స్వచ్ఛమైన అక్షరం..స్నేహమయ వ్యక్తిత్వం

30 Oct, 2019 03:11 IST|Sakshi

ఆదర్శాలు మాట్లాడటం వేరు. ఆదర్శంగా జీవించడం వేరు. ఆదర్శంగా జీవిస్తూ ఆ విషయాన్ని ప్రచారం చేసుకోకుండా అదేం పెద్ద గొప్ప కాదు అన్నట్టుగా మరింత గొప్పగా జీవించడం వేరు. రాఘవాచారి ఆ గొప్పతనం ఉన్న గొప్పమనిషి.  

చక్రవర్తుల రాఘవాచారి అంటే ఎవరూ గుర్తుపట్టరు. సి.రాఘవాచారి అనగానే ఆ తెల్లటి స్వచ్ఛమైన రూపం గుర్తుకు వస్తుంది. పాత్రికేయుడిగా బహు సుపరిచితుడు. కాని వ్యక్తిగా రాఘవాచారిని పరిచయం చేయడమే చాలా కష్టం. ఒక అమృత హృదయుడి గురించి పరిచయం చేయడానికి మనకు అర్హత ఉందా లేదా అని అంతరాత్మ తప్పనిసరిగా మథన పడుతుంది. తుది శ్వాస వరకు రాఘవాచారి కమ్యూనిస్టుగానే నిరాడంబరంగా జీవించి, ఆదర్శంగా నిలిచారు. స్థితప్రజ్ఞత, పూర్వభాషణం, మృదుభాషణం ఆయన లక్షణాలు. రాఘవాచారి గారిది ఆదర్శ వివాహం. బాల్యంలో శ్రీవైష్ణవానికి అనుగుణంగా  త్రికాల సంధ్యావదనం చేశారు. వైష్ణవ నామాలు, వెనకాల పిలక, పంచెకట్టు, చేతులకు శంఖుచక్రాలు వేయించుకున్నారు. అంతటి నిష్ఠాగరిష్టులైన రాఘవాచారి డిగ్రీ చదువుతుండగా కమ్యూనిజానికి ప్రభావితులయ్యారు. తన ఆలోచనలను మార్చుకున్నారు. పేరు మార్చుకోవలసిన అవసరం ఏముంది? ఆచారి అని ఉంచుకుంటే మాత్రమేం ఆలోచన, ఆచరణలో ఆ పేరు తనకు ఆటంకం కాబోదు కదా అనుకున్నారు.  రాఘవాచారి అజాత శత్రువు, ఎవ్వరినీ విమర్శించరు. ఆయనతో మాట్లాడుతుంటే ఒక గ్రంధాలయమంతా కలియతిరిగిన భావన కలుగుతుంది.

రాఘవాచారికి ఇద్దరు ఆడ పిల్లలు. 1990 ఆగస్టులో రెండో అమ్మాయి ప్రమాదవశాత్తు మరణించింది. ఆ సమయంలో రాఘవాచారి నిబ్బరంగా కూర్చోవడం చూసి ఆయనతో ‘అమ్మాయి పోయింది కదా!’ అని అడిగితే, ‘బతికుంటే బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చేది’ అన్నారే కాని ‘విధి నా మీద పగబూనింది’ లాంటి చిన్న మాటలు ఆయన నోటి నుంచి రాలేదు. ఇది ఇలా ఉంటే, రాఘవాచారికి అత్యంత ఆత్మీయుడైన రేడియో దిగ్గజం ఉషశ్రీ సెప్టెంబరు 7, 1990 లో కన్ను మూశారు. అప్పటికి రాఘవాచారి అమ్మాయి పోయి పూర్తిగా నెల కూడా కాలేదు. ఉషశ్రీ హైదరాబాదు ఆసుపత్రిలో గతించే సమయానికి విజయవాడలోని ఉషశ్రీ ఇంట్లో ఆయన తల్లి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టీవీలో వార్తలలో అకస్మాత్తుగా తండ్రి గతించిన వార్త చూస్తే పిల్లలు ఏమైపోతారో ఏమోనని రాఘవాచారి సతీమణి జ్యోత్స ్న గబగబ ఉషశ్రీ ఇంటికి చేరి విషయం చెప్పారు. ఒక పక్కన తండ్రి పోయినందుకు బాధపడాలో, కూతురు పోయిన బాధలో కూడా ఉషశ్రీ కూతుళ్ల గురించి ఆలోచించిన ఆయన విజ్ఞతకు చేతులెత్తి నమస్కరించాలో తెలియదు.

 ఉషశ్రీ, రాఘవాచారిది విచిత్రమైన అనుబంధం. ఉషశ్రీ రిటైరయ్యాక, మధ్యాహ్నం భోజనం చేశాక, నిద్ర మధ్యలో లేపద్దని చెప్పి నిద్రపోయేవారు. సరిగ్గా అదే సమయానికి రాఘవాచారి విశాలాంధ్ర ఆఫీసులో ఎడిటోరియల్‌ పూర్తి చేసి ఐదో నెంబరు బస్సు దిగి, ఉషశ్రీ ఇంటి మీదుగా ఇల్లు చేరుకునేవారు. తప్పనిసరిగా ఉషశ్రీ ఇంటి దగ్గర ఆగి మంచి నీళ్లు తాగి ఉషశ్రీతో కొద్దిసేపు చర్చించి వెళ్లేవారు. ఆయన వస్తే, మాత్రం తప్పకుండా నిద్ర లేపమనేవారు. ఇద్దరూ శ్వేతవస్త్రాలే ధరించడం, ఇద్దరివీ కమ్యూనిస్టు భావాలే కావడం, ఇద్దరికీ సాహిత్య చర్చలంటే ఇష్టం కావడంతో, వీరిద్దరి మధ్య అనుబంధం సన్నని లతలా పెనవేసుకున్నట్లు కూడా తెలియనంత గాఢంగా పెనవేసుకుంది. వారిద్దరూ మార్నింగ్‌ వాక్‌ చేస్తుంటే చూసినవారంతా వేదవ్యాస్, కార్ల్‌ మార్క్స్‌ అనుకునేవారు. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకునేవారు. ఉషశ్రీ గతించి మూడు దశాబ్దాలు అవుతున్నా రాఘవాచారి తుదిశ్వాస వరకూ ఆ కుటుంబంతో అనుబంధాన్ని పెనవేసుకునే ఉన్నారు.

తామరాకు మీద నీటిబొట్టు అనే మాట రాఘవాచారికి అన్వయించినట్లుగా మరొకరికి పొసగదు. రాఘవాచారి ఎంత సామాన్యంగా జీవిస్తారో ఒకరు చెప్పవలసిన పని లేదు. ఒక పత్రికకు అతి చిన్న వయసులో ఎడిటర్‌ అయ్యి, అదే పత్రికకు మూడు దశాబ్దాల పాటు అతి తక్కువ జీతానికి ఎడిటర్‌గా పనిచేసిన ఒకే ఒక్క జర్నలిస్టు బహుశా రాఘవాచారి మాత్రమేనేమో. విజయవాడలో 16 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండి, ఆ తరవాత సొంత ఇల్లు కట్టుకుని, అక్కడ 16 సంవత్సరాలు ఉన్నాక, కొన్ని కారణాల వల్ల ఇల్లు అమ్మేశారు. ‘మీకు బాధగా లేదా’ అని ఎవరో ప్రశ్నిస్తే, స్వచ్ఛమైన చిరునవ్వులు నిండిన పెదవులతో, ‘ఏముంది షోడశ సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉన్నాను. మరో షోడశ కాలం సొంత ఇంట్లో ఉన్నాను. మళ్లీ అద్దె ఇంట్లో ఎంతకాలమంటే అంత కాలం’ అని నిజాయితీగా అనేవారు. అసంతృప్తికి అర్థం తెలియదు రాఘవాచారికి. ఆయనకు అనారోగ్యమని తెలిసి ఎవరైనా పలకరించడానికి వెళితే ఆయన తన అనారోగ్య విషయం తప్ప మిగిలిన ఎన్నో విజ్ఞానదాయక విషయాలు మాట్లాడేవారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, మార్క్సిజం, న్యాయశాస్త్రం, స్టాటిస్‌టిక్స్‌... అన్ని అంశాల మీద తడబాటు లేకుండా మాట్లాడగలిగిన శక్తి రాఘవాచారికి ఎక్కడ నుంచి వచ్చిందో మరి. ఆయనకు పెద్దచిన్న తారతమ్యం తెలియదు. మానవులంతా ఒకటే అనే ఆత్మ కలిగిన రాఘవాచారి రాజకీయనాయకుడిని, రిక్షా తొక్కుకునే వ్యక్తిని, టీ అమ్ముకునే కుర్రవాడిని అందరినీ సమదృష్టితో పలకరించేవారు. 
– వైజయంతి 

మరిన్ని వార్తలు