ఎవరే ఇతగాడు?

16 May, 2017 23:31 IST|Sakshi
ఎవరే ఇతగాడు?

చిన్న కిమ్‌

మూర్ఖుడా? మనోహరుడా? మానస చోరుడా? వీరుడా? శూరుడా? నియంత్రుడా? (యంత్రం లాంటి నియంత), యుగాంతుడా? మూడో ప్రపంచ యుద్ధానికి ముహూర్తుడా? ఎవరే ఇతగాడు? ఆగండాగండాగండాగండి... ఇందులో కొన్ని మాటలు తెలుగు లేవు. కొరియాలో ఉన్నాయేమో తెలీదు. ఉన్నా, ఇతగాడిని నియంత్రుడు, యుగాంతుడు అనే పిలిచే ధైర్యం కొరియన్‌లకు లేదు. ఆ ‘ఇతగాడు’ ఎవరంటే... కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అనే పెద్దమనిషి. ఉత్తర కొరియాకు సుప్రీమ్‌ లీడర్‌. అమెరికాకు ట్రంప్‌ ఎలాగో ఉత్తర కొరియాకు కిమ్‌ అలాగ! పొజిషన్‌కే కిమ్‌ పెద్దమనిషి. మనిషి మాత్రం ‘పాలబాలకుడు’! అంటే... పాలించే బాలకుడా? పాలుతాగే బాలుడా? మీరెలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కిమ్‌ ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాలేదు. ప్రపంచం దాకా ఎందుకు? కొరియన్‌లకే అర్థం కాలేదు. కొరియన్‌ల వరకు ఎందుకు? వాళ్ల డిక్టేటర్‌ డాడీ స్వర్గీయ కిమ్‌ జోంగ్‌ ఇల్‌ కే అర్థం కాలేదు.

ఇప్పుడేమయిందంటే... బాలక్‌... కిమ్‌ ‘బాంబు విసురుతా’ అని అమెరికాను బెదిరిస్తున్నాడు! అమెరికాను బెదిరిస్తుంటే... ‘బాబ్బాబ్బాబ్బాబ్బాబు’ అని బక్క కంట్రీలు కిమ్‌ను బతిమాలుతున్నాయి. ‘పిల్లాజల్లను బతకనివ్వు బాబూ... అమెరికాపై బాంబు వేసి మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎందుకు తెచ్చిపెడతావు?’ అని వేడుకుంటున్నాయి. కిమ్‌ వినడు. కిమ్‌ చెప్పింది వినాల్సిందే. చూడాలి రేపు ఏమౌతుందో, ఈ లోపే కిమ్‌ ఏమౌతాడో? అంటే.. కిమ్‌కి ఏదో అవుతుంది, అవ్వాలి అని కాదు. దేవుడు మంచి మనసు ఇస్తాడేమో చూడాలి. దేవుడు కిమ్‌కే ఇవ్వనవసరం లేదు. ట్రంప్‌కి.. సర్దుకుపోయే మనసు ఇచ్చినా సరిపోతుంది. ఈలోపు మనం కొంచెం కిమ్‌ని స్టడీ చేద్దాం. ‘ఎవరే ఇతగాడు?’ అనే ప్రశ్నకు కొంచెం ఆన్సర్‌ దొరికింది కాబట్టి, ‘ఏమిటో ఇతగాడు?’ అనే యాంగిల్‌లో కిమ్‌ని చూద్దాం.

యథా నాన్న.. తథా సన్ను!
కిమ్‌ తండ్రి గురించి తెలుసుకోవాలని ఉంటే వెంటనే ఆ కోరికను చంపేసుకోండి. కిమ్‌ బాబు గురించి తెలుసుకుంటే చాలు. వెనక్కి వెళ్లి, సమాధిలో నిద్రపోతున్న కిమ్‌ నాన్నగారిని డిస్టర్బ్‌ చెయ్యడం ఎందుకు? సరే... రెడీ స్టడీ రీడ్‌. చిన్న కిమ్‌ని చిన్నప్పుడు పెద్ద కిమ్‌ రహస్యంగా స్విట్జర్లాండ్‌లో చదివించాడు. అబ్బాయికి చదువు ఎక్కట్లేదు. కొరియా కోళ్లు కంట్రీ చూరెక్కి ఈ సంగతిని కొక్కొరొకో మనకముందే దేశం దాటించేశాడు. ‘పాక్‌ ఉన్‌’ అనే మారు పేరుతో బళ్లో చేర్పించాడు. కొరియాలో చదవనివాడు స్విట్జర్లాండ్‌లో చదువుతాడా? చిన్న కిమ్‌ చదవలేదు. చదివినా మార్కులు రాలేదు. పెద్ద కిమ్‌ ఓసారి బడికి వెళ్లి, చిన్న కిమ్‌ గురించి ఆరా తీశాడు.. ‘మా వాడు ఎలా చదువుతున్నాడు?’ అని! ‘మీ వాడు బాస్కెట్‌ బాల్‌ బాగా ఆడుతున్నాడండీ.. మీ వాడు కంప్యూటర్‌ గేమ్స్‌ కూడా బాగా ఆడతాడండీ’ అని చెప్పింది హెడ్‌మిస్ట్రెస్‌. పెద్ద కిమ్‌కి అర్థమయింది. కిమ్మనకుండా వచ్చేశాడు.

తాత గారి పోలికల కోసం సర్జరీ
చిన్న కిమ్‌కి ప్రస్తుతం 33 ఏళ్లు. ఆరేళ్ల క్రితం అచ్చు తన తాతగారు కిమ్‌ ఇల్‌ సంగ్‌ పోలికలతో ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడు. చిన్న కిమ్‌ ఎంత గొప్పవాడో చూడండి! ఎవరైనా వయసు తక్కువగా కనిపించడానికి, లోపాలేవైనా ఉంటే సరిచేయించుకోడానికి పాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటారు. చిన్న కిమ్‌ మాత్రం తన ముసలి తాతగారిలా కనిపించడానికి సర్జరీ చేయించుకున్నాడు. అంత ప్రేమట ఆయనంటే!!

అమ్మాయిలకు నచ్చే ఫేస్‌! (అవునా!)
అమెరికాలో ‘ది ఆనియన్‌’ అనే పత్రిక ఉంది. 2012లో చిన్న కిమ్‌ కొరియాకు పెద్ద దిక్కయ్యాక.. ‘ది ఆనియన్‌’ అతడిని.. ‘ఆహా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు’ అన్న లెవల్‌లో కీర్తించింది. ‘సెక్సీయస్ట్‌ మ్యాన్‌ అలైవ్‌’ టైటిల్‌ కూడా ఇచ్చేసింది. కిమ్‌ని చూస్తే భూమండలం మీది అమ్మాయిల గుండెలు గుబగుబలాడతాయట! ఆ పత్రికే రాసింది.

ఎప్పుడు పుట్టాడో తెలీదు
పెద్ద కిమ్‌ పోయాక చిన్న కిమ్‌ (ఇంట్లో మూడో కిమ్‌) పెద్ద సీట్లోకి వచ్చేశాడని కదా చెప్పుకున్నాం. ఇక చూడండి.. ‘యంగెస్ట్‌ వరల్డ్‌ లీడర్‌’ అని కొరియాలో ఒకటే హోరు. విషయం ఏంటంటే.. కిమ్‌ బాబు పుట్టింది 1982లోనా, 83 లోనా, 84 లోనా అనేది క్లారిటీ లేదు. బళ్లో ఆధారాల్లేవు. ఇంట్లో ఆనవాళ్లూ లేవు.

అవి బుగ్గలా? చీజ్‌ ముక్కలా?
ఇక చిన్న కిమ్‌ తింటాడు చూడండీ.. స్విస్‌ చీజ్‌ ఎక్కడ కనిపించినా వదలడు. అందుకేనేమో.. బుగ్గులు ఆలా చీజ్‌ ముక్కలా నున్నగా ఉంటాయి! స్విట్జర్లాండ్‌లో అలవాటయిందట చీజ్‌ని కుమ్మేయడం. అది కంటిన్యూ అవుతోంది. రాజుగారు తింటున్నారు కదాని ప్రజలూ ఫాలో అయినట్లు.. చిన్న కిమ్‌కి ఇష్టమైన ఫుడ్‌ కదా కొరియాలోని సంపన్నులూ చీజ్‌ను ఓ పట్టు పడుతున్నారు. వాళ్ల సంగతి అలా ఉంచితే, తాతగారిలా బొద్దుగా, రౌండుగా కనిపించడానికి కావాలనే చిన్న కిమ్‌ అంతంత చీజ్‌ తినేస్తున్నాడని లోపలి వాళ్లు చెప్పుకుంటారు.

ఏడవ లేదని జైల్లో పెట్టించాడు
పెద్ద కిమ్‌ పోయినప్పుడు ఉత్తర కొరియా ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. అయితే చిన్న కిమ్‌కు కొంతమంది మీద డౌట్‌ వచ్చింది. ‘ఏడుస్తున్నవారిలో కొందరు నిజంగా ఏడవడం లేదు ప్రభూ’ అని వేగులు చెప్పారు. ఏడుపు నటించిన వారందరినీ ఆర్నెల్లపాటు కఠిన కారాగారంలో పెట్టించాడు చిన్న కిమ్‌. చిన్న కిమ్‌ తాతగారు చనిపోయినప్పుడు పెద్ద కిమ్‌ కూడా ఇలాంటి బలవంతపు రోదన కార్యక్రమాలను ఏర్పాటు చేయించాడు. కొన్ని చోట్ల డబ్బులిచ్చి మరీ ఏడుపు తెప్పించాడు.

అంకుల్, ఆంటీ.. సేమ్‌ టు సేమ్‌
పెద్ద కిమ్‌ చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు ఆర్మీ అధికారి ఒకరు తాగి వచ్చారు. అతణ్ణి గన్‌తో కాల్చి చంపేయమని చిన్న కిమ్‌ అక్కడిక్కడ ఆదేశించాడు! ‘అతడి అవశేషాలు కూడా నాకు కనిపించకూడదు’ అని ఆర్డర్‌ వేశాడు. సొంత అంకుల్‌ విషయంలో కూడా అంతే. జంగ్‌ సాంగ్‌ టేక్‌.. పెద్ద కిమ్‌ తర్వాత పెద్ద కిమ్‌ అంతటివాడు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జంగ్‌ ప్లాన్‌ వేస్తున్నాడని తెలిసి చిన్న కిమ్‌ అతడిని అతి కిరాతకంగా హత్య చేయించాడు. అయితే చిన్న కిమ్‌ గారి అమానుషం ఇక్కడితో అగలేదు! అంకుల్‌ భార్య ఆంటీకి పాయిజన్‌ ఇప్పించి చంపేశాడు. భర్త హత్యకు ప్రతీకారంతో రగిలిపోతున్న ఆంటీ ఏనాటికైనా తనకు థ్రెట్‌ అని భావించి అలా చేయించి ఉంటాడని ఒక పుకారు.

యూనివర్సిటీల నిండా ‘కిమ్‌’లే.
చిన్న కిమ్‌ ఫోర్‌–స్టార్‌ జనరల్‌. సైన్యంలో హయ్యస్ట్‌ ర్యాంక్‌. అయితే అతడికి ఒక్క రోజైనా సైన్యంలో పని చేసిన అనుభవం లేదు. చివరిగా చిన్న కిమ్‌ గురించి తప్పకుండా ఒక విషయం చెప్పుకోవాలి. అది అతడి హెయిర్‌ స్టెయిల్‌. ‘యాంబీషియస్‌’ ఆ కటింగ్‌ పేరు. అంటే.. ఎదగాలన్న తపన ఉన్నవాడు అని అర్థం. చిన్న కిమ్‌ ఆల్రెడీ ఎదిగేశాడు కదా! ఇంకా ఎక్కడికి ఎదగడం? ఇలాంటి క్వొశ్చన్స్‌ అడక్కండి. ఫాలో అవాలనుకుంటే అవండి.  బై ద వే.. కొరియా యూనివర్సిటీ విద్యార్థులంతా ఇదే కట్‌ కాపీ కొడుతున్నారట!
ఇవండీ.. ఇప్పటికైతే చిన్న బాబు.. అదే.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సంగతులు. రేపటికి ఏమౌతుందో తెలీదు. ఏం చేస్తాడో తెలీదు.

మరిన్ని వార్తలు