ఆకాశవాణి

20 Mar, 2017 01:16 IST|Sakshi
ఆకాశవాణి

హ్యూమర్‌ ప్లస్‌

ఇప్పుడైతే పాట చెవుల్లోకి దూరి వీధుల్లో మాయలైంది కానీ, ఒకప్పుడు పాట కుళాయి నీళ్ళలా ఎక్కడ చూసినా ప్రవహించేది. ఘంటసాల ఇంటింటి గాయకుడే. రేడియోలు గురగురమని, గడగడమని, స్టేషన్‌ మార్చినప్పుడల్లా సౌండ్‌ చేసేవి. ఒక్కోసారి ప్రెషర్‌ కుక్కర్‌లా ఆగకుండా విజిల్‌ వేసేవి. హోటళ్ళలో హార్మోనియం పెట్టె సైజ్‌లో కరెంట్‌ రేడియోలుండేవి. ఈ రేడియో చేసే సౌండ్‌కి ఒక్కోసారి కస్టమర్లు తింటున్న ఇడ్లీలు కూడా వదిలేసి పారిపోయేవాళ్ళు. భక్తిగీతాల దగ్గర నుంచి కార్మికుల కార్యక్రమం వరకూ రేడియో గొంతు వినిపిస్తూనే వుండేది. దేవుడి దయవల్ల ఆకాశవాణి కేంద్రాలకి మధ్యలో విరామం కూడా వుండేది.

కరెంట్‌ రేడియోకి సిస్టర్‌ ట్రాన్సిస్టర్‌. దాని పొట్టనిండా బ్యాటరీలు కూరిస్తే తప్ప అది మాట్లాడదు. బుష్, మర్ఫీ అని రెండు కంపెనీలుండేవి. మా ఇంట్లో ఉన్న బుష్‌ రేడియో నెత్తిమీద నాలుగైదు మొత్తితే తప్ప మూలిగేది కాదు. కడప స్టేషన్‌ రావాలంటే తూర్పుకి, హైదరాబాద్‌ రావాలంటే దక్షిణానికి తిప్పాలి. సిలోన్‌ మాత్రం తొందరగానే తగులుకునేది, కాకపోతే ‘గీక్‌గుటగుట’ అని గ్యాస్‌ట్రబుల్‌ వచ్చినోడి లాగా శబ్దతరంగాలు చేసేది. శ్రీలంక స్టేషన్‌లో మీనాక్షి పొన్నుదురై అనే అనౌన్సర్‌ ఒక సెలబ్రిటీ. ఆమె గొంతు వినడం ఒక ఫ్యాషన్‌. గంటసేపు ప్రోగ్రాంలో భక్తి కార్యక్రమాలు, ప్రకటనలు పోగా గట్టిగా ఐదు పాటలొచ్చేవి. వాటికోసం చెవుల్ని కోసి, రేడియోకి అతికించి వినేవాళ్ళం. అందరిళ్ళలో ఒకేసారి రేడియో మోగడం వల్ల వీధంతా మైక్‌ పెట్టినట్టుండేది.

రేడియోకి లైసెన్స్‌లు కూడా వుండేవి. ఒక పాస్‌ పుస్తకంలో రకరకాల స్టాంపులుండేవి. పోస్టాఫీస్‌లో డబ్బు కడితే వాటిమీద ముద్రలేసి ఇచ్చేవాళ్ళు. ఆ తరువాత గవర్నమెంట్‌ లైసెన్స్‌ని రద్దు చేసింది. జనం రేడియోని రద్దు చేశారు. మావూళ్ళో చెన్నకేశవులు అని ఒకాయనుండేవాడు. ఆయనకి రేడియో అంటే ఇష్టం. కొనుక్కునే స్థోమతుండేది కాదు. రేడియో వినడానికి ఇళ్ళముందు తచ్చాడేవాడు. ప్రాణాన్ని చెవుల్లోకి తెచ్చుకుని వినేవాడు. ఆయన కొడుకు మిలట్రీలో చేరిన తరువాత తండ్రికి ఒక రేడియో, సైకిల్‌ కొనిపెట్టాడు. చెన్నకేశవులు పూలరంగడు తిరిగినట్టు చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఒక రౌండేశాడు. సైకిల్‌కి ముందు ఒక బుట్ట, దాంట్లో రేడియో పెట్టుకుని, అట్లాస్‌ సైకిల్‌ తొక్కుతుంటే ఆ కతే వేరు. కానీ ఒకరోజు తన చేతుల్తోనే రేడియో పగలగొట్టాడు. మిలట్రీలో కొడుకు చనిపోయిన దుఃఖం అలాంటిది.

క్రికెట్‌ పిచ్చి ఎక్కువయ్యేసరికి పాకెట్‌ రేడియోలు పుట్టాయి. అర్థమైనా కాకపోయినా కామెంట్రీ వింటూ, గట్టిగా అరుపులు, కేకలు వినిపిస్తే వికెట్‌ పడిందని డిసైడ్‌ అయ్యేవాళ్ళు. బెల్‌బాటం ప్యాంట్‌ వేసుకోకపోయినా, క్రికెట్‌ కామెంట్రీ వినకపోయినా అనాగరికుడని భావించే కాలం.
బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీ దొంగలా ఇంట్లోకి ప్రవేశించింది. అప్పటివరకూ దొరలా జీవించిన రేడియోకి కష్టకాలం మొదలైంది. చెవులకి పనితగ్గి, కళ్ళు యాక్టివ్‌ అయ్యాయి. వస్తుందో రాదో తెలియని తెలుగు పాటకోసం ఇల్లంతా ‘చిత్రలహరి’ ముందు కూర్చునేవాళ్ళు. ఈలోగా జపాన్‌ వాళ్ళు పగబట్టి డొక్కు టేప్‌రికార్డర్‌లను తయారుచేసి జనం మీదికి వదిలారు. ఖాళీ క్యాసెట్‌ ఇస్తే పాటలు రికార్డు చేసేవాళ్ళు వీధుల్లో పుట్టుకొచ్చారు. గ్రామ్‌ఫోన్‌ రికార్డులు బ్రేక్‌ కావడం కూడా మొదలైంది.

పాట సామూహికంగా మాయమై వ్యక్తిగతంగా మారింది. మార్నింగ్‌ వాక్‌లో అందరి చెవుల్లోనూ  వైర్లు వేలాడుతూ కనిపిస్తాయి కానీ, ఎవరేం పాట వింటున్నారో తెలియదు. అసలు వినాలనిపించే పాటలు వస్తున్నాయో లేదో కూడా తెలియదు. పాటల వల్ల హిట్టయ్యే సినిమాలూ లేవు, పాటలకోసం సినిమాలు చూసేవాళ్ళూ లేరు. తమాషా ఏమంటే ఫేస్‌బుక్‌లు, వాట్సప్‌లు గురించి కూడా పాతికేళ్ళ తరువాత నాలాంటి వాడొకడు కాలమ్‌ రాస్తాడు. రాయడం అనే మాట తప్పేమో, అప్పటికి పేపర్లు ఉండకపోవచ్చు.
– జి.ఆర్‌. మహర్షి

మరిన్ని వార్తలు