ఫోన్ కావాలా? నేను కావాలా?

6 Oct, 2017 23:50 IST|Sakshi

మనిషిలో ఎన్ని సెల్లులు ఉంటాయి? ఓ.. లెక్కలేనన్ని! అన్నీ మురికైపోతున్నాయట.. టాక్సిన్‌లతో. అంటే.. అవో రకం విషాలు. బాడీ లోపల శుభ్రం చేసుకోడానికి సాత్విక భోజనం చేసినట్లు.. మైండ్‌ని క్లీన్‌ చేసుకోడానికి సాత్విక సమయం ఒకటి ఉండాలి. మరి ఆ సమయం ఎలా లభిస్తుంది? డిజిటల్‌ డీటాక్స్‌లో దొరుకుతుంది?!

చెయ్యవలసిన పనులు కొన్ని చెప్పింది వేదం. చెయ్యకూడదని పనులు కూడా కొన్ని చెప్పింది. ‘ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వొక్కడివే మేల్కొని ఉండకు’ అని వేద వచనం. ‘నిద్ర రాకపోతే నేను మాత్రం ఏం చేసేది? అయినా ఏమౌతుంది నాకు?.. శిష్యుడు అడిగాడు. గురువుగారు నవ్వారు. ‘నీకే అవుతుందని నువ్వెందుకు అనుకుంటున్నావ్‌?’ అన్నాడు. శిష్యుడికి అర్థంకాలేదు. ‘నిద్రపోతున్న వాళ్లకు మాత్రం ఏమౌతుంది?’ అని గురువుగారిని అడిగాడు. ‘కొన్ని ప్రశ్నలకు సమాధానం గురువు చెబుతాడు. కొన్ని ప్రశ్నలకు అనుభవం చెప్తుంది’ అన్నారు గురువుగారు. ఈ శిష్యుడు 2017 నాటి వాడు. యువకుడు. అతడు విన్న గురువేదం అతి ప్రాచీనమైనది. 1997కు ముందు నాటిది. స్మార్ట్‌ఫోన్‌లు రాని యుగంలోనిది. కనుక ‘ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు నువ్వొక్కడివే మేల్కొని ఉండకు’ అని వేదం ఎందుకు చెప్పిందో అతడు ఈ జన్మకు అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం లేదు. స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక రాత్రిళ్లు ఎవరూ నిద్రపోవడం లేదు. పగళ్లు ఎవరూ మెలకువగా ఉండటం లేదు! మరెలా శిష్యుడి సందేహానికి సమాధానం లభించడం?అన్నీ అనుభవాలే చెప్తాయనేముందీ.. అవమానాలూ చెప్తాయి. పనిగట్టుకుని అవమానాలు పడటం కోసం ఉన్నపళంగా ఎక్కడికి బయల్దేరాలి? ఎక్కడికీ అక్కర్లేదు. మీ పక్కనే అవమానం పొంచి ఉంది! మీ చుట్టూ ఉన్నవాళ్లను చూడండి. వాళ్లంతా ఈ క్షణంలో ఏం చేస్తూ ఉన్నారు? తలలు వంచుకుని ఈ ప్రపంచంతో పని లేకుండా తమ స్మార్ట్‌ ఫోన్‌ టచ్‌స్క్రీన్‌లను కదిలిస్తూ ఉన్నారు కదా. కాసేపు వాళ్లందరినీ మీ కుటుంబ సభ్యులు అనుకోండి. అది రాత్రివేళ అనుకోండి.

టచ్‌ స్క్రీన్‌లకు అంటుకుపోయిన వాళ్లందరినీ నిద్రపోతున్నవాళ్లు అనుకోండి. ఇప్పుడు మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ జేబులోంచి బయటికి తీసే ప్రయత్నాన్ని మానుకోండి. అంటే.. మీ కుటుంబ సభ్యులలో మీరొక్కరే మేల్కొని ఉన్నారన్నమాట. కాసేపలా.. నిలబడి ఉంటే నిలబడేఉండండి. కూర్చొని ఉంటే కూర్చొనే ఉండండి.. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా, స్మార్ట్‌ఫోన్‌లో లీనమైపోయి ఉన్నవాళ్లను డిస్టర్బ్‌ చేయకుండా. మీరేం చెయ్యకుండానే, మీ వల్ల.. వాళ్ల ‘నిద్ర’కు భంగం కలుగుతుంది! చికాగ్గా తలతిప్పి మీ వైపు చూస్తారు.. మీరు గానీ వాళ్లు చేస్తున్న టెక్స్‌టింగ్‌ని చూడ్డం లేదు కదా అని!  దీనికి విరుగుడు.. మీ చేతిలోనూ స్మార్ట్‌ఫోన్‌ ఉంచుకోవడం. అంటే మీరు కూడా ‘నిద్ర’పోవడం. అప్పుడు మీరు మీలోకంలో ఉన్నారన్న నిశ్చింతతో వాళ్లు వాళ్ల లోకంలో స్వేచ్ఛగా ‘నిద్ర’పోగలుగుతారు. పబ్లిక్‌గా పర్సనల్‌ విషయాలను మాట్లాడుకుంటూ, పర్సనల్‌ టెక్స్‌టింగ్‌ చేసుకుంటూ, పర్సనల్‌ ఫొటోలు, వీడియోలు చూసుకుంటూ.. ప్రైవసీని పాడుచేస్తున్నారని పక్కనున్నవాళ్లను శంకించడం ఎంత అనాగరికమో చూడండి. నిజానికి ఫ్రీడమ్‌ని కోల్పోతున్నది మనం. స్వేచ్ఛగా తల తిప్పడానికి లేకుండా! మనవైపు డిజ్గస్టింగ్‌ లుక్‌ ఇచ్చేది మాత్రం వాళ్లు. ఇలాంటి అవమానాలకు మీరేమీ చేయలేరు. ఒకవేళ మీరే ఇలా మీ పక్కవాళ్లను అవమానిస్తూ ఉంటే మాత్రం వెంటనే మీకొక డోస్‌ ‘డిజిటల్‌ డీటాక్సిఫికేషన్‌’ అవసరం. అది మీకు ఏ డాక్టరో ఇచ్చేది కాదు. మీకై మీరు ఇచ్చుకునేది. సింగిల్‌ షాట్‌తో మైండ్‌ క్లియర్‌ అయిపోతుంది. ఇంగితం వచ్చేస్తుంది.

డిజిటల్‌ డీటాక్స్‌  
విషరసాయనాల్ని తొలగించడం డీటాక్సిఫికేషన్‌. బాడీలో ఉంటే బాడీలోంచి. మైండ్‌లో ఉంటే మైండ్‌లోంచి! తిండి వల్ల శరీరం చెత్తకుండీగా మారినప్పుడు డీటాక్స్‌ చేస్తే మొత్తం శుభ్రమౌతుంది. స్మార్ట్‌ టెక్నాలజీవల్ల మైండ్‌ గందరగోళం అవుతున్నప్పుడు క్లీన్‌ చేసుకోడానికి కూడా ఇలాగే డీటాక్స్‌ అవసరం. దీన్నే డిజిటల్‌ డీటాక్సిఫికేషన్‌ అంటారు. శరీరాన్ని డీటాక్స్‌ చేయడానికి కొన్ని రోజులు తిండి మానేయాలి. డిజిటల్లీ డీటాక్స్‌ అవడానికి కొన్నాళ్లు స్మార్ట్‌ ఫోన్‌ని, మిగతా స్మార్ట్‌ గాడ్జెట్స్‌ని పక్కన పడేయాలి.

టచ్‌ చేస్తున్నది ఎవరు?
మనుషులు ఫోన్‌ని టచ్‌ చేస్తున్నారో, ఫోన్‌లే మనుషుల్ని టచ్‌ చేస్తున్నాయో తెలియనంతగా డిజిటలైజ్‌ అయింది ప్రపంచం.We shape our tools, and thereafter our tools shape us అని అంటుండేవారట మార్షల్‌ మెక్‌లుహాన్‌. ఈ కెనడా ప్రొఫెసర్‌.. ఫిలాసఫర్, పబ్లిక్‌ ఇంటలెక్చువల్‌ కూడా. మనుషుల ప్రవర్తనల మీద పరిశోధనలు చేశారు. 1980లో చనిపోయారు. ముప్పై ఏడేళ్ల క్రితం ఏ టెక్నాలజీ లేని కాలంలోనే ‘పరికరాలను మనం మలుచుకుంటాం. తర్వాత అవి మనల్ని మలుచుకుంటాయి’ అని అన్నారంటే.. ఇప్పటి ‘స్మార్ట్‌’ శతాబ్దంలో ఆయన ప్రాణాలు ఎంత విలవిల్లాడేవో! ఒక్క క్షణం మీ స్మార్ట్‌ఫోన్‌ని   చూడండి. డిజిటల్‌ టెక్నాలజీకి అది విశ్వరూపం మాత్రమే కాదు, వికృత రూపం కూడా!

మనిషిదో ప్రపంచం
స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక దూరంగా ఉన్న మనుషులు దగ్గరయ్యారు. దగ్గరివాళ్లు దూరమయ్యారు. ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురివీ నాలుగు ప్రపంచాలు. అబ్బాయి టెక్స్‌టింగ్‌లో ఉంటాడు. అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఉంటుంది. నాన్న వాట్సాప్‌లో ఉంటాడు. అమ్మ యూట్యూబ్‌లో ఉంటుంది. నేరుగా ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా.. పెద్ద యాత్రకు సిద్ధమైనట్లే.  ఇల్లు మాత్రమే ఇలా ఉందా? లోకమంతా ఇల్లులానే ఉంటోంది! పేషెంట్‌ బీపీ చూస్తూ, స్మార్ట్‌ ఫోన్‌ బీప్‌ల కోసం ఎదురుచూస్తుంటాడు డాక్టర్‌.  గవర్నమెంట్‌ ఆఫీస్‌లలో చూడండి. పని మీద వచ్చిన మనిషిని ఎదురుగా పెట్టుకుని, ఎక్కడో ఉన్న పనిలేని మనిషి పనులన్నీ ఫోన్‌లోనే చేసిపెడుతుంటాడు ఆ ఎంప్లాయీ. స్మార్ట్‌ ఫోన్‌కు వ్యాల్యూ పెరిగాక, ఎదుటి మనిషి వాల్యూ పడిపోయింది. ఫోన్‌లోకి చూసుకుంటూ మనుషులతో మాట్లాడ్డం అనే ధోరణి ఎక్కువైంది. ‘ఫబింగ్‌’ అంటారు ఈ అవలక్షణాన్ని. మీతో మాట్లాడ్డానికి వస్తారు. ఫోన్‌ చూసుకుంటూనే వస్తారు. ఫోన్‌ చూసుకుంటూనే మాట్లాడతారు. ఫోన్‌ చూసుకుంటూనే వెళ్లిపోతారు. మనిషిని డిజ్‌రెస్పెక్ట్‌ చెయ్యడం ఇది.

రింగ్‌.. వైబ్రేషన్‌.. టోన్‌
స్మార్ట్‌ఫోన్‌ తెచ్చిపెట్టే అష్టావక్ర లక్షణాలపై పెద్దగా పుస్తకాలేమీ రాలేదు. రాబర్ట్‌ సట్టన్‌ అనే ‘స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’ ప్రొఫెసర్‌ ఈ మధ్య The Asshole Survival Guide: How to Deal with People Who Treat You Like Dirt అనే పుస్తకం రాశారు. అందులో ‘ఫబింగ్‌’పై ఓ చాప్టరే ఉంది. ఎవరి లోకంలో వాళ్లు ఉండటం మంచి విషయమే కదా.. అనే సందేహం స్మార్ట్‌ పర్సన్స్‌కి రావచ్చు. మంచిదే. అయితే చుట్టూ ఉన్న ప్రపంచాల మాట ఏమిటి? పని చేయవలసిన ప్రపంచం, ప్రొడక్టివిటీని సాధించవలసిన ప్రపంచం, బరువు బాధ్యతల ప్రపంచం, మానవ సంబంధాల ప్రపంచం.. వీటన్నిటినీ వదిలేసి.. కనీస మర్యాదల్ని వదిలేసి మన ప్రపంచంలో మనం ఉండిపోతే... చివరికి ఏదీ మిగలదు. ఎవరూ మిగలరు.. మానసిక అనారోగ్యాలు తప్ప. జీవితం స్మార్ట్‌గా ఉండాల్సిందే. స్మార్ట్‌గా ఉండటమే జీవితం కాకూడదు. రాని రింగ్‌ కోసం, రాని వైబ్రేషన్‌ కోసం, రాని టోన్‌ కోసం... మైండ్‌ రెండు నిమిషాలకొకసారి ఫోన్‌ని చెక్‌ చేసుకుంటోం దంటే డిజిటల్‌ డీటాక్సిఫికేషన్‌కి టైమ్‌ దగ్గరపడిందనే. కనెక్షన్‌ ఉన్నంతసేపూ స్మార్ట్‌ వరల్డ్‌ వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. వింత వింత లోకాల విహారం చేయిస్తుంటుంది. కనెక్షన్‌ కట్‌ అయితే అన్నీ ఒక్కసారిగా మాయమైపోయి చీకటి మాత్రమే మిగులుతుంది. ఆ చీకట్లో టెక్నాలజీ మాట్లాడలేదు. పక్కనున్న మనుషులు మాట్లాడగలరు. వెలుగు కన్నా చీకటే నయం అని చెప్పడం కాదిది. వెలుగు ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్న మనుషులు మాట్లాడుతుంటే వినడం మానొద్దని చెప్పడం.

డిజిటల్‌ డీటాక్స్‌
ట్రూ అండీ!
►మనసు ప్రశాంతంగా, అలజడి లేకుండా ఉంటుంది.
►మంచి మంచి ఆలోచనలకు టైమ్‌ దొరుకుతుంది.
►చుట్టుపక్కల వాళ్లతో చక్కటి పరిచయాలు ఏర్పడతాయి.
►ఒకేసారి పది పనులు మీద వేసుకోవడం మానేస్తాం.
►మన ప్లానింగ్‌ ప్రకారం మన స్కెడ్యూల్‌ నడుస్తుంది.

ట్రై చెయ్యండి
►తినేటప్పుడు ఫోన్‌ని దగ్గర ఉంచుకోకండి.
►‘టచ్‌’ ప్రపంచంలోంచి బయటికి వచ్చి, రియల్‌ వరల్డ్‌కి టచ్‌లో ఉండండి.
►ఎవరైనా మీ అటెన్షన్‌ కోరుకుంటున్నప్పుడు మీరు అటెన్షన్‌ని ఫోన్‌కి ఇవ్వకండి.
►మీలాగే డిజిటల్‌ డీటాక్స్‌లోకి వచ్చినవాళ్లను జత చేసుకోండి.
►మీ ఫోన్‌కి ఒక రోజు సెలవు ప్రకటించండి. (వ్రతభంగం జరిగినా పర్వాలేదు)

మరిన్ని వార్తలు