పెళ్లికళను సంతరించుకున్న వెయ్యినూతుల కోన

9 May, 2017 23:16 IST|Sakshi
పెళ్లికళను సంతరించుకున్న వెయ్యినూతుల కోన

చుట్టూ కొండలు... మధ్యలోయలు పచ్చదనంతో పరిఢవిల్లే... సుమపరిమళాల చెట్లు... వేసవికాలమైన సరే... కళకళలాడే కోనేర్లు... భక్తులకు ఆహ్వానం పలికే వసతి గృహాలు...ఆçహ్లాదకర వాతావరణం... శిల్పకళ ఉట్టిపడే ఆలయం... అందులో ఉగ్రరూపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి. కాస్త దూరంలో లక్ష్మీదేవి ఆలయం... చూడ ముచ్చటైన క్షేత్రం... ఈ వెయ్యినూతలకోన.  

వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం చిన్నదాసరిపల్లె గ్రామంలో వెయ్యినూతలకోన క్షేత్రం ఉంది. వెయ్యి నూతులు (బావులు) ఉన్న ప్రదేశం కావడంతో వెయ్యినూతుల కోన అనే పేరు వచ్చింది. క్రమంగా నూతుల కాస్తా నూతల అయింది. ఈ క్షేత్రంలో శ్రీలక్ష్షీ్మనరసింహస్వామి, లక్ష్షీ్మదేవి అమ్మవార్లు భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్నారు. క్షేత్రం ప్రాంగణం చుట్టూ వెయ్యి కోనేర్లు ఉండేవని, తద్వారా వెయ్యినూతలకోన పేరు వచ్చిందని పురాణగా«థ. ఈ పుణ్య క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు రాత్రికి గరుడ సేవ, మరుసటి రోజు కల్యాణం జరపడం అనవాయితీ.

బ్రహ్మోత్సవాల కోన...
శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా 8వ తేదీ సోమవారం బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. నేటి ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రి గరుడసేవ, రేపు ఉదయం కల్యాణోత్సవం, చక్రస్నానం, గజవాహన సేవ, సాయంత్రం ధ్వజ అవరోహణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా చిన్నదాసరిపల్లె గ్రామస్థులు ఒంగోలు జాతి కోడెలకు రాతిదూలం బలప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయనున్నారు.

ఆలయ చర్రిత....
విజయనగర సామాజ్య కాలంలో వెయ్యినూతలకోన వెలసినట్లు అక్కడి శాసనాలు వివరిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలకాలంలో సాళువ మంగరాజు... తల్లి జ్ఞాపకార్థం వెయ్యినూతలకోన క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి గుడికట్టించారు. అచ్యుత దేవరాయలు గుడిని దర్శించి 27 ఎకరాలు భూమిని మాన్యంగా ఇచ్చారు. తాళ్లపాక అన్నమాచార్యులు స్వామి వారిని సందర్శించి 10కి పైగా సంకీర్తనలు రచించారు. ఆనాటి పూజారులు వంశపారంపర్య ధర్మకర్త పిన్నపాటి వంశీయులు నిత్యం పూజలు, నైవేద్యాలు కొనసాగిస్తున్నారు. 2006లో లక్ష్మీదేవి ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టి, 2007లో పునఃప్రతిష్టించారు. 2009లో స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, పనులు పూర్తి చేశారు. భక్తులు, దాతల సహకారంతో చేపట్టిన ఈ రెండు ఆలయాల జీర్ణోద్ధరణకు దాదాపు రూ.2.50 కోట్లు వెచ్చించారు. అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టిపడే ఈ ఆలయాలను సందర్శించడానికి రెండుకళ్లూ చాలవనిపిస్తుంది.

కాకులు, గద్దలు సంచరించవు...
వెయ్యినూతలకోనలో కాకులు, గద్దలు సంచరించవు. దీనికి ఒక పురాణ గాథను చెబుతారు. అదేమంటే... త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో దండకార్యణంలో ప్రవేశించినప్పడు సీతాదేవి ఒడిలో తల ఉంచి ఈ ప్రాంతంలో సేదతీరాడట. కాకాసురుడు అనే రాక్షసుడు పండు అని భ్రమించి సీతాదేవి తొడను ముక్కుతో పొడిచాడట. అది చూసిన రాముడు కోపంతో కాకాసురుడిపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడట. అప్పటి నుంచి ఈ క్షేత్రం పరిసరాలల్లోకి కాకులు, గద్దలు సంచరించవని పురాణగాధ.

చేరుకోవడం ఇలా....
–ఈ క్షేత్రం కడప పట్టణానికి 25 కిలోమీటర్ల దూరాన ఉంది.
–కడప–పులివెందుల ప్రధాన రహదారిలో మండల కేంద్రమైన పెండ్లిమర్రి సమీపంలోని చెర్లోపల్లె బస్టాప్‌కు మూడు కిలోమీటర్లు.
–వేంపల్లె నుంచి 23 కిలో మీటర్లు .

విశేషాలు...
వెయ్యినూతలకోన క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి పల్లకిని మోస్తే మనసులో కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. ఉత్సవాల రోజు కోనేర్లుల్లో చక్కెర స్నానం చేస్తే పాపకర్మలు తొలగి పోతాయని క్షేత్రమహాత్మ్యం చెబుతోంది. అందువల్ల ఈ రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
– పి.చెన్నకేశవరెడ్డి, సాక్షి పెండ్లిమర్రి, వైఎస్సార్‌ జిల్లా

మరిన్ని వార్తలు