దేవతమ్మ

21 Mar, 2016 00:15 IST|Sakshi
దేవతమ్మ

దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు.
మదర్ థెరిసా దేవుడు చేసిన అమ్మ.
ఇప్పుడు మానవాళి ఈ అమ్మను దేవతను చేసింది.
మానవత్వాన్ని మించిన దైవత్వం ఉండదని చాటిన
ఈ అమ్మ... ఈ దేవత... దేవతమ్మ.



అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరువవడం అసలైన పేదరికమని మదర్ నమ్మారు. ప్రేమకు, పలకరింపులకు నోచుకోని నిర్భాగ్యులకు తన జీవితాన్ని అంకితం చేశారు. మనుషుల్లో మంచితనం ఉందనీ, పంచుకుంటే అది విశ్వవ్యాప్తం అవుతుందని ప్రబోధించిన థెరిసాను సెయింట్ అనడం కన్నా మదర్ అనడమే బాగుంటుంది.



1998. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా. పశ్చిమ బెంగాల్.  మోనికా బెస్రా. గిరిజన మహిళ. అప్పటికి చాలా కాలంగా ఆమె పొత్తి కడుపులోని కణితితో బాధపడుతోంది. చుట్టుపక్కల వైద్యులకు చూపించారు. నయం కాలేదు. ఎవరో చెప్పారు.. మదర్ థెరిసా ఫొటో ఉన్న లాకెట్‌ను మెడలో వేసుకుంటే కణితి కరిగిపోతుంది అని. వాళ్లు చెప్పినట్లే చేసింది మోనికా బెస్రా. చిత్రం! కొన్నాళ్లకు కడుపులోని కణితి కరిగిపోయింది! ‘లాకెట్‌లోంచి ఒక వెలుగు కిరణం వచ్చి నా పొత్తి కడుపులో నొప్పిగా ఉన్నచోట లోనికి ప్రవేశించడాన్ని నా కళ్లారా చూశాను. ఆ తర్వాత నా కడుపునొప్పి తగ్గిపోయింది’ అని బెస్రా చెప్పింది. స్కాన్ చేసి చూస్తే లోపల నిజంగానే కణితి లేదు! ఈ ‘అద్భుతాన్ని’ 2002లో వాటికన్ చర్చి గుర్తించింది.

 

 
2008. బ్రెజిల్

ఆ దేశంలో ఒక వ్యక్తికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకింది. అత్యవసరంగా సర్జరీ చెయ్యాలని, లేకుంటే అతడు బతకడం కష్టమని వైద్యులు నిర్థారించారు. వెంటనే అతడి భార్య చర్చికి వెళ్లి మదర్ థెరిసాను ప్రార్థించింది. తన భర్తకు సర్జరీ అవసరం లేకుండా చెయ్యమని మొరపెట్టుకుంది. డిసెంబర్ 9న సర్జరీ చెయ్యడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. న్యూరోసర్జన్ ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లాడు. వెళ్లీ వెళ్లగానే పేషెంట్ ఎంతో ఉత్సాహంగా ఉండడాన్ని గమనించాడు. పైగా తనకు ఎలాంటి నొప్పీ లేదని ఆ పేషెంట్ చెబుతున్నాడు. స్కాన్ చేసి చూస్తే అతడి బ్రెయిన్‌లో ఎక్కడా ఇన్ఫెక్షన్ అన్నదే కనిపించలేదు! ఈ ‘అద్భుతాన్ని’ 2015లో వాటికన్ గుర్తించింది.

 
మదర్ థెరిసాను ‘సెయింట్’గా మార్చిన రెండు అద్భుతాలివి. వాటికన్ సిటీలోని రోమన్ కేథలిక్ చర్చి నిబంధనల ప్రకారం మహిమ గల ఏ క్రైస్తవ సాధువుకైనా, సాధ్వికైనా ‘సెయింట్‌హుడ్’ హోదాను ఇవ్వాలంటే ఆ సాధువుకు లేదా సాధ్వికి ఉన్న మహిమల కారణంగా కనీసం రెండు అద్భుతాలైనా జరిగి ఉండాలి.

    

మదర్ థెరిసా జీవించి ఉన్నప్పుడు ఆమెను ‘ఎ లివింగ్ సెయింట్’ అనేవారు. చనిపోయిన తర్వాత పందొమ్మిదేళ్లకు ఇప్పుడు ఆమె అధికారికంగా ‘సెయింట్’ అవబోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4న, థెరిసా వర్ధంతికి ఒకరోజు ముందు ఆమెకు ‘మహిమాన్విత’ (సెయింట్‌హుడ్) అనే  హోదాను ఇవ్వబోతున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా  థెరిసా.. మదర్ థెరిసా అయితే కావచ్చు కానీ, ముఖ్యంగా మాత్రం.. సెయింట్ థెరిసా!

 
వైద్య పరిజ్ఞానం పెరైండు అద్భుతాలను అంగీకరించకపోవడం అన్నది వేరేమాట. కానీ వాటికన్.. థెరిసా మహిమను అధికారికంగా గుర్తించింది. వాస్తవానికి మదర్ థెరిస్సా జీవించి ఉన్న కాలంలో వైద్యం విజ్ఞాన రంగం సైతం విస్తుబోయే మహిమలనెన్నింటినో ఆమె కనబరిచారు. అయితే అవన్నీ కూడా మానవాళిపై ఆమెకు చూపిన ప్రేమకు ఫలితంగా సంభవించిన అద్భుతాలు.

 

చనిపోతూ.. చిరునవ్వు
సాయంత్రం - థెరిసా, ఆమె సహాయకులు కలకత్తా వీధులలోకి వచ్చారు. వారికి నలుగురు అభాగ్యులు కనిపించారు. వాళ్లలో ఒకరి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆ ఒకరు స్త్రీ. థెరిసా.. సిస్టర్స్‌తో చెప్పారు - మిగతా ముగ్గురిని మీరు జాగ్రత్తగా చూసుకోండి, నేను ఈ వ్యక్తి దగ్గర ఉంటానని!


ప్రేమతో ఆ స్త్రీకి చేయగలిగినంత చేశారు థెరిసా. విశ్రాంతిగా ఆమెను మంచం మీద పడుకోబెట్టారు. ఆమె ముఖంలో అందమైన నవ్వు కనిపించింది. థెరిసా చేతిని తన చేతుల్లోకి తీసుకుని - ‘‘ధన్యవాదాలు’’ అంది. ఒకే ఒక మాట. ఆ వెంటనే ఆమె చనిపోయింది!


‘‘నేనేం చేయలేకపోయాను. అలా చూస్తూ ఉండిపోయాను. నేనే తన స్థానంలో ఉండి  ఉంటే? నా అంతరాత్మ ప్రశ్నించింది. ఉంటే - నా బాధను చెప్పుకునేదాన్ని. ఆకలిగా ఉందని, చచ్చిపోతున్నానని అనేదాన్ని. ఏదో ఒకటి చేయమని, కాపాడమనీ మూలిగే దాన్ని. ఇవేవీ తను చెయ్యలేదు. ఏదీ అడగలేదు. చనిపోతూ కూడా ప్రతిఫలంగా చిరునవ్వును ప్రసాదించింది’’ అని ఆనాటి సంఘటనను తన నోబెల్ ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు మదర్ థెరిసా. 

 
తక్కిన ముగ్గురిలో ఒక మగ మనిషి కూడా చనిపోయాడు. ఆశ్రమానికి తీసుకుని వచ్చేటప్పటికే అతడు మరణావస్థలో ఉన్నాడు. తెగిన అవయవంలా ప్రాణం దేహానికి వేలాడుతూ ఉండగా అక్కడికి తెచ్చారు. లాభం లేదని అతడికీ తెలిసిపోయింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘అనామకంగా బతికాను. దైవదూతలా వెళుతున్నాను’ అన్నాడు.. మదర్ చేతుల్లో ప్రాణాలు వదులుతూ. చనిపోయేముందు అతడు ఎవరినీ నిందించలేదు. ఎవరినీ దూషించలేదు. ఎవరినీ ద్వేషించలేదు. ఎవరితోనూ పోల్చుకోలేదు!

‘‘పుళ్లను కడిగి, పునీతం చేయగలిగిన శక్తి ప్రేమకు ఉన్నపుడు... సాటి మనిషి కోసం ఒక చిరునవ్వును ప్రేమగా మన పెదవులపై విరబూయించలేమా?’’ అని అడిగారు మదర్.. అదే ప్రసంగంలో.

 

ప్రేమకోసం అలమటింపు!
ఓసారి మదర్ ఒక వృద్ధాశ్రమానికి వెళ్లారు. కొడుకులు, కూతుళ్లు ఆ వృద్ధులను అక్కడ భద్రంగా వదలించుకుని వెళ్లి చాలాకాలమైనట్లుంది. బహుశా వాళ్లకు తమ తల్లిదండ్రులను ఏ వృద్ధాశ్రమంలో చేర్పించామో కూడా గుర్తుండకపోవచ్చు! అక్కడి వృద్ధులకు సౌకర్యాలకు కొదవలేదు. చిన్న లోటైనా లేదు.  మరెందుకనో ఒక్కరి ముఖంలోనూ సంతోషం లేదు. పొద్దస్తమానం తలుపుల వైపే చూస్తూ గడుపుతున్నారు. కూర్చున్నా, నడుస్తున్నా, తింటున్నా, ఆలోచిస్తున్నా... చూపులు మాత్రం తలుపుల వైపే!

 
అక్కడున్న సిస్టర్‌ని అడిగారు మదర్. ఎందుకు వాళ్లు అలా ఉన్నారు? ఎందుకు తలుపుల వైపే చూస్తున్నారు? ఎందుకు వారు సంతోషంగా లేరు? వారి ముఖంలో చిన్న నవ్వైనా పుయ్యడం లేదెందుకని అడిగారు. ‘‘చనిపోతున్నవారిలో సైతం నవ్వును చూసిన భాగ్యశాలిని నేను. అన్నీ ఉన్నా, ఎందుకుని వీళ్లు ఉల్లాసంగా లేరు?’’ అని అడిగారు. 

 
‘‘ఇవాళే కాదు, ప్రతిరోజూ అంతే. కూతురో, కొడుకో రాకపోతారా? కాసేపు మాట్లాడకపోతారా అని రోజంతా ఆశగా ఎదురు చూస్తుంటారు. రోజులు, నెలలు గడుస్తుంటాయి. కన్నబిడ్డలు తమను మర్చిపోవడం వీరిని బాధిస్తుంటుంది’’ అని చెప్పారు సిస్టర్. ప్రేమకు ప్రపంచం నిరుపేద అయిపోయిందా?- మదర్ ఆలోచనలో పడ్డారు.

 

తియ్యని తేనె మనసులు
ఒకసారి కలకత్తాలో పంచదారకు కొరత ఏర్పడింది. థెరిసా నిర్వహిస్తున్న హోమ్‌లోని పిల్లలకు పాలలో కలిపి ఇచ్చేందుకు కూడా పంచదార దొరకడం లేదని ఎట్లా తెలిసిందో నాలుగేళ్ల పసివాడు తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు! వాళ్ల చేతిలో పంచదార పొట్లాం ఉంది. మదర్‌కు ఆశ్చర్యమేసింది. ‘‘ఏం చెప్పి మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు’’అని అడిగారు. ‘‘మూడు రోజులుగా వీడు పాలలో పంచదార వేసుకోవడం లేదు’’ అని చెప్పింది తల్లి.  ‘‘తనకోసం వేసే పంచదారను మిగిల్చి మీ హోమ్ లోని పిల్లలకు ఇమ్మన్నాడు’’ అని చెప్పాడు తండ్రి.  పసివాడిని దగ్గరకు తీసుకున్నారు మదర్. ఆమె పేరు పలకడం కూడా వాడికి రాదు. కానీ తను చేయవలసింది ఏమిటో ఆ వయసుకి అర్థమయింది!! ఉన్నదాన్ని పంచుకోవాలన్న ఆలోచన తప్ప, ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నించే వయసు కూడా కాదది.


పంచుకున్నదే.. పరమాన్నం అలాంటిదే ఇంకో సంఘటన. ఎనిమిది మంది పిల్లలున్న ఒక హైందవ కుటుంబం ఆకలితో నకనకలాడుతోందని ఒక వ్యక్తి వచ్చి మదర్‌కు చెప్పాడు. కొన్ని రోజులుగా వాళ్లు పస్తులుంటున్నారని ఆవేదన చెందాడు. వెంటనే బియ్యం మూటతో అక్కడకు వెళ్లారు థెరిసా. పిల్లల కళ్లు క్షుద్బాధను ప్రతిఫలిస్తున్నాయి. ఇంటావిడ ఎంతో కృతజ్ఞతతో బియ్యం తీసుకుని, రెండు సమభాగాలు చేసింది! ఒక భాగాన్ని సంచిలో వేసుకుని బయటికి వెళ్లి వచ్చింది. ‘‘అంత హడావిడిగా ఎక్కడికి వెళ్లావు’’ అని అడిగారు మదర్.  ‘‘వాళ్లు కూడా ఆకలితో ఉన్నారు’’ అంది ఆమె! వెంటనే మదర్‌కు అర్థం కాలేదు.

 
ఆమె చెప్తోంది పొరుగున్న ఉన్న ముస్లిం కుటుంబం గురించి. మదర్ తెచ్చిన బియ్యంలో సగం... వాళ్లకు ఇచ్చి వచ్చింది! ఆ సాయంత్రం మదర్ మళ్లీ బియ్యం తీసుకెళ్లలేదు. పంచుకోవడంలోని ఆనందాన్ని వాళ్లకు మిగలనివ్వడం మదర్‌కు న్యాయమనిపించింది. తల్లి నుంచి లభించిన ప్రేమతో పిల్లలూ గెంతులేస్తున్నారు. ప్రేమ ఆ విధంగా ఇంటి నుంచే మొదలౌతుంది. ఇంటి నుంచి ఇంటికి, మనిషి నుంచి మనిషికి విశ్వవ్యాప్తం అవుతుంది.

 

గుర్తుంచుకునే మాట
ఆత్మీయంగా పలకరించడం, చిరునవ్వును చిలకరించడం కూడా ప్రేమను పంచుకోవడమే. రెపరెపలాడుతున్న జీవితంలోనూ ఆశలు రేపుతుంది ప్రేమ - అని మదర్ నమ్మకం.  ‘‘ఇదెలా సాధ్యం?’’ అని అడిగారు అమెరికన్ ప్రొఫెసర్లు. వాళ్లంతా అమెరికాలోని వేర్వేరు యూనివర్శిటీల నుంచి వచ్చినవారు. కలకత్తాలోని మిషనరీ హోమ్‌లు సందర్శించేందుకు వచ్చారు.   తిరిగి వెళ్లే ముందు - ‘‘ గుర్తుంచుకునే ఒక మాట చెప్పండి మదర్...’’ అని అడిగారు.   మదర్ ఇలా చెప్పారు - ‘‘ఒకరికొకరు ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోండి. కనీసం నవ్వు ముఖంతో చూసుకోండి. ఇందులో సాధ్యం కాకపోవడానికి ఏమీ లేదు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడండి. బయట కూడా అదే అలవాటవుతుంది. అప్పుడు ప్రపంచమే ఒక కుటుంబమౌతుంది’’.  నమ్మలేనట్లు చూశారు. దేవుడి ప్రేమను కూడా తరచు మనం అలాగే నమ్మలేనట్లు చూస్తాం అని అంటారు మదర్. 

 

మదర్ థెరిసా
26 ఆగస్టు 1910 - 5 సెప్టెంబర్ 1997
అసలు పేరు : ఆగ్నస్ గోన్షా బొజాక్షూ
తల్లిదండ్రులు : నికోల్, డ్రానా
జన్మస్థలం : స్కోప్జే (మెసిడోనియా)
పౌరసత్వం : ఇండియా
మతం : క్యాథలిక్
స్థాపన : మిషనరీస్ ఆఫ్ చారిటీ (కలకత్తా)
ప్రఖ్యాతి : మానవతావాది
ప్రతిష్ఠ : నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న, సెయింట్‌హుడ్

 

అందమైన త్యాగం!
ఒక వ్యక్తి నుంచి మదర్‌కు పదిహేను డాలర్లు అందాయి. ఇరవై ఏళ్లుగా అతడు మంచంపైనే ఉన్నాడు. కుడి చెయ్యి తప్ప అతడి శరీరంలోనే మరే అవయవమూ కదలడం లేదు. అన్నేళ్లుగా అతడికి తోడున్నదొకటే... స్మోకింగ్! బాగా సిగరెట్లు కాల్చేవాడట. ఒక వారం పాటు స్మోకింగ్ మాని, అలా మిగిలిన డబ్బును మదర్‌కు పంపించాడు. ఎంత అందమైన త్యాగం! ‘‘అతడు పంపిన డబ్బుతో రొట్టె ముక్కలు కొన్ని ఆకలిగొన్నవారికి పంచినప్పుడు వారి కళ్లల్లో ఎంత ఆనందం కనిపించిందో, ఆ ఆనందం గురించి విన్నపుడు అతడి కళ్లల్లోనూ అంతే ఆనందం కనిపించింది. ప్రేమను పంచుకోవడంలో ఉన్న సంతృప్తి అది’’ అన్నారు మదర్. 

 

థెరిసా జీవితంలోని ముఖ్య ఘట్టాలు
1910 ఆగస్టు 27 (పుట్టిన రెండోరోజు)      దైవ సభ్యత్వం (బాప్టిజం)
12 ఏళ్ల వయసులో    దేవుని పిలుపు అనుభూతి
1928 సెప్టెంబర్ 25      సిస్టర్ థెరిసాగా పేరు మార్పు
1929 (18 ఏళ్ల వయసులో)  కలకత్తా రాక, టీచర్‌గా సేవ
1937 (27 ఏళ్ల వయసులో)  మదర్ థెరిసాగా ఉన్నతి
1946 సెప్టెంబర్ 10      దేవుని రెండో పిలుపు అనుభూతి
1948    పేద పిల్లల కోసం స్కూలు ఏర్పాటు
1950 అక్టోబర్ 7   మిషనరీస్ ఆఫ్ ఛారిటీ స్థాపన
1951     భారత పౌరసత్వం
1961     పద్మశ్రీ అవార్డు
1971     పోప్ జాన్ గీగీఐఐఐ శాంతి బహుమతి
1979     నోబెల్ శాంతి బహుమతి
1980    భారతరత్న అవార్డు
1983    తొలిసారి గుండెపోటు
1997     మిషనరీ బాధ్యతల నుంచి విరమణ
1997 సెప్టెంబర్ 5  గుండెపోటుతో మరణం.
2003   ‘పరమ పావని’గా ఉన్నతి (బీటిఫికేషన్)
2016    ‘మహిమాన్విత’గా ఉన్నతి  (సెయింట్‌హుడ్)

 

మరిన్ని వార్తలు