అర్ధరాత్రి స్వతంత్రం

26 Apr, 2020 01:51 IST|Sakshi
కేక్‌ బేకింగ్‌ కోర్సు పూర్తి చేసిన తల్లులు (వీళ్లంతా ‘స్పెషల్లీ ఏబుల్డ్‌’ పిల్లల తల్లులే!)

తల్లిని అంటిపెట్టుకుని ఉండే పిల్లలు పనుల్ని తెమలనివ్వరు. తల్లి అంటిపెట్టుకుని ఉండాల్సిన పిల్లలు పనుల్ని అసలు మొదలే పెట్టనివ్వరు. అందుకే ఈ తల్లులంతా.. అర్ధరాత్రి వెలిగే కిచెన్‌లు అయ్యారు. పిల్లలు నిద్రపోయే వరకు ఉండి.. కేకుల బేకింగ్‌ పనిలోకి దిగుతున్నారు. కోర్సు చేసింది.. ఆర్థిక స్వాతంత్య్రం కోసం. కళ్లు మూతలు పడుతున్నా మేల్కొని ఉంటోంది అర్ధరాత్రి స్వతంత్రం కోసం.

ఒక బ్యాచ్‌ పూర్తయింది. రెండో బ్యాచ్‌కి లాక్‌డౌన్‌ అడ్డుపడింది. ‘క్రాఫ్ట్‌ బేకింగ్‌’కోర్సు అది. పూర్తయిన బ్యాచ్‌లోని మహిళలంతా రుచిగా కేకులు తయారు చేయడంలో సిద్ధహస్తులై ఉన్నారు. ‘వైట్‌ వాంచో’, ‘బార్బీ’ కేకులను చేస్తే వాళ్లు చెయ్యాల్సిందే. అంత రుచిగా వచ్చాయి కోర్సు ట్రైనింగ్‌లో. ఆ రెండు కేక్స్‌కి మంచి మార్కెట్‌ ఉంది. బయట మార్కెట్‌లే లేవు! చేసి చుట్టుపక్కల అమ్మేస్తున్నారు. అందరికీ నచ్చుతున్నాయి. ‘ఆంటీ.. మళ్లీ చేస్తారా?’ పిల్లలొచ్చి అడుగుతున్నారు. నేర్చుకున్న విద్య వృధాగా పోలేదు. లాక్‌డౌన్‌ని ఎత్తేస్తే వీళ్ల కుటీర కేక్‌ పరిశ్రమకు పెద్ద పెద్ద బేకరీలు బెంబేలెత్తి పోవాల్సిందే.
ఇక్కడి వరకు చెప్పుకుని ఆపేస్తే ఇది స్వయం ఉపాధి కథ మాత్రమే అవుతుంది.

క్రాఫ్ట్‌ బేకింగ్‌ కోర్సు ఫస్ట్‌ బ్యాచ్‌లోని 35 మంది మహిళలూ తల్లులే. వీరిలో 30 మంది ‘డిఫరెంట్‌లీ ఏబుల్డ్‌’ పిల్లలున్న తల్లులు. అరె! అలా ఎలా కుదిరింది. కుదర్లేదు. ఎంపిక చేసుకున్నారు. కోళికోడ్‌ నేషనల్‌ ట్రస్ట్, కోళికోడ్‌ పరివార్, డిఫరెంట్‌లీ ఏబుల్డ్‌ పిల్లలున్న తల్లుల సంఘం.. మూడూ కలిసి ట్రైనింగ్‌ ఇచ్చిన మాతృమూర్తులు వీరంతా. కేరళ ప్రభుత్వ పథకం ఎ.ఎస్‌.ఎ.పి. (అడిషనల్‌ స్కిల్‌ అక్విజిషన్‌ ప్రోగ్రామ్‌) కింద ఉన్న ఉపాధి కోర్సులలో ‘క్రాఫ్ట్‌ బేకింగ్‌’ కూడా ఒకటి. కోర్సు చేసిన వాళ్లంతా కోళికోడ్‌లోని దగ్గరి దగ్గరి ప్రాంతాల నుంచి వచ్చినవారే.

కోర్సు అయిపోగానే ఇంటికి వచ్చి సోలియా బైజు అనే మహిళ చేసిన మొదటి పని.. వెనీలా, చాక్లెట్, స్ట్రా బెర్రీ కేకులను తయారు చేయడం. ఎలా వస్తాయో చూద్దాం అని చేసింది. ‘ఇంత బాగా ఎలా వచ్చాయి’ అనే ప్రశంసలు వచ్చాయి. కొడెంచెరీ, కొడువల్లి ప్రాంతాల్లో సోలియా కేకుల్ని తిన్నవారు.. ‘కొత్త బేకరీ పడిందా?’ అనుకున్నారు. అయితే సోనియా వాటిని రాత్రంతా మేల్కొనే ఉండి తెల్లవారు జామున చేస్తోందని వారికి తెలిసే అవకాశం లేదు. నిజానికి అప్పుడు మాత్రమే ఆమెకు కుదురుతుంది. తన నాలుగేళ్ల కొడుకును వదిలి పనిలో పడటానికి ఆమెకు దొరికే సమయం అది. ఆ చిన్నారికి నరాల బలహీనత. ఏ అర్ధరాత్రి తర్వాతో కాని నిద్రపోడు. అప్పటివరకు తల్లి తన పక్కన ఉండాల్సిందే. నజీబత్‌ సలీమ్, షైజాలది కూడా సోలియా పరిస్థితే. నిద్రకు ఆగలేగ రెప్పపడుతున్నా.. పిల్లల కంటికి అనుక్షణం రెప్పల్లా ఉండాలి. నజీబత్‌ చెంబుకడవులో, షైజా ఉన్నికుళంలో ఉంటారు. పిల్లలు పడుకున్నాక అర్ధరాత్రి కేకుల తయారీ మొదలుపెడతారు.  

సోలియాకు అప్పుడే కొంత డబ్బును వెనకేయడానికి వీలవుతోంది. ఆమె బిడ్డకు తరచు డైపర్స్‌ మారుస్తుండాలి. భర్తను డబ్బులు అడగవలసి వచ్చేది. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టనవసరం లేకపోవడం ఆమెకు సంతోషాన్నిస్తోంది. రోజుకు ఇరవై కేకులు చేసి అమ్మగలుగుతోంది. నజీబత్‌కు పద్నాలుగేళ్ల కూతురు ఉంది. అది తల్లికి సహాయం చేసే వయసే కానీ, మానసికంగా తనింకా పసిపాపే. ఎనభైశాతం ‘మెంటల్లీ ఛాలెంజ్డ్‌’.

ఆ పాప నిద్రపోయాకే నజీబత్‌కు పని మొదలుపెట్టడం సాధ్యమౌతుంది. అయితే ఎప్పుడు నిద్రపోతుందో చెప్పలేం. అప్పటి వరకు ఆమె వేచి చూడవలసిందే. అప్పటికి నజీబత్‌ కళ్లూ నిద్రకు బరువెక్కుతుంటాయి. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం బలవంతంగా నిద్ర ఆపుకుంటుంది. ఆమె భర్త ఉపాధి కోసం ఆఫ్రికా వెళ్లాడు. షైజా కొడుకు వయసు 22 ఏళ్లు. అతడికి మానసిక వైకల్యంతో పాటు వినికిడి లోపం కూడా ఉంది. అతడు నిద్రపోయాకే కేకుల తయారీకి, కేకులపైన ఐసింగ్‌కీ వీలవుతుంది షైజాకు.

లాక్‌డౌన్‌ పూర్తయ్యాక ఫస్ట్‌ బ్యాచ్‌లోని వాళ్లతో కేకులు తయారు చేయించి మార్కెట్‌ చేయాలని ఎ.ఎస్‌.ఎ.పి. జిల్లా కోఆర్డినేటర్‌ మెర్సీ ప్రియా ఇప్పటికే ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసి ఉంచారు. నిద్ర మానుకుని మరీ కష్టపడుతున్న ఈ తల్లులకు.. కష్టాన్ని మరిపించేలా ఆ ప్రతిఫలం ఉండబోతోందన్న మాట.

బార్బీ కేకు, వైట్‌ వాంచో కేక్‌

మరిన్ని వార్తలు