గల్లీలో చెల్లి పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ...

10 Jun, 2015 22:30 IST|Sakshi
గల్లీలో చెల్లి పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ...

హిట్ క్యారెక్టర్
 
సినిమా పేరు: యమలీల (1994); డెరైక్ట్ చేసింది: ఎస్వీ కృష్ణారెడ్డి
సినిమా తీసింది: కె.అచ్చిరెడ్డి; మాటలు రాసింది: దివాకర్‌బాబు
 
అనగనగా ఓ తోటరాముడు. పేరు చూసి వీడెవడో ‘పాతాళ భైరవి’లోలాగా వీరుడూ శూరుడూ అనుకోవద్దు. నీచనికృష్ట పాపిష్టి మానవుడు వీడు. బీరు తాగినంత సునాయాసంగా దోపిడీలు, బ్రేవ్‌మని తేన్చినంత ఈజీగా ఘోర హత్యలు, టీవీలో వార్తలు చూసినంత అవలీలగా మానభంగములు చేసెడివాడు. నరకలోకపు హెచ్‌ఆర్ మేనేజర్ చిత్రగుప్తుడికి సైతం వీడి చిట్టా మెయింటైన్ చేయలేక హెడేక్ మీద హెడేక్ వచ్చేసింది. ఈ తోట రాముడికి తిక్క... వెర్రి... పిచ్చి... ఉన్మాదం... మదం... పొగరు... బలుపు... ఇలా సకల అవలక్షణాలూ కలవు. తనో పెద్ద తోపు అని తోటరాముడికి ఫీలింగ్. వీడికో బ్యాట్ బ్యాచ్ కలదు.

 ఎవడైనా తోటరాముడు తెలియదన్నాడంటే వాడి తాట తీసిపారేస్తాడు. ఈ నగరమనే నరకానికి తానే ‘యముండ’ అని చెప్పుకుంటుంటాడు. ఎవణ్ణి ఎప్పుడు ఖతం చేయాలో తానే డిసైడ్ చేస్తుంటాడు. ఇంతోటివాడికి రగతం చూస్తే కళ్లు తిరుగుతాయి. తన బ్యాట్‌బ్యాచ్ ఎవడినైనా చంపుతుంటే, తాను వెనక్కి తిరిగి ఆ చావుకేకల్ని వింటూ తన్మయానికి గురవుతుంటాడు. ఇదే నగరంలో ఓ గరం పోరీ ఉంటుంది. పేరు లిల్లీ. ఆమెకో చైన్ బ్యాచ్. ఈ రెండు బ్యాచ్‌లకీ టెస్ట్‌మ్యాచ్‌ల్లాగా నిరంతరం గొడవలే. ఈ తోటరాముడికి ఎవడైనా అమాయకుడు కనబడ్డాడా... వాణ్ణి బకరా చేసి ఆడించేస్తాడు. తమాషా చూస్తాడు. ఇదో శాడిజం వాడికి. ఈ తోట రాముడికి కపిత్వంలో పాటు కవిత్వం కూడా ఇష్టం. ఆ రోజు ఏమి జరిగినదంటే...
           
ఓ వారపత్రిక కార్యాలయమది. సంపాదకుడు మహా బిజీగా ఉన్నాడు. అక్కడికి తోటరాముడు ప్రవేశించేసరికి కార్యాలయం మొత్తం కల్లోలం. ఈ ఆఫీసుని కబ్జా చేయడానికే వచ్చాడని ఆ సంపాదకుడు భావించి తట్టాబుట్టా సర్దేసుకోవడానికి సిద్ధమైపోయాడు. కానీ, తోటరాముడు మాత్రం పెళ్లిచూపులకు వచ్చినవాడిలా సిగ్గుపడుతూ సంపాదకుని ముందు కూర్చున్నాడు. అతగాడు భయపడుతూ చూస్తున్నాడు. తోటరాముడు జేబులోంచి తీశాడు. కత్తి కాదు... కాగితం! ‘‘నేనీ మధ్య కవిత్వం రాయడం షురూ చేసినా...’’ అంటూ మెలికలు తిరిగిపోయాడు తోటరాముడు.

 సంపాదకుడికి సృ్పహ తప్పినంత పనయింది. తోటరాముడే నీళ్లు జల్లి లేపాడు. ఇక తప్పించుకోవడం అసాధ్యమని తేలిపోయి ‘‘చెప్పండి సార్’’ అని వినయంగా వేడుకున్నాడు సంపాదకుడు. తన అసిస్టెంట్ చిట్టి వైపు ఓ లుక్కిచ్చి సగర్వంగా చదవడం మొదలుపెట్టాడు తోటరాముడు.‘‘నాకొక బుల్లి చెల్లి...’’ అని ఒక లైను చదివాడో లేదో, చిట్టిబాబు ‘వహ్‌వా వహ్‌వా’ అంటూ భజన మొదలుపెట్టేశాడు.
 సంపాదకుడు కూడా పొగడాలి కదా. లేకపోతే గుండు రామకీర్తన పాడుతుందని తెలుసు. అందుకే తనూ పొగడ్డం మొదలెట్టాడు. ‘‘సిస్టర్ సెంటిమెంట్ అన్నమాట... కానివ్వండి కానివ్వండి’’ అన్నాడు. తోటరాముడు ఛాతీ రెట్టింపైంది. ‘‘నాకో బుల్లి చెల్లి నేడే గల్లీలో దానికి పెళ్లి ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’’ అని కవిత చదవడం పూర్తి చేసి, తోటరాముడు చాలా ఉత్సుకతగా సంపాదకుడి వైపు చూశాడు. ఆ సంపాదకుడి పరిస్థితి చూడాలి. యాక్సిడెంటై అంబులెన్స్ ఎక్కితే, ఆ అంబులెన్స్‌కే యాక్సిడెంట్ అయినట్టుగా ఉంది. ‘‘చెల్లి పెళ్లి... ఒక్కసారి కాదు... జరగాలి మళ్లీ మళ్లీ... బావుంది... చాలా బావుంది. కొత్తగా ఉంది. అద్భుతంగా ఉంది’’ అని పొగడ్డానికి పదాలు రాక... కాదు కాదు దొరక్క... అలా పొగుడుతూనే ఉన్నాడు. హుస్సేన్ సాగరంలో నిమజ్జనం చేసే వినాయకుడిలాగా తోటరాముడు తెగ సంబరపడిపోయాడు. ‘‘అయితే ఈ కవితను ప్రింట్ చేయాలని డిసైడ్ చేసినా’’ అన్నాడు. తోటరాముడు డిసైడ్ చేశాడంటే వార్ వన్‌సైడ్ అయిపోయినట్టే.
           
 కవిత పబ్లిషైంది. తోటరాముడు ఖుష్షో ఖుష్షు.
 సరిగ్గా అదే సమయంలో అసిస్టెంటు పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘అన్నా అన్నా... నీకోసం పోస్టల్ వ్యాన్ వచ్చినాదే’’ అని చెప్పాడు. ‘‘అరె చుప్... నా కోసం వస్తేగిస్తే పోలీసు వ్యాను రావాలే. పోస్టల్ వ్యాను రావడమేంటి?’’ అని తోటరాముడు కసురుకున్నాడు. కానీ నిజంగానే పోస్టల్ వ్యాను వచ్చి, 5 బస్తాల ఉత్తరాలు అతని ముందు పడేసి పోయింది. తోటరాముడికి ఏం అర్థం గాలేదు.‘‘తొలి కవితతోనే ఎంత పాపులరైపోయారు సార్’’ అంటూ సంపాదకుడు ఉబ్బేశాడు. తోటరాముడు చాలా హుషారుగా ఓ ఉత్తరం తీసి చదవమన్నాడు.
 ‘‘తోటరాముడు గారికి... గత వారం వారపత్రికలో మీరు రాసిన ‘చెల్లి పెళ్లి’ కవిత చదివా. చెల్లికి మళ్లీ పెళ్లేంట్రా గాడిదా... నికృష్టుడా... దరిద్రుడా... అప్రాచ్యుడా... నీకు దినం పెట్టా...’’ ... ఇలా ఆ ఉత్తరమంతా తిట్ల సునామీ. తోటరాముడి మొహం మాడిపోయిన మసాలాదోశెలా అయిపోయింది. ఇంకో ఉత్తరం తీస్తే... అందులో అంతకన్నా ఎక్కువ తిట్లు.సంపాదకుడి వైపు కొరకొరా చూశాడు తోటరాముడు. ‘‘నా కవిత్వం బాగుందని అన్‌పాపులర్ చేస్తావురా. నన్ను కవిని చేయమంటే బద్‌నామ్ చేస్తావ్. నేను నిన్ను బద్‌నామ్ చేస్తా’’ అని సంపాదకుణ్ణి చెడుగుడు ఆడేశాడు.
           
చూశారా... ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని తెలుసు మనకి. కానీ ఒక కవిత కూడా జీవితాన్ని ఎలా డిసైడ్ చేసేసిందో!
 ఫైనల్‌గా ఈ స్టోరీకి కన్‌క్లూజన్ ఏంటంటే - ఈ తోటరాముడు, సాక్షాత్తూ యమధర్మరాజునే డిసైడ్ చేసేయాలని చూశాడు.భూమ్మీదకు పొరపాటున జారిపడ్డ ‘భవిష్యవాణి’ పుస్తకం కోసం యమధర్మరాజు, చిత్రగుప్తుడు వెతుకుతుంటే, తోటరాముడు దాన్ని దొరకబుచ్చేసుకు న్నాడు. ఎంతో ఉత్సాహంగా, ఆత్రంగా ఆ ‘భవిష్యవాణి’ ఓపెన్ చేసి చూస్తే ‘నేటితో నీ చరిత్ర సమాస్తం’ అని రాసి ఉంది. అదేంటో యమధర్మరాజు గదతో గట్టిగా గదిమితే తప్ప తెలియలేదు. తోటరాముణ్ణి యమధర్మరాజు అట్లా డిసైడ్ చేసినాడు మరి!
 ఈ తోటరాముడి ప్రసారం ఇంతటితో సమాప్తం.
 - పులగం చిన్నారాయణ
 
‘యమలీల’ సినిమాలో యముడు ఎంత ఇంపార్టెంటో, తోట రాముడు కూడా అంతే ఇంపార్టెంటు. తన కామెడీ విలనీతో ఈ తోట రాముడు సినిమాను ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులూ తిప్పాడు. ఈ తోటరాముడు పాత్ర తనికెళ్ల భరణి కెరీర్‌ను చాలా గొప్పగా డిసైడ్ చేసేసిందంతే..!
 
‘‘ఆ రోజు... నేను ఇంటికి వెళ్లగానే ఓ వార్త. ఎస్వీ కృష్ణారెడ్డిగారు అర్జంట్‌గా కాల్ చేయమన్నారట. అప్పట్లో సెల్‌ఫోన్స్ లేవు. మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కానీ, ఎస్టీడీ సౌకర్యం లేదు. దాంతో ఎస్టీడీ బూత్‌కెళ్లి ఫోన్ చేశా. ‘యమలీల’లో మెయిన్ విలన్ వేషం ఇస్తున్నట్టు కృష్ణారెడ్డిగారు చెప్పగానే, ఆనందంతో ఉప్పొంగిపోయా. కానీ డేట్ల సమస్య. అవే డేట్లు ‘పల్నాటి పౌరుషం’ సినిమాకిచ్చా. రాజమండ్రిలో షూటింగ్. నిర్మాత ‘ఎడిటర్’ మోహన్‌గారిని బతిమిలాడా. కృష్ణంరాజులాంటి బోలెడుమంది ఆర్టిస్టులతో కాంబినేషన్. కుదరదన్నారు. అయ్యో... బ్రహ్మాండమైన అవకాశం మిస్సయ్యిందే అనుకుంటూ కృష్ణారెడ్డిగారికి ఫోన్ చేసి విషయం చెప్పా. ఆయన ‘‘ఏం పర్లేదు... మీరు వేరే డేట్లు ఇవ్వండి. అప్పుడే చేద్దాం’’ అని నాకు ఊపిరి పోశారు. అలా నాకు ‘తోటరాముడు’ పాత్ర దక్కింది. దాదాపు 20 రోజుల వేషం.
 ఆ రోజు లాస్ట్‌డే. నేను వెళ్లడానికి రెడీ అవుతుంటే... ‘‘మీ మీద పాట ఉంది’’ అని చెప్పారు. ఆశ్చర్యపోయా. క్లైమాక్స్‌లో నాతో సరదాగా ‘చినుకు చినుకు అందెలతో...’, ‘రగులుతోంది మొగలిపొద...’ పాటలకు స్టెప్పులేయించారు. ఈ సినిమా నా జీవితాన్ని ఎంతలా మలుపు తిప్పిందంటే - ఇక నేను రైటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించేశాను. ఒకే ఏడాది దాదాపు 37 సినిమాలు ఒప్పుకునేంత బిజీ అయిపోయా. నేనెక్కడికి వెళ్లినా ‘డిసైడ్ చేస్తా’ అంటూ అభిమానులు సరదాగా మాట్లాడేవారు. ‘చెల్లి పెళ్లి’ కవిత చెప్పమనేవారు. నేను తెలంగాణలో పుట్టి పెరిగా కాబట్టి, ఈ డైలాగులు నేను రాశానని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒక్క అక్షరం కూడా నాదికాదు. నూటికి నూరు శాతం ఈ క్రెడిట్ రచయిత దివాకర్ బాబుదే.’’
 - తనికెళ్ల భరణి
 

మరిన్ని వార్తలు