దూసుకెళ్లిన అనుమానం

24 Apr, 2018 00:23 IST|Sakshi

క్షణంలో. ఏం జరిగిందో అర్థమయ్యే లోపు కారు మాయమైంది. ఎవరో ఒక మనిషి చాలా వేగంగా డోర్‌ తెరుచుకుని లోపల కూర్చోవడం, కారును పరిగెత్తించి  తీసుకెళ్లిపోవడం... మెరుపు మెరిసినట్టుగానే. 

దొంగ పని స్పీడ్‌గానే ఉంటుంది.కనురెప్ప వాల్చేలోపు కాసులు మాయం చేస్తాడు.అనుమించేటప్పుడే మనం స్పీడ్‌ తగ్గించుకోవాలి. లేకపోతే కాసులతోపాటు కేరెక్టరూ మాయం అవుతుంది.

నీ దగ్గర నైపుణ్యం ఉంటే సొత్తు సంపాదించు. దొంగ సొత్తు కాదు.ఆ వేళ అన్నవరంలో ఒక నేరం జరిగింది.ఆ నేరాన్ని కుటుంబం వొకలా చూసింది. పోలీసులు మరోలా చూశారు.ఫిబ్రవరి 1, 2018. ఉదయం 11 గంటలు.‘మీరు మరీ జాగ్రత్త మనిషండీ బాబూ. కారు స్లోగా నడుపుతారు’ నవ్వింది శిరీష.మహేష్‌ కూడా భార్యను నవ్వుతూ చూశాడు.‘అంత స్పీడుగా నడిపేవాడు కావాలంటే షూమాకర్‌నే చేసుకోవాల్సిందిగా. నన్నెందుకు చేసుకున్నావ్‌?’ అన్నాడు నవ్వుతూ.‘షూమేకరా? ఆయనెవరండీ. బూట్లు తయారు చేస్తాడా?’‘నీ మొహం. షూమాకర్‌ అంటే కారు యమా స్పీడుతో నడిపే ఒక ఛాంపియన్‌’‘ఓ’అలా జోకులేసుకుంటూ వాళ్లు మాట్లాడుకుని చాలా రోజులైంది. పెళ్లై ఏడాది అవుతోంది. ఐదారు నెలల పాటు సరదాగా గడిచింది. ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ల అనారోగ్యం... బాగోగులు... అతడిఉద్యోగం బిజీతో టైమే లేకుండా పోయింది. ఇవాళే ఇలా బయల్దేరారు. తెల్లవారుఝామునే  సత్యనారాయణ స్వామి పూజ చేయించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ‘ఏమంటోంది మా అమ్మ?’ అన్నాడు మహేష్‌.‘ఏమంటుంది... ఎప్పుడూ నన్నే గమనిస్తుంటుంది. ఫోన్లు మాట్లాడినా నిఘాయే. పుట్టింటికి ఫోన్లు చేసుకోవడం కూడా తప్పేనా?’ అంది శిరీష.‘నువ్వు అదంతా ఏం పట్టించుకోకు. నేను బాగా చూసుకుంటున్నాను కదా’ ‘చాలా బాగా’ తృప్తిగా అంటూ మంచి నీళ్ల కోసం చూసింది. బాటిల్‌ ఖాళీగా ఉంది.

‘నీళ్లు తీసుకుందామా’ అంది.దూరంగా షాప్‌ కనపడటంతో రోడ్డు పక్కన ఆపాడు మహేష్‌. చిన్న పనులప్పుడు చాలామంది ఇంజన్‌ ఆఫ్‌ చేయకుండానే దిగుతారు. మహేష్‌ కూడా ఇంజన్‌ ఆఫ్‌ చేయకుండా దిగాడు. లోపల శిరీష కూర్చుని ఉంది. షాపు వైపు నడుస్తున్నాడు. ఏదో జరిగింది. క్షణంలో. ఏం జరిగిందో అర్థమయ్యే లోపు కారు మాయమైంది. ఎవరో ఒక మనిషి చాలా వేగంగా డోర్‌ తెరుచుకుని లోపల కూర్చోవడం, కారును పరిగెత్తించి తీసుకెళ్లిపోవడం... మెరుపు మెరిసినట్టుగానే.‘ఏయ్‌... ఏయ్‌... ఏయ్‌’... పరిగెత్తాడు మహేష్‌.అక్కడే ఉన్న ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లు బైక్‌ మీద స్పీడుగా ఫాలో అయ్యారు. కాని కారు అంతకన్నా వేగంగా వెళ్లిపోయింది. అచ్చు సినిమాలో చూపించినట్టుగానే.మహేష్‌ రోడ్డు మీద చతికిల పడ్డాడు.కారులో నుంచి శిరీష ‘రక్షించండి... కాపాడండి’ అని అరుస్తూ కనిపించిందని అనిపించింది. అనిపించిందా... లేక మామూలుగా కూచుని ఉందా?దేవుడా... పుణ్యక్షేత్రంలో ఏమిటి ఈ పాపం నేరం?

చిన్న ఊళ్లల్లో క్రైమ్‌ జరిగితే ఊరంతా ఉలిక్కిపడుతుంది. చానెళ్లకు ఖర్చులేని ఫుటేజీ దొరుకుతుంది. ‘పట్టపగలు అన్నవరంలో యువతి కిడ్నాప్‌’ అని ఘటన జరిగిన ఐదు నిమిషాలలో స్కోలింగ్స్‌ మొదలైపోయాయి.మహేష్‌ ఇంట్లో కూడా అదే పనిగా ఫోన్లు. అప్పటికే పోలీసు స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్‌ ఇచ్చి వచ్చాడు మహేష్‌. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఇంటికి వచ్చేశారు. రకరకాల అనుమానాలూ సందేహాలూ.‘ఇది కారు దొంగతనంలా లేదు. మనిషి దొంగతనంలా ఉంది’ అంది మహేష్‌ తల్లి.‘ఇదంతా ప్లాన్‌లే వదినా. వాడెవిడికో ముందే చెప్పి పెట్టినట్టుంది. కారు ఆపగానే లేవదీసుకొని పోయాడు’ అంది మహేష్‌ మేనత్త. ‘మరీ అన్యాయంగా మాట్లాడకండి. అమ్మాయి ఒంటిమీద నగలున్నాయిగా. వాటి కోసమే ఎవడో ఈ అఘాయిత్యం చేసి ఉంటాడు’ అంది పొరుగింటామె.‘బాబూ. మా అమ్మాయి అలాంటిది కాదు. వాడు దొంగే అయి ఉంటాడు. శిరీషకు ఏ ప్రమాదం జరక్కముందే కాపాడు’ మహేష్‌ చేతులు పట్టుకున్నారు శిరీష తల్లిదండ్రులు.

సరిగ్గా అరగంట గడిచింది. మహేష్‌ ఇంటి ముందు పెద్ద కోలాహాలం. శిరీష తిరిగి వచ్చేసింది. దగ్గరి బంధువు కుర్రాడి బైక్‌ మీద ఇల్లు చేరింది. అందరూ నోరెళ్ల బెట్టారు. శిరీష మాత్రం పెద్దగా ఏడ్చింది. ‘వాడు నా నగల కోసమే కిడ్నాప్‌ చేశాడని అర్థమైంది. ఇచ్చేస్తాను నన్నేమీ చేయకు అని బతిమాలాను. నగలు విప్పి ఇస్తుంటే కారు స్లో చేశాడు. డోర్‌ తెరుచుకుని కారులో నుంచి దూకేశాను. నడుచుకుంటూ వస్తుంటే ఈ అబ్బాయి కనిపించాడు. బైక్‌ ఎక్కి వచ్చా’ అంది. హ్యాండ్‌ బేగ్, సెల్‌ఫోన్‌ కారులోనే ఉండిపోయాయని చెప్పింది.  అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని అనుమానాలు మాత్రం పోలేదు. అప్పుల్లో ఉన్న తల్లిదండ్రులకు నగలు అప్పజెప్పడానికి ఆమె ఈ నాటకం ఆడిందని అత్తామామలు అనుకున్నారు. కాని ఆశ్చర్యంగా బైక్‌ మీద దించిన బంధువుల కుర్రాణ్ణి ఆ రాత్రి పోలీసులు లిఫ్ట్‌ చేశారు.‘ఎందుకు చేశావు ఈ పని? నువ్వు ఆమెతో సన్నిహితంగా తిరిగేవాడివట కదా. పోరిపోదామనుకుని ట్రై చేసి తిరిగి వచ్చేశారా?’ అడిగారు పోలీసులు.ఆ కుర్రాడు లబోదిబోమన్నాడు.‘నీకు కారు లేదు. అయినా ఆరు నెలల క్రితం డ్రైవింగ్‌ నేర్చుకున్నావ్‌. ఎందుకు?’ మళ్లీ నాలుగు తగిలించారు.కాని ఏమీ తేల్లేదు.

ఈసారి శిరీష, మహేష్‌లను విడివిడిగా ప్రశ్నించారు పోలీసులు.మహేష్‌ దగ్గర పెద్ద సమాచారం ఏమీ లేదు. శిరీష మాత్రం కిడ్నాపర్‌ని పోలికలతో సహా చెప్పింది.‘వాడో షూమేకర్‌ అండీ’ అంది పోలీసులతో.
ఆ పేరుతో పాత కేడీ ఎవడున్నాడా అని పోలీసులు ఒక క్షణం ఆలోచించారు. తర్వాత ఆ పేరుకు అర్థం తెలుసుకుని కిడ్నాపర్‌ డ్రైవింగ్‌లో ఎక్స్‌పర్ట్‌ అని అర్థం చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు కూడాఆగంతకుడు చాలా వేగంగా కారు నడిపిన తీరు చూసి ఆశ్చర్యపోయామని చెప్పారు. ఈ కేసులో ఏదైనా క్లూ ఉందంటే అది ఈ ఒక్క విషయమే.కిడ్నాపర్‌ డ్రైవింగ్‌ ఎక్స్‌పర్ట్‌.దాంతో బంధువుల కుర్రాణ్ణి వదిలేశారు. ఆరు నెలల క్రితం డ్రైవింగ్‌ నేర్చుకున్నవాడు అంత స్పీడుతో కారు నడపలేడు. మరుసటి రోజు ఫోన్‌ ద్వారా పోలీసులకు ఓ సమాచారం అందింది వజ్రకూటం వద్ద పొదల్లో ఓ కారు ఎవరో వదిలేసి పోయారని. అది శిరీష కారే. ఆ కారులో శిరీష సెల్‌ఫోన్‌ మినహా ఆమె బ్యాగ్, వ్రతం తర్వాత ఇచ్చిన ప్రసాదం, అన్నీ అలాగే ఉన్నాయి.  సెల్‌ఫోన్‌ స్విచ్‌డాఫ్‌లో ఉన్నా దాని సిగ్నల్స్‌ ఆధారంగా కిడ్నాపర్‌ కదలికలను ట్రేస్‌ చేసే పనిలో పడ్డారు నిందితులు. 

మరోవైపు పోలీసులు ఒక ప్లాన్‌ ప్రకారం డ్రైవర్లను జల్లెడ పట్టారు. జిల్లాలోని  ట్రావెల్స్‌ ఏజెన్సీల వద్ద పని చేసి మానేసిన డ్రైవర్ల లిస్ట్‌ తీసుకున్నారు. వారిలో వేగంగా కారు నడిపే వారి పేర్లు, అడ్రస్‌లు సేకరించారు.  కాకినాడకు చెందిన చెల్లూరి దుర్గాప్రసాద్‌  ఇటీవలే ట్రావెల్స్‌లో పని మానేశాడని, అతను కారును రాకెట్‌లా నడుపుతాడని తేలింది. అంతేకాదు, రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల అతనిమీద కేసులు నడుస్తున్నాయని కూడా తెలిసింది. అతని ఫొటోను శిరీషకు చూపించారు పోలీసులు. ‘వీడే’ అంది శిరీష.దుర్గాప్రసాద్‌ మీద పూర్తి నిఘాపెట్టిన పోలీసులకు మరో ఆధారం దొరికింది. కాకినాడలోని ఓ వీ«ధిలో కొన్నిరోజుల క్రితం అతడు దొంగలించిన కారులో తిరిగాడని, ఆ వీధిలో అతడి రెండో భార్య ఇల్లుందని తేలింది. సిసి ఫుటేజ్‌ ఆ విషయాన్నే నిర్థారించింది. పోలీసులు ఆలస్యం చేయలేదు. దుర్గాప్రసాద్‌ని  ఫిబ్రవరి 27న అరెస్ట్‌ చేశారు.ఉద్యోగం లేకపోవడం, రెండో పెళ్లి.. వీటితో దుర్గాప్రసాద్‌  దివాలా తీశాడు. కారు నడపడంలో ఎక్స్‌పర్ట్‌ కనుక ఏదైనా కారు కొట్టేద్దామని అనుకున్నాడు. సొంతూరులో అందరూ గుర్తుపడతారని కాకినాడ నుంచి అన్నవరం వచ్చాడు. ఏటీఎం దగ్గర కాపు కాసి ఉంటే శిరీష, మహేష్‌ రావడం శిరీష మెడలో నగలు కనిపించడంతో రంగంలోకి దిగాడు. కాని శిరీష కేకలు వేయడంతో భయపడ్డాడు. వెనుక నుంచి బైక్‌లు వెంబడించడం కూడా అతణ్ణి భయపెట్టింది. నగలు తీసుకుని కారు స్లో చేసి ఆమె తప్పించుకునేలా చేశాడు. ఆ తర్వాత కాకినాడ వెళ్లి రెండో భార్య ఇంట్లో నగలు ఉంచి కారును దూరంగా వదిలేసి వచ్చేశాడు. కారు వేగంగా నడపడమే ఈ కేసులో కీలకంగా మారింది. దుర్గాప్రసాద్‌ ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు.
– అనిశెట్టి వేంకట రామకృష్ణ, సాక్షి, అన్నవరం, తూర్పుగోదావరి జిల్లా

మరిన్ని వార్తలు