నాలుగో సింహం

30 Jul, 2017 23:09 IST|Sakshi
నాలుగో సింహం

సమ్‌సారం సంసారంలో సినిమా

‘‘సంసారం అంటే ఏమనుకుంటున్నావ్‌? ససారామ్‌లో జగ్‌జీవన్‌రామ్‌ గెలిచినంత ఈజీ కాదు. సారనాథ్‌లో బౌద్ధ స్థూపం చెక్కినంత కష్టం. కనిపించే మూడు సింహాలతోపాటు కనిపించని నాలుగో సింహం ఉంటుంది. అది ఎప్పుడు ఎలా గర్జిస్తుందో ఊహకు కూడా అందదు. కనిపించే మూడు సింహాల కదలికల మీద ట్వంటీఫోర్‌బై సెవెన్‌ ఓ కన్నేసి ఉంచవచ్చు. కనిపించని ఆ సింహం మాత్రం ఎప్పుడూ మనం నిద్రలో ఉన్నప్పుడే జూలు విదుల్చుతుంది’’. ‘‘నీ తార్కికత, తాత్వికత వినడానికి బాగానే ఉన్నాయి. పెళ్లంటే అంత భయమేంట్రా చైతూ, మేమంతా చేసుకోలేదా’’ అంటూ కొడుకును సముదాయించబోయాడు శ్రీనివాస్‌. ‘‘అమ్మో! మీరెన్నయినా చెప్పండి నాన్నా. నో డౌట్‌. భార్యంటే కనిపించని నాలుగో సింహమే. ఆ సింహానికి ఎప్పుడు కోపం వస్తుందోననే భయంతోనే నిద్రలేవాలి, ఆ భయంతోనే అన్నం తినాలి, ఆ భయంతోనే నిద్రపోవాలి. ఇంతగా భయపడానికి పెళ్లిచేసుకోవాలా? పెళ్లి చేసుకుని ఇంతలా భయపడాలా. నాకు వద్దనే వద్దు’’ తండ్రీకొడుకుల వాదనను మొదట్లో ఎంజాయ్‌ చేసింది. రాను రానూ కోపం వచ్చేసింది ప్రవీణకు.

‘‘రేయ్‌! ఆడవాళ్ల మీద చాలా తప్పు అభిప్రాయంలో ఉన్నావ్‌. నన్ను చేసుకుని మీ నాన్న కోల్పోయిందేమిటో చెప్పు’’ నిలదీసింది.‘‘అదిగో మా పెళ్లి ఫొటో చూడరా! ఎన్ని కష్టాలొచ్చినా సరే... ఇలా సోఫాలో కూర్చుని ఆ ఫొటోని చూస్తే అన్నీ మర్చిపోతుంటాను’’ కొడుకుని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీనివాస్‌. ‘‘పాయింట్‌కొచ్చేశావ్‌ నాన్నా! అసలు నీకు కష్టాలు ఎందుకొస్తున్నాయంటావూ... పెళ్లి చేసుకున్నందుకే. పెళ్లే చేసుకోకపోతే నీకేం కష్టాలుంటాయి చెప్పు. నీకొచ్చే జీతంతో ఇంకా పెద్ద ఫ్లాట్‌ కొనేవాడివి. ఎస్‌యువి కారులో తిరిగే వాడివి... ఇంకా...’’ అంటూండగానే... ‘‘మీ నాన్న పెద్ద ఫ్లాట్‌ కొనకపోవడానికి, ఎస్‌యువి కారు కొనలేకపోవడానికి కారణం నన్ను పెళ్లి చేసుకోవడం కాదురా వెధవా, నిన్ను కనడమే. స్కూలు ఫీజులు, కాలేజీ ఖర్చులు, బ్రాండెడ్‌ దుస్తులు’’ లిస్ట్‌ చదివింది ప్రవీణ.

‘‘అమ్మా! నువ్వు కూడా దగ్గరదగ్గరగా పాయింట్‌కొచ్చేశావ్‌. పెళ్లి చేసుకోకపోతే పిల్లల్ని కనే బాధ కూడా ఉండదుగా’’ చూశావా టిట్‌ ఫర్‌ టాట్‌ ఎలా ఇచ్చానో అన్నట్లు తల్లి వైపు చిలిపిగా చూశాడు చైతన్య. ‘‘ఆఖరుకి నీలాగే వితండ వాదం చేసినోళ్లే పెళ్లి లేకుండా ఉండి పోయి, నలభై ఏళ్లు దాటాక తెల్ల మొహం వేస్తారు. ఆలోచనలు నేలమీదకొచ్చి పెళ్లి చేసుకుందామంటే ఏ అమ్మాయీ మీ ముఖం కూడా చూడదు’’ ప్రవీణలో కోపం పొంగుకొస్తోంది. మూడవ ప్రపంచ యుద్ధానికి తొలి అడుగు తన ఇంటి నుంచే పడవచ్చని భయమేసింది శ్రీనివాస్‌కి. ‘‘పది దాటింది నిద్రపోరా! ఉదయం ఆఫీస్‌ టైమయ్యే వరకు పక్క మీద నుంచి లేవవు’’ అంటూ టీవీ ఆఫ్‌ చేసి తన గదిలోకి వెళ్లిపోయాడు.

‘‘వీడిలా ఎందుకయ్యాడండీ! మనిళ్లలో అందరూ చక్కగా పెళ్లి చేసుకుని చల్లగా సంసారాలు చేసుకుంటున్నారు. పిల్లలతో ఆ ఇళ్లన్నీ కళకళలాడుతున్నాయి’’ ప్రవీణ బెడ్‌రూమ్‌లో ట్యూబ్‌లైట్‌ ఆపి బెడ్‌ ల్యాంప్‌ వేస్తూ అన్నది. శ్రీనివాస్‌ ఏమీ మాట్లాడలేదు. ‘‘నా వయసు వాళ్లు మనుమలు, మనుమరాళ్ల కబుర్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. మాటల్లో మాటగా మన వాడి పెళ్లి టాపిక్‌ తెస్తారేమోనని నా గుండె గుబగుబమంటూ ఉంటుంది’’ అన్నది బ్లాంకెట్‌ మడత విప్పుతూ ప్రవీణ ఆవేదనగా. ఈసారీ మౌనమే సమాధానం. ‘‘మీ ఉద్యోగంతో మనం ఊరూరు తిరుగుతూ వాణ్ని చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో పెంచడంతోనేమో, వాడికి కుటుంబం అర్థం కావడం లేదు’’ అంటూ కళ్లు మూసుకుంది ప్రవీణ.

పంజగుట్ట, చట్నీస్‌ రెస్టారెంట్‌. చైతన్య, శ్రీనివాస్‌ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వెయిటర్‌ వినయంగా వంగి గ్లాసులో నీళ్లు పోశాడు. వినమ్రంగా వంగి వంగి సర్వ్‌ చేస్తున్నాడు.‘‘చూశావా నాన్నా! ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి సర్వీస్‌ అందుతుందా?’’ అన్నాడు. ‘‘నీ ధోరణి మారాలి చైతూ. నీ ఫ్రెండ్స్‌ లైఫ్‌ని ఎలా లీడ్‌ చేస్తున్నారో గమనించావా ఎప్పుడైనా’’ అన్నాడు శ్రీనివాస్‌ అనునయంగా . ‘‘ఎందుకు లేదు నాన్నా! అంతా బ్యాచిలర్‌ లైఫ్‌ని తలుచుకుంటూ పెళ్లి చేసుకున్నందుకు బాధపడేవాళ్లే. ఒక్కరూ మ్యారీడ్‌ లైఫ్‌ హ్యాపీగా ఉందనే వాళ్లు లేరు’’ పెళ్లి విషయంలో తన అభిప్రాయం తప్పుకాదన్న ఆత్మవిశ్వాసం అతడి మాటల్లో. ‘‘భార్యంటే నాలుగో సింహం కాదు చైతూ! జీవితంలో సగం’’. ‘‘జీవితంలో కాదు నాన్నా! జీతంలో సగం అను ఒప్పుకుంటాను’’ పెడవాదాన్ని బలంగా వినిపిస్తున్నాడు చైతన్య.

‘‘రాత్రి ఎనిమిదికి రామకృష్ణ కొడుకు పెళ్లి! నువ్వు ఆఫీస్‌ నుంచి నేరుగా పెళ్లికి వచ్చెయ్యి, నేనూ అమ్మా ఇంటి నుంచి వస్తాం’’‘‘యా! వినీల్‌ పెళ్లి కదా! నాకు కష్టమే నాన్నా! ఆఫీస్‌లో మీటింగ్‌ ఉంటుంది. మీరిద్దరూ వెళ్లండి’’ అనేసి సర్వర్‌కి ఫింగర్‌ బౌల్‌ చెప్పాడు. ‘‘ఏవండీ! భోజనానికి వస్తున్నారా’’ కిచెన్‌లో నుంచి పిలిచింది ప్రవీణ, ‘‘చైతూ, వస్తున్నావా’’ అంటూ చైతన్య గదిలోకి చూశాడు శ్రీనివాస్‌.‘‘ఆకలి లేదు, తర్వాత తింటా’’ ల్యాప్‌టాప్‌లో నుంచి ముఖం తిప్పకుండానే చెప్పాడు. ‘‘ముగ్గురి భోజనంలో ఒక్కొక్కరు ఒక్కోసారి భోజనం చేయడమేంట్రా, చల్లారిపోకముందే రా త్వరగా’’ అరిచినట్లే అన్నది ప్రవీణ. చైతన్య ముఖం చిట్లించుకుంటూ ‘‘అమ్మా! తినడానికి ఆకలి ఉండాలి కదా!’’ అంటూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకొచ్చాడు, చైతన్య శిలాప్రతిమ అయ్యాడు కొద్దిసేపు. శ్రీనివాస్‌ ప్లేట్‌లో అన్నం పొగలు కక్కుతోంది. ప్రవీణ అన్నంలో ఆవు నెయ్యి, కరివేపాకు పొడి వేసింది. అన్నాన్ని కొద్దికొద్దిగా పక్కకు జరుపుతూ కాలుతున్న చేతిని ఊదుకుంటూ కలిపి ముద్దలు చేస్తోంది. ‘‘వేడిగా కరివేపాకు పొడితో రెండు ముద్దలు పట్టండి. రెండ్రోజులుగా బయటి భోజనాలాయె. పొట్ట పాడైందని తినకుండా ఊరుకుంటూ పొట్టలో గ్యాస్‌ ఫార్మ్‌ అవదూ’’ అంటూ శ్రీనివాస్‌కి గోరు ముద్దలు తినిపిస్తోంది. ‘‘నేను తింటాలే ప్రవీణా’’ అంటూ శ్రీనివాస్‌ అన్నంలో చెయ్యి పెట్టాడు.

‘‘ఆగండి, ఇంత వేడి అన్నం కలపడం మీ వల్లనవుతుందా’’ అంటూ శ్రీనివాస్‌ చేతిని పక్కకు తోసేసి అన్నం కలుపుతూ శ్రీనివాస్‌ నోట్లో పెడుతోంది. చైతన్య వచ్చి శ్రీనివాస్‌ పక్క కుర్చీలో కూర్చుని బోర్లించిన ప్లేట్‌ని వెల్లకిలా తిప్పుకుని, బాటిల్‌లో నుంచి నీటిని గ్లాసులో పోసుకున్నాడు. చైతన్య ప్లేట్‌లో భోజనం వడ్డించి, ‘‘మీరు లేవకండి, అజీర్తి వదలడానికి మిరియాల చారు పెట్టాను’’ ఆర్డరేసినట్లే అంటూ కిచెన్‌లోకి వెళ్లింది. తండ్రి రియాక్షన్‌ కోసం ముఖంలోకి చూస్తూన్నాడు చైతన్య. శ్రీనివాస్‌ కొడుకు వైపు చూసి ‘‘నువ్వు చెప్పింది నిజమే చైతూ. కనిపించని నాలుగో సింహమే భార్య. మనకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని జూలు విదిలించి రంగంలో దిగడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అన్నాడు. చైతన్య మనోనేత్రం ముందు ఓ సంఘటన.

‘‘చైతూ! నువ్వు ఆఫీస్‌కెళ్లే దారిలో నన్ను ఏదో ఓ షాపింగ్‌మాల్‌లో దించు. రేపు మీ నాన్న బర్త్‌డే. ఏం మనిషో ఏంటో! ఇప్పటి వరకు కొత్త డ్రెస్‌ తెచ్చుకోలేదు’’ అంటూ హడావిడిగా ఎలా ఉన్న మనిషి అలాగే బయలుదేరింది ప్రవీణ. కారులో వెళ్తుండగా ‘‘చైతూ నీకు ఖాళీ ఉన్న రోజు చెప్పు కన్నా! మీ నాన్నకు ఓ సారి మాస్టర్‌ చెకప్‌ చేయించాలి. ఈ మధ్య మనిషి ఏంటో లాగేసినట్లయిపోతున్నాడు. మన కోసం ఆరాటపడడమే తప్ప, తన గురించి పట్టించుకోడు’’ అన్నది ప్రవీణ. చారు కోసం అన్నాన్ని కలుపుతున్న తండ్రి చేతి మీద చేయి వేస్తూ ‘‘అగ్రీ విత్‌ యూ నాన్నా!’’ అని షో కేస్‌లో ఉన్న అమ్మానాన్నల పెళ్లి ఫొటో వైపు చూశాడు చైతన్య.
– మంజీర

సుబ్బారావు పెళ్లి... అభిరామ్‌ లొల్లి..!
సినిమాలో సంసారం

అభిరామ్‌ (నాగార్జున) యాడ్‌ ఏజెన్సీలో మేనేజర్‌. ఆ కంపెనీ వాళ్లదే. అభిరామ్‌కు అమ్మాయిలన్నా, పెళ్లి అన్నా పడదు. ఆ కంపెనీలో ఓ ఉద్యోగి సుబ్బారావు. పెళ్లి కార్డుతో బాస్‌ ఇంటికి వెళ్లి... ‘మీ ఆశీర్వాదం కావాలి సార్‌’ అంటాడు. ‘ఏంటి పుట్టినరోజా?’ అని సింపుల్‌గా అడుగుతాడు అభిరామ్‌.‘పెళ్లి సార్‌’ మోహంలో సిగ్గు కనిపించాలనే ప్రయత్నంతో సమాధానం చెబుతాడు సుబ్బారావు. సుబ్బారావు ఏదో ఘోరమైన తప్పు చేయబోతున్నట్లు ఆశ్చర్యంగా ‘పెళ్లా...!’ అని అడుగుతాడు అభిరామ్‌. సుబ్బరావు మాత్రం మెల్లిగా ‘పెళ్లి సార్‌’ అంటాడు. ‘పెళ్లెందుకు అంటాడు’ అభిరామ్‌. ‘అందరూ పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు, మీరేంటి సార్‌ ఎందుకు అని అడుతున్నారు’ అని ఆశ్యర్యంగా ముఖం పెడతాడు సుబ్బారావు. ‘అందుకే అడుగుతున్నాను ఎందుకు’? అని కాస్త అసహసంతో అంటాడు అభిరామ్‌. ‘భోజనానికి కష్టమైపోతోంది సార్‌’ అని ఏదో నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు సుబ్బారావు.

‘కుక్కును పెట్టుకో’ అని సింపుల్‌ చెప్తాడు అభిరామ్‌. ‘ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు’ ఇంకో కన్విన్సింగ్‌ రీజనిస్తాడు సుబ్బారావు. ‘కుక్కను పెంచుకో’ అని కూల్‌ రిఫ్లై ఇస్తాడు అభిరామ్‌. అయినా పెళ్లంటే ఇష్టం పెళ్లి చేసుకునేవాళ్ళకు ఉండాలి కానీ, వచ్చి చూసిపోయేవాళ్ళ ఇష్టం ఎవరికి కావాలి చెప్పండీ. అలా అభిరామ్‌కు ఇష్టం లేకపోయినా  సుబ్బారావుకి పెళ్లయిపోతుంది. మోహమాటంగా పిలిచిన పెళ్ళికి కూడా అభిరామ్‌ నిర్మొహమాటంగా వెళ్తాడు. విశేషం ఏంటంటే అప్పుడు కూడా సుబ్బారావుకు ఏవేవో మాటలు చెప్పి జరిగిపోయిన పెళ్లిని పెటాకులు చేయాలనే విఫలప్రయత్నం చేసి తాను సఫలం కాలేకపోతాడు. ఇక ఎంతకూ వర్కౌట్‌ కాక ఓ పెగ్గేసి ‘అరే.. వద్దురా... సోదరా... అరే.. పెళ్లంటే నూరేళ్ళ మంటరా... గోతిలో పడద్దురా’ అంటూ ఓ వైరాగ్య సందేశం ఇస్తాడు అభిరామ్‌ ‘మన్మథుడు’ సినిమాలో. పెళ్లంటే ఇంత బ్యాడ్‌ ఒపీనియన్‌ ఉన్న అభిరామ్‌ చివరికి రియలైజ్‌ అయి ప్రేమవివాహం చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి.
సాక్షి పాఠకులతో పంచుకోండి.samsaaram2017@gmail.com
 

మరిన్ని వార్తలు