సూపరావతారం

16 Dec, 2017 00:16 IST|Sakshi

కామిక్స్‌లో, పురాణాల్లో సూపర్‌ క్యారెక్టర్స్‌ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్‌ అయ్యారు రజనీ!సౌత్‌కే కాదు... మొత్తం భారత్‌కే ఇప్పుడు రజనీకాంత్‌ ఓ సూపర్‌ స్టార్‌. ఆయన పేల్చే బులెట్‌కు ఎంత పవరో... ‘తుపుక్‌’ మని ఆయన ఊసే బబుల్‌గమ్‌.. అంత పవర్‌.‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...’ అని ‘అంతులేని కథ’లో పాడుకుంటూ తిరిగిన రజనీ...తనే ఇప్పుడు దేవుడై  సినిమాకో అవతారంలో... ప్రేక్షక భక్తులకు ‘ఫస్ట్‌ లుక్‌’లతో సాక్షాత్కరిస్తున్నారు.

మూడేళ్లుగా రెండు విషయాల్లో రజనీకాంత్‌ అభిమానులు ముఖం వాచి ఉన్నారు. రజనీ పొలిటికల్‌ ఎంట్రీ.రజనీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.తమిళనాడులో ‘పొంగల్‌’కు నెల ముందు డిసెంబర్‌ 12న వచ్చే పెద్ద పండుగ రజనీ బర్త్‌ డే. అయితే మూడేళ్లుగా సెలబ్రేషన్స్‌ జరగడం లేదు. రజనీ జరగనివ్వలేదు. 2015లో చెన్నైలో ఫ్లడ్స్‌. 2016లో జయలలిత మరణం. 2017లో తుఫాను. వేడుకలు వద్దన్నారు రజనీ. ఆయన పొలిటికల్‌ ఎంట్రీని కూడా మూడేళ్లుగా ఏ దేవుడో డిలే చేస్తున్నట్లుగానే ఉంది! ‘వచ్చేస్తున్నారు.. వచ్చేస్తున్నారు’ అని ఆశ. ‘ఇప్పుడే కాదు’ అని రజనీ అనగానే నిరాశ. ఇరవై ఏళ్ల నుండీ రజనీ పొలిటికల్‌ ఎంట్రీపై తమిళనాడులో ఊహలు సాగుతున్నా, అభిమానుల ఆశలు చిగురించింది మాత్రం 2014 ఎండింగ్‌లో రజనీ బర్త్‌ డేకి ‘లింగా’ రిలీజ్‌ అయినప్పుడే. ‘లింగా’లోడ్యామ్‌కాంట్రాక్టర్‌ కుట్రల నుండి ఊరిని కాపాడే క్యారెక్టర్‌ రజనీది. సినిమాలో జనం తరఫున ఆయన ఏ డైలాగ్‌ కొట్టినా, అది పొలిటికల్‌ డైలాగే అనిపించింది ఆడియన్స్‌కి. అందుకే పాలిటిక్స్‌లోకి వచ్చేస్తాడనుకున్నారు. 
    
రజనీ బర్త్‌డే, రజనీ పొలిటికల్‌ ఎంట్రీ.. ఈ రెండూ కాకుండా, రజనీ అభిమానులకు మూడో పెద్ద పండుగ రజనీ సినిమాల ‘ఫస్ట్‌ లుక్‌’ రిలీజ్‌. ఈ ఏడాదైతే, పండుగలో పండుగగా ఆయన పుట్టిన రోజే కొత్త పిక్చర్‌ ‘కాలా’ ఒరిజినల్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. ఫ్యాన్స్‌ సంతోషానికి పగ్గాల్లేవు. తలైవర్‌ రగ్డ్‌ లుక్‌తో ఉన్నాడు. గ్రీజీ బ్లాక్‌ షర్ట్, సన్‌ గ్లాసెస్, లోపల యాంగ్రీ ఐస్, చక్కగా ట్రిమ్‌ చేసిన తెల్లటి గడ్డం, వెనక్కి దువ్విన హెయిర్‌ స్టయిల్‌.. టోటల్‌గా గ్యాంగ్‌స్టర్‌ లుక్‌. ఈ లుక్‌కి రజనీ ఏ డైలాగ్‌ కొడతారు? తమిళనాడు ఇప్పుడు వెయిటింగ్‌. టీజర్‌ రిలీజ్‌ అయితే కానీ యూట్యూబ్‌ భళ్లుమనదు. ‘‘హియర్‌ యు గో!! ది కింగ్‌ ఆఫ్‌ స్టయిల్‌. అవర్‌ సూపర్‌ స్టార్స్‌ ‘కాలా’ సెకండ్‌ లుక్‌’’.ఒరిజినల్‌ లుక్‌ను విడుదల చేస్తూ రజనీ అల్లుడు ధనుష్‌ పెట్టిన ట్వీట్‌ ఇది. అయితే ఇది ఒరిజినల్‌ లుక్కే కానీ, ‘కాలా’ ఫస్ట్‌ లుక్‌ కాదు. సెకండ్‌ లుక్‌. ఫస్ట్‌ లుక్‌లో లైట్‌ కలర్‌ పంచె, బ్లాక్‌ లాల్చీతో కాలు మీద కాలు వేసుకుని ఒక వెహికిల్‌ బానెట్‌ మీద నవ్వులు చిందిస్తూ కూర్చొనిఉంటాడు. అది మే నెలలో విడుదలైంది. తమిళనాడు నుంచి ముంబైకి ఎస్కేప్‌ అయి, అక్కడి ధారవి ప్రాంతంలోని మురికివాడలో గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి వ్యక్తి లుక్‌ అది. ఇప్పుడీ సెకండ్‌ లుక్‌ అసలు రూపం. స్పాట్‌లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ స్వరూపం. రజనీకి ఇది 67వ బర్త్‌డే. ‘కాలా’ రజనీ 164వ మూవీ.

లాస్ట్‌ ఇయర్‌ ‘కబాలి’లో కూడా రజనీ దాదాపు ఇదే లుక్‌తో కనిపించారు. అందులోనూ గ్యాంగ్‌స్టరే కాబట్టి పోలికలు కనిపిస్తాయి. ‘కబాలి’ ఫస్ట్‌ లుక్‌ ఒక సెన్సేషన్‌. రజనీ అప్పియరెన్స్‌ అదిరిపోతుంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘నిరుప్పుడా’ అని వినిపించగానే.. యూత్‌ ‘ఓ’ అంటూ లేచింది. నిప్పుల మీదైనా సరే, ఉల్లాసంగా నడిపించేంత కిక్‌ అది. వైట్‌ షర్ట్, పైన గ్రే కోట్, సూటు, బూటుతో ఎంట్రీ ఇస్తాడు రజనీ. సేమ్‌ తెల్లగడ్డం, సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌. ‘ఎవడ్రా ఆ కబాలి. పిలవండ్రా వాణ్ణి’ అని విలన్‌ అనగానే.. ఇమీడియెట్‌ షాట్‌లో రజనీ తన స్టెయిల్‌లో హా.. హా.. హా.. అని నవ్వుతాడు. ఆ చిన్న లుక్‌తో, ఆ చిన్న డైలాగ్‌ డెలివరీతో కబాలిలో రజనీ లైఫ్‌ సైజ్‌ క్యారెక్టర్‌ చాలా సింపుల్‌గా ఎస్టాబ్లిష్‌ అయింది. 
    
రజనీ స్టార్‌ యాక్టర్‌. ‘పోన్లే ఉత్సాహపడుతున్నారు’ అని అప్పుడప్పుడు ఆయన కొత్త కుర్రాళ్లకు తనని డైరెక్ట్‌ చేసే చాన్స్‌ ఇస్తుంటారు కానీ, రజనీతో సినిమా తీసేవాళ్లంతా దాదాపుగా స్టార్‌ డైరెక్టర్లు, స్టార్‌ నిర్మాతలే. రజనీకి ఓ స్టెయిల్‌ ఉంది. అది తగ్గకుండా తమ ‘స్టెయిల్‌ ఆఫ్‌ మేకింగ్‌’ని చూపించాలి. రజనీకి ఓ ఇమేజ్‌ ఉంది. దాన్ని నిలబెడుతూనే, తమను నిలబెట్టుకోవాలి.  ఇంత జాగ్రత్తగా, ఇంత భారీగా రజనీతో సినిమా తయారౌతున్నప్పుడు ఆయన ఫ్యాన్స్‌ ఇంకెంత సూక్ష్మంగా మూవీ డెవలప్‌మెంట్స్‌ కోసం చూస్తుంటారు. ఫస్ట్‌ అసలు రజనీ లుక్‌ ఎలా ఉందో చూడాలని అరాటపడతారు. వారి ఆరాటాన్ని తీర్చడానికే ‘ఫస్ట్‌ లుక్‌’ అనే ఒరవడి మొదలైంది. ‘ఇదిగో రజనీ ఈ కొత్త సినిమాలో ఇలా ఉంటాడు అని పోస్టరో, టీజరో రిలీజ్‌ చెయ్యాలంటే.. సినిమాలో రజనీ క్యారెక్టర్‌లోని క్రీమ్‌ని బయటికి తియ్యాలి. అలా తియ్యడం.. ఇంకో సినిమా తియ్యడమే! 
   
తెలుగులో రజనీ తొలి సినిమా అంతులేని కథ. 1976లో వచ్చింది. మనకు గుర్తొచ్చే రజనీ కమర్షియల్‌ హిట్‌ మూవీ ‘బాషా’. 1995లో వచ్చింది. ఆ రెండు సినిమాల మధ్య ఇరవై ఏళ్ల వ్యవధిలో రజనీ నటించిన ఏ సినిమాకూ ఫస్ట్‌ లుక్‌ ట్రెండ్‌ లేదు. ‘బాషా’కు ముందు వరకు కథే రజనీని నడిపించింది. ‘బాషా’ చిత్రం నుంచి రజనీయే సినిమాను నడిపించే శకం మొదలైంది. అందుకే ఆయన సినిమాలకు ఫస్ట్‌ లుక్‌ మస్ట్‌ అయింది. బాషా తర్వాత పెదరాయుడు, ముత్తు, అరుణాచలం, నరసింహ, బాబా, చంద్రముఖి, శివాజీ, రోబో, లింగా, కబాలీ.. ఇప్పుడు ‘కాలా’.. ఫస్ట్‌ లుక్‌తోనే బయటికి వచ్చాయి.  ‘అంతులేని కథ’ టైమ్‌కి రజనీకి సూపర్‌స్టార్‌ అనే ఇమేజ్‌ లేదు. కానీ కథలోని క్యారెక్టర్‌.. ఇప్పటి ఫస్ట్‌ లుక్‌లా అప్పటి ప్రేక్షకులకు రజనీపై ఫస్ట్‌ ఇంప్రెషన్‌ని ఇచ్చింది. ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..’ అని పాడతాడు రజనీకాంత్‌. బాధ్యత లేని అన్న లుక్‌ అది. తర్వాత్తర్వాత  ‘దళపతి’లో సూర్యగా పేదవాడల లీడర్‌ లుక్‌. ‘ముత్తు’లో కైండ్‌ హార్ట్‌ లుక్‌. ‘అరుణాచలం’లో కోటీశ్వరుడి వారసుడి లుక్‌. ‘నరసింహ’లో బాధ్యత ఉన్న కొడుకు లుక్‌. ‘బాబా’లో దైవాంశ సంభూతుడి లుక్‌. ‘చంద్రముఖి’లో సైకియాట్రిస్ట్‌ లుక్‌. ‘శివాజీ’లో అక్రమార్కులపై విక్రమార్కుడి లుక్‌. ‘రోబో’లో యంత్రుడి లుక్‌. అసలైతే రోబో నుంచే క్లియర్‌ కట్‌గా ఫస్ట్‌ లుక్‌లు ఎంటర్‌ అయ్యాయి. లేటెస్ట్‌గా 2.ఓ, కాలా.. రజనీ కొత్త సినిమాలు. 2018లో విడుదల అవుతున్నాయి. వాటి ఫస్ట్‌ లుక్‌లు ఆల్రెడీ రిలీజ్‌ అయ్యాయి. ఇక స్క్రీన్‌ లుక్కే మిగిలింది. ఇంకో లుక్‌ కూడా.రజనీ పొలిటికల్‌ ఎంట్రీ లుక్‌! 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా