అడవి పూచిన వెన్నెల

14 May, 2017 23:25 IST|Sakshi
అడవి పూచిన వెన్నెల

అడవిలో పూచిన పువ్వుకు అడవిని కాచిన వెన్నెలకు అడవే సాక్ష్యం. అది వృథా అయిందని జనసంద్రాలు అనుకున్నా దాని కాంతి పరిమళాలు తగ్గవు. దాని ఔన్నత్యానికి గ్రహణం పట్టదు. ఒదిగిన ఈ పువ్వు పరిమళం... దేశమంతా విస్తరిస్తుందా?

భువనేశ్వర్‌ నుంచి రాంచీకి విమాన ప్రయాణం రెండున్నర గంటలు. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే నెలలో ఒడిశా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ద్రౌపది ముర్ము... తన ప్రమేయం లేకుండా ముందే నిర్ణయమైపోయిన ఈ రెండున్నర గంటల వ్యవధి ప్రయాణానికి సిద్ధం కావలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె మే 18న జార్ఖండ్‌ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు! రాంచీ నుంచి ఢిల్లీకి నాన్‌–స్టాప్‌ విమాన ప్రయాణం 1 గం. 50 నిమిషాలు. ఇది కూడా ద్రౌపది ముర్ము తన జీవనయానంలో ఏమాత్రం ఊహించని మరొక ప్రయాణ మార్గం. అయితే వచ్చే రెండు నెలల్లో ముర్ము ఈ మార్గంలో కూడా తరచూ రాకపోకలు సాగించే సూచనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఒకవేళ ముర్ము పేరు ఖరారు అయినట్లయితే కనుక ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు తన నివాసాన్ని మార్చడం కోసం ముర్ము మళ్లీ తన సరంజామాతో రాంచీ నుంచి బయల్దేరవలసి ఉంటుంది... కొత్త రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి! రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం ఈ ఏడాది జూలై 25తో ముగుస్తోంది. ఆయన తర్వాత ఆ స్థానంలోకి వచ్చే అవకాశం ఉన్న ఎన్డీయే అభ్యర్థుల జాబితాలో అకస్మాత్తుగా ఇప్పుడు ద్రౌపది ముర్ము పేరు పైకి వచ్చింది! ముర్ము కనుక భారత రాష్ట్రపతి అయినట్లయితే... వ్యక్తిగతంగా ముర్ముకు, భారత పౌరులుగా ఆదివాసీలకు ఎంతో ప్రాధాన్యం, ప్రాముఖ్యం లభించినట్లవుతుంది.


చదువు... కొలువు
ముర్ము భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో బి.ఎ. చదివారు. రాయ్‌రంగపూర్‌లోని శ్రీ అరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో గౌరవ సహాయక ప్రొఫెసర్‌గా ఉన్నారు. కొన్నేళ్లు ఇరిగేషన్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేశారు.


లో–ప్రొఫైల్‌
సుష్మా స్వరాజ్, స్మృతీ ఇరానీ, నజ్మాహెప్తుల్లా, మనేకా గాంధీ, ఉమాభారతి, నిర్మలా సీతారామన్‌... ఇలా బీజేపీలోని మహిళలంతా ప్రముఖంగా కనిపించేవారే! అయితే అదే పార్టీ నుంచి పైకి వచ్చిన  ముర్ము మాత్రం ఏనాడూ మీడియా ఫోకస్‌లో లేరు. ఒడిశా మంత్రిగా వాణిజ్యం, రవాణా, మత్స్య, పశువనరుల వంటి అనేక కీలక శాఖలను నిర్వహిస్తున్నప్పుడు కూడా ముర్ము నిశ్శబ్దంగా తన పని తను చేసుకుపోయారు. ఎప్పుడూ ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. మృదుభాషిణి అయిన ముర్ము మహిళలు, గిరిజనుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎంతో చురుగ్గా పనిచేశారు. చేతల్లో చూపించగలిగినప్పుడు మాటలతో పనే లేదని నిరూపించారు.

విషాదం నిర్వేదం
ద్రౌపది ముర్ము జీవితంలో కనిపించని విషాదం ఉంది. భర్త, ఇద్దరు కొడుకులు మరణించాక ఆమెకు జీవితం శూన్యంగా అనిపించింది. డిప్రెషన్‌లో పడిపోయారు. ఉద్యోగం మానేశారు. కూతుర్ని పెంచుకుంటూ ఇంటికే పరిమితం అయిపోదామనుకున్నారు. ఆధ్యాత్మికత వైపు మళ్లారు. మెల్లిమెల్లిగా ధైర్యం తెచ్చుకున్నారు. తను రాజకీయాల్లోకి రావడం కూడా దైవ సంకల్పమేనని ఆమె నమ్ముతారు. గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశాక ఆమె మొదట చేసిన పని పూరి వెళ్లి జగన్నాథుడిని దర్శించుకోవడం.


తొలి మహిళ
ముర్ము 59 ఏళ్ల వయసులో జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌ అయ్యారు. ఒడిశా మహిళ ఒకరు గవర్నర్‌ అవడం కూడా ఇదే ప్రథమం. ముర్ము రాష్ట్రపతి అయితే కనుక భారతదేశపు తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా కూడా గుర్తింపు పొందుతారు.


తనకై తనే వచ్చారు
ముర్ము ప్రజాసేవ కోసం స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో తన ముప్పై తొమ్మిదేళ్ల వయసులో ‘నోటిఫైడ్‌ ఏరియా కౌన్సిల్‌’ సభ్యురాలిగా ఎన్నికైన అనంతరం బి.జె.పి. ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. ముర్ము 2000, 2004 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి. అభ్యర్థిగా రాయ్‌రంగపూర్‌ నుంచి గెలిచారు. బి.జె.పి. నేతృత్వంలోని నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంలో 2000 నుంచి 2004 వరకు మంత్రిగా వివిధ శాఖలను చేపట్టారు. ఒడిశా లెజిస్లేటివ్‌ అసెంబ్లీ 2007లో ముర్ముకి పండిట్‌ నీలకంఠ అవార్డును ప్రదానం చేసింది. ప్రజాప్రతినిధిగా సమాజానికి విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. ముర్ము 2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.

బాలికలకు ప్రాధాన్యం
పిల్లలు స్మార్ట్‌గా ఉంటే దేశం స్మార్ట్‌ అవుతుందని ద్రౌపది తరచూ చెబుతుంటారు. ‘‘పిల్లల్ని బాగా చదివించండి. చిన్నప్పుడే వారిని సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లించండి. జాతి నిర్మాణంలో, అభివృద్ధిలో బాలల్ని పాత్రధారులను చేసినప్పుడు దేశం ప్రగతిని సాధిస్తుంది’’ అని ముర్ము ఎప్పుడూ చెబుతుంటారు. గత ఏడాది మార్చిలో దేవ్‌ఘర్‌లోని జవహర్‌ విద్యామందిర్‌లో ఆమె ఎంతో స్ఫూర్తివంతమైన ప్రసంగం ఇచ్చారు. ‘‘సంపాదించింది పిల్లలకు ఇవ్వడం కాదు. స్వయం శక్తితో దేన్నయినా సాధించుకునే ఆత్మవిశ్వాసాన్ని వారికి ఇవ్వాలి. తోటి వారికి సహాయం చెయ్యడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం.. అన్నవి చాలా చిన్న విషయాలుగా కనిపించవచ్చు. కానీ అవి పిల్లల ఆలోచనల్లో చాలా పెద్ద మార్పును తెస్తాయి. సమాజ నిర్మాణానికి తోడ్పడతాయి. ముఖ్యంగా బాలికలను అన్నింటా సమానంగా చూడాలి. వారి శక్తియుక్తులకు, సామర్థ్యాలకు పెద్దలు గుర్తింపునివ్వాలి’’ అని ద్రౌపది చెప్పిన మాటలు పేరెంట్స్‌ మనసులకు హత్తుకుపోయాయి.

ప్రమాణ స్వీకారం రోజు
ద్రౌపది ముర్ము 2015 మే 18న జార్ఖండ్‌కు తొమ్మిదవ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ వీరేందర్‌ సింగ్‌ రాజ్‌భవన్‌లో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్, మంత్రివర్గ సహచరులు, అగ్ర రాజకీయ నేతలు, హైకోర్టు జడ్జీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ బోర్డులు, కార్పొరేషన్‌ల అధిపతులు... ఇంతమంది హాజరైన ఆ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఎంతో నిరాడంబరంగా తెలుపు రంగు చీరను ధరించి రాజ్‌భవన్‌కు వచ్చారు. ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆమెకు బదులు ఆమె కుమార్తె 28 ఏళ్ల ఇతిశ్రీ ముర్ము..  ఆహ్వానితులు, మీడియా ప్రతినిధులతో ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు.
‘‘చాలాకాలం క్రితమే నేను నా సోదరులిద్దరిని, నా తండ్రిని కోల్పోయాను. మా అమ్మే నన్ను కష్టపడి పెంచింది. అయితే ఆ కష్టంలో అమ్మ ఏనాడూ తన జీవితాన్ని ఒక భారంగా భావించలేదు. తన ఒత్తిడిని నాపై పడనివ్వలేదు. నన్ను ఎం.బి.ఎ. వరకు చదివించింది. స్ట్రాంగ్‌గా పెంచింది. తల్లి బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించింది. గవర్నర్‌గా కూడా అమ్మ ఈ రాష్ట్రం ఆలనా పాలనా చూస్తుందని గట్టిగా చెప్పగలను’’ అన్నారు ఇతిశ్రీ.

ఇతిశ్రీ తల్లితో పాటు రాంచీలో ఉండడం లేదు. ఒడిశాలోని రాయ్‌రంగపూర్‌లో బ్యాంకు అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త గణేశ్‌ చంద్ర హెంబ్రోమ్‌. రగ్బీ క్రీడాకారుడు. ఇదిలా ఉంటే.. ఏవో రాజకీయ కారణాల వల్ల ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ సుఖ్‌దేవ్‌ భగత్‌కి ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ ముర్ము మీద గౌరవంతో ఆయన తన శుభాభినందనలను పంపారు. ‘‘నన్ను ఆహ్వానించనప్పటికీ నా ఆశీస్సులు ఆమెకు ఉంటాయి’’అనే సందేశం పంపించారు సుఖ్‌దేవ్‌.


‘వ్యవస్థపై నమ్మకం ఉంచండి’
ద్రౌపది ముర్ము ఎవర్నీ నిందించరు. ఎవర్నీ ఆపేక్షించరు. ప్రభుత్వ యంత్రాంగం మీద, పాలనా విభాగాల మీద ఆమెకు అపరిమితమైన గౌరవం. పౌరులం మనం బాధ్యతగా ఉంటే వ్యవస్థలోని ప్రయోజనాలన్నింటినీ చక్కగా పొందవచ్చునని ముర్ము విశ్వసిస్తారు. ఈ ఏడాది జనవరి 25న ‘ఓటర్స్‌ డే’ సందర్భంగా ద్రౌపది జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో ప్రసంగించారు. యువ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మీ కళ్లెదుట ఏవో కనిపిస్తుంటాయి. మీ చెవులకు ఏవో వినిపిస్తుంటాయి. అంత మాత్రాన యావత్‌ ప్రజాస్వామ్య వ్యవస్థపైనే నమ్మకం కోల్పోవడం మన పరిణతికి చిహ్నం కాదు. ఓటు వేస్తేనేం, వెయ్యకుంటేనేం అనే నిస్పృహలోకి వెళ్లకండి. పౌర ధర్మంగా మీ ఓటు మీరు వెయ్యండి. మీ ఆత్మ ఎవరికి వెయ్యమని చెబితే వారికే వెయ్యండి. అంతే తప్ప ఓటు వెయ్యడం మానకండి’’ అని చెప్పారు. ‘కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా, జాతి హితం కోరి మాత్రమే మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అని సూచించారు.

ఎవరు చెప్పారో తెలీదు
గవర్నర్‌ కావడానికి మూడు నెలల ముందు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఒడిశా వచ్చి ముర్ము బయోడేటాను తీసుకెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలోని హోమ్‌ మంత్రిత్వశాఖ నుంచి వ్యక్తిగతంగా ఒకసారి వచ్చి కలవమని ముర్ముకి పిలుపు వచ్చింది. తనకు సంబంధించి పెద్ద నిర్ణయం ఏదో జరగబోతోందని అప్పుడు అనిపించడం తప్ప, గవర్నర్‌ పదవికి తన పేరును సూచించిందెవరో ముర్ముకు తెలియదు. ‘‘ఏదైనా దైవ నిర్ణయానుసారం మాత్రమే జరుగుతుంది’’ అని ముర్ము బలంగా నమ్ముతారు. ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి తన పేరు వినిపించడం పైన కూడా ముర్ము ఏమీ చెప్పలేకపోతున్నారు.


జననం: 1958 జూన్‌ 20
జన్మస్థలం: ఉపర్‌బేడా గ్రామం,  మయూర్‌భంజ్, ఒడిశా
తండ్రి:బిరంచి నారాయణ్‌ తుడు
భర్త: శ్యామ్‌ చరణ్‌ ముర్ము
అభిరుచులు:పుస్తక పఠనం, అల్లికలు
కాలక్షేపం:ఇంటిని అలంకరించుకోవడం
ఆసక్తి: డ్రైవింగ్‌
వ్యాపకం:స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు
కృషి: ఆదివాసీల సంక్షేమం

మరిన్ని వార్తలు