సూకీభవ

21 Feb, 2016 22:56 IST|Sakshi
సూకీభవ

ఆంగ్ సాన్ సూకీ, బర్మా ఉద్యమ నేత

తల్లిదండ్రులు       ఆంగ్‌సాన్ (దేశభక్త విప్లవకారుడు), ఖిన్ కీ (దౌత్యవేత్త)
కుటుంబ స్థానం   ముగ్గురు పిల్లల్లో ఒకే ఒక్క అమ్మాయి
భర్త                    డాక్టర్ మైఖేల్ ఏరిస్ (వివాహం: 1972)
సంతానం           అలెగ్జాండర్, కిమ్
పార్టీ                  ఎన్.ఎల్.డి. (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ)
వ్యవస్థాపన        27 సెప్టెంబర్ 1988 (8888 తిరుగుబాటు తర్వాత)
తిరుగుబాటు      8 ఆగస్టు 1988 - 18 సెప్టెంబర్ 1988
అవార్డులు          నోబెల్ శాంతి బహుమతి (1991)జవహర్‌లాల్ నెహ్రూ అవార్డ్ (1992) రాఫ్టో, సఖరోవ్ ప్రైైజులు (1990)

 
 
అన్నం పెట్టేవాళ్లు, పెట్టించేవాళ్లు, పండించేవాళ్లు.. ఎప్పుడూ చల్లగా ఉండాలి. అన్నదాతా.. సుఖీభవ!పిడికిలి బిగించినవారు, పోరు సాగించేవారు.. ఎప్పుడూ శాంతంగా ఉండాలి. పౌరులారా.. సూకీభవ! ఆంగ్ సాన్ సూకీలా ఉండండీ అని!!ఎప్పుడైనా సరే, అమెరికా ఎన్నికలు నవంబరులోనే జరుగుతాయి. అదీ మంగళవారమే జరుగుతాయి. అది కూడా నవంబరు నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం మాత్రమే జరుగుతాయి. అంటే.. నవంబరు 2కి ముందు గానీ, నవంబరు 8కి తర్వాత గానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగవు. రాజ్యాంగంలో అలా రాసుకున్నారు వాళ్లు! ఈ ఏడాది నవంబర్ 8న అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి.
 గత ఏడాది మయన్మార్ ఎన్నికలు కూడా నవంబర్ 8నే జరిగాయి. అంత మాత్రాన అమెరికా, మయన్మార్ రాజ్యాంగాలకు సంబంధం ఉందని చెప్పలేం. అలాగని ఏ సంబంధమూ ఉండబోదనీ చెప్పలేం. ఒక అందమైన ఊహ ఏమిటంటే.. అమెరికా, మయన్మార్‌లకు అధ్యక్షులుగా ఇద్దరూ మహిళలే అయితే ఎంత బాగుంటుందీ అని! ఊహ మాత్రమే కాదు.. అయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అమెరికాలో హిల్లరీ, మయన్మార్‌లో ఆంగ్‌సాన్ సూకీ అధ్యక్ష పీఠం మీద కూర్చుంటే మానవాళి మునుపెన్నడూ వీక్షించని ఒక అందమైన ప్రపంచం ఆవిష్కృతమౌతుంది. అమెరికా చరిత్రలో ఇంతవరకు మహిళా అధ్యక్షులు లేరు. మయన్మార్ చరిత్రలో అయితే అసలు ప్రజాస్వామ్యమే లేదు.

మయన్మార్ ఇప్పటికీ మిలటరీ పాలనలోనే ఉంది! మరి నవంబర్ 8న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కదా! వాటి ఫలితాలు ఏమైనట్లు? నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్.ఎల్.డి.) భారీ మెజార్టీతో గెలిచింది కదా! ఆ పార్టీ లీడర్ ఆంగ్‌సాన్ సూకీ ఎందుకు ఆ దేశానికి అధ్యక్షురాలు కాలేకపోయినట్లు? అందుకు చట్టాన్ని సవరించాలి. సవరించాలంటే పార్లమెంటులో 25 శాతం సీట్లు ఉన్న రిజర్వుడు (ఎన్నిక కాని వారు) అభ్యర్థుల ఆమోదం ఉండాలి. వాళ్లను మిలటరీ నియంత్రిస్తుంటుంది. సవరణకు మిలటరీ ఒప్పుకుంటే వాళ్లూ ఒప్పుకుంటారు. ఆంగ్‌సాన్ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామికి గానీ, పిల్లలకు గానీ విదేశీ పౌరసత్వం ఉంటే ఆ వ్యక్తి మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. అందుకోసం ప్రస్తుతం మిలటరీకి, సూకీ పార్టీకి మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. అవి ఫలిస్తే.. మార్చిలో సూకీ ప్రమాణ స్వీకారం ఉంటుంది.

ఈ నెల మొదట్లో సూకీకి ఫేస్‌బుక్‌లో ఒక బెదిరింపు పోస్ట్ వచ్చింది. ‘నిన్ను చంపేస్తాం’ అని! మామూలుగా అయితే అక్కడి పాలకులకు అదొక చిన్న విషయం. కానీ ఇప్పుడది పెద్ద సంగతి! సూకీకి తరగని ప్రజాదరణ అందుకు కారణం కావచ్చు. బెదిరింపు వచ్చిన వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సూకీకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సూకీ పట్ల మిలటరీ కనబరుస్తున్న సానుకూల ధోరణికి దీనినొక నిదర్శనంగా భావించవచ్చు.
 
మయన్మార్ ఎదురు చూపులు
సూకీని తమ అధ్యక్షురాలిగా చూడడం కోసం మయన్మార్‌లో ఇప్పుడు ప్రతి ఇల్లూ ఎదురుచూస్తోంది. చదువుల కోసం, ఉద్యోగాల నిర్వహణ కోసం దాదాపు నలభై ఏళ్ల పాటు విదేశాల్లో గడిపి, 1988లో మయన్మార్ వచ్చి, వచ్చిన ఏడాదే ఉద్యమ నేతగా అవతరించడానికి సూకీకి అంత శక్తి ఎక్కడిది? ‘అది నాకు నా తండ్రి, బర్మా ప్రజలు ఇచ్చిన శక్తి’ అని చెప్తారు సూకీ. అసలు ఆంగ్ సాన్ సూ కీ అన్న పేరులోనే మూడు తరాల శక్తి ఉంది. ‘ఆంగ్ సాన్’ అన్నది తండ్రి పేరు. ‘సూ’ అన్నది నానమ్మ పేరు. ‘కీ’ అన్నది అమ్మ పేరు.
 సూకీ రంగూన్‌లో జన్మించారు. పాలిటిక్స్, ఫిలాసఫీ చదివారు. బ్రిటిష్ పౌరుడు మైఖేల్ ఆరిస్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. ఉద్యమబాట పట్టారు. ఫలితంగా గృహ నిర్బంధానికి గురయ్యారు. సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. గత ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో నెగ్గి.. ప్రజాస్వామ్యానికి పురుడు పోశారు. ఇది ఆమె సాధించిన నోబెల్ శాంతి బహుమతి కంటే గొప్ప విజయం.
 
బందీ అయిన యోధురాలు
సూకీ గత ఐదేళ్లుగా స్వేచ్ఛా విహంగం అయితే కావచ్చు. అప్పటి వరకు ఆమె బర్మా స్వేచ్ఛకోసం బందీ అయిన యోధురాలు. 1989 జూలై 20 నుంచి 2010 నవంబర్ 13 వరకు ఇరవయ్యొక్కేళ్ల కాలంలో మధ్య మధ్య స్వల్ప విరామాలతో దాదాపు 15 ఏళ్ల పాటు బర్మా సైనిక పాలకులు విధించిన గృహ నిర్బంధంలో గడిపారు. నిర్భందం నుంచి బయటపడిన ఏడాదిన్నర తర్వాత - బ్యాంకాక్‌లో ఏర్పాటైన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడం కోసం సూకీ చేసిన తొలి విమాన ప్రయాణంలో ఆమెను చూడగానే కెప్టెన్ ఆనందాన్ని పట్టలేకపోయాడు. అంతేనా! కాక్‌పిట్‌కి ఆహ్వానించి, అక్కడ కొంతసేపు కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ హైటెక్ కంట్రోల్ ప్యానెల్ నుంచి భూమి మీద మినుకు మినుకుమని వెలుగుతున్న నగరాలను చూడగానే సూకీకి మయన్మార్ నిరుద్యోగ యువకులు, వారి కలలు, ఆశలు గుర్తొచ్చాయి.
 తర్వాత.. బ్యాంకాక్‌లో జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’లో ప్రసంగిస్తూ.. ఆమె అన్న మాట ఫోరమ్ సభ్యుల మనసు గెలుచుకుంది. ‘‘కొంచెం ఇవ్వండి చాలు. అవినీతికి అవకాశం కల్పించేంత భారీ స్థాయి పెట్టుబడులు అక్కర్లేదు’’ అన్నారు సూకీ. లేత నీలి రంగు దుస్తులలో, తలలో తెల్లటి పూలతో సూకీ మాట్లాడుతున్నప్పుడు ఆవిడొక స్వేచ్ఛా విహంగంలా కనిపించారంటూ అంతర్జాతీయ న్యూస్ చానళ్లు ఆహ్లాదకరమైన పోలికను తేవడం విశేషం.
 
తొలి ఎన్నికలు.. తుది ఫలితాలు
నిర్బంధం నుంచి సూకీ విడుదలయ్యాక మయన్మార్‌లో జరిగిన ఒక కీలక పరిణామం... ఉప ఎన్నికలు. ఆ ఎన్నికల్లో సూకీ ఘన విజయం సాధించారు. ఫలితాలు వెల్లడవగానే ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తరమెరికా, దక్షిణమెరికా, ఇజ్రాయిల్, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియాల నుంచి సూకీకి అభినందలు వెల్లువెత్తాయి. ‘‘మయన్మార్‌కి మంచి భవిష్యత్తు ఉంది. అది మీ వల్లే సాధ్యమౌతుంది’’ అని కొందరు దేశాధినేతలు సూకీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సీన్  మొన్న 2015 ఎన్నికల్లోనూ రిపీట్ అయింది.
 
 
నాన్న.. నా హీరో:  సూకీ
నాన్న! నా హీరో. నా జీవితానికి స్ఫూర్తి. ఉద్యమ రాజకీయాల్లో నా దిక్సూచి. బర్మా యువశక్తిని నడిపిన నాన్న... నా రెండేళ్లప్పుడు యువకుడిగానే చనిపోయారు. ఆయన నన్నెత్తుకుని ఆడించిన గుర్తు... ఉండీలేనట్లుంది. ‘‘నిన్ను ఇలా ఎత్తుకునేవారు, చేతులపై ఇలా ఊపేవారు. గాలిలో పైకి లేపి ఒక్క విసురుతో భద్రంగా నిన్ను కిందికి దింపేవారు. నువ్వు కిలకిలమని నవ్వేదానివి’’ అని అమ్మ చెబుతుంటే నాన్నని ఊహించుకునేదాన్ని. అమ్మ ఒక్కటేనా నాన్న గురించి చెప్పేది! బర్మాలోని ప్రతి ఉద్యమ గ్రామం ఆయన్ని గుర్తుంచుకుంది. ఆంగ్ సాన్ సూకీ ఒక తిరుగుబాటు నాయకురాలంటే వాళ్లకేం గొప్ప కాదు. ఆ తండ్రి కూతురేనని చెప్పుకోవడం గొప్ప!  
 నిర్బంధానికి నిర్బంధానికి మధ్య లభించిన షరతుల స్వేచ్ఛలో పశ్చిమ బర్మాలోని రఖైన్, చిన్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు ‘‘అదిగో.. ఆంగ్‌సాన్ తాతయ్య కూతురొచ్చింది చూడు’’ అని వారు అంటున్నప్పుడు నా కళ్లు చెమర్చాయి. నాన్న వారితో నిజాయితీగా ఉన్నారు. వారు నన్ను విశ్వసిస్తున్నారు. అంతే. ప్రజాస్వామ్యాన్ని తప్ప వారు ఇంకేమీ ఆశించడం లేదు. ఆచరణసాధ్యం కాని హామీలేమీ నేనివ్వడం లేదు. మా పార్టీ ప్రతి గూడెం గుండెకు హత్తుకుంది. అప్పుడు మాకు వినిపించినవి హృదయ స్పందనలు కాదు. ఆగస్టు తిరుగుబాటులో అమరవీరులైన వారి నినాదాలు!
 
భయానికి బందీ అయ్యామా అంతకన్నా శిక్ష లేదు. భయాన్ని వదిలించుకున్నామా అంతకన్నా స్వేచ్ఛలేదు. - ఆంగ్ సాన్ సూకీ, మయన్మార్ పోరాట యోధురాలు
 
 
 

మరిన్ని వార్తలు