మాటల మహారాణి

30 Apr, 2017 22:43 IST|Sakshi
మాటల మహారాణి

అమ్మ కౌన్సెలింగ్‌ క్లాసులు చెప్పడానికి వెళ్లిపోయేది. నాన్న బీమా పాలసీలు కట్టించుకోడానికి వెళ్లిపోయేవాడు. ఇంట్లో ఇక మిగిలింది అన్న. అతడూ అంతే. తన మ్యూజిక్‌ లోకంలో తను ఉండిపోయేవాడు. ఎలెన్‌ ఎవరితో మాట్లాడాలి? స్కూల్లో చాన్స్‌ దొరికింది.కాలేజీలో చాన్స్‌ దొరికింది. చిన్నాచితక ఉద్యోగాల్లో చాన్స్‌ దొరికింది. చివరికి ఒక టాక్‌ షోతో తనే చాన్స్‌ తీసుకుంది. నిజానికి అది ఎలెన్‌కు దొరికిన చాన్స్‌ కాదు. ఆమె మాటలకు హాయిగా నవ్వుకోడానికి మనకు దొరికిన చాన్స్‌.

ఎలెన్‌ డిజెనరస్‌! పేరు మనది కాదు. ఊరు మనది కాదు. మనిషి ముఖం మనది కాదు. అసలు ఎలెన్‌ డిజెనరస్‌ అనే పేరు... ఆడవాళ్ల పేరో తెలీదు, మగవాళ్ల పేరో తెలీదు. కానీ ఎలెన్‌ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఎలెన్‌ పడిన ఒక టెన్షన్‌ గురించి మొదట తెలుసుకోవాలి. అప్పుడు.. ‘అయ్యో పాపం ఆడపిల్ల’ అనిపిస్తుంది!! అవును. ఎలెన్‌ ఆడపిల్ల. ఒక డౌట్‌ అయితే క్లియర్‌ అయింది కదా! ఇక ఆ అమ్మాయి పేరు, ఊరు, ముఖం... మనవి కాకపోయినా... గత శుక్రవారం తన టాక్‌ షో ‘ది ఎలెన్‌ డిజెనరస్‌ షో’లో... బెదిరిన లేడిపిల్లలా నెమరు వేసుకున్న చేదు జ్ఞాపకాల గురించి తెలుసుకుంటే ఆమె గురించి ఇంకా ఇంకా తెలుçసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది.

1997. ఫిబ్రవరిలో ఓ రోజు...  ‘ది ఓఫ్రా విన్‌ఫ్రే షో’లో మాట్లాడుతూ 39 ఏళ్ల ఎలెన్‌ అన్నమాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి లోను చేశాయి. స్క్రీన్‌పై ఎలెన్‌ను చూస్తున్నవారు పట్టలేని కోపంతో ఆమె ముఖం మీదే టీవీలను పగలగొట్టేశారు. కొందరు అభ్యంతరకరమైన పదాలతో ద్వేషపూరితమైన మెయిల్స్‌ పంపారు. స్వయానా ఆమె తల్లి బెట్టీ... టీవీ చూస్తూ నివ్వెరపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. అమెరికాలోని మిగతా తల్లులు... ఇక నుంచీ టీవీలో ఎలెన్‌ ఎక్కడ కనిపిస్తే అక్కడ చానల్‌ మార్చేయాలని తమ పిల్లల్ని ఆదేశించారు. ఎలెన్‌ అప్పటికే పెద్ద సెలబ్రిటీ. సిట్‌కామ్‌ల (సిట్యుయేషనల్‌ కామెడీ) సెలబ్రిటీ. పిల్లలు, పెద్దలు ఆమె మాటలకు పగలబడి నవ్వుతుండేవారు. చివరికి ఆమే నవ్వులపాలు అయింది!

ఇంతకీ ఆ షోలో ఎలెన్‌ అన్న మాటలు ఏమిటి?అవేమీ ఫోర్‌ లెటర్‌ వర్డ్స్‌ కాదు. కానీ అంతకుమించి జగుప్సాభావం, ఎలెన్‌పై ద్వేషం కలగడానికి కారణమైన ఫైవ్‌–వర్డ్‌ ఫ్రేజ్‌ అది! I'm Ellen and I'm gay. ఇదీ ఎలెన్‌ అన్న మాట. తనొక ‘గే’ అని ఎలెన్‌ ప్రకటించారు! ఆ మాటను ఎలెన్‌ ఇరవై ఏళ్ల క్రితమే మర్చిపోయారు. కానీ.. ఇరవై ఏళ్లుగా ఆనాటి ప్రతి స్పందనలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ‘నా జీవితంలో.. నేనెప్పుడూ అంతగా భయంతో వణికిపోలేదు. మా ఇంటి అద్దాలు పగలగొట్టి లోపలికి వచ్చారు. చచ్చిపోయాననే అనుకున్నాను. ఒకవేళ బతికి బట్టకట్టినా ఏ క్షణమైనా,  ఎవరి చేతిలోనైనా నాకు చావు తప్పదనే అనుకున్నాను’ అని శుక్రవారం నాటి షోలో గుర్తు చేసుకున్నారు ఎలెన్‌. ఎలెన్‌ జీవితంలోని ఇంకో వివాదం.. ఆమె ఒక మహిళను వివాహం చేసుకోవడం. ఈ రెండు వివాదాలను అటుంచితే.. పద్నాలుగేళ్లుగా (2003 నుంచి) తన చురుకైన, సరదా వ్యాఖ్యానాలతో నవ్వుల్ని పంచుతున్న ఈ లేడీ కెమెడియన్‌ జీవితం.. ‘నవ్వుతూ బతకాలిరా’ అని చెప్పే ఒక చిరునవ్వుల సందేశం.

ఒక్క పూసలో ఎలెన్‌ ఊసు!
ఎలెన్‌ కమెడియన్‌. జోకుల్ని కేకుల్లా కట్‌ చేస్తుంది. తడుముకోదు. అప్పటికప్పుడు తన్నుకొచ్చేస్తుంది ఆమెలోంచి హాస్య భాషణం! అమెరికా అమ్మాయి. ఎయిటీస్‌లో కెరీర్‌లోకి వచ్చింది. కెరీర్‌ అంటే ఏం లేదు.. మాటలే! టీవీలో మాటలు. టీవీ షోలలో మాటలు. పెద్దపెద్ద వాళ్లతో మాటలు. చిన్నచిన్నవాళ్లతో మాటలు. ప్రేక్షకుల్ని చూస్తూ లైవ్‌లో నవ్వుల్ని పేల్చడం మాటలు కాదు. ఎలెన్‌కు మాత్రమే మాటలే. సిట్‌కామ్స్‌తో ఊపేస్తుంది. తరచు భారీ ఈవెంట్‌లకు స్టేజ్‌ పైకి ఎక్కి మైక్‌ పట్టుకుంటుంది. ఆస్కార్‌ అవార్డులు, గ్రామీ అవార్డులు.. ఇలా! ఎలన్‌కు కూడా అవార్డులు వచ్చాయి. ఒబామా నుంచి అందుకున్న ప్రెసిడెన్షియల్‌ అవార్డు వాటిల్లో ఒకటి. ఎలెన్‌కు ఇప్పుడు 59 ఏళ్లు. ఇంత పెద్ద మనిషిని పట్టుకుని ఏకవచనం ఏంటి? ఇంట్లో మనిషి అన్నట్లుగా ఉంటే పనిగట్టుకుని నోట్లోంచి రెస్పెక్ట్‌ వచ్చేస్తుందా మరి! ఒకటి మాత్రం నిజం. ఓప్రా విన్‌ఫ్రే తర్వాత అంత రెస్పెక్ట్‌ ఉన్న టీవీ హోస్ట్‌.. ఎలెన్‌.  

సింపుల్‌గా ఇదీ.. షో!
 ∙ఎలెన్‌ షో పేరు.. ‘ది ఎలెన్‌ డిజెనరస్‌ షో ∙లాఫ్, డాన్స్, షేర్‌... అన్నది షో టాగ్‌ లైన్‌ ∙షో 2003 సెప్టెంబర్‌ 8న మొదలైంది. ఇప్పటికీ కొనసాగుతోంది ∙ఇప్పటి వరకు 13 సీజన్లు అయ్యాయి. 14వ సీజన్‌ నడుస్తోంది ∙ ఒక్కో సీజన్‌ ఏడాది పాటు ఉంటుంది. ప్రతి సీజను సెప్టెంబర్‌లో మొదలై సెప్టెంబర్‌లో ముగుస్తుంది ∙ మొత్తం ఇప్పటికి 2,233 ఎపిసోడ్‌లు అయ్యాయి. సీజన్‌కి సుమారుగా 150 ఎపిసోడ్‌లు ఉంటాయి. అంటే నెలకు కనీసం పదీ పన్నెండు ఎపిసోడ్‌లు ∙ మూడు రోజుల క్రితమే ఏప్రిల్‌ 28న 2,234 ఎపిసోడ్‌ అయింది ∙ఎలెన్‌ ఎపిసోడ్‌ను నడిపిస్తుంది. అమెరికన్‌ టీవీ ప్రొడక్షన్‌ కంపెనీ ‘టెలీపిక్చర్స్‌’ ఎపిసోడ్‌ను షూట్‌ చేస్తుంది. ఈ ఎపిసోడ్‌ ‘సిండికేషన్‌’తో ప్రపంచవ్యాప్తంగా అనుమతి పొందిన టీవీ చానళ్లలో ప్రసారం అవుతుంది.  ∙ఎలెన్‌ షో కాలిఫోర్నియాలోని వార్నర్‌ బ్రదర్స్‌ స్టూడియోలో రికార్డు అవుతుంది ∙షో రికార్డింగ్‌ సమయంలో 14 ఏళ్లు నిండిన వాళ్లు ఎవరైనా ఫ్రీగా వెళ్లి చూడొచ్చు. అయితే లాటరీలో ఫ్రీ టికెట్‌ గెలుచుకున్న వాళ్లకే ఆ అవకాశం లభిస్తుంది. ∙ వారానికి నాలుగుసార్లు సాయంత్రం నాలుగు గంటలకు ఎన్‌.బి.సి. చానెల్‌ 4లో ఈ షో ప్రసారం అవుతుంది. యూట్యూబ్‌ చందాదారులు కూడా నెట్‌లో చూడొచ్చు.

షో... కాన్సెప్టు కమామిషు
మెయిన్‌గా కామెడీ, మ్యూజిక్కు, డాన్స్, ఎలెన్‌ మాటల మాయాజాలం ఈ షో కాన్సెప్టు. ప్రతి ఎపిసోడ్‌కీ ఒక సెలబ్రిటీ అతిథిగా వస్తారు. ఇదొక చాట్‌ షో. ఎలెన్‌ అప్‌ టు డేట్‌ గా ఉండి లోకంలోని అన్ని విషయాలపై సెటైర్స్‌ వేస్తుంటారు. షో చివర్లో ఆడియన్స్‌కి కూడా ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు. కొన్నిసార్లు ఈ షో లో వచ్చే మానవీయ కథనాలు కంటతడి కూడా పెట్టిస్తుంటాయి. అప్పుడప్పుడు చీఫ్‌ గెస్టులుగా నాన్‌–సెలబ్రిటీలు, ఐ.క్యూ. ఎక్కువగా ఉన్న పిల్లలు, చిన్నాచితక వ్యాపారులు కూడా షోలో కనిపిస్తుంటారు! ఇటీవల ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్, అంతక్రితం 6 ఏళ్ల కేరళ చెఫ్‌ నిహాల్‌ రాజ్, 8 ఏళ్ల డాన్సర్‌ అక్షత్‌ ఎలెన్‌ షో గెస్టులుగా వెళ్లి ఎలెన్‌నే థ్రిల్‌ చేశారు!

శాకాహారి.. మానవతామూర్తి
ఎలెన్‌ జంతు ప్రేమికురాలు. శాకాహారి. ప్రపంచంలోని శాకాహారులందరి కోసం ‘గోయింగ్‌ వీగన్‌ విత్‌ ఎలెన్‌’ అనే వెబ్‌సైట్‌ నడుపుతున్నారు. ఎలెన్‌ భార్య రోజీ కూడా శాకాహారే. ఇద్దరూ కలిసి లాస్‌ ఏంజెలెస్‌లో స్పానిష్‌ శాకాహార భోజనశాలను నడపాలని అనుకున్నారు కానీ, ఎంచేతనో ఆ ఆలోచన ముందుకు సాగలేదు. అమెరికాలో జరిగే ప్రతి మానవతా ఉద్యమానికీ ఎలెన్‌ చేయూతను ఇస్తుంటారు. హిల్లరీ విదేశాంగ కార్యదర్శిగా ఉన్నప్పుడు 2011లో ఎలెన్‌ను ‘గ్లోబల్‌ ఎయిడ్స్‌ అవేర్‌నెస్‌’ ప్రచారోద్యమానికి ప్రత్యేక దూతగా నియమించారు. తనకు తానుగా కూడా ఎలెన్‌.. పేదలకు, అనారోగ్యంతో ఉన్నవారికి పేరున్న సంస్థల తరఫున భారీగా ఆర్థిక సహాయ, సహకారాలను అందిస్తుంటారు.

ఏ ఇంటికొమ్మ ఈ మాటలమ్మ?
అమ్మ బెట్టీ. స్పీచ్‌ థెరపిస్ట్‌. అందుకే మాటలమ్మ అయినట్లుంది ఎలెన్‌. నాన్న ఇలియట్‌. ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌. అన్నయ్య వాన్స్‌. మ్యుజీషియన్‌. ఇదీ ఫ్యామిలీ. ఎలెన్‌.. మేటరీ అనే ఊళ్లో పుట్టింది. లూసియానాలో ఉందా ప్లేస్‌. 13 ఏళ్ల వయసు వరకు ఎలెన్‌ క్రిస్టియన్‌ సైంటిస్ట్‌గా పెరిగింది. అంటే.. మతశోధక విద్యార్థి! సరిగ్గా అప్పుడే ఎలెన్‌ అమ్మానాన్న విడిపోయారు. నాన్నను వదిలేసి, అమ్మతో టెక్సాస్‌ వెళ్లిపోయింది ఎలెన్‌. వాన్స్‌ తండ్రితో ఉండిపోయాడు. ఏళ్లు గడిచాయి. 2011లో  ‘న్యూ ఇంగ్లండ్‌ హిస్టారిక్‌ జీనియలాజికల్‌ సొసైటీ’ నుంచి ఎలెన్‌కు ఒక ఉత్తరం వచ్చింది. ‘నువ్వు సామాన్యురాలివి కాదు తల్లీ.. స్వయానా బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ విలియమ్‌గారి సతీమణి కేట్‌ మిడిల్టన్‌ 15వ కజిన్‌వి’అని! ఆ ఉత్తరాన్ని ఒక టీవీ ఎపిసోడ్‌లో ప్రేక్షకులకు చూపించారు ఎలెన్‌. వీళ్ల వంశానికి మూల పురుషుడు పదిహేనవ శతాబ్దం నాటి థామ్‌ ఫెయిర్‌ఫాక్స్‌ అని కూడా ఆ ఉత్తరం నిర్ధారించింది.

నవ్వించేది... ఏడిపించేది
ఎలెన్‌ పీజీలో కమ్యూనికేషన్స్‌ స్టూడెంట్‌. అప్పటికే ఆమెకు ఫ్రెంచ్, ఇంగ్లిష్, జర్మ¯Œ , ఐరిష్‌ భాషలు వచ్చు. కాలేజీలో ఫ్రెండ్స్‌ తన చుట్టూ చేరేవారు. ఎలెన్‌ సెటైర్‌లకు పగలబడి నవ్వేవారు. అయితే ఆ నవ్వు వారికి ఎక్కువకాలం దక్కలేదు. మధ్యలోనే కోర్సు మానేసి, కొలువు వెదుక్కుంటూ వెళ్లిపోయింది ఎలెన్‌. ఓ ‘లా’ కంపెనీలో క్లర్కుగా ఉద్యోగం. తర్వాత జె.సి.పెన్నీ అనే డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో పని చేసింది. ఆ తర్వాత ‘టి.జి.ఐ.ఫ్రైడేస్‌’లో, వేరే రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా కొన్నాళ్లు ఉంది. అక్కడి నుంచి హౌస్‌ పెయింటర్, హౌస్‌ హోస్టెస్, బార్‌టెండర్‌.. ఇలా చాలా ఉద్యోగాలు చేసింది. ఎక్కడ పనిచేసినా ఉన్నన్నాళ్లూ నవ్వించేది. వెళ్లిపోతున్నప్పుడు ఏడిపించేది.

ప్రేమ... పెళ్లి... ఇల్లు
ఎలెన్‌ తను లెస్బియన్‌ని అని ప్రకటించాక తను ప్రేమ భావనలను దాచుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. అదే ఏడాది ఆమె యాన్‌ హ్యాష్‌ని ప్రేమించింది. యాన్‌ అమెరికన్‌ నటి. ఆ తర్వాత ఎలెన్‌.. అలెగ్జాండ్రా హెడిసన్‌తో సన్నిహితంగా ఉంది. అలెగ్జాండ్రా కూడా నటే. ఇద్దరూ కలిసి ‘ది అడ్వొకేట్‌’ అనే ఎల్‌జిబిటి (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) మ్యాగజీన్‌ కవర్‌ మీద కనిపించారు. 2004లో విడిపోయారు. అదే యేడాది ఎలెన్‌కు పోర్షియా డి రోజీ తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ 2008లో పెళ్లిగా మారింది! అవును. ఈమె ఆమెను పెళ్లి చేసుకుంది. రోజీ ఆస్ట్రేలియా అమ్మాయి.

పాతికేళ్లకే ఫన్నీయస్ట్‌!
ఎక్కడా నిలకడగా ఉండడం లేదు ఎలెన్‌. అన్నీ సీరియస్‌ ఉద్యోగాలే. తనా.. ఫన్‌ లేందే ఉండలేదు. అప్పటికే ఉడీ అలెన్, స్టీవ్‌ మార్టిన్‌ ఆమె హీరోలు. ఇద్దరూ కమెడియన్‌లు. వాళ్ల మాయలో పడిపోయింది. వారి ప్రభావంతో న్యూ ఆర్లియన్స్‌లో క్లాయ్‌డ్‌ అనే క్లబ్బు ఉంటే అందులో ‘ఎంసీ’గా చేరింది. అది కామెడీ క్లబ్బు. ఎంసీ అంటే మాస్టర్‌ ఆఫ్‌ సెర్మనీస్‌. క్లబ్బులో ప్రోగ్రామ్స్‌ జరుగుతుంటే వాటికి సరదాగా కామెంటరీ ఇస్తూ నవ్వించేది. ‘ఇంటికెళ్లాక కూడా ఎలెన్‌ మాటలు గుర్తు చేసుకుని నవ్వుకున్నాం’ అని సభ్యులు, వాళ్ల అతిథులు కాంప్లిమెంట్స్‌ ఇచ్చేవాళ్లు. ఆ కిక్కుతో కామెడీ టూర్‌లు మొదలుపెట్టింది ఎలెన్‌. యూఎస్‌ అంతా పేరొచ్చేసింది. ఉడీ అలెన్, స్టీవ్‌ మార్టిన్‌లు కూడా ఆమె వైపు తలతిప్పి చూశారు. అప్పుడే ‘షో టైమ్‌’ టీవీ నెట్‌వర్క్‌ ఆమెను ‘ఫన్నీయస్ట్‌ పర్సన్‌ ఇన్‌ అమెరికా’ అని ప్రశంసించింది!

ఒబామాతో...

ప్రియాంకా చోప్రాతో...

దీపికా పదుకోన్‌తో...


 

>
మరిన్ని వార్తలు