బంధుజనులకు విందు

3 Sep, 2016 23:28 IST|Sakshi
బంధుజనులకు విందు

‘బాబూ ముహమ్మద్ ! నాకు కూడా ఈ ధర్మాన్ని అవలంబించాలని ఉంది, కాని  నేను మనతాతముత్తాతల ధర్మాన్ని విడిచి పెట్టలేనయ్యా. అయితే ఒకమాట. నువ్వు నిరభ్యంతరంగా ఈధర్మాన్ని అనుసరించవచ్చు. నిన్నెవరూ అడ్డుకోలేరు. నా బొందిలో ప్రాణమున్నంతవరకూ నేను నీకు అండగా ఉంటాను’. అన్నారు అబూతాలిబ్

 తరువాత, తనయుడు అలీ నుద్దేశించి, ‘‘ముహమ్మద్ చాలా మంచి విషయాలు చెబుతున్నాడు. ఆయన అవలంబిస్తున్న ధర్మం చాలా బాగుంది. నువ్వు కూడా దాన్ని అనుసరించు. దాని పైనే స్థిరంగా ఉండు. ముహమ్మద్ చెప్పినట్లు నడుచుకో. ఆయన్ని ఎప్పటికీ విడువబాకు’ అని హితవు చేశారు.

 తరువాత జాఫర్‌తో, ‘బాబూ! నువ్వుకూడా నీసోదరునితో కలిసి ఈ ధర్మాన్ని అనుసరించు’ అన్నారు.

 అబూతాలిబ్ అయితే ధర్మాన్ని స్వీకరించలేదు కాని, కొడుకులకు మాత్రం స్వీకరించమని హితవుచేశారు. బాబాయి అబూతాలిబ్ మాటలతో ముహమ్మద్ ప్రవక్త (స)కు కొండంత ధైర్యం కలిగింది. ఆయన చాలా సంతోషించారు

 చూస్తూ చూస్తూనే మూడేళ్ళు గడిచి పొయ్యాయి. ఈమధ్యకాలమంతా ధర్మప్రచారం రహస్యంగానే కొనసాగింది. సఫా కొండ దిగువ భాగంలో ఉన్న హజ్రత్ అర్ఖమ్ గారి ఇల్లు సామూహిక నమాజులకు నెలవుగా మారింది. కాని తరువాత బహిరంగంగా ధర్మప్రచారం కొనసాగించాలన్న దైవాదేశం మేరకు  ముహమ్మద్ ప్రవక్త తన కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా బంధుజనులందరినీ విందుకు ఆహ్వానించారు. విందుముగిసిన తరువాత నాలుగు మంచిమాటలు చెబుదామని, దైవసందేశం అందజేద్దామని అనుకున్నారు ప్రవక్తమహనీయులు. అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్న అబూలహబ్ వెంటనే అందుకొని,  ‘చూడు ముహమ్మద్! ఇక్కడ నీ బాబాయిలు, సోదరులు, ఇతర కుటుంబీకులు, బంధుజనమంతా ఉన్నారు.

వీళ్ళంతా నీ మేలు కోరేవారే. వారంతా ఏ రాగమాలాపిస్తే, నువ్వు కూడా అదేరాగం అందుకో. అంతేగాని, నువ్వేదో కొత్తకొత్తగా మాట్లాడితే కుదరదు. తాతల కాలం నుండి వస్తున్న మతాన్ని కాదని, ఈరోజేదో కొత్తమతం అంటే ఊరుకునేది లేదు. ఇలాంటి పిచ్చి పనులన్నీ వెంటనేమానేయి. అరేబియా అంతా ఒకటైతే నువ్వొక్కడివి ఏంచేస్తావు? నీ సోదరులందరిపై ఆపద తెచ్చి పెడదామనుకుంటున్నావా?’ అంటూ విందుకొచ్చిన బంధువులందరినీ రెచ్చగొడుతూ..,’ తప్పో ఒప్పో తరువాత సంగతి గాని, ముందుమీరంతా కలిసి ముహమ్మద్‌ను నిలువరించండి. వేరే ఎవరో వచ్చి మీదపడకముందే మీ అంత మీరే మేలుకోండి. ఇక పదండి, ఇంకా ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు’. అంటూ లేచాడు అబూలహబ్ .

 దాంతో అందరూ ఒక్కొక్కరుగా అక్కడినుండి నిష్ర్కమించారు.

 దైవప్రవక్త ముహమ్మద్ (స) ఉద్దేశ్యం నెరవేరలేదు. మనసులో మాట మనసులోనే ఉండిపోయింది.
- ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతా వచ్చేవారం)

మరిన్ని వార్తలు