ఏక్తా క్వీన్

3 Apr, 2016 22:50 IST|Sakshi
ఏక్తా క్వీన్

ఏక్తా కపూర్ పర్ఫెక్షనిస్ట్. సినిమా అయినా, టీవీ సీరియల్ అయినా తను అనుకున్నట్టు రావాల్సిందే. అందుకోసం ఆమె ఎన్నిసార్లయినా స్క్రిప్టు మారుస్తారు. హీరోయిన్ చేత ఎన్ని డ్రెస్సులైనా మార్పిస్తారు. అంత ‘పట్టింపు’లోనూ ప్రేక్షకాదరణ తగ్గకుండా యేళ్లకు యేళ్లు కుటుంబ కథలను వేళ్లకు దారాలు కట్టుకున్నట్టుగా నడిపిస్తున్నారు. అందుకే ఆమె ‘డ్రామా క్వీన్’ అయ్యారు. కథ ఏదైనా ఏక్తానే.. క్వీన్.  

 

సినిమాలు మూడు కారణాల వల్ల నడుస్తాయి. ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్. రెండు ఎంటర్‌టైన్‌మెంట్. మూడు ఎంటర్‌టైన్‌మెంట్. ‘డర్టీపిక్చర్’లోని డైలాగ్ ఇది. సినిమాలోని ైడె లాగ్ మాత్రమే కాదు. సినిమాను నడిపించిన సూత్రం కూడా అదే. ఆ సినిమా నిర్మాణసంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ (బి.ఎం.పి.)ని హిట్ చేసిందీ అదే ఎంటర్‌టైన్‌మెంట్. బి.ఎం.పి. 2001లో మొదలైంది. అది జితేంద్ర కంపెనీ. అంతకు ఏడేళ్ల క్రితం (1994) నుండీ ‘బాలాజీ టెలీ ఫిలింస్ ప్రొడక్షన్ హౌజ్’ నిర్మిస్తున్న టీవీ సీరియల్స్‌కు టీఆర్‌పీ టాప్ రేటింగ్స్ ఇస్తున్నది కూడా ఎంటర్‌టైన్‌మెంటే. 1995 నుండి జితేంద్ర కూతురు ఏక్తా కపూర్ దీనిని నడిపిస్తున్నారు. కాదు. పరుగెత్తిస్తున్నారు. టీవీ ధారావాహికలకు ఒక చెడ్డపేరు ఉంది. నత్తనడక నడుస్తాయని! నత్తల్లా కదలొచ్చుగాక... ఏక్‌తా స్క్రీన్ ప్లేలో ఆ నడక పరుగులా ఉంటుంది. అదే ఆమె స్పెషాలిటీ. 

 

కథ ఏదైనా.. ఏక్తానే క్వీన్!
పేరుకు తండ్రి కంపెనీలే కానీ... బాలాజీ టెలీఫిలిమ్స్, బాలాజీ పిక్చర్స్.. ఈ రెండిటికి తెరవెనుక ప్రధాన నాయిక ఏక్తా కపూర్. గ్లిజరిన్ అమ్మకందార్లకు విపరీతంగా గిరాకీ పెంచిందని ఆమె మీద పెద్ద సెటైర్. దాన్ని ఆమె ఏనాడూ లెక్క చేయలేదు. తను తీయాలనుకున్నది తీశారు. ఏక్తా తీసిన వాటిల్లో 25 టీవీ సీరియళ్లు సూపర్ హిట్. అందుకే... ప్రేక్షకాదరణ ఏమాత్రం చెక్కుచెదరకుండా యేళ్లకు యేళ్లు కుటుంబ కథలను వేళ్లకు దారాలు కట్టుకున్నట్టుగా నడిపిస్తున్న ఏక్తా ‘డ్రామా క్వీన్’ అయ్యారు. కథ ఏదైనా ఏక్తానే.. క్వీన్.

 

తొలినాళ్ల థీమ్‌లు వేరు
నిజజీవితంలో ఎక్కడా లేని, ఎక్కడా జరగని సన్నివేశాలతో ఏక్‌తా సీరియళ్లు తీస్తారని ఆమెపై ఇంకో విమర్శ. ఏక్తా లెక్క చేయలేదు. తను నమ్మిన ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములానే ఫాలో అయ్యారు. అవుతున్నారు. ప్రతిసారి ఒక కొత్త సక్సెస్‌ని ఒక కొత్త  కిరీటంలా ధరిస్తున్నారు. 2010లో ఫోర్బ్స్ పత్రిక విజయవంతమైన పారిశ్రామిక మహిళల్లో ఏక్తాకు మూడో స్థానం ఇచ్చింది. అది ఆమెకు ఫోర్బ్స్ ఇచ్చిన స్థానమే అయుండొచ్చు. ఇచ్చేలా చేసింది మాత్రం టీవీ ప్రేక్షకులే. ‘‘ఈ రంగంలోకి వచ్చిన కొత్తలో ‘పెళ్లి తర్వాతి ప్రేమ..’ అనే థీమ్‌తో కొన్ని సీరియల్స్ తీశాను. టీఆర్‌పీ రేస్‌లో అవి చివరన ఉన్నాయి. అప్పుడర్థమైంది నాకు.. వీక్షకులకు కావల్సింది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమేనని. అంతే నా రూట్ మార్చుకున్నాను.. కథాంశాలను మార్చేశాను’ - విమర్శకులకు ఏక్తా సమాధానం. నాడి పట్టుకున్నారు ఏక్తా.



క్యోంకీ సాస్ భీ...
1997లో సీరియళ్ల నిర్మాణంలోకి అడుగుపెట్టినా.. అసలైన విజయంతో ఏక్తా వేలమందికి తెలిసింది మాత్రం 2000 సంవత్సరంలో మొదలైన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ అనే సీరియల్‌తోనే. ఈ కథతో ఆమె టెలివిజన్ సీరియళ్ల చరిత్రనే తిరగరాశారు. కనిపించకుండా పోతున్న ఉమ్మడి కుటుంబాలు, ఆ కుటుంబాల్లో నిరంతరం కనిపిస్తుండే కలహాలు, ఆస్తుల తగాదాలు, దాయాదుల పగలు, పంతాలు, కుట్రలు వీటన్నింటినీ ఏక్తా తన సీరియల్స్‌కు కథాంశాలుగా ఎంచుకున్నారు. విపరీతమైన డ్రామా! ఏళ్లకు ఏళ్లుగా ఎపిసోడ్‌లు. చివరికి తమ సీరియళ్లతోనే ఇంట్లో ఆడవాళ్లు టీవీ చూసే టైమ్‌ను సెట్ చేసుకునే పరిస్థితి కల్పించింది బాలాజీ టెలీఫిలిమ్స్! తన ప్రొడక్షన్స్‌తో జీటీవీ ఛానల్‌ను పాపులర్ చేసింది. ఒక దశలో స్టార్ ప్లస్, సోనీ, జీటీవీ లాంటి ప్రముఖ చానళ్లంటిలోనూ.. బాలాజీ టెలీఫిలింస్ సీరియల్సే ప్రసారమయ్యేంత డిమాండ్‌ని సంపాదించిపెట్టింది.

 

తొణకలేదు.. బెణకలేదు!
సరిగ్గా ఈ సమయంలోనే ఏక్తా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. స్త్రీని విలన్‌గా చూపిస్తోందని.. అత్తాకోడళ్లను ఆగర్భ శత్రువులుగా చిత్రీకరిస్తోందని విమర్శకులు ధ్వజమెత్తారు. అయినా ఏక్తా తొణకలేదు..బెణకలేదు. అలాంటి సీరియళ్ల కొనసాగింపును ఆపలేదు. దటీజ్ ఏక్తా! ఆమె సాహసాన్ని, ధైర్యాన్ని తెలిపే సంగతులు చాలానే ఉన్నాయి. మచ్చుకు సన్నీ లియోన్ బాలీవుడ్ ఎంట్రీ! రాగిణీ ఎంఎంఎస్2 అనే సినిమాతో ఎక్కడో బ్రిటన్‌లో పోర్న్‌స్టార్‌గా ఉన్న సన్నీలియోన్‌ను ఏక్తా బాలీవుడ్‌కి తెచ్చారు. రాగిణీ ఎంఎంఎస్2 కు ఏక్తానే నిర్మాత. ఎందరు ముక్కున వేలేసినా.. సన్నీలియోన్‌కు కొత్త ఇమేజ్‌నిచ్చేందుకు చేసిన ఆమె ప్రయత్నాన్ని కొందరు మెచ్చుకున్నారు. ఇదీ ఎక్తాకపూర్ వ్యక్తిత్వం. బిజినెస్.. ప్రొడక్షన్ విషయాల్లో ఎంత నిక్కచ్చిగా.. ధైర్యంగా ఉంటారో.. కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఆమె అంతే భయస్తురాలు అని ఏక్తా తమ్ముడు, ప్రముఖ బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ చెప్తాడు. ‘అక్కకు ఎత్తయిన ప్రదేశాలన్నా, చీకటి అన్నా, హెలికాప్టర్ ఎక్కడమన్నా చాలా భయం’ అంటాడు.

 

స్క్రిప్టు మార్చాల్సిందే!
పనిలో పర్‌ఫెక్షన్ లేకపోతే ఏక్తాకు ఎక్కడలేని కోపం. ఈ స్వభావంతోనే ఆమె చాలామందికి శత్రువు అయ్యారు ‘కుమ్‌కుమ్ భాగ్య’ అనే సీరియల్‌లో ఒక సన్నివేశం కోసం హీరోయిన్‌కి 19 డ్రెస్‌లు మార్పించారట ఏక్తా! ఆ అమ్మాయి ఓపిక నశించి ఇక నా వల్ల కాదు అన్నా వినలేదట. అంతేకాదు స్క్రిప్ట్‌ను ఎంచుకునేటప్పుడు.. దాన్ని ఖరారు చేసే విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటారు ఏక్తా.. ఒక్కోస్క్రిప్ట్‌ను కనీసం 20 సార్లయినా మార్చందే ఫైనలైజ్ చేయదనే దర్శకుల కినుకా ఆమె మీద ఉంది.

 

పెళ్లిపై ఏక్తా అభిప్రాయం
‘వైవాహిక జీవితంలో ఇమడాలంటే చాలా ఓపిక, సహనం ఉండాలి. నాకు అవి లేకే పెళ్లికి దూరంగా ఉన్నా’ అని ఏక్తా (40) అంటారు. ‘పెళ్లి చేసుకున్నాక మగాడు మగాడిగానే ఉంటాడు. కానీ స్త్రీ జీవితమే మారిపోతుంది. భార్య, కూతురు, కోడలు, తల్లి పాత్రలో ఒదగాల్సి వస్తుంది. ఆ బాధ పురుషుడికి లేదు. భర్త అనే పేరు వస్తుంది తప్ప బాధ్యత ఉండదు. పురుషుడు.. పురుషుడు అనే స్వేచ్ఛతోనే ఉంటాడు. స్త్రీగా నేను అన్ని పాత్రలు పోషించలేను’ అని ఏక్తా కపూర్ ముగించారు.

 

నాన్నంటే ఇష్టం...
చిన్నప్పుడు ఏక్తా తన తండ్రి జితేంద్ర పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేదట. జితేంద్రతోపాటే షూటింగ్‌కి వెళ్లి కాపుకాసేదట. షూటింగ్‌లో భాగంగా తండ్రి హీరోయిన్‌తో నటిస్తుంటే ‘ మా నాన్నను ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అంటూ హీరోయిన్‌ను వెంబడించేదట  ఏక్తా.. పనిలో ఎంత కఠినంగా ఉంటారో.. మూగజీవాల పట్ల అంతగా దయతో ఉంటారు. బాలివుడ్ ప్రముఖులంతా ఫారిన్ బ్రీడ్ కుక్కలను లక్షలు పెట్టి కొనుక్కొని తెచ్చి పెంచుకుంటుంటే.. ఏక్తా మాత్రం ముంబైలోని తమ ఇంటి దగ్గర్లో ఉన్న ఓ పది వీధి కుక్కలను చేరదీసి పెంచుతున్నారు. వాటిలో ఒకటి రెండు శునకాలు ఎప్పుడూ ఆమె వెంటే ఉంటాయి. ఆఖరుకు ఆమె షూటింగ్‌కి వెళ్లేటప్పుడు కూడా వదలవు. సినిమాలు, సీరియల్సే కాకుండా ఫ్యాషన్‌ప్రపంచంలోకీ అడుగుపెట్టారు ఏక్తా. తన పేరులోని రెండు పొడి అక్షరాలు ’ఉఓ’ అనే బ్రాండ్‌నేమ్‌తో ఫ్యాషన్ దుస్తులను రూపొందిస్తున్నారు  ఏక్తా టీనేజ్‌లోకి వచ్చేదాకా చాక్‌లెట్లు విపరీతంగా తినేదట. ఇప్పటికీ చాక్లెట్‌లంటే పడిచస్తుంది అని ఆమె స్నేహితులు చెబుతారు. ఆమె చేత చాక్‌లెట్లు, ఐస్‌క్రీమ్ మాన్పించడానికి ఆమె తండ్రి జితేంద్ర చాలా కష్టపడ్డారట.

 

పొగరు.. పరిణతి.. పట్టుదల
ఈ మూడూ కలిస్తే.. ఏక్తా. నుదుటి మీద నిలువెత్తు నామం.. విరబోసుకున్న జుత్తు... నవ్వీనవ్వని పెదాలు.. ఏక్తా రూపానికి ఆకర్షణలు. బాంబే స్కాటిష్ స్కూల్లో బాల్యవిద్య, మితిభాయి కాలేజ్‌లో కామర్స్ డిగ్రీ. అక్కడితో ఆగిపోయారు ఏక్తా. పై చదువుల మీద అంత ఆసక్తి చూపించలేదు. నిజానికి ఆమె బ్రిలియంట్ కాదు. క్రియేటివ్. ఇంకా చెప్పాలంటే.. బ్రిలియంట్‌లీ క్రియేటివ్. ఈ విషయాన్ని తండ్రి జితేంద్ర కనిపెట్టారు. ఆమెను టీవీ రంగం వైపు ప్రోత్సహించారు. ‘బాలాజీ టెలీఫిలింస్ ప్రొడక్షన్ హౌజ్’ను ప్రారంభించారు. క్రియేటివ్ డెరైక్టర్‌గా కూతురికి బాధ్యతలు అప్పగించాడు. తండ్రి ఇంత చేసినా తన  విజయానికి స్ఫూర్తి మాత్రం తల్లి శోభాకపూరే అని చెప్తారు ఏక్తా. సెట్లో అమ్మ వెన్నంటే ఉండాలని కోరుకుంటారు ఆమె. శోభ కపూర్ ఇప్పుడు బాలాజీ టెలీఫిలింస్ మేనేజింగ్ డెరైక్టర్.

 

 

‘కె’ సెంటిమెంట్ ఒక వ్యూహం!
‘జారినా ఆఫ్ టీవీ’గా పేరున్న ఏక్తా స్వయంశక్తిని ఎంతగా నమ్ముకున్నారో జాతకాలనూ అంతకన్నా బలంగా నమ్ముతారు. జ్యోతిష్యం, న్యూమరాలజీ మీద నమ్మకం జాస్తి. తన సీరియల్స్‌లో చాలా వాటికి ‘కె’ అనే అక్షరంతోనే మొదలయ్యే టైటిల్స్‌నే ఆమె పెట్టారు. ‘మా ప్రొడక్షన్ హౌజ్‌కి ఓ బ్రాండ్‌నేమ్ స్థిరపడడానికే నేను ఈ కె సెంటిమెంట్‌ను వాడుకున్నా. అందుకే మొదట్లో మేం తీసిన సీరియల్స్ అన్నిటికీ కెతో టైటిల్స్ పెట్టాం. ఎప్పుడైతే ఆ సీరియల్స్ అన్నీ బాలాజీ వాళ్లవని జనాల్లో ఓ ముద్ర పడిపోయిందో అప్పుడు నెమ్మదిగా కెని వెనక్కి నెట్టా. తర్వాత నుంచి అలాంటి సెంటిమెంట్ లేకుండా కథాంశానికి అనుగుణంగా టైటిల్స్ పెట్టడం స్టార్ట్ చేశా’ అని చాలాసార్లు చెప్పారు ఏక్తా.

 

 

ఏక్తా టీవీ సీరియల్స్
తెలుగు డబ్బింగ్
బడే అచ్చే లగ్‌తే హై (నువ్వు నచ్చావ్), పరిచయ్ (అభినందన),
బైరీ పియా (నువ్వే కావాలి)

 

తెలుగులో వచ్చినవి
కళ్యాణి, బ్రహ్మముడి, కన్నవారి కలలు, కొత్త బంగారం, కార్తీకదీపం, కాళరాత్రి, కంటే కూతుర్నే కనాలి, కలవారి కోడలు, పవిత్రబంధం, కుటుంబం, అనుబంధం, పెళ్లికానుక, కలిసుందాం రా, కావ్యాంజలి.

 

ఇప్పుడు వస్తున్నవి
యే హే మొహొబ్బతే (మనసు పలికే మౌనగీతం), కుంకుమ్ భాగ్య (కుంకుమభాగ్య), జోథాఅక్బర్ (జోథాఅక్బర్). సావధాన్ ఇండియా - క్రైమ్‌స్టోరీస్ సిరీస్ (లైఫ్ ఓకే చానెల్లో వస్తోంది. తెలుగులోనూ ఇదే పేరుతో వస్తోంది)

-  సరస్వతి రమ

 

మరిన్ని వార్తలు