అలీ పంచ్‌కు యాభై ఏళ్లు!

25 May, 2015 23:10 IST|Sakshi
అలీ పంచ్‌కు యాభై ఏళ్లు!

బయోగ్రఫీ
 
ఫస్ట్ రౌండ్‌లోనే తన నాకౌట్‌కు నేలకొరిగిన సోనీ లిస్టన్‌ను ‘గెటప్ అండ్ ఫైట్’ అని రెచ్చగొడుతున్న బాక్సింగ్ ఛాంపియన్ మహ్మద్ అలీ (1965 మే 25)

 
యాభై ఏళ్ల క్రితం. 1965 మే 25 యూఎస్‌లోని మెయిన్ స్టేట్. యాడ్రోస్‌స్కాజిన్ కౌంటీ. లూయిస్టన్ సిటీ. అక్కడ జరుగుతోంది మ్యాచ్. మహ్మద్ అలీకి సోలీ లిస్టన్‌కి మధ్య! నిజానికది మ్యాచ్ కాదు. రీమ్యాచ్. అంతకుముందు ఏడాది బోస్టన్‌లో నవంబరులో జరగవలసి ఉండి, అలీకి అత్యవసర హెర్నియా ఆపరేషన్ కారణంగా వాయిదా పడిన మ్యాచ్. లూయిస్టన్ బరిలో ఫస్ట్ రౌండ్‌లోనే అలీ పంచ్‌కు లిస్టన్ నేలపై వెల్లకిలా పడ్డాడు. ఇరవై సెకన్ల వరకు లిస్టన్ పైకి లేవలేకపోయాడు. ‘‘గెటప్ అండ్ ఫైట్ సక్కర్’ అని అలీ ఘీంకరిస్తూనే ఉన్నాడు. ఊహు. లిస్టన్‌లో ఓపిక  లేదు. రిఫరీ జెర్సీ జో అలీని విజేతగా ప్రకటించాడు. అలీ విన్నింగ్ పంచ్‌ని మీడియా ‘ఫాంటమ్ పంచ్’ గా అభివర్ణించింది. ఫాటమ్ అంటే ఊహాత్మకం అని. అలీ పంచ్ ఎంత నిజమో, ఆ పంచ్‌ని ఆ క్షణంలో ఎవరూ చూడకపోవడమూ అంతే నిజం. మొత్తానికైతే లిస్టన్ నాకౌట్ అయ్యాడు.
 
2015 మే 25

అలీ పంచ్‌కి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా లూయిస్టన్ సిటీ బరిలో నిన్న రాత్రి ‘రైజింగ్ అలీ’ అనే 27 నిమిషాల డాక్యుమెంటరీ ప్రీమియర్ షో ప్రదర్శన జరిగింది. దీని నిర్మాత చార్లీ హెవిట్. 68 ఏళ్ల చార్లీ జీవితకాలంలో ఎక్కువ భాగం న్యూయార్క్, పోర్ట్‌లాండ్ సిటీల మధ్య తిరగడంతోనే సరిపోయింది. బాల్యం గడిచింది మాత్రం లూయిస్టన్‌లో. అందుకే ఆ సిటీ అంటే అతడికి అంత ప్రేమ. మరి ఆయన తన డాక్యుమెంటరీకి ‘రెయిజింగ్ అలీ’ అని పేరు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ఇప్పటికీ అక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులు ‘‘ఇక్కడే కదా అలీ తన ఫాంటమ్ పంచ్ ఇచ్చింది’’ అని గైడ్‌లను, స్థానికులను అడుగుతుంటారట. ఆ బాక్సింగ్ బరిని ఫోటోలు తీసుకుంటుంటారట. లూయిస్టన్ అనగానే అందరికీ అలీ గుర్తొస్తున్నాడు కాబట్టి, అలీ అనగానే లూయిస్టన్ గుర్తొచ్చేలా ఈ పేరు పెట్టారు చార్లీ. అందుకే మనకు ‘రెయిజింగ్ అలీ’ టైటిల్ కింద ‘ఎ లూయిస్టన్ స్టోరీ’ అనే సబ్ టైటిల్ కనిపిస్తుంది.
 
అలీ బ్యాగ్రౌండ్


మహమ్మద్ అలీ మన దేశపు అలీ అనిపిస్తాడు. కానీ అమెరికన్. అలీ అలియాస్ కాస్సియెస్ మార్సెలస్ క్లే తొలి ఫైట్ అతడి 22వ యేట 1964 ఫిబ్రవరిలో సోనీ లిస్టన్‌తో జరిగింది. ఆ ఫైట్ లో అతడు లిస్టన్‌పై విజయం సాధించాడు. ప్రపంచ బాక్సింగ్ యోధుడిగా టైటిల్ గెలిచాడు. అదే ఏడాది తన ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన ‘మహమ్మద్ అలీ’ అనే టైటిల్‌నీ ఎంతో గర్వంగా ధరించాడు. బాక్సింగ్ టైటిల్ అతడిని జగదేకవీరుడిని చేస్తే, భక్తితో స్వీకరించిన ‘అలీ’ అన్న టైటిల్ అతడిని జగద్విదితం చేసింది. అయితే  ఇస్లాం మతాన్ని స్వీకరించినందుకు క్రైస్తవ మూలాలు ఉన్న ఈ ‘త్రీ-టైమ్’ వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్.. సంప్రదాయవాదుల ఆధ్యాత్మిక ముష్టి ఘాతాలను ఏళ్లపాటు ఎదుర్కొనవలసి వచ్చింది.

జాతివివక్ష అన్నది అలీతో పాటు దెయ్యపు నీడలా ఎదిగింది. పద్దెనిమిదేళ్ల వయసులో రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొని లైట్ హెవీ వెయిట్ చాంపియన్‌గా బంగారు పతకంతో సంతోషంగా తిరిగి వచ్చిన క్లే (అలీ) కి అమెరికాలో వివక్ష మాత్రమే స్వాగతం పలికింది. విజేతను ప్రశంసించడం పోయి, పట్టనట్టు ఉండిపోవడం అతడినేమీ కలిచివేయలేదు కానీ, ఆ  తర్వాత కొన్నాళ్లకు జరిగిన ఒక పరిణామం అతడికి విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించింది. క్లే హాజరైన ఓ విందు వేడుకలో అతడికి వడ్డించేందుకు అక్కడివారు నిరాకరించడంతో క్లే బయటికి వచ్చి ఎప్పుడూ తన వెంట ఉంచుకునే ఒలింపిక్ పతకాన్ని తీసి ఓహియో నదిలోకి విసిరికొట్టాడు. తనను గౌరవించని దేశంలో ఆ దేశం తరఫున సాధించిన పతకాన్ని గౌరవించడం తనకు అవమానకరం అని అతడు భావించాడు కనుకే అలా చేశాడు.
 అలీ దేవుడికి తప్ప మరెవరికీ కట్టుబడి లేడు. అదే ఆయన్ని అనేకసార్లు చిక్కుల్లో పడేసింది. వియత్నాం యుద్ధ సమయంలో యు.ఎస్. ఆర్మీ నుంచి అలీకి ‘కన్‌స్క్రిప్షన్’ నోటీసు వచ్చింది... వెంటనే వచ్చి యుద్ధంలో చేరమని. అలీ తిరస్కరించాడు.  జాతి గర్వించే ఒక క్రీడాకారుడిగా కన్‌స్క్రిప్షన్‌ను తిరస్కరించే హక్కు అతడికి ఎలాగూ ఉంటుంది. అయితే తన మత నిబంధనలు ఏ విధమైన హింసనూ అనుమతించవన్న కారణం చూపి సైన్యంలో చేరడానికి అతడు నిరాకరించడంతో  అమెరికా ఆగ్రహించింది. అతడికి పది వేల డాలర్ల జరిమానా, ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. తర్వాత అలీ తరఫున వచ్చిన అభ్యర్థనలను మన్నించి కారాగారవాసాన్ని రద్దు చేసినప్పటికీ అతడి బాక్సింగ్ టైటిల్‌ను వెనక్కు తీసేసుకుంది. బాక్సింగ్ లెసైన్స్‌నీ (తాత్కాలికంగా) లాగేసుకుంది.

అలీ తన నలభయ్యవ యేట 1981లో బాక్సింగ్ నుంచి తప్పుకున్నారు. తర్వాత మూడేళ్లకు వైద్యులు అతడిలో పార్కిన్‌సన్ వ్యాధిని గుర్తించారు. బాక్సింగ్‌లో తలకు అయిన గాయాల కారణంగా వచ్చిన వ్యాధి అది. అలీ వైవాహిక జీవితం కూడా నాలుగు పెళ్లిళ్లతో నలతకు గురయినట్లే ఉంది. ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులకు తండ్రి అయిన అలీ ప్రస్తుతం యు.ఎస్. కెంటకీలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.  
 
పేరు : మహ్మద్ అలీ (73)
ఇతర పేర్లు : ది గ్రేటెస్ట్,
ది పీపుల్స్ ఛాంపియన్,
ది లువీజా లిప్
ప్రఖ్యాతి : బాక్సింగ్‌లో హెవీవెయిట్ వరల్డ్ చాంపియన్
 
ఎత్తు     6 అ. 3 అం.
మొత్తం ఫైట్లు    61
గెలిచినవి     56
ఓడినవి    5
 
మహ్మద్ అలీ వ్యక్తిత్వం
భక్తిపరుడు
విలువలను గౌరవిస్తాడు.
మృదుస్వభావి
ముక్కోపి కూడా
భావోద్వేగాలు ఎక్కువ
మితభాషి
 
అలీ ప్రత్యర్థులలో ఐదుగురు
సోనీ లిస్టన్
ఫ్లాయిడ్ పాటర్సన్
హెన్రీ కూపర్
లియాన్ స్పింక్స్
జో ఫ్రేజియర్
 
మహ్మద్ అలీపై వచ్చిన
పాపులర్ సాంగ్
‘హి ఫ్లోట్స్ లైక్ ఎ బటర్‌ఫ్లై,
హి స్టింగ్స్ లైక్ ఎ బీ..’
 

మరిన్ని వార్తలు