లీకుతే పీకుతా

30 Jun, 2017 23:06 IST|Sakshi
లీకుతే పీకుతా

ఇండస్ట్రీకి కోపం రాదా మరి! కాస్త అటూ ఇటుగా వంద కోట్లు. అదీ సినిమా స్పెండింగ్‌. మన వంద రూపాయలు ఎవరైనా కొట్టేస్తేనే... కడుపు రగిలిపోతుంది. పిచ్చి పిచ్చిగా కోపం వచ్చేస్తుంది. కండలు, బండలు లేకపోయినా దొంగను పట్టుకుని ఒకటి పీకాలనిపిస్తుంది. మరి వంద కోట్ల సినిమా లీక్‌ అయితే.. పీకాలనిపించదా?!

రీసెంట్‌గా లీకైన రెండు సినిమాలు :  ‘డీజే’ని ఏకంగా ఫేస్‌బుక్‌లో పెట్టారు. ‘జై లవ కుశ’ రఫ్‌ టీజర్‌ని యూట్యూబ్‌లో ఎక్స్‌పోజ్‌ చేశారు. డీజేలో సినిమా బయట పడితే, జై లవ కుశలో క్యారెక్టర్‌ బయటపడింది.

ముక్కలు లీక్‌ అవడం మామూలే.
మొత్తం మూవీనే లీకయితే?!
నిర్మాత గుండె 24 ముక్కలౌతుంది.
కోట్ల డబ్బు మరి! కష్టం మాత్రం.. తక్కువా?!
తేడా వస్తే.. కృష్ణా నగరే మామ.. కృష్ణా నగరే...
సీన్‌ మళ్లీ  మొదటికొస్తుంది!


డీజే! దువ్వాడ జగన్నాథం. గన్‌ పెట్టి పేల్చేస్తుంటాడు కొడుకుల్ని. మనిషి కనిపించడు. వాడు చేసే పని మాత్రమే కనిపిస్తుంది. అమ్మాయిల్ని ఏడిపిస్తే టైర్‌పంక్చర్‌ అవుతుంది. అగ్రో డైమండ్‌ రొయ్యల నాయుడి బంపర్‌ బద్దలౌతుంది. పైకి జంధ్యం జగన్నాథం. లోపల జగమెరిగిన జగన్నాథం. స్లోగా పికప్‌ అయి, ఫాస్ట్‌గా టికెట్‌లు కోసేస్తున్నాడు. పిక్చర్‌హిట్‌. అంతలోనే ఉపద్రవం! డీజే శుక్రవారం రిలీజ్‌ అయింది. మళ్లీ శుక్రవారంలోపు ఫేస్‌బుక్‌లో రీ–రిలీజ్‌ అయింది. ఫేస్‌బుక్‌లో రిలీజ్‌ అవడం ఏంటి? ‘లీక్‌’ కదా అవుతుంది! చిన్నముక్కయితే లీక్‌ అనొచ్చు. మొత్తం సినిమానే లీక్‌ అయితే.. అదీ రిలీజే! పట్టుకోవాలి. ఎవడు ‘రిలీజ్‌’ చేశాడో పట్టుకోవాలి. అవుతుందా? అంత ఈజీ ఏం కాదు. పదిమంది డీజేలు కావాలి. ‘దిల్‌’ రాజుకు అంతమంది డీజేలు ఎక్కడ దొరుకుతారు? పోలీసులకు కంప్లైంట్‌ చేశాడు. హంట్‌ మొదలైంది. స్మార్ట్‌ పోలీసులు చాలా ఫాస్ట్‌గా కేసును డీల్‌ చేస్తున్నారు. దొంగ దొరికితే ఏమౌతుంది? శిక్ష పడుతుంది. తర్వాత? బెయిల్‌ దొరుకుతుంది. తర్వాత? ఇంకో సినిమా లీక్‌ అవుతుంది. సినిమాలు తియ్యాలా? సర్దుకుని వెళ్లిపోవాలా? ఈ లీకుల వెర్రి ఏంటి? ఒకడెవడో చేసే మతిమాలిన పనికి ఇండస్త్రీకి బతుకే లేకుండా పోతుందే!

సాయంత్రం ఎనిమిది గంటలు. సాక్షి కార్యాలయంలో సినిమా డెస్క్‌ బిజీగా ఉంది. ‘ట్వంటీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ స్టార్‌ కమెడియన్‌ పృథ్వీరాజ్‌ పర్సనల్‌ లైఫ్‌పై వస్తున్న వార్తలపై క్లారిటీ కోసం విదేశాల్లో ఉన్న పృథ్వీరాజ్‌తో మాట్లాడుతున్నారు సినిమా పేజ్‌ ఇన్‌చార్జి డి.జి.భవాని.అర్జెంట్‌గా దిల్‌ రాజుతో మాట్లాడాలి! దిల్‌ రాజు ఒక్కరే కాదు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌తో మాట్లాడాలి. కల్యాణ్‌రామ్‌తో మాట్లాడాలి. శోభుతో మాట్లాడాలి. పైరసీల దెబ్బల్ని, లీకుల తాకిడిని తట్టుకుని నిలబడిన వాళ్లలో ఈ నలుగురూ మెయిన్‌. సాక్షి ఫోటో జర్నలిస్ట్‌ శివ మల్లాల రంగంలోకి దిగారు. ‘‘శివా.. చెక్‌–ఇన్‌లో ఉన్నా. నేనే చేస్తా’’ అన్నారు దిల్‌ రాజు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి. దిల్‌ రాజు యు.ఎస్‌. వెళ్తున్నారు. శోభు దొరకడం కష్టం. ఆయన మాస్కోలో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉన్నారు.

రఫ్‌ స్కెచ్‌ కూడా లీకైంది!
జై లవ కుశ.హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌. డైరెక్టర్‌ బాబీ (కె.ఎస్‌.రవీంద్ర). డబ్బులు పెడుతోంది నందమూరి కల్యాణ్‌ రామ్‌. పిక్చర్‌ ఇంకా పూర్తవలేదు. సెప్టెంబర్‌లో రిలీజ్‌ అనుకున్నారు. టీజర్‌ని జూలై మొదటి వారంలో రిలీజ్‌ చేద్దాం అనుకున్నారు. అంతలోనే టీజర్‌ లీకై పోయింది. టీజర్‌ కూడా సినిమాలాగే డిఫరెంట్‌గా ఉండబోతోందని కల్యాణ్‌ ఆల్రెడీ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చేశాడు. అయితే టీజర్‌ ఏమీ డిఫరెంట్‌గా లేదు. ఎందుకు లేదంటే.. అది రఫ్‌ కాపీ. కల్యాణ్‌ రామ్‌ షాక్‌ తిన్నాడు. సైబర్‌ పోలీసులకు కంప్లైంట్‌ చేశాడు. అప్పటికే నష్టం జరిగిపోయింది. సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ వేస్తున్న క్యారెక్టర్‌లలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్‌ ఏంటో బయట పడిపోయింది.

‘భయ్యా.. ఇలా ఎలా జరిగింది?’ అడిగారు శివ. ఎలా జరిగిందో కల్యాణ్‌ చెప్పారు. ఇంటి దొంగే లీక్‌ చేసేశాడు! ప్రొడక్షన్‌లో పై నుంచి బాయ్‌ వరకు అందర్నీ ఫ్యామిలీ మెంబర్‌లానే ట్రీట్‌ చేస్తాడు ఏ నిర్మాతైనా. ఆ నమ్మకంతోనే ఇంట్లో చోరీ జరిగిపోతుంది. ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ.. డీజే, జై లవ కుశ. సినిమాలపై నడవాల్సిన టాక్‌.. సినిమాల లీకులపై నడుస్తోంది! ‘వెధవలు’ అన్నారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌... లీకులు చేసేవాళ్లను. కూర్చున్న కొమ్మను నరుక్కునేవాళ్లు వెధవలు కాక మరేమిటి?

సినిమా రిలీజ్‌ అయ్యాక లీక్‌ అయితే కలెక్షన్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. సినిమా రిలీజ్‌ కాకముందే లీక్‌ అయితే ప్రేక్షకుల ఆసక్తి పలచబడిపోయే అవకాశం ఉంది. రెండూ నిర్మాతలకు నష్టమే. ‘బాహుబలి 2’ చివరి యుద్ధ సన్నివేశాలు కొన్ని లీక్‌ అయ్యాక దర్శక నిర్మాతలకు నిద్రపట్టడం మానేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే మిస్టరీపై ప్రేక్షకులకు ఉన్న ఉత్కంఠ కన్నా, ‘బాహుబలి – ది కంక్లూజన్‌’లో ఫైటింగ్‌ సీన్‌లు ఎలా లీక్‌ అయ్యాయనే మిస్టరీనే రాజమౌళి అండ్‌ టీమ్‌కి కంట కునుకు లేకుండా చేసింది. కష్టాన్ని కొల్లగొడితే ఎవరికైనా కడుపు మండుతుంది. కడుపు కొట్టడమూ కష్టాన్ని కొల్లగొట్టడమూ రెండూ ఒకటే.  సినిమా నిర్మాణంలో పడే కష్టం మామూలుగా ఉండదు. ప్రతి ఫ్రేమ్‌లోనూ కష్టం ఉంటుంది. ఇరవైనాలుగు ఫ్రేమ్‌లలో ఇరవై నాలుగు కష్టాలు కలిస్తేనే ఒక సినిమా. ‘హింసించే రాజు 23వ పులకేసి’లా ఇప్పుడు.. సినిమా వాళ్లకు కొత్తగా యాడ్‌ అయిన 25వ కష్టం.. లీకేజ్‌. లీకేజ్‌తో కలుపుకొని సినిమాకు ఇప్పుడు కొత్త నిర్వచనం.. 25 ఫ్రేమ్స్‌!

చిన్న లీక్‌.. పెద్ద సెలబ్రేషన్‌!
సోషల్‌ మీడియాలో ఒక వర్గం రాత్రీపగలూ మేల్కొనే ఉంటుంది. దానికి పనీపాట ఉండదు. ఒక ప్రాజెక్టు ఉండదు. ఎప్పుడూ ఎగై్జట్‌మెంట్‌ కోసం చూస్తుంటుంది. చిన్న లీక్‌ దొరికినా చాలు సెలబ్రేట్‌ చేసుకుంటుంది. భారీ బడ్జెట్‌తో, భారీ స్టారింగ్‌తో తయారయ్యే సినిమాలను లీక్‌ చేస్తే అదొక భారీ అచీవ్‌మెంట్‌!

ఒక లీకు.. ఐదు రూమర్లు
తొలిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన అతి భారీ లీక్‌.. అత్తారింటికి దారేది! 2013లో పిక్చర్‌ రిలీజ్‌ అవడానికి నెల ముందే యూట్యూబ్‌కి ఎక్కేసింది! పవన్‌ కల్యాణ్‌ స్టార్‌ హీరో. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. స్టార్‌ డైరెక్టర్‌. ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కువగా ఉండే కాంబినేషన్‌. సినిమాలోని ప్రతి పార్టూ లీకైంది! యూనిట్‌ సభ్యులకు చూపించలేదు. ప్రివ్యూ వేయలేదు. మరి ఎలా లీకైనట్లు? అత్తారింటికి దారైతే తెలిసింది కానీ, డిజిటల్‌ దొంగల్ని పట్టుకునే దారే దొరకలేదు. ఎవరు లీక్‌ చేసి ఉంటారనే దానిపై రూమర్లు బయల్దేరాయి. అందుకు కారణం పవన్‌ కల్యాణ్‌!

రూమర్‌ నెం.1
లీకేజ్‌పై పీకే (పవన్‌ కల్యాణ్‌) అయితే చాలా ఎమోషల్‌ అయ్యారు. ‘ఇది పైరసీ కాదు, కాన్‌స్పిరసీ’ అన్నారు. ‘నేను 365 రోజులూ నా సినిమానే ఆడాలని అనుకోను. కానీ అందరూ అలా లేరు’ అన్నాడు. ఎవరా ‘అందరూ’ అని ఇండస్ట్రీ లోపల, బయట అప్పట్లో పెద్ద పరిశోధన. పవన్‌ అంటున్న కాన్‌స్పిరసీ వెనుక నిర్మాత దిల్‌ రాజు ఉన్నాడని పవన్‌ అభిమానులు అనుమానించారు. అత్తారింటికి దారేది చిత్రానికి నైజామ్‌ హక్కుల్ని దిల్‌ రాజుకు ఇవ్వకుండా హీరో నితిన్‌ తండ్రికి ఇచ్చినందుకే దిల్‌ రాజు అలా రివెంజ్‌ తీర్చుకుని ఉంటాడని వాళ్ల ఎనాలిసిస్‌. దిల్‌ రాజు నవ్వేసి ఊరుకున్నారు. రూమర్‌ నెం.2‘కంచే చేను మేసినట్టు’ అని పీకే ఇంకోమాట కూడా అన్నారు! అంతే, కొన్ని చూపుడువేళ్లు పీకే కుటుంబ సభ్యులవైపు మళ్లాయి. రామ్‌ చరణ్‌ అండ్‌ టీమ్‌.. లీక్‌ చేసి ఉండొచ్చని కొందరు అనుమానించారు. రామ్‌చరణ్‌ నటించిన ‘తుఫాన్‌’ చిత్రం రిలీజ్‌ సమయంలో.. ఒకదానికొకటి అడ్డుపడకుండా ఏ పిక్చర్‌ని ముందు రిలీజ్‌ చెయ్యాలనే విషయంపై తుఫాన్‌ టీమ్‌కి, అత్తారింటికి దారేది టీమ్‌కి మధ్య జరిగిన చర్చలు ఫెయిల్‌ అయ్యాయి. దాంతో రామ్‌చరణ్‌ గ్రూపు పీకే మూవీని లీక్‌ చేయించిందని ఒక విశ్లేషణ!  అబ్బాయ్‌.. బాబాయి నవ్వుకుని ఊరుకున్నారు.

రూమర్‌ నెం.3
పీకే నోట్లోంచి కాన్‌స్పిరసీ (కుట్ర) అనే మాట రాగానే జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద కూడా ఓ లుక్కు పడింది. ‘రామయ్యా వస్తావయ్యా’కి అత్తారింటికి దారేది గట్టి పోటీ ఇస్తుందన్న భయంతో జూనియర్‌ ఎన్టీఆర్, అత్తారింటికి దారేది నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఆఫీస్‌లో పని చేసే ఓ కుర్రాడికి డబ్బాశ చూపించి సీడీని బయటికి తెప్పించి లీక్‌ చేయించాడని ఓ అనుమానం. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ తవ్వకాలకు నవ్వుకుని ఊరుకున్నారు. అత్తారింటికి దారేది లీకేజ్‌లో చివరికి తేలిందేమిటంటే..  అరుణ్‌ కుమార్‌ అనే  ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ ఎడిటింగ్‌ రూమ్‌లో మూవీని కాపీ చేసుకుని తన కాన్‌స్టేబుల్‌ ఫ్రెండ్‌కి ఇచ్చాడనీ, అలా ఆ సినిమా లీక్‌ అయిందనీ!

అయ్యో పాపం..!
‘అత్తారింటికి దారేది’కి ముందు.. ‘ఎవడు’ (రామ్‌ చరణ్‌ హీరో) షూటింగ్‌ జరుగుతుండగానే మూవీలోని ఐటమ్‌ సాంగ్‌.. ‘అయ్యో పాపం...’ లీక్‌ అయింది. అది హిట్‌ సాంగ్‌. దానివల్ల నష్టం కన్నా పబ్లిసిటీనే ఎక్కువగా వచ్చింది. లేటెస్టుగా ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రం ‘జై లవ కుశ’ టీజర్‌ లీక్‌ కావడంపై అయ్యో పాపం అనాల్సి వస్తోంది. పబ్లిసిటీ కన్నా నష్టమే ఇక్కడ ఎక్కువగా జరిగింది. ఎన్టీఆర్‌లోని విలనిజాన్ని రిఫ్లెక్ట్‌ చేస్తున్న టీజర్‌లో ‘ఫినెస్‌’ (స్కిల్‌) లోపించింది. సినిమాను ఏదో హడావుడిగా తోసేయబోతున్నారనే అభిప్రాయానికి తావిచ్చేలా ఏమాత్రం క్వాలిటీ లేకుండా ఉంది. రఫ్‌ అలానే ఉంటుందని ఫాన్స్‌కు తెలియదా?

పది కాలాలు నిలవాలి
అంత డబ్బు పెట్టి ఒక నిర్మాత, అంత క్రియేటివిటీ తో ఒక దర్శకుడు, అంత యాక్షన్‌ చేసి ఒక హీరో.. సినిమాను తీసినప్పుడు.. ఆ కష్టం అంతా ఒక్క లీకేజీకి.. కొట్టుకుపోవడం ఎంత అన్యాయం? ఈ అన్యాయాన్ని సినిమా తీసినవాళ్లే కాదు,  చూసే మనం కూడా ప్రశ్నిం చాలి. అప్పుడే పది కాలాల పాటు వాళ్లు మనకు పద్నా లుగు రీళ్ల వినోదాన్ని అందించగలరు.

చచ్చిబతికినట్టు ఉంటుంది – బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ ప్రముఖ నిర్మాత
‘అత్తారింటికి దారేది’ లీక్‌ అయినప్పుడు చచ్చిబతికినట్టయింది! హీరో, డైరెక్టర్‌ సపోర్ట్‌ ఉండబట్టి గట్టెక్కాం. ఇందులో పని చేసే కొందరు వెధవల వల్ల ఈ లీకులు జరుగుతుంటాయి. ‘ఈ సినిమాలో చేశాం’ అని చెప్పుకోవడం కోసం ఇలా చేస్తారు. ‘మగధీర’ అప్పుడు కూడా పెద్ద లీక్‌ అయింది. సీజీ వర్క్‌ చేసిన సీన్‌ ముందే లీక్‌ అయింది. దానివల్ల ఆ సీన్‌ని ఆ సినిమాలో పెట్టలేకపోయాం. లీకులు చేసేవాళ్లు ఒక సంగతి గ్రహించాలి. వేల మంది ఇండస్ట్రీ మీద బతుకుతుంటారు. లీక్‌ చేయడం అంటే వీళ్లందరి జీవితాలతో ఆడుకోవడమే. వీళ్ల మైండ్‌సెట్‌ మారాలి. మైండ్‌సెట్‌ మారని వాళ్ల కోసం చట్టాలు కఠినంగా మారాలి. ఇలా అరెస్ట్‌ అయి, అలా బెయిల్‌పై వచ్చేలా ఉండకూడదు.

అందరు హీరోల ఫ్యాన్స్‌ ఒకటవ్వాలి – దిల్‌ రాజు, డీజే నిర్మాత
లీకేజీ సమస్య అన్ని సినిమాలకూ, అన్నీ లాంగ్వేజీలలోనూ ఉంది. కొన్ని వేల రూపాయల కోసం ఆశపడి, కొన్ని కోట్లరూపాయల సినిమాను డ్యామేజ్‌ చేస్తున్నారు. మనుషుల మెంటాలిటీ మారితే తప్ప ఇలాంటివి ఆగవు. ఒక హీరో సినిమా లీక్‌ అయితే, ఆ హీరో అభిమానులే కాకుండా, మిగతా హీరోల అభిమానులు కూడా లీక్‌లకు వ్యతిరేకంగా సపోర్ట్‌ ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వాళ ఒక హీరో సినిమాకు జరిగింది రేపు ఇంకో హీరో సినిమాకు జరగదని ఏముంది? పైరసీపై ఇలాగే కలసికట్టుగా అభిమానులు ఫైట్‌ చేశారు. ఇప్పుడు ఫిజికల్‌గా పైరసీ లేదు కానీ ఆన్‌లైన్‌లో ఉంది. దీన్ని కూడా అడ్డుకోవాలి. లేదంటే అందరం బాధపడవలసి వస్తుంది.

నమ్మక ద్రోహులు ఉంటారు – కల్యాణ్‌ రామ్‌ సినీ హీరో, జై లవ కుశ నిర్మాత
సినిమా సీజీ వర్క్‌కి మనుషుల అవసరం బాగా పెరుగుతుంది. రకరకాల మనుషులు వస్తారు. అంతా నమ్మకం మీద వదిలేస్తాం. అనుమానిస్తే అసలు ఏ పనీ కాదు. అప్పటికీ కేర్‌ఫుల్‌గా ఉంటాం. అయినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరిదీ క్రిమినల్‌ మైండ్‌ అనలేం. ఇంటి దగ్గర అందరికీ గొప్పగా చూపించుకోవడం కోసం కొందరు ఇలా లీక్‌లు చేస్తుంటారు. జై లవ కుశ కూడా అలాగే లీక్‌ అయింది. ఆన్‌లైన్‌ ఎడిటర్‌ హెల్త్‌ బాగోలేకపోతే అతని ప్లేస్‌లో వేరే మనిషిని పంపాడు. అతడి వల్ల జూనియర్‌ ఎన్టీఆర్‌ విలన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడన్న సంగతి ప్రపంచానికంతటికీ తెలిసింది. ఈ లీక్‌ చేసిన వాడికి గుడివాడలో గర్ల్‌ ఫ్రెండ్‌ ఉంది. ఆ అమ్మాయి దగ్గర షో ఆఫ్‌ చెయ్యడం కోసం చూపించాడు. అలా అలా అది ఫోన్‌లతో తిరిగి నెట్‌లోకి వచ్చింది.
– సాక్షి ‘ఫ్యామిలీ’

మరిన్ని వార్తలు