హిస్టరీ. హిజ్ స్టోరీ. హర్ స్టోరీ!

9 Oct, 2015 23:21 IST|Sakshi
హిస్టరీ. హిజ్ స్టోరీ. హర్ స్టోరీ!

కొత్త సినిమాలు గురూ!
 
హిస్టరీ అంటే చరిత్ర హిస్ స్టోరీ అంటే గుణశేఖర్ చెప్పిన చరిత్ర హర్ స్టోరీ అంటే రుద్రమ్మ చరిత్ర.పాళ్లు అటూఇటూ అయినా... అన్నీ కలగలిసి. అందరినీ అలరించే  సినిమా స్టోరీ. రుద్రమదేవిలో ఒక సన్నివేశం ఉంటుంది. అప్పటి వరకూ రాజ్య ప్రజలు యువరాజు రుద్రదేవుణ్ణి చూడలేదు. చక్రవర్తి గణపతిదేవుడికి పుత్రోదయం అయ్యిందనీ పేరు రుద్రదేవుడనీ అతడు యుద్ధవిద్యలలో రణతంత్రాలలో రాటు దేలి రాజ్యపాలనకు సిద్ధంగా ఉన్నాడని వినడమే తప్ప ఎవరూ కళ్లతో చూసిన పాపాన పోలేదు. సందర్భం వస్తుంది. రాజవేడుకలలో భాగంగా మత్త గజాన్ని లోబరుచుకునే వీరుడి కోసం ప్రకటన వెలువడుతుంది. ఎవరూ ముందు రారు. వచ్చినవాడు ఓడి వెనుదిరుగుతాడు. అప్పుడు ప్రజలు అడుగుతారు- రుద్రదేవుణ్ణి ప్రవేశపెట్టండి... మత్తగజం పొగరణచి అతడి శౌర్యాన్ని ప్రదర్శించమనండి... కోరినట్టుగానే రుద్ర దేవుడు ప్రత్యక్షమవుతాడు. అందమైన తలపాగా, గిరిజాల జుట్టు, దారుఢ్యమెన శరీరాన్ని బిగించి కట్టిన వస్త్రాలు... మీసాలొక్కటే లేవు. రుద్రదేవుడు క్షణాల్లో మత్తగజాన్ని ఎదుర్కొంటాడు. కుంభస్థలంపై పిడికిళ్లతో మోది మోకాళ్ల మీద సాగిల పడేలా చేస్తాడు. ప్రజలందరూ హర్షధ్వానాలు చేస్తారు. వయసులో ఉన్న ఆడపిల్లలు, రాచకన్నెలు అతడి ఒక్క చూపు కోసం, కరస్పర్శ కోసం తహతహలాడిపోతుంటారు. అది చూసి చక్రవర్తి గణపతిదేవుడు ఉప్పొంగిపోతూ ‘రుద్రదేవుడికి పెళ్లి వయసు వచ్చింది.

ఈ ఆడపిల్లల వరుస చూస్తుంటే ఎందరు యువరాణులు వలచనున్నారో... వారి కోసం ఎన్ని అంతఃపురాలు కట్టించాలో’ అంటాడు. అది విని మంత్రి శివదేవయ్య ప్రశ్నార్థకంగా చక్రవర్తి వైపు చూస్తాడు. చక్రవర్తి ఒక్క క్షణం పాటు సర్దుకొని వాస్తవంలోకి వస్తాడు. ఎందుకంటే రుద్రదేవుడు పురుషుడు కాదు... స్త్రీ కదా. రుద్రమదేవి కదా. థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక క్షణం రుద్రదేవుడు స్త్రీ అన్న సంగతి మర్చిపోతారు. ఒక వీరుడు పోరాడుతున్నట్టే. ఒక సబల, ధీరురాలు చేయదగ్గ పోరాటం అది. రుద్రమదేవిలో ఇలాంటి మలుపులు... కాకతీయ రాజ్యానికే పరిమితమైన విలక్షణ చారిత్రక వాస్తవాలు ఉన్నాయి. కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టడం ఎప్పుడూ సులువు కాదు. గణపతి దేవుడు తన పాలనా కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతడి వారసురాలిగా ప్రకటితమైనప్పటికీ రాచకిరీట ధారణ కోసం చాలా కాలం వేచి చూడవలసిన అగత్యం పట్టిన రుద్రమదేవి కూడా తన హయాంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే ఉన్న పరిస్థితుల నుంచి బయట పడటానికి పుట్టింది ఆడశిశువు అయితే మగబిడ్డగా ప్రకటన చేయడం మగబిడ్డగానే పెంచడం చివరకు ఇంకో ఆడపిల్లకు
ఇచ్చి పెళ్లి చేసేవరకూ వెళ్లడం ఈ చరిత్రలో ఉన్న విలక్షణత. దర్శకుడు గుణశేఖర్ ఈ ఒక్క అంశం దగ్గరే కథ మొత్తం అల్లుకున్నాడు. ఈ రహస్యాన్ని కాపాడుకోవడం కథ. ఈ రహస్యాన్ని కాపాడుకుంటూ అసంతృప్తితో ఉన్న రక్త సంబంధీకులను, అధికారం కోసం చూస్తున్న సామంతులని, బయటి శత్రువులని ఎదుర్కొంటూ వచ్చి ప్రథమ శత్రువైన దేవగిరి ప్రభువు మహదేవ నాయకుణ్ణి ఓడించడంతో సినిమా ముగుస్తుంది.

మలుపుతిప్పే సన్నివేశం...
రుద్రదేవుడికి తాను ఆడపిల్లననే సంగతే తెలియదు. తెలియకుండా పెంచుతారు. కాని ఒకసారి స్నేహితులతో దొంగ చాటుగా వ్యాహ్యాళికి వెళతాడు. అక్కడ ఒక స్త్రీ శిల్పం ఉంటుంది. సాటి స్నేహితుడు ఆ స్త్రీ శిల్పంలోని అందచందాలను వర్ణిస్తాడు. వక్షం, నాభి, నడుము, ఊరువులు.... ఒక్కొక్కటీ వర్ణిస్తుంటే రుద్రదేవుడికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇలా ఉంటే స్త్రీనా? ఇవన్నీ తనలో ఉన్నాయే.... దడదడలాడే గుండెలతో అంతఃపురానికి పరిగెడుతుంది. అద్దం ముందు నిలబడి ఒక్క పెట్టున పై వస్త్రాన్ని తొలగించి చూసుకుంటుంది. స్త్రీ. తనే స్త్రీ. ఎదుగుతున్న ఆడపిల్ల. ఆందోళనతో నిలదీస్తూ తల్లిని కావలించుకుంటుంది. కాని ఏ ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారో తెలుసుకుని తిరిగి ప్రజల కోసం మగవాడి అవతారంలోకి మారిపోతుంది. ఆ సందర్భంలో అంతవరకూ అబ్బాయిగా ఉన్న రుద్రదేవుడు చక్కటి ఆడపిల్ల వేషధారణలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. అలాగే ‘కౌముది ఉత్సవం’ పేరిట స్త్రీలు జరుపుకునే సరసవేడుకలో రుద్రదేవుడు తన సహజమైన స్త్రీ అంశతో ఉన్మత్తతతో రాచరిక ఆహార్యంలో కనిపించే సన్నివేశం కూడా దర్శకుడి రసాత్మకతకు, పాత్రధారి అయిన అనుష్క సౌందర్యానికి ఒక నిదర్శనం.

 సినిమాటిక్ స్వేచ్ఛ...
 చరిత్రలో అనేకం జరుగుతాయి. కొన్నింటిని ప్రజలు మరుగున పడేస్తారు. కొన్ని జరగకపోయినా జరిగినట్టుగా తమ సంతోషం కోసం చెప్పుకుంటారు. సినిమాలో సినిమా కథే ఉంటుంది. ఆ మేరకు దర్శకుడు, రచయితలు అవసరమైన స్వేచ్ఛ తీసుకున్నారు. రుద్రమదేవికి చాళుక్య వీరభద్రుడి(రాణా)కి కొన్ని ప్రేమ సన్నివేశాలు కల్పించారు. నిజ చరిత్రలో రుద్రమదేవికి తోడుగా నిలిచిన ప్రసాదాదిత్య పాత్రను (అజయ్) చివరి వరకూ కొనసాగించినా గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) పాత్రను పూర్తి స్వేచ్ఛతో మలుచుకున్నారు. నిజ చరిత్ర ఏదైనా ఇందులో మాత్రం గోన గన్నారెడ్డి అండర్ కవర్ ఆఫీసర్. పైకి గజదొంగలా తిరుగుతూ రుద్రమదేవికి శత్రువులా కనిపిస్తూ కాకతీయ రాజ్యానికి శత్రువులైన వారందరినీ చంపే రాజ విధేయుడు.

 సెకండాఫ్ గ్రాఫ్
 రుద్రమదేవి పాత్ర ఆది నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రుద్రమదేవి స్త్రీ అయిన కారణాన ఆమెకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన పని లేదు అని సామంతులు, ప్రజలు అభిప్రాయ పడుతున్నప్పుడు ఆమె పడిన సంఘర్షణ, ఆ సందర్భంలో మంత్రి పాత్రధారి ప్రకాష్‌రాజ్ వాదన ఆకట్టుకుంటాయి. క్లయిమాక్స్‌లో శత్రువులపై దాడి చేసి తన బలగాలతో ఆమె విజృంభించి పోరాడుతూ ఉన్నప్పుడు గోన గన్నారెడ్డి పాత్రధారి అల్లు అర్జున్ జత పడటం సగటు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.ద్వితీయార్ధం ప్రారంభమైన పదిహేను ఇరవై నిమిషాలకే రుద్రమదేవి పట్టాభిషిక్తురాలై సామంతులను శత్రువులను అణచే ప్రక్రియకు పూనుకుని ఉంటే ఆ క్యారెక్టర్ గ్రాఫ్ మరింత పెరిగి ఉండేదా అనే ఆలోచన వచ్చే అవకాశం ఉంది.

ఎవరికెన్ని మార్కులు
ఇది దర్శకుడు గుణశేఖర్ కల. తెలుగువారి సామ్రాజ్ఞి రుద్రమదేవి కథను సినిమాగా తీయాలనే ఆలోచన వచ్చినందుకే అతడు అభినందనీయుడు. నిర్మాణ పరంగా, మార్కెట్ పరంగా ఎన్నో ఎక్కుచిక్కులు ఉంటాయని తెలిసి కూడా పట్టుదల వీడకుండా సినిమా తీసినందుకు మరోసారి అభినందనీయుడు. సాంకేతికంగా నిర్మాణపరంగా మరిన్ని వనరులు, మద్దతు దొరికి ఉంటే ఇంకా బాగా తీసి ఉండేవాడని అనిపిస్తుంది. ‘బాహుబలి’లో అనుష్క అందాన్ని చూసే అవకాశం ప్రేక్షకులకు కలగలేదు. కాని ‘రుద్రమదేవి’లో మాత్రం ఒకవైపు మగటిమిని ప్రదర్శిస్తూనే మరోవైపు అత్యంత సున్నితత్వాన్ని, సౌందర్యాన్ని చూపించడంలో అనుష్క రాణించింది. రానా వీరుడుగా తన ముద్ర వేస్తాడు. ఇక గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ అందర్నీ ఆకట్టుకుంటాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ అందులో ఒక రకమైన వ్యంగ్యం, హాస్యం కలగలిపి సినిమాకో రిలీఫ్‌లా నిలిచాడు. తక్కిన సంభాషణలు ఎలా ఉన్నా ఈ ఒక్క పాత్ర కోసం రాసిన సంభాషణలు బ్రహ్మాండం. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ ముందు వరుసలో ఉంటుంది. ఇళయరాజా ఆర్.ఆర్‌తో ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఇది స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్. త్రీడీ ప్రింట్‌లో చూడటం మంచి అనుభూతి.

 ముక్తాయింపు
 ఇది తెలుగువారి చరిత్ర ఆధారంగా తీసిన సినిమా. అందరూ చూడటానికి వీలుగా తీసిన సినిమా. ఇంకొన్ని పదార్థాలు పెడితే బాగుండనిపించవచ్చు. కాని వేసిన విస్తరి సంతృప్తి కలిగించే ప్రయత్నం చేస్తుంది. కర్పూరం సంగతి ఏమోగాని లవంగం గుచ్చిన తాంబూలం గ్యారంటీ.
 
లండన్‌లోని ‘ది ఏంజెల్ స్టూడియో’లో ప్రపంచ ప్రసిద్ధ ఫిల్‌హార్మోనియా ఆర్కెస్ట్రాతో ‘రుద్రమదేవి’ నేపథ్య సంగీతాన్ని రికార్డ్ చేశారు ఇళయరాజా. హాలీవుడ్ ఫిల్మ్ ‘టైటానిక్’ నేపథ్య సంగీతం కూడా ఈ స్టూడియోలోనే రికార్డయింది.
 
చెన్నైకి చెందిన ఎన్.ఎ.సి. వాళ్ళు ప్రత్యేకంగా డిజైన్ చేసిన అసలైన బంగారు నగల్ని ‘రుద్రమదేవి’ షూటింగ్‌లో వాడారు. ఆ నగల విలువ దాదాపు రూ. 5,00,00,000
 
మేకింగ్ ముచ్చట్లు
సర్వసాధారణంగా సినిమాను 2డిలో చిత్రీకరించి, 3డిలోకి మారుస్తుంటారు. కానీ, ‘రుద్రమదేవి’ని పూర్తిగా 3డీలోనే తీయడం విశేషం.  భారతదేశంలోనే మొట్టమొదటి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్ ఇది. ఈ 3డి చిత్రీకరణ కోసం హాలీవుడ్ స్టీరియోగ్రాఫర్లు, లాస్ ఏంజెల్స్ నుంచి టెక్నీషియన్లు ఇండియాకు వచ్చి పనిచేశారు.  గతంలో ‘ట్రాన్స్‌ఫార్మర్- ఏజ్ ఆఫ్ ఎక్స్‌టిన్‌క్షన్’,
‘డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్’, ‘ది ఎమేజింగ్ స్పైడర్‌మ్యాన్’ లాంటి హాలీవుడ్ చిత్రాలకు లీడ్ స్టీరియోగ్రాఫర్‌గా పనిచేసిన మార్కస్ లాంక్సింజర్ ‘రుద్రమదేవి’ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
     
చారిత్రకంగా పక్కాగా ఉండడం కోసం ఢిల్లీ మ్యూజియమ్‌లోని చారిత్రక ఆధారాలను పరిశీలించి మరీ ఈ సినిమాలోని రుద్రమదేవి, గణపతిదేవుల కిరీటాలను డిజైన్ చేశారు.‘లగాన్’ సినిమాలో కథాకథనానికి అమితాబ్ బచ్చన్ నేపథ్య గళమందిస్తే, ఇప్పుడీ ‘రుద్రమదేవి’కి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు.  ఈ కథలో కీలకమైన బందిపోటు గోన గన్నారెడ్డి పాత్రను హీరో మహేశ్‌బాబు, చిన్న ఎన్టీయార్ లాంటి వాళ్ళు చేస్తారని మొదట్లో ప్రచారమైంది. చివరకు ‘వరుడు’ సినిమా షూటింగ్ టైమ్ నుంచే ‘రుద్రమదేవి’ స్క్రిప్ట్, ఈ పాత్ర గురించి తెలిసిన అల్లు అర్జున్ అన్‌కండిషనల్‌గా ఆ పాత్ర చేయడానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు.
     
రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడిగా ఈ సినిమాలో రానా 30 సార్లకు పైగా కాస్ట్యూమ్స్ మార్పులున్నాయి. దాదాపుగా ప్రతిరోజూ ఒక కొత్త కాస్ట్యూమ్స్‌లో ఆయన షూట్ చేసేవారట! ‘బాహుబలి’ షూటింగ్‌లో రానాకు గాయమవడంతో,‘రుద్రమదేవి’ దర్శక - నిర్మాతలు ఏకంగా ఒక షెడ్యూల్ మొత్తం వాయిదా వేశారు. ఈ సినిమాలో బాల నటులు కూడా పలువురు ఉన్నారు. ముఖ్యంగా, పలువురు సినీ

ప్రముఖుల వారసులు ఈ బాల పాత్రలు పోషించడం విశేషం

హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 16 ఏళ్ళ చాళుక్య వీరభద్రుడిగా, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్
 సహిదేవ్ 12 ఏళ్ళ గోన గన్నారెడ్డిగా నటించారు. ఇక, 9 ఏళ్ళ బాల రుద్రమదేవిగా హీరో శ్రీకాంత్ కూతురు మేధ తెరపైకి వచ్చింది. ఇంకా 14 ఏళ్ళ వయసు రుద్రమదేవిగా ఉల్క, 9 ఏళ్ళ మహదేవుడిగా యశ్వంత్ చేశారు.
 
ఇంకోసారి చూస్తా...

ఈ సినిమా ఓ అద్భుతం. నేను టూడీలో చూద్దామనుకుంటే మావాళ్ల బలవంతం మీద త్రీడీలో చూడాల్సివచ్చింది. మళ్లీ ఇంకోసారి చూస్తా. తెలుగు చరిత్రకు ఆమె మహారాణి. తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇస్తే బాగుంటుందేమో.
 - ఎస్.ఎస్.రాజమౌళి
 
ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 80 కోట్లు. భారతదేశంలో ఇప్పటి వరకు తయారైన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ సినిమా ఇదే. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు రెండు వేల స్క్రీన్స్‌లో ‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది. ఈ నెల 16న తమిళంలో విడుదల కానుంది. ఒక్క త్రీడీ కన్వెర్షన్  కోసమే దాదాపు రూ. 12 కోట్లు వెచ్చించారని సమాచారం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమైన కారణంగా మరో 10 కోట్ల రూపాయల భారం నిర్మాతలపై పడిందని బోగట్టా.

షూటింగ్ డేస్: 195
గ్రాఫిక్  వర్క్: మూడేళ్లు
 
 - సాక్షి ఫ్యామిలీ
 
 

మరిన్ని వార్తలు