ఎర్రయిటీ

3 Feb, 2017 23:17 IST|Sakshi
ఎర్రయిటీ

బీట్‌రూట్‌ అమ్మా!
కొరికితే కసక్క్‌ అంటుంది.
కోస్తే రక్తం చిందుతుంది.
ఈ ప్రపంచంలో పాన్‌ తినకుండా ఎర్రటి సోకు చేయాలంటే బీట్‌రూట్‌ ఉండాల్సిందే!
నాలుక ఎర్రబడుద్ది.
ఆ తర్వాత బీట్‌రూట్‌ అంటే వెర్రి పుట్టుద్ది.
ఒక్క బీట్‌రూట్‌తో ఎన్ని వెరైటీలో ఎర్ర ఎర్ర వెరైటీలు!!


బెర్రీ బీట్‌
కావల్సినవి:  బాదం పాలు – ముప్పావుకప్పు, నేరేడు పళ్ల గుజ్జు – ముప్పావు కప్పు, బీట్‌రూట్‌ తురుము – కప్పు, పుదీనా ఆకులు – పావు కప్పు, నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్లు, సబ్జా గింజలు – 2 టేబుల్‌ స్పూన్లు (అర కప్పు నీళ్లలో 2 గంటల సేపు నానబెట్టాలి), తేనె – టేబుల్‌ స్పూన్, ఉప్పు – చిటికెడు

తయారీ: ∙బాదం పాలు, నేరేడు, బీట్‌రూట్, పుదీనా, నిమ్మరసం, సబ్జా గింజలు, తేనె, ఉప్పు, అర కప్పు ఐస్‌ కలిపి మిక్సర్‌లో బ్లెండ్‌ చేయాలి. పుదీనాతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

హల్వా
కావల్సినవి: బీట్‌రూట్‌ తురుము – కప్పు, పాలు – కప్పు, పంచదార – అర కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు, యాలకుల పొడి – చిటికెడు, కర్బూజ గింజలు, జీడిపప్పు – అలంకరణకు

తయారీ: ∙కడాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో బీట్‌రూట్‌ తురుము వేసి కొన్ని నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత దీంట్లో పాలు, పంచదార వేసి కలపాలి. సన్నని మంట మీద ఉడకనివ్వాలి. మధ్య మధ్య కలుపుతుండాలి. కడాయికి పట్టుకోనంతగా ఉడకనిచ్చాక దించాలి. చివరగా జీడిపప్పు, కర్బూజ గింజలతో అలంకరించి, సర్వ్‌ చేయాలి.

సూప్‌
కావల్సినవి: ఆలివ్‌ ఆయిల్‌ – టేబుల్‌ స్పూన్, జీలకర్ర – టేబుల్‌ స్పూన్, ఉల్లిపాయ – 1 (తరగాలి), కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూన్, ఉల్లికాడలు – 1 (సన్నగా తరగాలి), ఉప్పు – తగినంత, నల్లమిరియాల పొడి – చిటికెడు, మజ్జిగ – కప్పు

తయారీ: ∙కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో జీలకర్ర, ఉల్లిపాయలు, ఉల్లికాడలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. దీంట్లో ఉప్పు, మిరియాల పొడి వేసి  5–7 నిమిషాల సేపు ఉడికించాలి. దీంట్లో బీట్‌రూట్‌ ముక్కలు వేసి రెండున్నర కప్పుల నీళ్లు పోసి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. 15–20 నిమిషాల సేపు ఉడికి, చల్లారిన తర్వాత మిక్సర్‌లో వేసి బ్లెండ్‌ చేయాలి. దీంట్లో అర కప్పు మజ్జిగ కలపాలి. కొత్తిమీర ఆకులు, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలపొడి చల్లి అందించాలి.

రసం
కావల్సినవి: బీట్‌రూట్‌ – 1, కందిపప్పు – అర కప్పు (నీళ్లలో నానబెట్టాలి), వెల్లుల్లి రెబ్బలు – 4–6, చింతపండు – నిమ్మకాయంత (నీళ్లలో నానబెట్టి, రసం తీయాలి), రసం పొడి – టీ స్పూన్‌ (అర టీ స్పూన్‌ జీలకర్ర – మిరియాలు, చిటికెడు పసుపు కలిపి పొడి చేయాలి), ఉప్పు – తగినంత

తాలింపు: నూనె /నెయ్యి – టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఇంగువ – చిటికెడు, ఎండుమిర్చి – 1

తయారీ: ∙బీట్‌రూట్‌ కడిగి, తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ప్రెజర్‌ కుకర్‌లో బీట్‌రూట్‌ ముక్కలు. వెల్లుల్లిరెబ్బలు, కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి 2 విజిల్స్‌వచ్చేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత తీసి, మొత్తం మిశ్రమాన్ని గరిటెతోనో లేదా పప్పు గుత్తితోనో మెత్తగా చేయాలి. ఇంకా మెత్తగా కావాలనుకుంటే మిక్సర్‌లో వేసుకోవచ్చు. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు ఎండుమిర్చి, ఇంగువ వేసి కలపాలి. దీంట్లో చింతపండు రసం, బీట్‌రూట్‌ పప్పు మిశ్రమం పోయాలి. దీంట్లోనే రసం పొడి, ఉప్పు వేసి కలపాలి. తీపిని ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం లేదా పంచదార వేసుకోవచ్చు. తర్వాత దించి కొత్తిమీర ఆకులు వేసి మూత పెట్టాలి. దీనిని వేడి వేడిగా అన్నంలోకి వడ్డించాలి.

చట్నీ
కావల్సినవి: బీట్‌రూట్‌ – 1, చిన్నది (సాంబార్‌) ఉల్లిపాయలు – 3,వెల్లుల్లి – 2, కొబ్బరి తురుము – 4 టేబుల్‌ స్పూన్లు, చింతపండు – ఉసిరికాయంత, ఉప్పు – తగినంత వేయించి గ్రైండ్‌ చేయడానికి: శనగపప్పు – టేబుల్‌ స్పూన్, మినప్పప్పు – టేబుల్‌ స్పూన్, ధనియాలు – టీ స్పూన్, ఎండుమిర్చి – 5

తాలింపు: నూనె – టేబుల్‌స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్‌ కరివేపాకు – రెమ్మ, ఇంగువ – చిటికెడు

తయారీ: ∙బీట్‌రూట్‌ను శుభ్రపరిచి, పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్‌ చేయాలి. పాన్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, చింతపండు, బీట్‌రూట్‌ ముక్కలు, కొబ్బరి తురుము వేసి 5–10 నిమిషాలు వేయించాలి. మంట తీసేసి చల్లారనివ్వాలి. మరో పాన్‌లో వేయించే దినుసులు వేసి బంగారు రంగు వచ్చేవరకు కలపాలి.చల్లారాక ఈ దినుసులు మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉడికించిన బీట్‌రూట్‌ కొబ్బరి మిశ్రమం, తగినంత ఉప్పు, 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమం గిన్నెలోకి తీసుకోవాలి. పాన్‌లో నూనె వేసి తాలింపు దినుసులు వేసి, వేయించి, చట్నీలో కలపాలి.

చికెన్‌
కావల్సినవి:  చికెన్‌ – అర కేజీ (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), బీట్‌రూట్‌ – 1 (పెద్దది, తురమాలి), సాంబారు ఉల్లిపాయలు (చిన్నవి) – 10., ఉల్లిపాయలు – 1 (సన్నగా తరగాలి), అల్లం, వెల్లుల్లి – 2 టీ స్పూన్లు, పెరుగు – టేబుల్‌స్పూన్, టొమాటో – 1 (సన్నగా తరగాలి), కారం – 2 టీ స్పూన్లు, ధనియాలపొడి– టీ స్పూన్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్‌ స్పూన్లు

తయారీ: ∙చికెన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి 15 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి చికెన్‌ను 10 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. విడిగా కడాయిలో నూనె పోసి వేడయ్యాక దీంట్లో  జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు ఉడికాక దీంట్లో బీట్‌రూట్‌ తరుగు, టొమాటో వేసి ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా ఉడికాక చికెన్‌లో వేసి కలపాలి. చికెన్‌ గ్రేవీ బాగా చిక్కపడ్డాక కొత్తిమీర ఆకులను చల్లి, మూత పెట్టి మంట తీసేయాలి.

గ్రిల్డ్‌ బీట్‌
కావల్సినవి:  ఆలివ్‌ ఆయిల్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, బీట్‌రూట్స్‌ – 4 , నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్లు
తహిని (అర టేబుల్‌ స్పూన్‌ నువ్వుల పొడి+ అర టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి చేసినది) – టేబుల్‌ స్పూన్‌
వెల్లుల్లి – ఒకటి (సన్నగా తరగాలి), ఉప్పు, మిరియాల పొడి – చిటికెడు

తయారీ: ∙కడాయి పొయ్యి మీద పెట్టి వేడయ్యాక నూనె వేయాలి. దీంట్లో బీట్‌రూట్‌ ముక్కలు వేసి కలపాలి. ఇది బాగా వేగి, చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం, వెల్లుల్లి, తహిని, ఉప్పు కలపాలి. చివరగా కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి, వేయించిన చిటికెడు నువ్వులు చల్లాలి. దీన్ని బ్రెడ్‌కి కాంబినేషన్‌గా వడ్డించాలి.

బీట్‌రూట్‌ పోషకాలు
బీట్‌రూట్‌లో ఫోలిక్‌ యాసిడ్, ఫైబర్‌ ఉంటుంది. అలాగే మెగ్నిషియమ్, పొటాషియమ్‌ అధికంగా లభిస్తాయి. బీట్‌రూట్‌ని రోజూ జ్యూస్‌ లేదా ఆహార రూపంలో తీసుకుంటే చర్మం ముడతలు పడదు. పిగ్మెంటేషన్‌ సమస్య దరిచేరదు. చర్మం మాయిశ్చరైజర్‌ను కోల్పోదు. వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది. లివర్‌ పనితీరు మెరుగవుతుంది. హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. క్యాన్సర్‌ నిరోధకారకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా బాడీ క్లెన్సర్‌లా పనిచేస్తుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు