పుతిన్‌ అండ్‌ పెట్స్‌

14 Dec, 2016 00:43 IST|Sakshi
పుతిన్‌ అండ్‌ పెట్స్‌

రాజతంత్రాలు రణతంత్రాల మధ్య కాసింత మానసికోల్లాసానికి దేశాధ్యక్షులు ఏం చేస్తారు? విందు వినోదాలు... స్నేహితులతో కాలక్షేపం.... కానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అలా కాదు. ఏ మాత్రం టైమ్‌ దొరికినా అతడు తన పెంపుడు జంతువులతో గడుపుతాడు. మూగ జీవులతో ఆడుకుంటాడు. వాటి బాగోగులు చూడడంలో సంతృప్తి చెందుతాడు. మనుషులంటే ఏవో ఒకటి ఆశిస్తారు. కాని పెంపుడు జంతువులు ఏమీ ఆశించవు. ప్రేమిస్తాయి. ఉత్తినే అలా ప్రేమిస్తూనే ఉంటాయి. అందుకే పుతిన్‌కు అవి అంటే ఇష్టం. ఇలాంటి ఇష్టం ఉన్న దేశాధ్యక్షులు ఎంతమంది?

మొన్నామధ్య పుతిన్‌ దత్తత తీసుకున్న మూడు సైబీరియా పులుల్లో ఒకటి అభయారణ్యపు కంచెలు దాటి చైనాలో అడుగుపెట్టింది. చైనా ఈ సంగతి తెలిసి మరేం ఫరవాలేదనీ తమ అడవుల్లో ఆ పులికి ఆహారం కోసం గొర్రెలనూ, దుప్పులనూ పంపుతామనీ చెప్పింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ పులి మరుసటిరోజు చనిపోయి కనిపించింది. ఇది తెలిసి పుతిన్‌ ఎంత బాధపడ్డాడో చైనా అంత హడలిపోయింది. ఎటొచ్చి ఏం గొడవ వస్తుందో అని. ఒక పెంపుడు జంతువు వల్ల రెండు దేశాల మధ్య స్నేహం చెడిపోయేంత స్థాయిలో పుతిన్‌కు మూగజీవుల పట్ల ఆసక్తి ఉంది.

ఇక అతడికి సొంతంగా అనేక శునకాలు ఉన్నాయి. వాటిలో ఇష్టమైనది – ‘యుమె’ అనే ‘అకిటా’ జాతి శునకం. జపాన్‌లో విస్తృతంగా కనిపించే ఈ జాతి శునకాన్ని రష్యాలో, అమెరికాలో, మరికొన్ని దేశాల్లో పెంచుకుంటున్నారు. పరాయివాళ్లతో పూర్తిగా దూరంగా ఉంటూ తన యజమాని కుటుంబంతో చాలా దగ్గరగా మసలే అకిటా జాతి శునకాలు యజమానితో ఆటలాడుతూ ఉల్లాసాన్ని పెంచుతాయి.

ప్రేమ పంచుతూ ఆనందాన్నిస్తాయి. ఈ శునకాలతోటే కాదు... మంచు ఎలుగుబంటులు, డాల్ఫిన్లు, పులులు, గుర్రాలు... ఒకటనేముంది పుతిన్‌ మూగప్రాణుల ఆప్తమిత్రుడు. పూర్వాశ్రమంలో కెజిబి (రష్యా గూఢచార సంస్థ) ఏజెంట్‌ అయిన పుతిన్‌ సకల తంత్రాలలోనే కాదు... క్రూరమృగాలతో కూడా ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నాడు. వేటగాడిగా కూడా అతడు అవసరమైతే తుపాకీ పట్టగలడు. ఈ విషయాన్ని కూడా అతడు ఫొటోల ద్వారా లోకానికి వెల్లడి చేస్తూ ఉంటాడు.



ఇదంతా ఎందుకు అనంటే... ‘నేను మరీ కరడుగట్టిన దేశాధ్యక్షుణ్ణి కాదు. నా గుండెల్లో ప్రేమ ఉంది అని చెప్పడానికే. లేదా నేను ప్రేమనూ పంచగలనూ శత్రువును తుద ముట్టించనూ గలను అని చాటడానికే’ అని ఒక పరిశీలకుడు తేల్చాడు.
ఏమైనా రష్యాకు రాజు కూడా మూగజీవుల ప్రేమకు బానిసే అని ఈ ఫొటోల ద్వారా మనకు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు