'టీన్' మార్

9 Oct, 2017 23:37 IST|Sakshi

క్రైమ్‌ పేరెంటింగ్‌

‘అబ్బ.. పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కావడం లేదు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకొకటేదో మిగిలే ఉంటుంది!’
టీనేజ్‌ పిల్లల గురించి ఏదైనా విన్నప్పుడు ఇలా అనిపించడం సహజమే.
మరేం చేస్తారు చెప్పండి? పేరెంట్స్‌ కదా!  కష్టం ఊహకందనిదే అయినా..
ముందుగా చేతిలో గొడుగు ఉంచుకుంటే ఆ కష్టంలో పిల్లలు తడవరన్న ఆశ!
టీనేజ్‌లో స్వరం మారినట్లే.. ప్రవర్తనా మారుతుంది.
దానిని పేరెంట్సే పసిగట్టాలి. టీనేజ్‌ని.. జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలి.

సెక్యూరిటీ గార్డ్‌ కోపంతో ఒణికిపోతున్నాడు. దుఃఖంతో అతడు ఊగిపోతున్నాడు. మరికొంతలో అయితే అతడి ఉద్యోగం పోయి ఉండేది. ‘ఇతడే... ఇతడే ఇలా చేశాడు’ ఎదురుగా ఉన్న బుజ్జిని చూపిస్తూ అన్నాడు. ‘ఇంకో మాట మాట్లాడావంటే ఊరుకోను చెప్తున్నా’ బుజ్జి అతడి అభియోగాన్ని అంగీకరించక ఎదురు తిరుగుతున్నాడు. ఆ ఫ్లాట్‌ వాళ్లూ ఈ ఫ్లాట్‌ వాళ్లూ నలుగురైదుగురు మూగారు గేట్‌ దగ్గర సెక్యూరిటీ రూమ్‌ ముందు. ‘అసలేమిటి గొడవ’ ఎవరో అడిగారు. ‘టూ జీరో టూ మేడమ్‌ బయటకు వెళుతూ వెళుతూ వాళ్ల హజ్బెండ్‌ వస్తే ఇవ్వమని కీ నా చేతికిచ్చి వెళ్లిందండీ. నేను రూమ్‌లో కీస్‌ తగిలించే చోట ఆ కీని తగిలించాను. ఇంతలో వాటర్‌ కావాల్సి వచ్చి బిల్డింగ్‌ వెనుక ఉన్న ట్యాప్‌ దగ్గరకు వెళ్లాను. ఈ బుజ్జి ఎప్పుడొచ్చాడో తెలియదు ఆ కీ తీసుకొని జేబులో వేసుకున్నాడు. నేను తిరిగి వచ్చే సమయానికి రూమ్‌ నుంచి బయటకు వస్తూ కనిపించాడు. ఏమిటంటే ఏమీ లేదన్నాడు. డౌట్‌ వచ్చి చూస్తే కీ లేదు. ఇతనే తీశాడని నాకు అర్థమైంది. అప్పుడే నిలదీశాను. నాకేం తెలియదు అని వెళ్లిపోయాడు. కాసేపటికి లాన్‌లో వెతికితే కనిపించింది. ఇతనే అక్కడ పడేసి ఉంటాడు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ ఫ్లాట్‌కు వెళ్లి ఏమేం చేసి ఉండేవాడో చెప్పలేను’ అన్నాడు సెక్యూరిటీ గార్డ్‌. అందరూ బుజ్జివైపు చూశారు. ‘నేను వికెట్స్‌ కోసం రూమ్‌లోకి వెళ్లాను. కీ సంగతి నాకు తెలియదు’ అన్నాడు నిర్లక్ష్యంగా. ‘సరే... జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం కాలేదుగా. వదిలేయండి’ అన్నారు ఎవరో. ‘అలా వదిలేస్తే ఎలాగండీ. వీళ్ల మదర్, ఫాదర్‌లకు చెప్పాలి’ అన్నాడు గార్డ్‌. అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు.

బుజ్జికి పదహారేళ్లు ఉంటాయి. అందరితో కలివిడిగా ఉంటాడు. ఫ్లాట్స్‌ బయట గ్రౌండ్‌లో ఆటలాడుతూ కనిపిస్తాడు. కాలేజ్‌కు యాక్టీవా మీద వెళ్లి యాక్టీవా మీద వస్తుంటాడు.
కాని తరచూ ఫ్లాట్స్‌లో న్యూస్‌లోకి వస్తుంటాడు. రెండు నెలల క్రితం మరో ఫ్లాట్‌లో ఉండే నంద కిశోర్‌ బుజ్జిని కొట్టినంత పని చేయబోయాడు. అతడూ బుజ్జీ కలిసి సాయంత్రం షటిల్‌ ఆడారు. ఆడాక చూస్తే నందకిశోర్‌ సెల్‌ఫోన్‌ కనపడలేదు. అది కొత్తది. దాదాపు పదిహేడు వేలు ఉంటుంది. అది కాదు బాధ... అందులో చాలా డేటా ఉంది. ఆడేటప్పుడు చమటకు తడుస్తుందని కాంపౌండ్‌ వాల్‌ మీద పెట్టి ఆడటం స్పష్టంగా గుర్తుంది. ఆట తర్వాత, దాని సంగతి మర్చిపోయి లిఫ్ట్‌ దాకా వెళ్లి వచ్చేలోపు మాయమైంది. బుజ్జి తప్ప ఎవరూ అక్కడ రాలేదు. బుజ్జిని అడిగితే ఏమో తెలియదని చెప్తున్నాడు.నందకిశోర్‌ చాలా గట్టి మనిషి. వెంటనే మరో ఫ్లాట్‌లో ఉండే శ్రీమంత్‌కు కబురు చేశాడు. వాళ్లిద్దరూ నయానో భయానో బుజ్జిని నిలదీస్తే ‘దొరికితే ఇస్తాను’ అని వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే సెల్‌ఫోన్‌ పూల మొక్కల దగ్గర బురదలో దొరికింది.

ఇటీవల ఫోర్త్‌ ఫ్లోర్‌లో ఉండే అర్పిత కొనుక్కున్న సైకిల్‌ పోయింది. కొత్త సైకిల్‌. అర్పితకు ఎయిత్‌ బర్త్‌డే సందర్భంగా వాళ్ల నాన్న ఐదు వేలు పెట్టి కొనిచ్చాడు. గ్రౌండ్‌ ఏరియాలో సాయంత్రం వరకూ తొక్కుకుని మెట్ల దగ్గరే సైకిల్‌ పెట్టి వెళ్లిపోయింది. తెల్లారేసరికి లేదు. కాంపౌండ్‌ వాల్‌ ఎత్తు తక్కువది కనుక ఎటునుంచైనా ఎవరైనా దాటించి ఉండవచ్చు. అందరికీ బుజ్జి మీద అనుమానం వచ్చింది. కాని ఎవరికీ అడిగే ధైర్యం లేదు. ఆ సైకిల్‌ మాత్రం తిరిగి రాలేదు.

బుజ్జి తండ్రిది సీజనల్‌ బిజినెస్‌. కొన్నాళ్లు ఇంట్లో ఉంటాడు. కొన్నాళ్లు క్యాంప్‌లకు వెళుతుంటాడు. బుజ్జి తల్లి చిన్న ఉద్యోగం చేస్తుంది. బుజ్జి ఒక్కడే కొడుకు. వాళ్లు బుజ్జిని బాగా చూసుకుంటారు. కాని అతడికి ఖర్చులకు ఇచ్చేంత స్తోమత మాత్రం వాళ్లకు లేదు. బుజ్జి కాలేజీ నుంచి ఇంటికి వచ్చే సమయానికి ఎవరూ ఉండరు. ఒక్కోసారి సాధారణంగా ఇంట్లో ఎవరూ ఉండని వాతావరణం ఉంటుంది. బుజ్జికి కంపెనీ కావాలి. అందుకే ఫ్రెండ్స్‌ ఎక్కువ. ఈ ఫ్రెండ్స్‌ వల్లే బుజ్జి ఇలా తయారయ్యాడని నందకిశోర్‌ లాంటి వాళ్ల అబ్సర్వేషన్‌.బుజ్జికి చిన్నప్పటి నుంచి లోన్లీ ఫీలింగ్‌ ఉన్నట్టుంది. తల్లిదండ్రులు జాబ్స్‌లో ఎంత ఇన్‌వాల్వ్‌ అయినా బుజ్జితో తగినంత టైమ్‌ స్పెండ్‌ చేసినట్టు లేదు. పైగా సిబ్లింగ్స్‌ను కూడా కనలేదు. దాంతో బుజ్జికి ఫ్రెండ్స్‌ను ఎక్కువమందిని చేసుకోవాలని నిర్బంధం ఏర్పడినట్టుంది. వాళ్లను ప్లీజ్‌ చేయాలంటే సినిమాలకు తీసుకెళ్లాలి. వాళ్ల బైక్స్‌లో పెట్రోల్‌ పోయించాలి. పార్టీలు ఇవ్వాలి. ఇవన్నీ చేసి వాళ్లను తన చుట్టూ తిప్పుకుంటూ తానో లీడర్‌లా ఫీలయ్యి తనలోని ఎంప్టీనెస్‌ను ఫిల్‌ చేసుకుంటున్నట్టున్నాడు. అయితే దానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఇంట్లో దొరికే మార్గం లేదు. అందుకే దొంగతనాలు చేయడానికి రెడీ అయిపోయినట్టున్నాడు’ అంటాడు నంద కిశోర్‌.

తల్లిదండ్రులకు ఈ సంగతి చెప్పి బుజ్జిని కరెక్ట్‌ చేయమంటే వాళ్లు బుజ్జి పక్షమే నిలబడి ఇంత పొడవు తగాదాకు వస్తారు. ‘మా అబ్బాయి అలాంటివాడు కాదు. మా అబ్బాయే దొరికాడా. ఇంకోసారి మీరు వాడి జోలికి వస్తే పోలీస్‌ రిపోర్ట్‌ ఇస్తాను’ ఇలా ఉంటుంది ధోరణి. వాళ్లు బుజ్జిని కరెక్ట్‌ చేయరు. బుజ్జి తనకు తాను కరెక్ట్‌ కాడు. ఇప్పుడు ఆ ఫ్లాట్స్‌ వాళ్లు ఏ వస్తువు ఎప్పుడు పోతుందో అని బితుకు బితుకుమంటూ బతుకుతున్నారు. ఏ వస్తువు పోయినా బుజ్జి వైపు అనుమానంగా చూస్తూ ఉన్నారు. బుజ్జి ఇతర పిల్లలకు మల్లే మంచివాడే.కాని ఈ ఒక్క అలవాటు అతడినే కాదు మొత్తం కొన్ని కుటుంబాలనే చికాకులో పడేస్తోంది. ఈ ధోరణి ఇంకా ముందుకు సాగితే ఏమవుతుందో? పిల్లలపై ఉండే అవ్యాజమైన ప్రేమానురాగాల వల్ల తాము చేస్తున్న తప్పిదాన్ని పేరెంట్స్‌ గ్రహించలేరు. ఉదాహరణకు బిడ్డ కింద పడిపోయినప్పుడు, అలా పడటం వల్ల తనకు తగిలే దెబ్బ తాలూకు బాధ అతడికి తెలుస్తుంది. కానీ బిడ్డ పడిపోయే సమయంలో అతడికి నొప్పే తెలియకుండా చేసేలా తల్లిదండ్రులు ప్రతిచోటా బిడ్డకు ఒక రక్షణ వలయం ఏర్పాటు చేస్తూ పోవడం సరికాదు.

ఈ సందర్భంలో తప్పు తల్లిదండ్రులదే!
బుజ్జిలా వ్యవహరించే వాళ్ల విషయంలో తప్పంతా తల్లిదండ్రులదే. ఒక్కడే సంతానం అనే కారణంగానో లేదా తమ అతిగారాబం, అతి ప్రేమ వల్ల చేజేతులా వాళ్లే చెడగొడతారు పిల్లల్ని. కొందరు పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తుంటారు. బుజ్జి లాంటి వాళ్లు చేసే తప్పిదాలను ఇతరులు ఎత్తి చూపినప్పటికీ తల్లిదండ్రులకు ఉండే అవ్యాజమైన అనురాగం వల్ల తాము చేస్తున్న తప్పిదాన్ని పేరెంట్స్‌ గ్రహించలేరు. ఉదాహరణకు బిడ్డ కింద పడిపోయినప్పుడు, అలా పడటం వల్ల తనకు తగిలే దెబ్బ తాలూకు బాధ అతడికి తెలుస్తుంది. కానీ బిడ్డ పడిపోయే సమయంలో అతడికి నొప్పే తెలియకుండా చేసేలా తల్లిదండ్రులు ప్రతిచోటా బిడ్డకు ఒక  రక్షణ వలయం ఏర్పాటు చేస్తూ పోవడం సరికాదు. దాంతో తాను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కలిగే నష్టం తెలియక బిడ్డ అదే పనిని కొనసాగిస్తూ ఉంటాడు. ఇలా తమ ప్రవర్తన వల్ల తామెంత నష్టం చేస్తున్నారో, తమది ఎంత తప్పిదమో కూడా ఈ పేరెంట్స్‌కు తెలియదు. ఇతరులు ఎవరైనా చెప్పినా అర్థం చేసుకోలేరు. బుజ్జి లాంటి కేసులో మార్పు అనేది పేరెంట్స్‌ లోనే రావాలి.

అలా జరడానికి బయటి వాళ్లు ఎంత ప్రయత్నించినా కుదరకపోతే ఈ పేరెంట్స్‌ వాళ్ల తల్లిదండ్రులో లేదా చాలా దగ్గరివాళ్లో అర్థమయ్యేలా చెప్పాలి. బుజ్జిలాంటి పిల్లల ప్రవర్తన వల్ల తాము కేవలం ఒక సెల్‌ఫోన్‌ లేదా సైకిల్‌ లాంటి చిన్న వస్తువు మాత్రమే కోల్పోతామనీ, అయితే బుజ్జి తల్లిదండ్రులు అతడి ప్రవర్తనను సరిదిద్దకపోతే... భవిష్యత్తులో తల్లిదండ్రులు సమర్థించడానికి కూడా వీల్లేనంత లేదా సరిచేయలేనంత పెద్ద తప్పిదం జరిగినప్పుడు నష్టపోయేది బుజ్జి, అతడి తల్లిదండ్రులే అన్న విషయాన్ని విడమరచి ఆ పేరెంట్స్‌కు దగ్గరివాళ్లు తెలియజెప్పాలి. ఇలా పేరెంట్స్‌కు దగ్గరి వాళ్లే బుజ్జి ప్రవర్తనను సరిదిద్దడానికి ప్రయత్నించడమో లేదా తమ వల్ల కూడా కాకపోతే ఆ పేరెంట్స్‌తో పాటు బుజ్జి లాంటి పిల్లలను సైకియాట్రిస్ట్‌ సహాయం తీసుకునేలా చేయాలి.
- డాక్టర్‌ పద్మ పాల్వాయి చైల్డ్‌ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌
- ఫ్యామిలీ డెస్క్‌

మరిన్ని వార్తలు