చేత స్వీటు ముద్ద

1 Sep, 2018 00:25 IST|Sakshi

‘అమ్మా! తమ్ముడు మన్ను తిన్నాడు’బలరాముడి కంప్లైట్‌. తల్లికి కోపం వచ్చింది. నోరు తెరవంది.‘ఆ..’ అని తెరిచాడు చిన్ని కృష్ణుడు.లోపల.. లోకాలు లోకాలే కనిపించాయి. అయినా.. ఏ పరమార్థమూ లేకుండా..వెన్నముద్దలు తినే కన్నయ్య.. మన్నుముద్దలు తింటాడా..?!శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తోంది..ఆయన ‘చేత’ ఎప్పుడూ ఉండే వెన్నముద్దకుకాస్త మీగడ కలిపి.. స్వీటు ముద్దలు చేసుకుని..‘ఏదీ.. నోరు తెరువ్‌’ అని.. మీ చిన్నారులతో అనండి.

బాసుంది
కావలసినవి:
తియ్యటి కండెన్స్‌డ్‌ మిల్క్‌ – 400 గ్రా. (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది); చిక్కటి పాలు – ఒకటిన్నర లీటర్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; జీడిపప్పు – 15 (చిన్నచిన్న ముక్కలు చేయాలి); పిస్తా పప్పులు – 15 (చిన్నచిన్న ముక్కలు చేయాలి); బాదం పప్పులు – 15 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కుంకుమ పువ్వు – ఏడెనిమిది రేకలు; జాజికాయ పొడి – చిటికెడు

తయారీ:
మందపాటి పాత్రలో పాలు, కండెన్స్‌డ్‌ మిల్స్‌ వేసి స్టౌ మీద ఉంచి కలుపుతుండాలి. పాలను మరీ మరిగించడకూడదు. పాలు కాగుతున్నంతసేపు కలుపుతూనే ఉండాలి. లేదంటే గోధుమరంగులోకి మారే అవకాశం ఉంది. చిక్కబడుతుంటే బాసుంది తయారవుతున్నట్లు. మీగడ వచ్చినప్పుడల్లా అంచుల నుంచి మీగడను వేరు చేసి పాలలోకి రానిచ్చి కలుపుతుండాలి. ఈ విధంగా మీగడ తరకలతో పాలు చిక్కబడ్డాక, జాజికాయ పొడి, తరిగి ఉంచుకున్న డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలియబెట్టి దింపేయాలి. బాసుందిని వేడిగా గాని చల్లగా గాని తీసుకోవచ్చు. గ్లాసులలో అందించే ముందు కొద్దిగా కుంకుమపువ్వుతో అలంకరిస్తే కనువిందుగా ఉంటుంది.

బాదాం కుల్ఫీ
కావలసినవి: 
పాలు – 4 కప్పులు; ఏలకులు – 5; పంచదార – పావు కప్పు; కార్న్‌ ఫ్లోర్‌ – ఒక టీ స్పూను; బాదం పప్పులు – 10; బ్రెడ్‌ – ఒక స్లైస్‌.

తయారీ:
ఏలకుల తొక్క తీసి పొడి చేసి వాడుకునే వరకు గాలిచొరని డబ్బాలో ఉంచాలి. బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. (బాదం పప్పుల తొక్క తీయకుండా ఉంచితే, కుల్ఫీ తినేటప్పుడు రుచిగా ఉంటుంది. అలాగే కుల్ఫీ తయారయ్యాక చూడటానికి కూడా అందంగా ఉంటుంది). బ్రెడ్‌ స్లైస్‌ అంచులు వేరు చేసి, బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు కుల్ఫీ తయారుచేయడం ప్రారంభించాలి. నాలుగు కప్పుల పాల నుంచి అర కప్పు పాలు వేరు చేసి పక్కన ఉంచాలి. మందంగా ఉన్న పాత్రను స్టౌ మీద ఉంచి, మిగిలిన మూడున్నర కప్పుల పాలు అందులో పోసి సన్నని మంట మీద పాలను మరిగించాలి. మూడున్నర కప్పుల పాలు ఒకటిన్నర కప్పుల పరిమాణంలోకి వచ్చేవరకు మరిగించాలి. పాలు మరీ చిక్కబడిపోతే రెండున్నర కప్పుల పరిమాణం వచ్చినా పరవాలేదు. మిక్సీ జార్‌లో బ్రెడ్‌ ముక్కలు, కార్న్‌ ఫ్లోర్, అర కప్పు పాలు వేసి అన్నీ కలిసి మెత్తగా ముద్దలా అయ్యేవరకు సుమారు రెండు నిమిషాలపాటు మిక్సీ పట్టాలి. పాలు బాగా చిక్కబడిన తరవాత మిక్సీ పట్టిన పాల ముద్దను వేసి ఆపకుండా కలుపుతుండాలి. (లేదంటే అడుగు అంటి మాడు వాసన వస్తుంది). ఈ మిశ్రమం బాగా చిక్కబడ్డాక పంచదార జత చేసి మరోమారు కలియబెట్టాలి. పంచదార వేయగానే పాలు పల్చబడతాయి. అందువల్ల పాలు మళ్లీ గట్టిపడేవరకు కలుపుతూ ఉడికించాలి. బాగా గట్టిపడ్డాక స్టౌ మీద నుంచి దింపేయాలి. ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఏలకుల పొడి, డ్రైఫ్రూట్స్‌ తరుగు వేసి కలపాలి. బాగా చల్లబడ్డాక, కుల్ఫీ మౌల్డ్స్‌లోకి ఈ మిశ్రమం వేసి మూత పెట్టి, డీప్‌ ఫ్రీజర్‌లో ఆరు గంటలపాటు ఉంచి తీసేయాలి. మౌల్డ్‌లో నుంచి కుల్ఫీని జాగ్రత్తగా బయటకు తీసి చల్లగా అందించాలి.

రబ్రీ రసమలై
కావలసినవి: 
చిక్కటి పాలు – 4 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – నాలుగు రేకలు; పంచదార – పావు కప్పు; డ్రై ఫ్రూట్స్‌ తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; రసమలై మిల్క్‌ పౌడర్‌ కోసం... పాల పొడి – ఒక కప్పు; పంచదార పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; పాలు – పావు కప్పు; నెయ్యి – అర టీ స్పూను;

తయారీ: 
ముందుగా రబ్రీని తయారుచేసుకోవడం కోసం నాలుగు కప్పుల పాలను మందంగా ఉండే పాత్రలో పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి. అడుగు అంటకుండా ఉండటం కోసం మధ్యమధ్యలో కలుపుతుండాలి. పాలు బాగా మరిగిన తరవాత, అర టీ స్పూను ఏలకుల పొడి అందులో వేసి గరిటెతో బాగా కలియబెట్టాలి. ఇవి మరుగుతుండగానే, ఒక చిన్న కప్పులో ఒక టీ స్పూను నీళ్లు పోసి అందులో కుంకుమపువ్వు రేకలు వేసి కరిగించి, మరుగుతున్న పాలలో పోసి కలపాలి. ఇప్పుడు పావు కప్పు పంచదార వేసి కలిపి, తీపి సరిపడిందో లేదో రుచి చూసి, అవసరమనుకుంటే మరికాస్త పంచదార జత చేయాలి. మంట బాగా తగ్గించి, ఐదు నిమిషాలు కలపకుండా అలాగే వదిలేయాలి. మీగడ ఏర్పడి, అం చులకు చేరినప్పుడల్లా, గరిటెతో మీగడ కలుపుతుండాలి. ఇలా పాలు బాగా దగ్గరపడి చిక్కపడేవరకు కలుపుతూనే ఉండాలి. ఆ తరవాత రెండు టేబుల్‌ స్పూన్ల డ్రైఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తా పప్పులు) జత చేసి మరోమారు బాగా కలిపి మరో ఐదు నిమిషాలు స్టౌ మీదే ఉంచాలి. పాలు బాగా చిక్కబడితే రబ్రీ తయారైనట్లే. (తయారనై రబ్రీని పక్కన ఉంచాలి).

రసమలై తయారీ:
పెద్ద బాణలిలో ఒక కప్పు పాల పొడి వేసి, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార పొడి, పావు కప్పు పాలు జత చేయాలి. మంట బాగా తగ్గించి, పాలను ఆపకుండా కలుపుతుండాలి. ఉండలు లేకుండా, పాలు బాగా చిక్కగా తయారయ్యేవరకు కలుపుతుండాలి. బాగా చిక్కబడ్డాక, అర టీ స్పూ ను నెయ్యి జత చేసి మరోమారు కలపాలి. బాణ లి నుంచి విడివడేవరకు బాగా కలుపుతుండాలి. చేతికి నెయ్యి పూసుకుని, మిశ్రమా న్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి ఒక పాత్రలో ఉంచాలి. చివరగా తయారుచేసి ఉంచుకున్న ర బ్రీని రసమలై మీద పోసి వెంటనే రసమలై అందించాలి.

పనీర్‌ పాయసం
కావలసినవి:
చిక్కటి పాలు – 3 కప్పులు; పనీర్‌ తురుము – అర కప్పు; పంచదార – 6 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; బాదం పప్పులు – 15 (సన్నగా తరగాలి); పిస్తా పప్పులు – 15 (సన్నగా తరగాలి); జీడి పప్పులు – 15 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కుంకుమ పువ్వు – కొద్దిగా; రోజ్‌ వాటర్‌ – ఒకటిన్నర టీ స్పూన్లు;

తయారీ:
మందపాటి పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి సన్న మంట మీద పాలను మరిగించాలి. బాగా మరిగిన తరవాత పంచదార వేసి కలిపి ఐదు నిమిషాలుపాటు మరిగించాలి. డ్రైఫ్రూట్స్‌ తరుగులు వేసి బాగా కలిపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి. ఆ తరవాత పనీర్‌ తురుము వేసి కలపాలి. పనీర్‌ బాగా ఉడికేవరకు కలుపుతుండాలి. బాగా ఉడికినట్లు అనిపించాక రోజ్‌ వాటర్‌ జత చేసి మరోమారు కలపాలి. కుంకుమ పువ్వు వల్ల మంచి రంగు, రోజ్‌ వాటర్‌ వల్ల సువాసన వస్తుంది. పనీర్‌ పాయసాన్ని వేడివేడిగా కాని, చల్లగా కాని తీసుకోవచ్చు. పనీర్‌ పాయసాన్ని సర్వ్‌ చేసే ముందు పాత్రలో చిటికెడు కుంకుమ పువ్వు లేదా డ్రై ఫ్రూట్స్‌ తరుగు లేదా గులాబీ రేకలు వేస్తే కంటికి ఇంపుగా ఉంటుంది.

బెల్లం పాలకోవా
కావలసినవి:
చిక్కటి పాలు – ఒక లీటరు; బెల్లం పొడి – అర కప్పు; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను

తయారీ:
మందపాటి పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి. ఏలకుల పొడి జత చేసి సుమారు గంటసేపు కలుపుతుండాలి. పాలు బాగా చిక్కగా అయ్యి, దగ్గర పడిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టాలి. పాలతో బెల్లం కలిసి ఉడుకుతున్నప్పుడు రంగు మారుతుంది. అలా రంగు మారిన అంటే సుమారు పావు గంట తరవాత పంచదార వేసి మరోమారు కలియబెట్టాలి. పాల పరిమాణం బాగా తగ్గటం గమనించాలి. నెయ్యి జత చేసి మరోమారు బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి. చల్లారుతుండగా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని కోవా మాదిరిగా ఒత్తాలి. గట్టిపడ్డాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

కాయం
కావలసినవి:
బెల్లం తరుగు – అర కప్పు;శొంఠి – చిన్న ముక్క;మిరియాలు – 4 గింజలు;వాము – ఒక టీ స్పూను;గసగసాలు – ఒక టేబుల్‌ స్పూను;దాల్చినచెక్క – చిన్న ముక్క; నెయ్యి – పావు కప్పు;

తయారీ:
స్టౌ మీద పెద్ద బాణలి ఉంచి వేడి చేయాలి. కొద్దిగా నెయ్యి వేసి కరిగాక శొంఠి వేసి దోరగా వేయించి, తీసి పక్కన ఉంచాలి. ఆ తరవాత గసగసాలను వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో వాము కూడా వేసి వేయించి పక్కన ఉంచాలి. వేయించి ఉంచుకున్న పదార్థాలన్నీ చల్లారనివ్వాలి. మిక్సీలో శొంఠి, మిరియాలు, గసగసాలు, వాము, దాల్చిన చెక్కలను ఒకదాని తరవాత ఒకటి వేస్తూ మెత్తగా చేయాలి. చివరగా బెల్లం తరుగు వేసి పదార్థాలన్నీ కలిసేలా మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. చిన్న గిన్నెలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, కరిగించి దింపేయాలి. సిద్ధంగా ఉన్న శొంఠి పొడి మిశ్రమంలో నెయ్యి వేసి ముద్దలా చేయాలి. చిన్న చిన్న ఉండలు చేసి ఒక పళ్లెంలో ఉంచి శ్రీకృష్ణుడికి నివేదన చేయాలి. ఇలా తయారుచేసిన ఉండలను కాయం ఉండలు అంటారు. వీటిని శ్రీకృష్ణుడు ఇష్టంగా తినేవాడని దక్షిణాది వారు భావిస్తారు.

శ్రీఖండ్‌
కావలసినవి:
పెరుగు – అర కిలో (పుల్లగా ఉండకూడదు); కుంకుమ పువ్వు – నాలుగు రేకలు; గోరువెచ్చటి పాలు – 2 టేబుల్‌ స్పూన్లు; పంచదార పొడి – పావు కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పిస్తా తరుగు – పావు కప్పు; మిఠాయి రంగు – 2 చుక్కలు (పసుపు పచ్చ రంగు)

తయారీ:
పెద్ద పాత్రకు పల్చటి వస్త్రాన్ని కట్టి ముడి వేయాలి. అందులో పెరుగు వేసి ఆ పాత్రను ఫ్రిజ్‌లో మూడు గంటల సేపు ఉంచి, బయటకు తీయాలి. స్పూన్‌తో గట్టిగా అదిమి, పెరుగులో ఉన్న నీటిని పిండి తీసేయాలి. నీరు లేని గట్టి పెరుగును ఒక పాత్రలోకి తీసుకోవాలి. పంచదార పొడి వేసి బాగా కలపాఇ. గోరు వెచ్చని పాలలో కుంకుమపువ్వును పది నిమిషాల పాటు ఉంచి, ఆ పాలను గట్టి పెరుగులో వేసి కలపాలి. పంచదార, పిస్తా తరుగు, ఏలకుల పొడి జత చేసి మరోమారు బాగా కలియబెట్టాలి. మిఠాయిరంగును జత చేసి మరోమారు బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి సుమారు గంట తరవాత బయటకు తీసి చల్లగా అందించాలి.


ధనియా పంజీరీ
కావలసినవి:
ధనియాల పొడి – ఒక కప్పు; పంచదార పొడి – ఒక కప్పు; మఖనీ – ఒక కప్పు (తామర గింజలు); ఉడికించిన కొబ్బరి తరుగు – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడి పప్పులు – 10; బాదం పప్పులు – 10; చిరోంజీ – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకులు – 4 (చిన్నవి).

తయారీ:
ముందుగా డ్రై ఫ్రూట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. మఖ్‌నీలనుని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడిచేయాలి. బాగా వేడిగా అయిన తరవాత మనం తీసుకున్న నేతిలో సగ భాగాన్ని బాణలిలో వేయాలి. నెయ్యి బాగా కరిగిన తరవాత మఖనీ ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు కలపాలి. వాటిని వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఆ తరవాత కొబ్బరి తురుము వేసి రంగుమారే వరకు వేయించి మరో పాత్రలోకి తీసుకోవాలి. ఆ తరవాత డ్రైఫ్రూట్స్‌ వేసి ఒక నిమిషం పాటు వేయించి మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగతా నెయ్యి వేసి కరిగాక ధనియాల పొడి వేసి వేయించాలి. ఆపకుండా కలుపుతుండాలి. మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ధనియాల పొడి బదులు ధనియాలు కూడా వాడుకోవచ్చు. ధనియాల పొడిని మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దపాత్రలో ధనియాల పొడి, పంచదార పొడి, కొబ్బరి తురుము, డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, చిరోంజీ వేసి కలపాలి. ఇది పొడిపొడిగా ఉంటుంది. మఖనీలను చేతితో మెత్తగా నలపాలి. ఆ పొడిని కూడా జతచేసి మరోమారు కలపాలి. మఖ్‌నీ బదులు పుచ్చకాయ గింజలు కూడా వేసుకోవచ్చు. ఇలా తయారైన ధనియా పంజీరీని ఉత్తరాది వారు శ్రీకృష్ణునికి నివేదన చేయడానికి ప్రసాదంగా తయారుచేస్తారు.
నిర్వహణ
వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు