ప్రేక్షక దేవుళ్లు శాసిస్తారు.. తలైవా పాటిస్తాడు

1 Jan, 2018 23:52 IST|Sakshi

ఎవరు నడుచుకుంటూ వస్తే
సూర్యుడు గొడుగు పడతాడో...
ఎవరికి దాహం వేస్తే
మేఘం పరుగు పరుగున వస్తుందో...
ఎవరు విశ్రమిస్తే
చుక్కలు జోల పాడతాయో...
ఎవరు బొటనవేలెత్తి చూపితే
కోట్ల అభిమానులు పూలదండలౌతారో...
ఆ తమిళ సూపర్‌స్టార్‌
సింగిల్‌గా రాజకీయాల్లోకి వచ్చి
‘తలైవా’గా రాణిస్తారా?
తెలుగు ఇండస్ట్రీ ఏమంటోంది?

రజనీకాంత్‌ : కలక్షన్‌లలో హిట్‌ అయ్యారు. ఎలక్షన్‌లలో హిట్‌ అవుతారా?
పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో డిసెంబర్‌ 31న రజనీకాంత్‌ ప్రకటించడంతో ఆయన అభిమానులకు ఈ ఏడాది ఒక రోజు ముందుగానే న్యూ ఇయర్‌ వచ్చేసినట్లయింది! అయితే అది యేటా రెగ్యులర్‌గా వచ్చే న్యూ ఇయర్‌ కాదు. ఇరవై ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తే వచ్చిన న్యూ ఇయర్‌! న్యూ ఎరా!పాలిటిక్స్‌లోకి వచ్చేశానని రజనీ ప్రకటించగానే మండపంలోని వేలాది మంది అభిమానులు ‘తలైవ.. తలైవ..’ అని నినాదాలు చేశారు. అవి రణన్నినాదాలు. తమిళనాడులో ఉద్ధండులైన రాజకీయ నాయకులను సైతం ఉలిక్కిపడేలా చేసిన రాజకీయ ప్రకంపనాలు. ‘‘అవినీతిపై పోరాడదాం.. అసమానతల్ని అంతమొందిద్దాం. మార్పుని తీసుకొద్దాం’’ అని రజనీ పిలుపు ఇవ్వగానే.. ‘అలాగే తలైవా.. చూపిద్దా తడాఖా’’ అని అభిమానుల స్వరం ప్రతిధ్వనించింది.

రజనీ నిజంగానే పాలిటిక్స్‌లోకి వచ్చేశారా?  ఇంకా కొంతమంది నమ్మడం లేదు.  రెండు దశాబ్దాల ఎదురుచూపులు అంత వెలుగును ఒక్కసారిగా తట్టుకోగలవా?  ఆ వెలుగు నిజమని నమ్మగలవా? నమ్మాలి. నిజంగానే రజనీలో ఆ రోజున రాజకీయ నాయకుడు సాక్షాత్కరించాడు. బొటనవేళ్లు పైకెత్తి తన రాజకీయ ప్రవేశానికి సంకేతం ఇచ్చారు.  ‘‘నాకు జీవితాన్ని ఇచ్చిన అభిమానులారా.. తమిళ ప్రజలారా.. మీ అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు. నా అభిమానులను ఎలా కీర్తించాలో తెలియడం లేదు. ఆర్రోజులుగా, ఆరువేల మందికి పైగా అభిమానులు నాతో ఫొటో దిగేందుకు చూపిన ఓర్పు, పాటించిన క్రమశిక్షణ చెప్పలేని అనుభూతిని కలిగించింది. ఇదే క్రమశిక్షణ, ఓర్పు భవిష్యత్తులో కూడా కొనసాగితే ఏదైనా సాధించగలమని అర్థమైంది. మనం సరైన దిశగా వెళుతున్నాం. రాజకీయాల్లోకి రావడానికి నాకు భయం లేదు’’ అని తన ప్రసంగాన్ని చిన్నపాటి మోటివేషన్‌తో ప్రారంభించారు రజనీ.  ‘‘నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చు. మిగతావి నేను చూసు కుంటానని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. యుద్దంలో జయిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం ప్రాపిస్తుంది. అదే.. యుద్ధం చేయకుండా వెళ్లిపోతే పిరికిపంద అంటారు. ఇప్పటికే అన్నీ పూర్తి చేశాను. బాణాన్ని గురి చూసి వదలడమే ఇక మిగిలింది’’ అని చెప్పారు. రజనీ ఒకసారి చెప్పాడు కాబట్టి.. ఇంకోసారి అడగన క్కర్లేదు. నిజమేనా అని చెయ్యి గిల్లుకోనక్కర్లేదు. 

రజనీసర్‌.. యువార్‌ ది స్టార్‌.  రజనీసర్‌.. యువార్‌ ది వార్‌. ఇదీ.. నిన్నటి, మొన్నటి వైబ్రేషన్‌.. సెలబ్రేషన్‌! రాజకీయాల్లో రజనీ శక్తియుక్తులేమిటో బయట పడేందుకు మరికొంత సమయం పట్టొచు  కానీ సినిమాల్లో ఆయనకు ఉన్న ఇమేజ్‌ ఏ స్టార్‌కూ లేనిది.  ‘రజనీసర్‌ టైమ్‌ చూసుకోరు. టైమ్‌ ఎంత అవ్వాలో ఆయనే డిసైడ్‌ చేస్తారు!’. ‘రజనీసర్‌ క్యాలెండర్‌లో మార్చి 31 తర్వాత ఏప్రిల్‌ 2 ఉంటుంది. అందుకే రజనీసర్‌ని ఎవరూ ఫూల్‌ని చెయ్యలేరు’. ‘శాంటాక్లాస్‌ తనే ప్రతి సంవత్సరం రజనీసర్‌ దగ్గరికి గిఫ్ట్‌ కోసం వస్తాడు!’. ‘రజనీసర్‌ ‘కౌన్‌బనేగా...’ హాట్‌ సీట్‌లో కూర్చున్నప్పుడు సర్‌ని క్వొశ్చన్‌ అడగడానికి కంప్యూటర్‌ గారే హెల్ప్‌లైన్‌ తీసుకోవలసి వచ్చింది!’. రజనీసర్‌ ఆరో తరగతి నోట్సే ఇప్పుడు మనం చూస్తున్న వికీపీడియా! సూపర్‌మేన్, బాట్స్‌మేన్‌ రజనీసర్‌ దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ రోజు టీచర్స్‌ డే.  ఇవన్నీ.. రజనీకాంత్‌ అభిమానుల మీద ఉన్న జోకులు. అంతగా వారికి ఆయనపై నమ్మకం. ఏదైనా చేయగలడని, ఏదైనా సాధించగలడని. అలాంటి శక్తిమంతుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడంటే.. సమాజమే మారిపోతుంది వారు గట్టిగా నమ్ముతున్నారు. అభిమానం రాబిన్‌హుడ్‌నీ చేస్తుంది, రాఘవేంద్ర స్వామినీ చేస్తుంది. పాలిటిక్స్‌లో అంత పవర్‌ ఉంటుంది. 

రజనీ రాజకీయ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు మాత్రమే ఇంతకాలం ఎదురు చూడలేదు. ప్రత్యర్థులకు చెక్‌ పెట్టడం కోసం రాజకీయ నాయకులు సైతం పరోక్షంగా ఆయన్ని ‘రాజకీయం’లోకి దింపేందుకు ఇరవై ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. జయలలితకు చెక్‌ పెట్టడానికి కరుణానిధి వర్గం, కరుణానిధిని అదుపులో ఉంచేందుకు జయలలిత వర్గం ఎన్నోసార్లు రజనీ అనే అస్త్రాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నం చేశారు. ‘పోలింగ్‌ డేట్‌ దగ్గర పడింది రజనీ. నువ్వొక్క మాట చెప్పు ఈ రాష్ట్రానికి..  మేము వందసార్లు ప్రచారం చేసుకుంటాం’ అనే సంకేతాలనూ డీఎంకే అనేకసార్లు రజనీకి పంపింది. ఆఖరికి ‘కబాలి’ ట్రైలర్‌ని కూడా ఆ పార్టీ జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంది!  రజనీ మాత్రం ఎప్పుడూ ఎవరి పక్షమూ నిలవలేదు. చివరి వరకు అభిమానుల పక్షాన్నే ఉండి, ఇప్పుడు తమిళ ప్రజల కోసం అభిమానుల అండతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నిలబడి గెలిచారూ అంటే ఆయనపై అభిమానులకు ఉన్న నమ్మకం గెలిచినట్లు. అభిమానంతో ఏదైనా సాధించగలం అన్న ఆయన నమ్మకం కూడా గెలిచినట్లే!
కామెంట్స్‌: శివ మల్లాల

ఎమ్జీఆర్‌లా ఉండాలి
రజనీకాంత్‌ వచ్చి సరిగ్గా నిలబడి చేస్తారా? ఎలక్షన్‌ దాకా ఉంటారా? ఊరికే మాట్లాడుతు న్నారా? పవన్‌ కల్యాణ్‌ కూడా ముప్పైసార్లు చెప్పాడు. అది అంటాడు, ఇది అంటాడు. పొలిటికల్‌ కన్సిస్టెన్సీ ఉండాలి పవన్‌కి అయినా,  రజనీకాంత్‌కు అయినా. ఎన్టీఆర్‌గారు వచ్చారంటే, యంజీఆర్‌ గారు వచ్చారంటే ఒక మాట అనుకున్నారంటే తప్పో ఒప్పో చేసేసేవారు. వాళ్లకున్న కాన్ఫిడెన్స్‌ గానీ నమ్మకం గానీ వీళ్లకు లేదు.
– తమ్మారెడ్డి భరద్వాజ

తపన ఉన్న మనిషి
తొంభైల మధ్యకాలంలో చాల సంవత్సరాలు రజనీతో సన్నిహితంగా మెలిగాను. ప్రజలకు ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంటాడు. చాలా మంచి మనిషి. గొప్ప మానవతావాది. ఆయన రాజకీయాలలోకి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు. ఆయన మనస్పూర్తిగా తలుచుకుంటే, దానిని సాధించే దాకా వదిలిపెట్టే రకం కాదు. కచ్చితంగా రాజకీయాల్ని ఒక పట్టు పడతాడని అనుకుంటున్నాను. 
– అల్లు అరవింద్‌

స్ట్రాంగ్‌గా నిలబడాలి
రజనీకాంత్‌ గారు రాజకీయాల్లోకి రావటం మంచిదే. పాలిటిక్స్‌లోకి ఎవరైనా రావచ్చు. ఫలానా వాళ్లే రావాలనే రూలేం లేదు. సేవ చేయలనే ఉద్దేశం ఉంటే చాలు ఎవరైనా ఎన్నికల్లో పోటీ పడొచ్చు. ఆయనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సాధారణమైనది కాదు. ఆయన పార్టీ పెడితే బావుంటుంది. ఆయన ఎంత వరకూ స్ట్రాంగ్‌ నిలబడి చేస్తారో చూడాలి. లెట్స్‌ హోప్‌ ఫర్‌ ది బెస్ట్‌. 
– జీవిత రాజశేఖర్‌ 

మానవతావాది
నేను రజనీకాంత్‌ని రెండు సార్లు కలిశాను. రజనీ గురించి దేÔ¶ ం మొత్తం మీద ఒక అభిప్రాయం ఉంది మోస్ట్‌ హానెస్ట్‌ అని. గొప్ప మానవతావాది. ఫ్రెండ్లీ నెచర్‌. ప్రజలందరికి ఏమని ఉంటుందంటే..æ ‘రాజకీయాలు బావుండాలి. రాజకీయ నాయకులు బావుండాలి. మన సొమ్ము తినకూడదు’ అని. అది నిజం కావాలంటే రజనీకాంత్‌లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి. అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రి కావాలి. ప్రజలకు సేవ చేయాలి. 
– పోసాని కృష్ణ మురళి

సరైన సమయం
రజనీకాంత్‌ తమిళనాడు ప్రజల సమస్యలను చూసి  అర్ధం చేసుకున్న వ్యక్తి. ఏ నటుడైనా రాజకీయల్లోకి రావాలంటే వాళ్లంత మాస్‌ ఫాలోయింగ్‌ ఉండాలి. తెలుగు నాట ఎన్టీఆర్, తమిళనాట ఎమ్జీఆర్, జయలలిత.. వీళ్లంతా కూడా మాస్‌ ప్రజల హృదయాల్ని గెలుచుకున్నవారే. 25 సంవత్సరాలు టైమ్‌ తీసుకుని శూన్యమైన తమిళ రాజకీయల్లోకి సరైన సమయంలో రజనీ వస్తున్నాడు అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా ఆయన్ని ఆహ్వానిస్తున్నాను. 
– జయప్రద  

మరిన్ని వార్తలు