ఇదో మనవరాలి కథ

25 May, 2017 23:01 IST|Sakshi
ఇదో మనవరాలి కథ

నాటి సినిమా

మాట తప్పని తండ్రి – ఆ తండ్రి పెంపకంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే వ్యక్తిగా పెరిగిన కొడుకు – తండ్రీకొడుకుల మంచితనాన్ని పుణికి పుచ్చుకున్న మనవరాలు. ముగ్గురూ మంచితనానికి కేరాఫ్‌ అడ్రస్‌. సీతారామయ్యగారు గొప్పవారు. తాతయ్యకు బాధ కలగకుండా ఉండటానికి మనసులో బాధను దిగమింగుకునే మనవరాలు ఇంకా గొప్ప. తండ్రీ–కొడుకు– మనవరాలు... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎమోషనల్‌ జర్నీ ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఈ తాతా మనవరాలి కథ ఏంటంటే...

గోదావరి తీరంలోని సీతారామపురం ఊరి పెద్ద సీతారామయ్య (అక్కినేని నాగేశ్వరరావు). భార్య జానకి (రోహిణి హట్టంగడి), ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. ఇది సీతారామయ్య కుటుంబం. కొడుకు శ్రీనివాస మూర్తి అలియాస్‌ వాసు (రాజా)కి తండ్రంటే ప్రాణం. కొడుకంటే తండ్రికి కూడా బోల్డంత ప్రేమ. ఫాదర్‌–సన్‌ అనడంకంటే ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌’ అనడం కరెక్ట్‌గా ఉంటుంది. కొడుక్కి పెళ్లి సంబంధం చూస్తాడు సీతారామయ్య. ఆ విషయం చెప్పేలోపే వాసు తాను సుమతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెబుతాడు. మునసబుని వియ్యంకుణ్ణి చేసుకుంటానని మాటిచ్చేసానంటాడు తండ్రి. సుమతికి మనసిచ్చానంటాడు కొడుకు. తండ్రి మాటకు ఊళ్లో ఎంత విలువ ఉందో చెప్పి, పెళ్లికి ఒప్పుకోమంటారు వాసు అక్కా బావ. అటువంటి తండ్రి కడుపున పుట్టిన కొడుకుగా మాట తప్పలేనంటాడు వాసు. తప్పక పెళ్లికి ఒప్పుకుంటాడు సీతారామయ్య.

అవే చివరి మాటలు!
పాతికేళ్లు ప్రతి మాటనూ పంచుకున్న కొడుకు మనసిచ్చిన అమ్మాయి గురించి ఒక్క మాట కూడా ముందు చెప్పకపోవడం తనను అవమానించినట్లుగా, అగౌరవించినట్లుగా భావిస్తాడు సీతారామయ్య. సుమతి, తానూ డాక్టర్స్‌ కాబట్టి, ఊళ్లో ఆస్పత్రి కట్టిస్తే, ఇక్కడే ఉంటామంటాడు వాసు. ఆస్పత్రి కావాలంటే ఆస్పత్రి, ఆస్తి కావాలంటే ఆస్తి.. ఏదైనా ఇచ్చేస్తా.. కానీ, ఎప్పటికీ నాతో మాట్లాడకూడదంటాడు. కొడుకుతో సీతారామయ్య మాట్లాడే చివరి మాటలవే. ఈ తండ్రీకొడుకుల మధ్య జానకమ్మ నలిగిపోతుంది. పుట్టిన తర్వాత కొడుకు చేసిన మొదటి తప్పుని క్షమించమని జానకమ్మ బతిమాలుతుంది. తాను కూడా మొదటిసారి మాట తప్పానంటాడు సీతారామయ్య. మరోవైపు కోడలు సుమతి అన్యోన్యంగా ఉన్న తండ్రీకొడుకులు తన కారణంగా విడిపోయారని బాధపడుతుంది. చేసేదేం లేక భార్యతో సహా ఇంటి నుంచి వెళ్లిపోతాడు వాసు. కాలం ఎవరికోసమూ ఆగదు. 20 ఏళ్లు గడిచిపోతాయ్‌. పైకి మామూలుగానే ఉన్నా సీతారామయ్య మనసులో కొడుకు జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బాధను బయటపెట్టకుండా సీతారామయ్య, జానకమ్మ గంభీరంగా రోజులు గడుపుతుంటారు. కట్‌ చేస్తే...

అమెరికా టు ఇండియాకి సీత
సీతారామయ్య మనవరాలి (పెద్ద కుమార్తె కూతురు) వివాహం కుదురుతుంది. ఈ పెళ్లికి సీతారామయ్య మరో మనవరాలు (వాసు కూతురు) సీత (మీనా) అమెరికా నుంచి ఇండియా వస్తుంది. మనవరాలిని చూసి, మురిసిపోతుంది జానకమ్మ. సీతారామయ్య మనసు మురిసినా బయటపడడు. ‘నా పేరు సీత.. మీ పేరే’ అంటూ తాతయ్యతో మాటలు కలిపిన మనవరాలికి మెల్లమెల్లగా దగ్గరవుతాడు సీతారామయ్య. పెరిగింది అమెరికాలో అయినా తెలుగింటి పిల్లలా మనవరాలు ఉండటం, సంస్కృతీ సంప్రదాయాలకు విలువ ఇవ్వడం సీతారామయ్య మనసుని ఆకట్టుకుంటుంది.

మనవరాలిలో కొడుకుని చూసుకుంటాడు. మాట పట్టింపుతో కొడుకు తన ఇంటికి రాలేదని ఓ మూల బాధపడతాడు. అంతా సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో అమెరికా నుంచి వాసు ఫ్రెండ్‌ (మురళీమోహన్‌) ఇండియా వచ్చి, సీతారామయ్యగారింటికి వెళతాడు. ‘మా అబ్బాయి ఎప్పుడు వస్తాడు’ అని సీతారామయ్య దంపతులు అడగడంతో తన తల్లిదండ్రులు చనిపోయిన విషయాన్ని సీత దాచిన విషయం అతనికి అర్థమవుతుంది. చెప్పొద్దని మురళీమోహన్‌తో సీత విన్నవించుకుంటుంది. అతను వచ్చిన దారినే అమెరికా చెక్కేస్తాడు.

మనవరాలిలోనే కొడుకు
‘నీలో నన్ను చూసుకునేవరకూ తాతయ్యకు నేను చనిపోయిన విషయం చెప్పకు’ అని తండ్రి చివరి క్షణాల్లో చెప్పిన మాటను నిలబెట్టడానికి సీత విశ్వప్రయత్నం చేస్తుంది. దుఃఖాన్నంతా లోపల మింగేసుకుని, బయటికి నవ్వుతుంటుంది. ఇప్పుడో చిక్కొచ్చి పడుతుంది. సీతారామయ్య–జానకమ్మల షష్టిపూర్తి వేడుక నిర్ణయం అవుతుంది. ఆ వేడుకకు కొడుకు వస్తాడని ఆశిస్తారు. వాసు రాడు? మరీ ఇంత పట్టింపా? అని సీతారామయ్య బాధపడిపోతాడు. ఎలాగైతేనేం వేడుక బాగానే జరుగుతుంది. ఆ తర్వాత జరగకూడనిదే జరుగుతుంది, జానకమ్మ హఠాన్మరణం ఇంటిల్లిపాదినీ కుంగదీస్తుంది.

ఇప్పుడైనా కొడుకు వస్తాడని ఎదురు చూస్తాడు సీతారామయ్య. రాకపోవడంతో ఈసారి బాధ.. కోపంగా మారుతుంది. ‘నువ్విక్కడే ఉంటే నా కొడుకు లేని వెలితి బాగా కనిపిస్తోంది. అమెరికా వెళ్లిపో’ అంటాడు మనవరాలితో. సీత కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. చివరకు తాతయ్య చెప్పినట్లే అమెరికా ప్రయాణమవుతుంది. కానీ, అప్పటివరకూ రాసుకున్న డైరీని మరచిపోయి, వెళ్లిపోతుంది. అది చదివి, కొడుకు చనిపోయిన విషయం తెలుసుకున్న సీతారామయ్య ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి మనవరాలిని వెనక్కి తీసుకొస్తాడు.

కొడుకు అస్తికలను గోదావరిలో కలుపుతాడు. ‘మా నాన్న మీకు గిఫ్ట్‌ పంపించాడు’ అంటూ ఇంటికొచ్చిన రోజున మనవరాలు ఇచ్చిన చేతి కర్రను నదిలో విసిరేస్తాడు. దీని అవసరం లేదు.. నువ్వున్నావుగా అంటూ మనవరాలిని అక్కున చేర్చుకుంటాడు. ఇది ఓ మనవరాలి కథ. అందుకే ఏయన్నార్‌ లాంటి స్టార్‌ ఉన్నప్పటికీ ‘సీతారామయ్యగారి మనవరాలు’ అని టైటిల్‌ పెట్టారు. ఆ మనవరాలి ప్రేమ, త్యాగం మనసుని మెలిపెడతాయి.

తప్పంతా పరిస్థితులదే
మాట ఇచ్చిన తండ్రిదీ తప్పు కాదు. తండ్రి మాటను కాదన్న కొడుకుదీ కాదు. తప్పంతా పరిస్థితులదే. మానస రాసిన ‘నవ్వినా కన్నీళ్లే’ అనే నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలతో సినిమా గంభీరంగా మొదలవుతుంది. నవలను దర్శకుడు క్రాంతికుమార్‌ వెండితెరకు ట్రాన్స్‌ఫామ్‌ చేసిన తీరు బాగుంటుంది. కళ్లెదుటే జరుగుతున్న కథేనేమో అన్నంతగా హృదయాన్ని తాకే సన్నివేశాలతో తీశారు. అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి విగ్‌ లేకుండా నటించిన సినిమా. ‘సీతారామయ్య’లాంటి పాత్రలు చేయడం ఆయనకు కష్టం కాదు. జీవించేశారు. ఏయన్నార్‌కి దీటుగా నటించగలిగింది మీనా. బాలనటిగా మెరిసిన మీనా మెయిన్‌ లీడ్‌ చేసిన మొదటి సినిమా ఇది.

అద్భుతంగా నటించింది. ఈ పాత్రల్లో వీళ్లను తప్ప వేరేవాళ్లను చూడలేం అన్నంతగా రోహిణి హట్టంగడి, రాజా, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు తదితరులు నటించారు. అతిథి పాత్రలో దాసరి నారాయణరావు గోదావరి యాసలో నవ్వించారు. ‘పూసింది పూసింది పున్నాగ’, ‘భద్రగిరి రామయ్య’, ‘కలికి చిలకల...’ వంటి పాటలతో సినిమా హాయిగా సాగుతుంది. కీరవాణి ఇచ్చిన పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఓ ప్లస్‌.1991లో వచ్చిందీ సినిమా. విడుదలై పాతికేళ్లవుతున్నా సీతారామయ్యగారు, ఆయన మనవరాలు మనసుల్లో నిలిచిపోయారంటే కథ గొప్పతనం అది.

ఏయన్నార్‌ అభినందనను మరచిపోలేను – మీనా
‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాకి ఛాన్స్‌ వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. అక్కినేని నాగేశ్వరరావుగారితో సినిమా చేయడం అంటే మాటలా? టెన్షన్‌ అనిపించినప్పటికీ మంచి ఛాన్స్‌ అని ఒప్పుకన్నా. నాగేశ్వరరావుగారు బాగా మాట్లాడేవారు. దాంతో నా భయం మొత్తం పోయింది. ‘మనం ఎవరి కోసమైనా వెయిట్‌ చేయొచ్చు.. మనకోసం ఎవరూ వెయిట్‌ చేయకూడదు. పంక్చువాల్టీ ముఖ్యం’ అని ఏయన్నార్‌గారు నాకో సలహా ఇచ్చారు. అది ఎప్పటికీ మరచిపోలేను. అలాగే సినిమా విడుదలైన తర్వత, ‘లొకేషన్లో నువ్వు యాక్ట్‌ చేసినప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ, సినిమాలో చూస్తే చాలా బాగానే యాక్ట్‌ చేశావ్‌ అనిపించింది’ అని మెచ్చుకున్నారు. అది మరచిపోలేను. చెన్నయ్‌లో జరిగిన వందేళ్ల భారతీయ సినిమా పండగ (2014) అప్పుడు అన్ని భాషలవాళ్లు వచ్చారు. అక్కడే ఏయన్నార్‌గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో నేను పాల్గొన్నాను. ఆయన్ను చూడటం అదే చివరిసారి. ‘మనం’ చూసినప్పుడు ఎమోషనల్‌ అయ్యాను.

తల్లిదండ్రులు చనిపోయారనే విషయం తాతయ్య–నానమ్మలకు చెప్పలేక గోదావరి తీరాన మీనా ఏడవడం, తాతయ్య అమెరికా వెళ్లిపొమ్మన్నప్పుడు పడే బాధ ప్రేక్షకుల కళ్లు చెమర్చే సన్నివేశాలు. కొడుకు పంపిన బహుమతి (చేతికర్ర)ని సీతారామయ్య ఆప్యాయంగా తడిమి చూసుకునే సీన్, అది చూసి జానకమ్మ మురిసిపోవడం అలరిస్తాయి.

‘పెళ్లి చేసినట్లే చేసి నాకు మరణశిక్ష విధించారు’, ‘కన్నతండ్రికి అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడా మీ నాన్న.. వాడి కోసం ఒక్క మెట్టు కూడా దిగను’, ‘మాటకు విలువ తెలియనవాడితో నన్ను మాట్లాడమని అడగొద్దు’ వంటి డైలాగ్స్‌ సూపర్బ్‌. గణేశ్‌ పాత్రో రాసిన ఇలాంటి సంభాషణలు సినిమాకు బలం.  1991లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. నాలుగు నంది అవార్డులు దక్కించుకుంది. మలయాళంలో ‘సంధ్వానమ్‌’గా, కన్నడంలో ‘బెల్లి మొదగళు’ పేరుతో, హిందీలో ‘ఉదార్‌ కీ జిందగీ’గా రీమేక్‌ అయింది.
– డి.జి. భవాని
 

మరిన్ని వార్తలు