‘నువ్వేం చూపించదలచుకున్నావ్‌?’

26 Jul, 2019 10:53 IST|Sakshi

సినీ తారలతో ఫ్యాన్స్‌కు ఉండేది ఆత్మబంధం! పైకి ఏదో అలా సినిమా చూసి వచ్చేసినట్లే ఉంటారు. లోలోపల మాత్రం టెంపుల్స్‌ కట్టేసుకుంటారు. టెంకాయలు కొట్టేసుకుంటూ ఉంటారు. ఆ అభిమానం ఇప్పుడు కొత్త ‘ట్రోల్స్‌’ తొక్కుతోంది. ఎవరైనా తమ ‘దేవత’ను ఒక మాటంటే ఒప్పుకోనట్లే.. మాట అనిపించుకునేలా ఆ దేవత ఉన్నా.. అంగీకరించడం లేదు! ఈ ధోరణికి మనం లైక్‌ కొట్టాలా? రాంగ్‌ కొట్టాలా?

సందర్భ శుద్ధి గల ఒక బుద్ధి లేని ప్రశ్న. విజయ్‌ దేవరకొండ, రశ్మిక మందన్నా.. రిలేషన్‌లో ఉన్నారా?
బుద్ధిహీనతకు అకేషన్‌ అక్కర్లేదు. ఈరోజు ‘డియర్‌ కామ్రేడ్‌’ విడుదల అవుతోంది కాబట్టి, అర్థం పర్థం లేని ఈ ప్రశ్న సందర్భోచితం అయింది.
విజయ్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఇప్పుడు. అమ్మాయిలు అతడి కోసం పడి చస్తున్నారు. రశ్మిక మోస్ట్‌ వాంటెడ్‌. అబ్బాయిలు ఆమె సినిమాల కోసం పడిగాపులు కాస్తున్నారు. విజయ్‌–రశ్మిక కంబైండ్‌గా మోస్ట్‌ అసూయబుల్‌. విజయ్‌ని రశ్మికతో చూస్తున్న అమ్మాయిలు, రశ్మికను విజయ్‌తో చూస్తున్న అబ్బాయిలు.. గుండెలు బద్దలు చేసుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే విజయ్, రశ్మికల మధ్య రిలేషన్‌ ఉంటే..

రెండు జండర్‌లలో కొన్ని గుండెలు ఆగిపోతాయా!
ఆగబోయే గుండెల్ని విజయ్, రశ్మిక కలిసి ‘మా మధ్య అలాంటిదేమీ లేదు’ అనే ఒక్క స్టేట్‌మెంట్‌తో ఆపగలరు. అయితే ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాను బాయ్‌కాట్‌ చెయ్యాలని కర్ణాటకలో మూడు రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని ఆపడం మాత్రం ఒక్క రశ్మిక చేతుల్లోనే ఉంది.. చిన్న అపాలజీ స్టేట్‌మెంట్‌తో! అపాలజీనా? ఏం చేశారావిడ?

‘కన్నడం కష్టం’ అన్నందుకు!
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఒకే రోజు నాలుగు భాషల్లో ఇవాళ స్క్రీన్‌ల మీదికి వస్తోంది ‘డియర్‌ కామ్రేడ్‌’. ‘అర్జున్‌రెడ్డి’తో విజయ్‌ దేవరకొండ, ‘గీత గోవిందం’ తో రశ్మిక మందన్నా దక్షిణాదికి హార్ట్‌ బీట్‌ అయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ రశ్మిక ఇప్పుడు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో కూడా నటించబోతున్నారు. సినిమాలు తప్ప ఆమె మనసులో ఏమీ లేవు. దేవరకొండ అసలే లేడు. బాగా నటించాలి. అంతవరకే. ‘విజయ్‌ దేవరకొండ సినిమా అనగానే ఒప్పేసుకున్నారా’ అని మనవాళ్లు అడగ్గానే, ‘అంతలేదు’ అని రశ్మిక వెంటనే చెప్పేయలేదా? ఆమె క్లియర్‌గానే ఉన్నారు. భాష తెలియకపోయినా, భాష రాకపోయినా! సినిమా ప్రమోషన్‌కి చెన్నై వెళ్లినప్పుడు తమిళ్‌వాళ్లు అడిగారు.. ‘డబ్బింగ్‌ కష్టం కాలేదా?’ అని. ‘అంత తేలిక అయితే కాదు’ అని చెప్పారు రశ్మిక. ఆ ప్రశ్నకు ముందు వాళ్లు వేసిన ప్రశ్న ఇంకొకటి ఉంది. ‘మిగతా మూడు భాషలతో కంపేర్‌ చేస్తే మీ మాతృభాష కన్నడలో మీకు డబ్బింగ్‌ ఈజీ అయి ఉంటుంది కదా’ అని. అది తమిళ్‌ ఇంటర్వ్యూ కనుక రశ్మిక తమిళ్‌లోనే ఆన్సర్‌ చేశారు. ‘అదు కష్టం. ఎనకు ఏ లాంగ్వేజ్‌ కరెక్ట్‌ అగి వరాదూంగా’ అన్నారు. ‘అది కూడా కష్టమే. నేను ఏ భాషనూ కరెక్టుగా మాట్లాడలేను’ అని. కన్నడ ఫాన్స్‌ ఈ మాటను పట్టుకున్నారు. ‘కన్నడ అమ్మాయికి కన్నడం కష్టం అవడమేంటి.. స్టెయిల్‌ కాకపోతే!’ అని సోషల్‌ మీడియాలో ఆమెను ట్రోల్‌ చేశారు. ‘యాంటీ–కన్నడ కామెంట్స్‌ చేసినందుకు నిరసనగా రశ్మిక నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాను బాయ్‌కాట్‌ చెయ్యాలని ట్విట్టర్‌లో పెద్ద ఉద్యమమే లేవదీశారు. రక్షిత్‌శెట్టితో రశ్మిక విడిపోయినప్పుడు కూడా ఇలాంటి ఉద్యమమే కొన్నాళ్లు నడిచింది.

రక్షిత్‌ కన్నడ నటుడు. సినీ నిర్మాత. స్క్రీన్‌ రైటర్‌. రశ్మిత తొలి సినిమా ‘కిరిక్‌ పార్టీ’ (2016) నిర్మాత అతడే. ఆ సినిమా తీస్తున్నప్పుడు రక్షిత్‌కి, రశ్మికకు రిలేషన్‌ ఏర్పడింది. నిశ్చితార్థం కూడా జరిగింది. తర్వాత ఎందుకనో వద్దనుకున్నారు. అదే టైమ్‌లో ఇక్కడ గీత గోవిందం హిట్‌ అయింది. తెలుగులో గుర్తింపు వచ్చాక రక్షిత్‌ను వద్దనుకుందని రశ్మికపై రక్షిత్‌ ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌ చేశారు. పాపం.. తననేమీ అనొద్దనీ, ఇద్దరం ఇష్టప్రకారమే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నామని రక్షిత్‌ తనకై తను చెప్పినా ఫ్యాన్స్‌ వినలేదు. రశ్మిక కూడా అప్పుడూ ఏం మాట్లాడలేదు. ఇప్పుడూ ఏమీ మాట్లాడలేదు. ఈమధ్య మనవాళ్లెవరో విజయ్‌ దేవరకొండను అడిగారు.. ‘రశ్మిక బ్రేకప్‌ గురించి కామెంట్‌ ప్లీజ్‌’ అని! ‘ఎందుకు.. సంబంధంలేని వాటి చుట్టూ తిరుగుతారు’ అని విజయ్‌ మందలింపుగా అన్నారు.

నాట్‌ మై దీపిక
సినిమాతో సరిపెట్టుకోనివ్వదు అభిమానం. నచ్చిన హీరోనో, హీరోయిన్‌నో కలవాలని తపిస్తుంది. చేయి కలపాలని, ఫొటో తీయించుకోవాలని ప్రయత్నిస్తుంది. అభిమాన సంఘం పెట్టుకుంటుంది. క్షీరాభిషేకం చేస్తుంది. గుడి కట్టిస్తుంది. ఇవన్నీ పాత విధానాలు. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫాన్స్‌ ఇప్పుడు డైరెక్టుగా సినీ స్టార్స్‌తో ఇంటరాక్ట్‌ అవుతోంది. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి, వృత్తిపరమైన  నిర్ణయాల్లోకి కూడా వెళ్లిపోతోంది. రశ్మికతోపాటు ఇప్పుడీ తరహా అభిమానానికి ‘గురవుతున్న’ మరొక నటి దీపికా పడుకోన్‌. ఈమెకు వ్యతిరేకంగా తాజాగా ‘నాట్‌ మై  దీపిక’ అనే మూవ్‌మెంట్‌ నడుస్తోంది! ‘నా దీపిక కాదు’ అని! ఫ్యాన్స్‌కి ఎందుకి ంతగా ఆవేదన కలిగింది? ‘మీటూ’ కేసులో నిందితుడిగా ఉన్న బాలీవుడ్‌ దర్శకుడు లవ్‌ రంజన్‌ నెక్ట్స్‌ సినిమాలో దీపిక నటించడం వారికి ఇష్టం లేదు. లవ్‌ రంజన్‌ తీసే సినిమాలు వెరైటీగా ఉంటాయి. ‘ప్యార్‌ కా పంచనామా’, ‘లైఫ్‌ సహీ హై’ ఆయన డైరెక్ట్‌ చేసిన సినిమాలే. ఇవి కాక, మరికొన్ని సినిమాలకు నిర్మాత కూడా. దీపిక ఈ మధ్య రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి లవ్‌ రంజన్‌ ఇంటికి వెళ్లి వస్తూ మీడియా కంటపడ్డారు. అంతే. ఇక వీళ్లిద్దరూ లవ్‌ రంజన్‌ కొత్త ప్రాజెక్టులో నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని చూసిన అభిమానులు.. ‘చస్తే ఆ పని చెయ్యొద్దు’ అని దీపికకు ట్వీట్‌లు పెట్టారు. ‘‘స్త్రీలను లైంగికంగా వేధించే ఒక నీచుడి ప్రాజెక్టులో మీరు నటిస్తున్నట్లయితే మీటూకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఎందరో మహిళలకు మీరు అన్యాయం చేసినట్లే. మీరు మీ గౌరవాన్ని కూడా కోల్పోతారు’’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ‘నాట్‌ మై దీపిక’ అనే హ్యాష్‌టాగ్‌ ఆవిర్భవించింది. లవ్‌ రంజన్‌ ప్రాజెక్టులో దీపిక నటించకూడదని కోరుకుంటున్న, ఆదేశిస్తున్న, విజ్ఞప్తి చేస్తున్న, ప్రాధేయపడుతున్న, ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌ అంతా కలిసి దీపికపై ఇలా ఒత్తిడి తెస్తున్నారు! ‘ప్యార్‌ కా పంచనామా’ (2011) ఆడిషన్‌లలో లవ్‌ రంజన్‌ తన  పట్ల అనుచితంగా ప్రవర్తించాడని, ఒంటిపై బట్టలన్నీ తీసి నిలబెట్టాడని ఇటీవల ఒక నటి ఆరోపించింది. అలాంటి వ్యక్తితో టై–అప్‌ కావడం ఏంటని దీపిక ఫ్యాన్స్‌ ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై దీపిక ఇంతవరకూ స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అంటే లవ్‌ రంజన్‌ సినిమాకు సంతకం చేశానని ఆమె చెప్పినప్పుడు కదా!

బర్త్‌డే పార్టీలో ప్రియాంక : బికినీలో విహరిస్తూ.. స్మోక్‌ చేస్తూ..
బ్యాడ్‌ గర్ల్‌ ప్రియాంక
నిక్‌ జోనస్‌ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక కూడా ప్రియాంక  చోప్రా  అభిమానులు  ఆమె ఇంకా తమ మనిషే అనే భావనలోంచి బయటికి వచ్చినట్లే లేదు. ఇటీవల మయామీ బీచ్‌లో ప్రియాంక సిగరెట్‌ తాగుతున్న ఫొటోను, బికినీలో ఆమె ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి తట్టుకోలేకపోయారు ఫాన్స్‌. ‘ప్రియాంకా.. ఏమిటి నువ్వు చేస్తున్న పని’ అని ఆవేదన చెందారు. ఆగ్రహం వ్యక్తం చేశారు! ప్రియాంక గ్లోబల్‌ స్టార్‌. ఆ గ్లోబల్‌ స్టార్‌ దేశవాళీ స్టార్‌లా ఉండాలని కోరుకోవడం అంటే అభిమానం హద్దులు విధించడమే కదా! జూలై 18న ప్రియాంక బర్త్‌ డే. ఆమె ఎంతో ముందుగా ప్లాన్‌ చేసుకున్న రోజు అది. ముంబై నుంచి ప్రియాంక తల్లి మధు చోప్రా, చెల్లి పరిణీతి చోప్రా కూడా మయామీ వచ్చి ప్రియాంక–నిక్‌లతో జాయిన్‌ అయ్యారు. పరిణీతి అయితే తన అప్‌కమింగ్‌ మూవీ ‘జబరియా జోడీ’ ప్రమోషన్‌ పనులను కూడా పక్కన పెట్టి అక్కకోసం ఆకాశంలో ఎగిరొచ్చారు. ఆ రోజు ప్రియాంక ఎంతో లవ్‌లీగా ఎంజాయ్‌ చేశారు. యాట్‌(విలాసవంతమైన నౌక) లో విహరించారు. ఘాటుగా ఉండని మేలు రకం సిగరెట్‌ను ఆస్వాదించారు. దేహానికి బికినీని తగిలించుకుని విహంగంలా మారిపోయారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. వాటిని చూసి ప్రియాంక ఫ్యాన్స్‌ విలవిల్లాడిపోయారు. ‘ది స్కయ్‌ ఈజ్‌ పింక్‌’ సినిమాలో (అదింకా మన దేశంలో విడుదల కాలేదు) ఒక తల్లిగా ప్రియాంక చెప్పిన నీతులేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?’ అని ఒకరు ట్వీట్‌ పెట్టారు. ఇంకొకరు మరికాస్త ముందుకు వెళ్లి.. ‘అల్లుడి పక్కన అత్తగారు అలానేనా కూర్చోవడం! అసలు ప్రియాంక ఎలా చూస్తూ ఊరుకుంది? భారతీయ సంప్రదాయం ఏమిటో ఆ తల్లి మర్చిపోయినా, ఈ కూతురు గుర్తు చెయ్యొద్దా ’ అని ట్వీట్‌ చేశారు. మరికొందరైతే.. ‘ప్రియాంక తన లవింగ్‌ హస్బెండ్‌తో, లవింగ్‌ మదర్‌తో, బ్యూటిఫుల్‌ బికినీతో ఉన్న ఫొటోలు నాకేమీ సంతోషం కలిగించడం లేదు. ధ్వని లేకుండా దీపావళిని సెలబ్రేట్‌ చేసుకొమ్మనీ, కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చుకొమ్మని, మూగజీవుల పట్ల మానవత్వంతో మెలగమని ఇక ముందు కూడా చెప్పేందుకు ప్రియాంక ఎలా ధైర్యం చేయగలుగుతారు’’ అని ఒక అభిమాని వాపోయారు. రశ్మిక, దీపిక లానే ప్రియాంక ఏమీ స్పందించలేదు. తను చేసింది తప్పు అనుకుంటే తన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోరు కదా.

భూమి పడ్నేకర్‌ జిమ్‌ సెల్ఫీ
‘ఎక్కడ తల్లీ నీ బ్రెయిన్‌?’
భూమి పడ్నేకర్‌ నాలుగేళ్లుగా బాలీవుడ్‌లో ఉన్నారు. మంచి సినిమాలు చేశారు. ‘టాయ్‌లెట్‌ : ఏక్‌ ప్రేమ్‌ కథ’లో మంచి రోల్‌ చేశారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన డైలీ రొటీన్‌ ఫొటోలను తరచు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. ఈమధ్య జిమ్‌కి వెళ్లినప్పుడు అక్కడ తీసుకున్న సెల్ఫీని కూడా అలాగే పోస్ట్‌ చేశారు. ఆ యాంగిల్‌లో (బ్రెస్ట్‌ ఎలివేట్‌ అయ్యేలా) తీసుకున్న ఫొటో ఆమె అభిమానులకు నచ్చలేదు. ‘భూమి ఏంటి? ఇలా కనిపించడం ఏంటి?’ అనుకున్నారు. ఒకరైతే చాలా బ్యాడ్‌గా కామెంట్‌ పెట్టారు. ‘నీ బ్రెయిన్‌ నీ బ్రెస్ట్‌లో ఉందా?’ అని పెట్టారు! ఇలాంటివే చాలా కామెంట్లు. ‘నిన్నెంత ఉన్నతంగా ఊహించుకున్నాం. నువ్వేమో ఇలాగా’ అని మరొక ఆవేదన. ఆ ఫొటోలో భూమిక ‘పీస్‌ ఆఫ్‌ మైండ్‌’తో ఉన్నట్లు కనిపిస్తున్నారు. దానిపైనే ఎక్కువ కామెంట్లు వచ్చాయి.
‘పీస్‌ ఆఫ్‌ మైండ్‌’ (పి.ఐ.ఇ.సి.ఇ.)
‘అందరికీ మీడియా అటెన్షన్‌ కావాలి’.
‘నీ పీస్‌ ఆఫ్‌ మైండ్‌ నీ బ్రాలో ఉన్నట్లుంది’.
‘ఇలాంటి యాంగిల్‌ను ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు’.
‘రెండు పెద్ద పీస్‌ ఆఫ్‌ మైండ్‌లు’.
‘నువ్వేం చూపించదలచుకున్నావ్‌?’
ఇలా ఉన్నాయి కామెంట్లన్నీ. తన వర్క్‌అవుట్‌ సెల్ఫీ తన ఫ్యాన్స్‌ మనసును ఇంతగా విరిచేస్తుందని ఆమె ఊహించినట్లు లేరు. కానీ తనేం తప్పు చేయలేదు కదా. ఎందుకు రెస్పాండ్‌ అవడం అని అనుకున్నట్లున్నారేమో.. కామ్‌గా ఉండిపోయారు భూమి పడ్నేకర్‌.   

తాప్సీ పన్నుది ఇంకో స్టోరీ. పై వాటికి పూర్తి భిన్నమైనది. ఆమెను ట్రోల్‌ చేసింది ఫాన్స్‌ కాదు. ఎవరో ముక్కూముఖం తెలియని వ్యక్తి. బాలీవుడ్‌ దర్శకుడు అనుభవ్‌ సిన్హాతో కలిసి భోంచేస్తూ ఆ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టారు తాప్సీ. ‘మంచి ఆహారంతో ఒక కొత్త ప్రారంభం. ఎంతో కాలం నుంచి నేను ఎదురు చూస్తున్న ఒక పాత్ర దొరికిన ఆనందాన్ని నేను ఇలా షేర్‌ చేసుకుంటున్నాను’ అని దానికి కామెంట్‌ పెట్టారు. దీనిపై ఆ వ్యక్తి ట్వీట్‌ చేస్తూ, ‘అనుభవ్‌ సార్‌.. మీరు ఇంకెవర్నయినా వెతుక్కోవాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తాప్సీకి యాక్టింగ్‌ రాదు’ అని ట్రోల్‌ చేశాడు. తాప్పీ దానిని ఇగ్నోర్‌ చెయ్చొచ్చు. చెయ్యాల్సిన ట్వీట్‌ కూడా. అయితే ఆమె సమాధానం ఇచ్చారు. ‘సారీ యార్, ఇప్పటికే మొత్తం సంతకాలయి పోయాయి. ఒక పని చెయ్యి, తర్వాతి దానికోసం వేచివుండు, బహుశా అది కూడా పూర్తి చేసేస్తా’ అని చాలా కూల్‌గా, బ్రైట్‌గా ఇచ్చారు.

సినీ హీరోయిన్‌లపై చచ్చేంత అభిమానంతో వారిని ట్రోల్‌ చేసేవారు ఉన్నట్లే.. వాళ్లని పిచ్చిపిచ్చి కామెంట్‌లతో ట్రోల్‌ చేసేవారూ ఉంటారు. వీటన్నిటికీ సమాధానం ఇవ్వడం ఇవ్వక పోవడం వాళ్లిష్టం. ట్రోల్‌ చేసేవాళ్లే ఆలోచించుకోవాలి తమ అభిమానం గానీ, ద్వేషం గానీ, హద్దులు మీరడం లేదు కదా అని.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా