నాలుకలుకలు

26 Jul, 2016 00:33 IST|Sakshi
నాలుకలుకలు

చేతనబడి
 

మనసులో దోషం ఉంటే... నాలుక వంకర్లు తిరుగుతుంది. జనంలో అమాయకత్వం ఉంటే...  ప్రకృతిలో వికృతి కనిపిస్తుంది.  మోసం చేసే వాళ్ల మాట... నరం లేని నాలుక.  ఏ ఎండకా గొడుగులా...  ఏ చెట్టుకా పుట్టలా...  ఈ మోసానికీ ఓ పుట్ట ఉంది. ఓ గొడుగూ ఉంది! దీనంతటి వెనకాల... లుకలుకలు ఉన్నాయి.  హుండీని చప్పరించిన నాలుకలుకలున్నాయి.
 
ఉదయం ఏడవుతోంది. పద్మలత వంటగదిలో హడావుడిగా ఉంది. ‘‘నరసమ్మ ఇంకా రాలేదు. అంట్ల గిన్నెలు ఎప్పుడు కడగాలి, ఇల్లు ఎప్పుడు ఊడవాలి’’.. విసుక్కుంటోంది. ‘పైకి ‘నరసమ్మ ఇంకా రాలేదు’ అంటోంది. కానీ లోలోపల మాత్రం ‘ఇక రాదేమో’ అనే భయం. రాకపోతే ఆ పనులన్నీ తాను చేసుకోవాల్సిందేననే భయం. ఆ భయం ఆమె మాటల్లోనూ ధ్వనిస్తోంది. అంతలోనే వచ్చింది నరసమ్మ. ఆలస్యమైందని పద్మ అడగడానికి అవకాశమివ్వకుండా తానే మొదలుపెట్టింది. ‘‘అమ్మోరికి కోపమొచ్చిందమ్మా! తాంబూలం పెట్టి శాంతి చేసి సల్లంగా కాపాడమని మొక్కి వచ్చిన’’ అన్నది. ఆలస్యంగా వచ్చినందుకు కోప్పడే అవకాశం కూడా ఇవ్వని నరసమ్మ లౌక్యానికి ఉడికిపోయింది పద్మలత. అంతలోనే... ఆలస్యంగానైనా వచ్చింది. రేపొచ్చి ఇదే మాట చెప్పినా చేయగలిగిందేముంది. పనంతా నేను చేసుకోవడమే మిగిలేది... అని సమాధాన పడింది.
 
అమ్మో! కోపమే!!
 ఎలా మొదలైందో తెలియదు, ఎప్పుడు మొదలైందో తెలియదు. టౌన్‌లో చాపకింద నీరులా ప్రవహిస్తోంది. ఎవరి నోట విన్నా ‘‘అమ్మోరికి కోపం వచ్చిందంట’’ అనే మాట తప్ప మరొక ప్రస్తావన ఉండడం లేదు. సీతాలక్ష్మికి పని పూర్తయిందా, కబుర్లలోకి దించవచ్చా... అని పక్క పోర్షన్‌లోకి తొంగి చూసింది పద్మ. ఆమె కనబడగానే నేరుగా విషయంలోకి వచ్చింది. ‘‘అమ్మోరికి కోపం ఎందుకొచ్చింది’’ అడిగింది పద్మలత పక్కింటి సీతాలక్ష్మిని.  ‘‘ఏమో! ఎవరికి తెలుసు? ఏటా పూజలు చేయకపోయినా ఆగ్రహం వస్తుందట’’ కారణం తెలియకపోయినా తనకు తెలిసిన విషయానికి కొంత స్వపరిజ్ఞానాన్ని జోడించింది సీతాలక్ష్మి.


‘‘అమ్మోరు... కోపం వచ్చిందని ఎవరికి చెప్పింది మమ్మీ, ఎవర్ని కోప్పడింది? అమ్మోరు ఎలా ఉంటుంది? అమ్మోరు మాట్లాడుతుందా’’.. పద్మలత కూతురు పూజిత అడిగింది. మూడు రోజులుగా ఆ పసి మెదడును తొలుస్తున్న తార్కిక సందేహాలకు సమాధానం కోసం ఇద్దరినీ మార్చి మార్చి చూస్తోంది పూజిత. ఆ చిన్ని మెదడును ఇంకా విశ్వాసపు పొరలు అలుముకోలేదు. కాబట్టి తార్కికతను కాపాడుకుంటోంది చిట్టిబుర్ర.

‘‘అమ్మోరంటే మనిషి కాదు, దేవత. ఆ వేపచెట్టు లేదూ! మనకు తెలియదు కానీ, అది అమ్మోరు చెట్టంట. పూజలు చేస్తున్నారు. నువ్వు స్కూలుకెళ్లే దారే కదా! చూడలేదా?’’ పూజితను రెట్టిస్తోంది పద్మలత.  ‘‘మేము దొంగ-పోలీస్ ఆడుకునే చెట్టుకి చీర కట్టారు. మమ్మల్ని ఆడుకోనివ్వడం లేదక్కడ’’ బుంగమూతి పెట్టింది పూజిత.  ‘‘ఏంటీ! చెట్టుకి చీరకట్టారా’’ ఆశ్చర్యపోయింది పద్మ.  ‘‘ఒక్క చీరేంటి? వేపమాను చుట్టూ దారాలు కట్టారు. పూలదండలు వేశారు. ముత్తయిదువకు తాంబూలం పెట్టినట్లు రవికె గుడ్డ, పండ్లు, ఆకు-వక్కలు, డబ్బులు పెడుతున్నారు. గుడి కడతారంట. మూడు రోజుల్లోనే హుండీ డబ్బా నిండిపోయింది...’’ తాను విన్నవి, కన్నవి కలిపి చెప్పుకుపోతోంది సీతాలక్ష్మి.  ‘‘మనమూ వెళ్దామా!!’’ ఉత్సాహపడుతోంది పద్మ. ‘‘పిల్లల్ని స్కూలుకు పంపించి మధ్యాహ్నం పోదాం. పిల్లలు ఇంటికొచ్చేలోగా వచ్చేయచ్చు’’ అంగీకారాన్ని తెలిపింది సీతాలక్ష్మి.

చెట్టుకు నాలుక!
నిజామాబాద్ జిల్లా కేంద్రం, న్యాల్‌కల్ రోడ్‌లోని వివేకానంద నగర్ కాలనీలో ఓ ఇంటి ముందు పెద్ద వేపచెట్టు. ఏళ్లనాటి వృక్షం. చెట్టు చుట్టూ వెడల్పాటి చప్టా. దాని మీద చెట్టు మొదలు నుంచి రెండడుగుల పైన చీర చుట్టి ఉంది. బెరడు చీల్చుకుని చొచ్చుకుని వచ్చినట్లుంది చిన్న ఆకారం. ‘‘అదిగో అమ్మోరు ఆగ్రహంతో నాలుకెళ్లబెట్టింది చూడు’’ అని పద్మలతకు చూపించింది సీతాలక్ష్మి.  ‘‘చెట్టు నుంచి నాలుక బయటకు వస్తుందా’’ మనసులోని సందేహం బయటకు వచ్చేసింది, కానీ వెంటనే నాలుక జారాననుకుని లెంపలు వేసుకుంది పద్మ.

‘‘అవునమ్మా! అమ్మోరి నాలుకే. పూజ చేసేటప్పుడు చేయి తగిలితే మెత్తగా మనిషి నాలుక ఉన్నట్లే ఉంది. ఊరందరికీ చెప్పి గుడి కట్టిస్తానమ్మా, ఆగ్రహించకు, శాంతించమని మొక్కా! నా మాట పోనివ్వకుండ్రి తల్లులూ’’ అని అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకూ చెప్తోంది అక్కడే కూర్చుని ఉన్న మారెమ్మ. ‘‘ఊరిని చల్లంగా కాపాడాలని వానలు కురిపించిందన్న జ్ఞానమైనా లేకపోయె. అమ్మోరికేం చేశాం. ఒక్క కొబ్బరికాయ కొట్టామా!’’ ఆరోపిస్తోందామె.

మారెమ్మ జుట్టు జడలు కట్టి ఉంది. మెడలో తెల్ల పూసల దండలు రెండు. పలుపు లాంటి కాషాయరంగు దారపు దండ, రుద్రాక్ష దండలు, చేతులకు నిండుగా పచ్చగాజులు, కాళ్ల వేళ్లకు బరువైన మట్టెలు చూడగానే ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పక్కనే అనుచరురాలి చేతిలో వేపమండలు. కొత్తగా వచ్చిన వాళ్లు చెట్టును వదిలి మారెమ్మను చూస్తూ... మంత్రం వేసినట్లు ఆమె చెప్పే మాటల మీదనే లగ్నమైపోతున్నారు.

తల్లి మనసు!
‘‘నువ్వు రేడియో స్టేషన్ ఎదురుగా ఉండేదానివి కదా!’’ ఆమెను గుర్తు పట్టింది పద్మలత.  ‘‘అవునమ్మాయి! రేణుక ఎల్లమ్మ కల్లోకొచ్చి చెబితే అక్కడే ప్రతిష్టించా. అక్కడ గుడి కట్టలేదని అమ్మోరు ఏకంగా నేనుండే ఇంటి ముందుకే వచ్చింది’’ అని చెప్తూ మారెమ్మ అరమోడ్పు కళ్లతో అలౌకికానందాన్ని పొందుతోంది. ఆమె మాటల్లో ఏదో ఆకర్షణ ఉంది. వినేవాళ్లు మాయ కమ్మేసినట్లవుతారు.
 ‘‘ఊరిని కాపాడమ్మా! పిల్లలకు గాలిసోకకుండా రక్షించమ్మా!! బాలింతలను, చూలింతలను ఓ కంట కనిపెట్టు తల్లీ! నీకు దణ్ణం పెడతా తల్లీ! ఊరి బిడ్డలంతా నీ బిడ్డలే తల్లీ. నీ బిడ్డలంటే నాకూ బిడ్డలే. ఏ ఒక్క బిడ్డ జ్వరాన పడకుండా ఊరిని కాచుకో అమ్మోరు తల్లీ!’’ అంటూ పాటపాడినట్లు వేడుకుంటోంది మారెమ్మ. చిన్న పిల్లల తల్లుల మనసును తాకిందా మొక్కు.  ‘‘పిల్లలకు చీడ సోకకుండా దారం మంత్రించి ఇవ్వమ్మా’’ అడుగుతోంది సీతాలక్ష్మి.  కొబ్బరికాయ, పూలు, పండ్లు, తాంబూలం, కానుక డబ్బులకు ఖర్చు కాగా, ఇంకా పర్సులో ఎంత మిగిలి ఉందో చూసుకుంది పద్మలత.

చెట్టుకు పూచిన గొడుగు!
 ‘‘మమ్మీ! నువ్వు వద్దన్నా వినకుండా నా మెడలో దారం కట్టావు చూడు! అంతా హంబక్ అంట’’ స్కూలు నుంచి వచ్చిన పూజిత మెడలో దారాన్ని బయటకు తీసి చూపిస్తోంది. దాన్ని తీసేయాలని ఉన్నా అమ్మ కోప్పడుతుందేమోననే బెరుకు ఆ పాప కళ్లలో. హంబక్ అన్న తన మాటను అంగీకరిస్తే ధీమాగా తీసేయవచ్చనే పెద్ద వ్యూహం పూజితది. పద్మలత రియాక్షన్ కోసం కళ్లలోకే చూస్తోందా పాప.
 
‘‘అమ్మో! తీస్తే అమ్మోరికి కోపం వస్తుంది. నీకు జ్వరం వస్తుంది. తియ్యకూడదు. అసలే ఊరి మీద కోపంతో అమ్మోరి నాలుక చాచింది చూళ్లేదా’’ కళ్లు పెద్దవి చేసి నోటిని సున్నాలా చుట్టి, నోటి మీద వేలు పెట్టి మరీ భయం చెప్పింది అక్కడే ఉన్న సీతాలక్ష్మి.  ‘‘అది అమ్మోరి నాలుక కాదమ్మా! మష్రుమ్ నాలుకంట. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకున్నారు. చాలా మంది వచ్చారు. ఆటో అంకుల్‌ని ఇంకొద్దిసేపు ఉండమంటే వినకుండా తెచ్చేశాడు’’ అలుకగా అంది పూజిత.

మాటల్లోనే నరసమ్మ వచ్చింది. ‘‘అవ్ అమ్మా! నాలుకను విరిచి చూపించారు. అంతా మారెమ్మ మాయ. ఇట్టాంటి మాయలెన్ని చూసినా మళ్లీ కొత్త మాయలోళ్ల  మోసంలో మోసపోతాం. ఒట్టి ఎర్రిబాగులోళ్లం’’ అంటూ గదులు ఊడవడానికి చీపురు తీసుకుంది.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి   గమనిక: కథనంలో పాత్రల పేరు మార్చడమైంది
 
వాన పడింది!  శిలీంధ్రం మొలిచింది!!

 వర్షాలకు చెట్టు బెరడులో నీరు నిలిచి ఫంగస్ పెరిగింది. చెట్టు మొదళ్ల మీద పుట్టగొడుగులు మొలుస్తుంటాయి కదా! అదే ఇది కూడా. అయితే ఇది బెరడులో చీలిక మధ్యగా విస్తరించి అడ్డంగా లావుగా తయారైంది. దానిని నాలుకగా నమ్మించే ప్రయత్నం చేసింది మారెమ్మ. ఆమెకు గతంలోనూ ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. ఎల్లమ్మ గుడి కడతానని చెప్పేదట. దేవుడి గుడి అనే నమ్మకంతో వచ్చిన వాళ్లకు భవిష్యత్తు చెప్తానని డబ్బు దక్షిణ తీసుకోవడం, దారాలు కట్టి డబ్బు హుండీలో వేయించుకోవడం వంటివి చేసేదని తెలిసింది. అప్పుడు కొందరు స్థానికులే ఆమెను మందలించి రేడియో స్టేషన్ దగ్గర నుంచి పంపించేశారు. ఇప్పుడు తాను అద్దెకుండే ఇంటి ముందు వేప చెట్టు చుట్టూ కథ అల్లింది. మేము దానిని విరిచి చూపించిన తర్వాత అందరూ అది పుట్టగొడుగేనని నమ్మారు. శాస్త్రీయంగా ఆలోచించమని చెప్పాం.
 - నర్రా రామారావు, జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
 

మరిన్ని వార్తలు