ట్రంపూర్ణేశ్‌బాబు!

31 Jan, 2017 23:06 IST|Sakshi
ట్రంపూర్ణేశ్‌బాబు!

కైండ్‌ ఖలేజా

అమెరికా కొత్త ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌.. ఖలేజా ఉన్న మనిషి. కైండ్‌నెస్‌ ఉన్న మనిషి. మన సంపూర్ణేశ్‌బాబుది ‘హృదయ కాలేయం’ అయితే.. ట్రంప్‌ది ‘కైండ్‌ ఖలేజా’! సంపూర్ణేశ్‌బాబులో ఒక హీరో ఉన్నాడు. ఒక కెమెడియన్‌ ఉన్నాడు. ట్రంప్‌లోనూ ఆ ఇద్దరూ ఉన్నారు. చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి హీరో. ఆయన్నెవరూ సీరియస్‌ విలన్‌గా చూడడం లేదు కాబట్టి కమెడియన్‌. ఈ ట్రంపూర్ణేశ్‌బాబు భూలోకానికిప్పుడు ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్‌.

ట్వంటీ ట్వంటీకి రెడీ!
‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’. ఎన్నికల్లో ట్రంప్‌ స్లోగన్‌.
‘కీప్‌ అమెరికా గ్రేట్‌’. 2020 ఎన్నికల్లో ట్రంప్‌ స్లోగన్‌!
అయితే నాలుగేళ్ల తర్వాత ఆ స్లోగన్‌ ఇవ్వాలంటే.. ఇప్పటి ఈ స్లోగన్‌ నిజం అవ్వాలి. అంటే అమెరికాకు పూర్వవైభవం మళ్లీ రావాలి. అప్పుడు ‘ఈ వైభవాన్ని కాపాడుకుందాం’ అని 2020లో స్లోగన్‌ ఇవ్చొచ్చు. ట్రంప్‌లో ఇంత కాన్ఫిడెన్స్‌ ఏమిటి... అమెరికా మళ్లీ గ్రేట్‌ అవుతుందని! కాన్ఫిడెన్స్‌ ఉంది కాబట్టే అతడు 2020 స్లోగన్‌ని ముందే రిజిస్టర్‌ చేయించాడు! ముందే.. అంటే ఎంత ముందో తెలుసా? తనింకా ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేయకముందే!

చావరా ట్రంప్‌.. చావు..!
ఈ మాట అన్నది మోదీ

నో.. నో.. నరేంద్ర మోదీ కాదు. పాయల్‌ మోదీ. డాలస్‌లోని ఆడమ్‌సన్‌ హైస్కూల్‌లో ఈ అమ్మాయి టీచర్‌. చాలామందికి ఇష్టంలేనట్లే, పాయల్‌కి కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా  ప్రెసిడెంట్‌ అవడం ఇష్టం లేదు. కానీ అయ్యాడు! ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. అదే రోజున.. అంటే, ట్రంప్‌ ప్రమాణ స్వీకారం రోజున పాయల్‌ పట్టలేని కోపంతో తన క్లాస్‌రూమ్‌లో విద్యార్థులందరూ చూస్తుండగా స్క్రీన్‌ మీద ట్రంప్‌ ముఖంపై వాటర్‌ గన్‌తో కసితీరా నీళ్లు కొట్టింది. అక్కడితో ఆ కసి తీరక.. ‘చావరా ట్రంప్‌.. చావు’ అని పెద్దగా కేకలు వేసింది. దీన్నెవరో వీడియో తీశారు. ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారు. స్కూల్‌ యాజమాన్యం పాయల్‌ మోదీని సస్పెండ్‌ చేసింది. ట్రంప్‌ని కూడా ఇలాగే అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్‌ చేసే చట్టం ఉంటే ఎంతబాగుంటుంది అని పాయల్‌ అనుకుంటూ ఉండి ఉండాలి.

గాడ్‌! నేనిప్పుడు గ్రహాంతరజీవిని!!
మో ఫరా.. డిస్టెన్స్‌ రన్నర్‌. నాలుగు ఒలింపిక్స్‌లో చాంపియన్‌. ముస్లింలను తొంభై రోజుల పాటు అమెరికాలోకి రానిచ్చేది లేదని ట్రంప్‌ ప్రకటించగానే.. హాయిగా నవ్వింది ఫరా ఒక్కడే. ‘ట్రంప్‌ నన్ను ఏలియన్‌ని చేసేశాడు’ అని పడీపడీ నవ్వుతున్నాడు ఫరా. ఫరా బ్రిటన్‌ పౌరుడు. పుట్టింది సోమాలియాలో. ఇప్పుడు ఉంటున్నది అమెరికాలో. ఇథియోపియాలో ట్రైనింగ్‌ ఉంటే ఈ మధ్యే అక్కడికి వెళ్లాడు. ట్రైనింగ్‌ అయ్యాక అమెరికా తిరిగి రావాలంటే మాత్రం... ట్రంప్‌ తెచ్చిన కొత్త చట్టం ప్రకారం కుదరదు! ఫరా ఫ్యామిలీ ఒరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో ఉంది. ‘‘జనవరి 1న బ్రిటిష్‌ మహారాణి నాకు ‘సర్‌’ అనే బిరుదును ప్రదానం చేశారు. జనవరి 27న అమెరికా ప్రెసిడెంట్‌ నన్ను గ్రహాంతర జీవిని (ఏలియన్‌) చేశారు. గత ఆరేళ్లుగా అమెరికాలో జీవిస్తున్న బ్రిటిష్‌ పౌరుడిని నేను. కష్టపడి పనిచేస్తాను. సమాజానికి అంతో ఇంతో సహాయం చేస్తుంటాను. పన్నులన్నీ సక్రమంగా కడుతుంటాను. నా నలుగురు పిల్లల్ని చక్కని విశ్వపౌరులుగా తీర్చిదిద్దుతున్నాను. ఇప్పుడు నేను, ఇంకా నాలాంటి వాళ్లు ఈ పనులన్నీ ఎలా చెయ్యాలి?’ అని ఫరా ఒక ప్రకటనలో హాస్యంతో కూడిన ఆవేదనను వ్యక్తం చేశారు.

ప్రమాణం గుర్తులేదు!
ట్రంప్‌కు ట్వీట్‌ చేయడం బాగా అలవాటు. ఈ మధ్య మన ఇండియన్‌ గురు జగ్జీవాసుదేవ్‌ని ఎవరో అడిగారు.. ‘మీరే కనుక ట్రంప్‌కి పర్సనల్‌ అడ్వైజర్‌ అయితే ఆయనకు ఏం అడ్వైజ్‌ చేస్తారు?’ అని. ‘మీ ట్విట్టర్‌’ అకౌంట్‌ని డైరెక్టుగా మీరే కాకుండా, వేరొకరి చేత హ్యాండిల్‌ చేయించండి అని చెబుతాను’ అన్నారు వాసుదేవ్‌. అదలా ఉంచితే, ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ట్రంప్‌.. ట్విట్టర్‌లో పెద్ద మిస్టేక్‌ చేశారు. తను ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటో పెట్టి దాని కింద ‘జనవరి 21, 2017’ అనే డేట్‌ వేశారు. స్వీకారం జరిగింది 20న అయితే 21 అని రాశారు.

కాల్చినా.. అడ్డువెళ్లదట ఈమె!
కెర్రీ ఓగ్రాడ్‌.. ఉమన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌. యు.ఎస్‌.లోని డెన్వర్‌ బ్రాంచ్‌లో పనిచేస్తోంది. అమెరికా ఎన్నికలకు ముందు, అక్టోబర్‌లో ఆమె ఫేస్‌బుక్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌పై వ్యతిరేకంగా కామెంట్స్‌ పోస్ట్‌ చేసింది. ఒకవేళ ట్రంప్‌ ప్రెసిడెంట్‌ అయి, ఆయన భద్రతా విభాగంలో నేను పనిచేయవలసి వస్తే.. జైలుకైనా వెళతాను కానీ, ‘ఐ వోన్ట్‌ టేక్‌ ఎ బులెట్‌ ఫర్‌ హిమ్‌’ అని రాసింది. ‘టేకింగ్‌ బులెట్‌’  అంటే ప్రాణాలను పణంగా పెట్టడం. ‘ట్రంప్‌ను ఎవరైనా తుపాకీతో కాలిస్తే, ఒక బాడీగార్డుగా ఆ బులెట్‌కి నా గుండెల్ని అడ్డుపెట్టను’ అని ఆమె కామెంట్‌కు అర్థం. ఈ విషయం ట్రంప్‌ వరకు వెళితే.. ఏమో చెప్పలేం కెర్రీని తన పర్సనల్‌ సెక్యూరిటీ హెడ్‌గా చేసినా చేస్తాడు ట్రంప్‌! హి రెస్పెక్ట్‌ ఉమెన్‌.. మోర్‌ దేన్‌ హిజ్‌ లైఫ్‌!

మరిన్ని వార్తలు