మా నాన్న తొలి కృష్ణుడు

8 Jan, 2020 03:58 IST|Sakshi

సినీ పరివారం

ఈలపాట రఘురామయ్య అంటే తెలుగువారి మొదటి కృష్ణుడు. ఆయన అసలు పేరు కల్యాణం వెంకట సుబ్బయ్య. ఈలపాటలో ప్రావీణ్యం వల్ల ఈలపాట రఘురామయ్య అయ్యాడు. పద్యాలకు పాటలకు స్టార్‌డమ్‌ తెచ్చాడు. ఆయన పాడిన రామనీల మేఘశ్యామా కోదండ రామా గీతం నేటికీ తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తూనే ఉంది. రఘురామయ్యఐదుగురు సంతానంలో ఒకరైన కల్యాణం రామకృష్ణ తన తండ్రిని స్మరించుకున్నారు.

నాన్నగారికి మేము మొత్తం ఐదుమంది సంతానం. పెద్దావిడ రూపాదేవి నటిగా మీకు తెలుసు (ఋతురాగాలు ఫేమ్‌). పెద్దన్నయ్య  సంపత్‌ బిజినెస్‌ చేస్తున్నారు. నేను రెండో అబ్బాయిని. తమ్ముడు శ్రీధర్‌ ఆస్తులు చూసుకుంటాడు. చెల్లెలు ఆండాళ్‌ తల్లి ఇంట్లోనే ఉంటుంది. నాన్నగారు తన ఎనిమిదవ ఏటే రంగస్థలం మీద గళం విప్పి అందరిచేత మంచి నటుడు అనిపించుకున్నారు. అమ్మ ఆదోని లక్ష్మీదేవి కూడా నాటకాలు వేసేవారు. వారిద్దరూ వ్యత్తిరీత్యా దగ్గరయ్యారు. వివాహం చేసుకున్నారు. వి.వి.గిరి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో అమ్మనాన్న కలిసి తులాభారం నాటకం ప్రదర్శించారు.

రామా అంటే పలికేవాడిని..
నాన్నగారికి చిన్నప్పటి నుంచి రాముడు, కృష్ణుడు అంటే ఇష్టం. ఎప్పుడు గొంతు సవరించాలన్నా ‘రామా’ అనేవారు. నన్ను పిలిచారనుకుని పరుగెత్తుకు వచ్చేవాడిని. నన్ను ఎత్తుకుని ‘నిన్ను కాదురా... ఆ రాముడిని పిలిచాను’ అనేవారు. నాన్నగారికి నాటకాల మీద ఉండే ప్రీతి కారణంగాను, ప్రజల నుంచి ఆయనకు వచ్చిన ఆదరణ కారణంగాను, ఆయన కుటుంబంతో గడిపింది తక్కువే. ఆఖరిక్షణం వరకు నాటకాలు, సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన జీవితంలో వేలాది నాటకాలు ప్రదర్శించారు. పద్యాలతో పాటు ఈలపాట కూడా పాడేవారు. కాలం చేసే ముందు నాకు సంగీతం నేర్పించాలనుకుని మాస్టర్‌ని పెట్టారు. అంతలోనే అంటే 1975లో నాన్నగారు గతించారు.

ఆరోగ్య యోగా...
ఆయన ఆరోగ్యానికి పెద్ద పీట వేశారు. ఏ షూటింగులూ లేనప్పుడు పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు వ్యాయామం, యోగా, ఆసనాలు క్రమం తప్పకుండా చేసేవారు. ఏ రాగాన్నయినా రెండు నిమిషాల పాటు గిరికీలు కొట్టించే శక్తి కలగడానికి కారణం వ్యాయామమే అని చెప్పేవారు. వేదికల మీద నాటక ప్రదర్శన పూర్తయ్యాక ‘నా వయసు చెప్పండి’ అని అడిగేవారట. అందరూ 50 అంటూంటే అదే తనకి పెద్ద కిక్‌ అని చెప్పేవారు. అప్పటికి నాన్న 60లు దాటేశారు. చెన్నైలో ఒక ఆయుర్వేద వైద్యుడిచ్చిన లేహ్యం సేవించేవారు. ఒళ్లంతా నూనె పట్టించుకుని రోజుకి గంటసేపు స్నానం చేసేవారు.

నటించాలనుకున్నాను కానీ...
నాకు చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక బలంగా ఉండేది. నాన్నగారికి మాత్రం నన్ను పోలీసు ఆఫీసరుని చేయాలని ఉండేది.‘నేను ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మళ్లీ నా పిల్లలు పరిశ్రమలోకి ఎందుకు?’ అనుకున్నారు. అందుకే నన్ను ఈ రంగంలోకి రానివ్వలేదు. నాకు పాతికేళ్లు వచ్చేనాటికి హైదరాబాద్‌ దూరదర్శన్‌లో క్యాజువల్‌ అనౌన్సర్‌గా చేరాను. ఆ తరవాత న్యూస్‌రీడర్‌గా పనిచేశాను. తెర మీద కనపడాలనే నా చిన్ననాటి కోరిక ఆలస్యంగా అయినా తీరినందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం యాడ్‌ ఫిలిమ్స్‌ చేస్తున్నాను.

దేవుడిచ్చిన వరం...
నాన్న పెద్దగా సంగీతం నేర్చుకోకపోయినా దేవుడు ఇచ్చిన వరం వల్ల గొప్ప కళాకారుడు కాగలిగారు. కొన్ని కారణాల వల్ల ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ చిత్రంలో ఆంజనేయుడి పాత్ర మరొకరిని వరించింది. ఆ చిత్రం కోసం నాన్న పాడిన పాటలు, పద్యాలు చిరస్మరణీయంగా నిలిచాయి. తెలుగు పాటలను, పద్యాలను హిందుస్థానీ బాణీలో పాడే ఏకైక తెలుగు వ్యక్తి నాన్నగారు. బాలగంధర్వ శతజయంతికి అన్ని రాష్ట్రాల నుంచి ఆ బాణీలో పాడుతున్నవారిని సత్కరించారట. నాన్నగారి కోసం మా ఇంటికీ వచ్చారు. నాన్న గతించారని తెలిసి, అమ్మలోనే నాన్నను దర్శించుకుని సత్కరించారని అమ్మ చెప్పింది. నాన్న గతించి 45 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజుకీ, నేను ఆయన కుమారుడినని తెలిస్తే చాలు, వయసులో పెద్దవారు సైతం నాకు పాదాభివందనం చేయబోతుంటారు. అంతటి యశో మూర్తి కడుపున పుట్టడం మా అదృష్టం.  

మాయాబజార్‌...
మాయాబజార్‌ సినిమానాటì కే నాన్నగారు కృష్ణుడిగా స్థిరపడిపోయారు. అందువల్ల ఈ చిత్రంలో నాన్నగారి బదులు ఎన్‌టిఆర్‌ను తీసుకున్నారు. అప్పటి నుంచి రామారావు కృష్ణుడు, నాన్న నారదుడు అయ్యారు. ఆ తర్వాత నారదుడిగా కాంతారావుగారు ప్రవేశించడంతో నాన్న నెమ్మదిగా సినీ పరిశ్రమను విడిచిపెట్టారు. 1960లలో నాన్నకు శాంతినికేతన్‌ నుంచి ఆహ్వానం అందటంతో కలకత్తా వెళ్లారట. అక్కడ రవీంద్రనాథ్‌ టాగూర్‌ని కలిసినప్పుడు పద్యాలు, పాటలు, ఈలపాట పాడి వినిపించారట. ఆ విశ్వకవి ముచ్చటగా అన్నీ విని, ‘రోజూ కోయిల పాట వినిపించేది. రెండురోజులుగా అది రావట్లేదు. ఈ కోకిల వస్తోందని తెలిసి ఉంటుంది’ అంటూ నాన్నను ‘ఆంధ్ర నైటింగేల్‌’ అన్నారట. నెహ్రూ సమక్షంలో నాన్నగారు నోటిలో వేళ్లు పెట్టుకుని ఈలపాట పాడటం చూసి, ‘మీ చేతిలో ఏమీ లేదు కదా. ఎలా ఈల వేయగలిగారు?’ అని నెహ్రూ ఆశ్చర్యపోయారట. ఇందిరాగాంధీని కలిసినప్పుడు, ఆవిడ నాన్న వయసు అడిగారట. ‘గతంలో మీ నాన్నగారిని కలిశాను, ఇప్పుడు మిమ్మల్ని కలిశాను. మీ అబ్బాయిని కూడా కలుస్తాను’ అని చమత్కరించారట.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
ఫొటోలు: శివ మల్లాల

ఈ పేరు ఇలా వచ్చింది...
నాన్నగారి అసలు పేరు కల్యాణం వెంకట సుబ్బయ్య. ఆయన తన ఎనిమిదో ఏట స్టేజీ ఎక్కారు. చీరాలలో ఒక నాటకంలో రఘురాముడిగా నటిస్తున్నారట. ఆ నాటకానికి హాజరైన ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు స్టేజీమీదకు వెళ్లి నాన్నగారిని దగ్గరకు తీసుకుని, బంగారు గొలుసు మెడలో వేసి, జనసమక్షంలో ‘ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఈ పాత్రకు ప్రాణం పోశాడు. ఈ రోజు నుంచి ఈ అబ్బాయి సుబ్బయ్య కాదు రఘురామయ్య’ అన్నారట.

ఆ రోజు నుంచి నాన్న రఘురామయ్యగా మారిపోయారు. ఒకసారి ఒక కార్యక్రమంలో ఘంటసాలగారిని పాడమని అడిగారట. ఆయన ‘నా పక్కన సముద్రంలాంటి రఘురామయ్యగారు ఉంటే నన్ను పాడమంటారేంటి’ అన్నారట. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో నాన్నపాడిన ‘నా హృది పయనించు శృంగార సమా’ పాట నాకు చాలా ఇష్టం. ఆయన పిల్లలుగా కొంతవరకైనా ఆయన ఋణం తీర్చుకోవాలనుకున్నాం.  గుంటూరు జిల్లా సుద్దపల్లిలో నాన్నగారి విగ్రహం పెట్టించాం. నాన్నగారి జీవిత చరిత్రను పుస్తకంగా తీసుకొచ్చాను.
– కల్యాణం రామకృష్ణ
ఈలపాట రఘురామయ్య కుమారుడు

మరిన్ని వార్తలు