త్రికూటాలయం రుద్రేశ్వరుడు

21 Feb, 2017 23:41 IST|Sakshi
త్రికూటాలయం రుద్రేశ్వరుడు

వేయిస్తంభాల గుడిగా ఖ్యాతి చెందిన శ్రీరుద్రేశ్వరాలయం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు చరిత్రాత్మకంగా కూడా విశిష్టమైనది. వరంగల్‌ జిల్లా హన్మకొండలో ఉన్న ఈ శైవాలయం 19వ, 20వ శతాబ్దాలలో విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించి వారి చేత ‘టెంపుల్‌ ఆఫ్‌ హనమ్‌కొండ’గా నమోదు పొందింది. ఒకనాడు వేయి ఎకరాలలో వేలాది స్తంభాలతో భాసిల్లడం వల్లే ఈ ఆలయానికి ‘వేయి స్తంభాల గుడి’ అని పేరు వచ్చిందని అంటారు. ఈ పేరుతో మన దేశంలో ఉన్న గుడి ఇదొక్కటే కావడం తెలుగువారికి గర్వకారణం.

ఓరుగల్లు ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించిన కాలంలో మతాల మధ్య ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉండేది. జైనంతో పాటు శైవ, వైష్ణవ వర్గాలు కూడా తమ ప్రాబల్యం కోసం కీచులాడుకుంటూ ఉండేవారు. మరోవైపు సామ్రాజ్యవిస్తరణలో భాగంగా కాకతీయ ప్రభువులకు ఎక్కువ సమయం యుద్దభూమిలోనే ఉండాల్సి వచ్చేది. రాజ్య సరిహద్దులు పెరుగాలంటే  రాజ్యంలో అంతర్గత శాంతి ఉండాలనీ సామరస్యం కలిగిన సైన్యాలతోటే ఇతర ప్రాంతాలను ఆక్రమించగలమని వారు  గ్రహించారు. అందుకు సంకేతంగా శైవ, వైష్ణవ, జైన మతస్తుల సఖ్యత కోసం త్రికూట ఆలయంగా రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ఒకే ఉపపీఠం పైన, ఒకే పైకప్పు కింద, ఒకే రంగమండపం, ఒకే ముఖమంటపం ఉండే విధంగా పశ్చిమాన శ్రీరుద్రేశ్వరాలయాన్ని, ఉత్తరాన కేశవ ఆలయాన్ని, తూర్పున సూర్యదేవాలయాన్ని నిర్మించారు. కొంతకాలం పూజలందుకున్న దరిమిలా అల్లావుద్దీన్‌ ఖిల్జీ హయాంలో జరిగిన దాడులలో వైష్ణవ, సూర్యదేవాలయాల మూలవిరాట్టులు ధ్వంసం అయ్యి రుద్రేశ్వర ఆలయం మాత్రం సంపూర్ణంగా మిగిలిందని చరిత్రకారుల పరిశోధన.

రాజ్యవిస్తరణకు సంకేతంగా..
అలాగే ఈ గుడి వెనుక మరో కథ కూడా ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రెండవ భేతరాజు తన మంత్రి వైద్యదండనాథుని సహాయంతో చాళుక్య త్రిభువన మల్లుడిని మెప్పించి వెయ్యిమండలాలను తన రాజ్యంలో కలుపుకున్నాడట. ఆ విధంగా వేయి మండలాలను కలుపుకున్నందుకు ఈశ్వరునికి కృతజ్ఞతగా వేయిస్తంభాలతో ఈ దేవాలయం నిర్మించడానికి అంకురార్పణ చేశాడని అంటారు. అతడి కాలంలో మొదలైన పని అతని కుమారుడు రెండవ ప్రోలరాజు (క్రీ.శ 1116–1157) కాలం వరకు కొనసాగింది. చివరకు రెండవ ప్రోలరాజు కుమారుడైన మొదటి ప్రతాప రుద్రదేవుడు (క్రీ.శ.1158– 1195)  నిర్మాణాన్ని ముగించి క్రీ.శ.1163 జనవరి 19న ప్రతిష్టాపనో త్సవం అంగరంగ వైభోగంగా జరిపించాడు. ప్రతాప రుద్రదేవుని పేరు మీదుగానే ఇక్కడి శివుడికి రుద్రేశ్వరుడు అనే పేరు వచ్చింది.

అపురూప శిల్పకళ
నక్షత్ర ఆకారపు పీఠం మీద నిర్మించిన రుద్రేశ్వరాలయంలో అడుగడుగునా శిల్పకళా సౌందర్యం అబ్బుర పరుస్తుంది. గర్భగుడి ద్వారశాఖల్లోని నిలువుపట్టె పాదభాగంలో పూర్ణకుంభం ధరించిన స్త్రీ, చామరగ్రాహిణి, ద్వారపాలకులతో పాటు పొడగాటి చేపను ధరించిన వ్యక్తి కనిపిస్తారు. ఇది ఆనాటి మత్స్యసంపదకు తార్కాణం అని చరిత్రకారుల అభిప్రాయం. దీనికి పైభాగంలో దేవునికి సుప్రభాతం పలుకుతున్నట్లు వీర్నం, కంచు ఢంక, పలక, వాయువీణ, బూరవాద్యాలు ధరించిన వాద్యగాళ్లు, మాలధారులు కనిపిస్తారు. సింహవరుసలు, గొలుసులు, రుద్రాక్షహారాలు, లతలు, కీర్తిముఖహారాలు కనిపిస్తాయి. అంతరాళ ద్వారంపై నటరాజు, దక్షప్రజాపతి, పార్వతిదేవి, ప్రమథ గణాలు చెక్కబడి ఉంటారు.

అతుకులు లేని గోడలు
దేవాలయ గోడలను శిల్పులు అతుకులు, గీతలు కనిపించకుండా ఏకశిలానిర్మితం అనిపించేలా నిర్మించడం అబ్బుర పరిచే విషయం. ఈ గోడలలో కూడా చాలా స్తంభాలను ఉపయోగించారని ఆ విధంగా కూడా ఇది వేయిస్తంభాల గుడి అయ్యిందని భావిస్తున్నారు. ఈ ఆలయ ముఖమంటపం దక్షిణం వైపు ఉంటుంది. దీని నుంచి లోపలికి ప్రవేశించగానే పదహారు స్తంభాలతో చతురస్రాకార నిర్మాణం ఉంటుంది. మనోహరంగా తీర్చిదిద్దబడిన నాలుగు స్తంభాల  మధ్యలో రంగమండపం ఉంటుంది. దారం పట్టేంత సన్నని రంధ్రాలున్న స్తంభాలు ఈ మండపంలో ఉన్నాయి.

జిట్టెడు ఆంజనేయస్వామి ...
ఆలయ బలిపీఠానికి ఆగ్నేయంగా లోపలి వైపు గోడ కింది భాగంలో జానెడు పరిమాణంలో ఉన్న ఆంజనేయస్వామి ఉంటాడు. ఈ అంజనేయస్వామిని ఆలయవాస్తురక్షకుడిగా ఆనాటి శిల్పులు ఏర్పాటు చేశారు. జానెడు కొలతను జిట్టెడుగా జానపదులుగా పిలుస్తారు కాబట్టి ఈ అంజనేయస్వామిని జిట్టెడు అంజనేయస్వామిగా పిలుస్తారు.

మహాగణపతి..
దేవాలయంలో శ్రీరుద్రేశ్వరాలయానికి కుడివైపున నైరుతిమూలలో మహాగణపతి కొలువై ఉన్నాడు. చేతిలో కల్వం, మరోచేతిలో నూరే రాయి ధరించి  వైద్యగణపతిగా కనిపించే ఈ గణపతిని కొలిచిన వారికి ఆయురాగోగ్యాలు కలిగిస్తాడని విశ్వాసం.

నందీశ్వరుడు..
వేయి స్తంభాల గుడిలోని నందీశ్వరుడి శిల్ప సౌందర్యం చూడవలసిందేగాని వర్ణించతరం కాదు. బహుశా కాకతీయుల కాలం నాటి మొదటి నంది కనుక శిల్పులు నందీశ్వరునికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ భారీపరిమాణంలో అనేక ఆభరణాలతో సర్వాంగసుందరంగా చెక్కారు. నందీశ్వరుడు కూర్చొని ఉండి దేవాలయానికి వస్తున్న భక్తులను చూస్తూ చెవులు రిక్కించి ఆలకిస్తున్నట్లు, ఎడమకాలిని పాదంపై మోపి లేవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కన్పిస్తాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ నందీశ్వరునిమూర్తి భారతీయశిల్పకళాచరిత్రలోనే  కాకతీయుల కీర్తిని పతాక స్థాయిలో నిలబెట్టింది.  

ప్రసన్నాంజనేయస్వామి..
ఆలయ పశ్చిమ భాగంలో రావిచెట్టు క్రింద ప్రసన్నాంజనేయస్వామి కొలువై ఉన్నాడు. ప్రతిమంగళవారం స్వామివారికి ప్రత్యేకపూజలు జరుగుతాయి. భక్తులు తమ కోరికలను కోరుకుని రావిచెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ దారం చుడతారు.

శనీశ్వర పూజలు..
రుద్రేశ్వరాలయంలో శనీశ్వరునికి పూజలు నిర్వహించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయని, పూజల అనంతరం శ్రీరుద్రేశ్వరుణ్ణి దర్శించుకోవడం ద్వారా శని పీడ నుండి విముక్తులు కావచ్చునని విశ్వాసం ఉంది. ఆ విధంగా ఈ దేవాలయంలో ప్రతి శనిత్రయోదశి రోజు ఉదయం 5 గంటల నుంచి శనీశ్వరుని విగ్రహనికి తిల, తైలాభిషేకాలు నిర్వహిస్తారు. రాహుకేతు అర్ధాష్టమశని, ఏలిననాటి శని, అష్టమ శని తదితర గ్రహప్రభావాలతో బాధపడుతున్న వారు, శనిగ్రహపీడితులు పూజలలో పాల్గొంటారు.  నవగ్రహ పూజలు, తిలపూజలు, తిలదానాలు, వస్త్రదానాలు చేస్తారు.

శిలాశాసనం..
దేవాలయ తూర్పుద్వారం వద్ద శిలాశాసనం ఉంది. 11 అడుగుల పొడవుతో, నల్లనిశిలతో తయారైన ఈ శాసనం పతాకస్థానంలో రుద్రేశ్వర మహారాజు శ్రీరుద్రేశ్వర మహాశివలింగాన్ని అర్చిస్తున్నట్లుగా ఉంది. పక్కనే నందీశ్వరుడు ఉంటాడు. శాసనానికి మూడువైపులా రుద్రేశ్వర, కేశవ, సూర్యనారాయణమూర్తుల నమూనాలు ఉన్నాయి. ఈ శాసనంలో రుద్రదేవుడి తండ్రి అయిన రెండవ ప్రోలరాజు శౌర్యపరాక్రమాలను విజయయాత్రలను వర్ణించారు. దక్షిణాన శ్రీశైలం, పడమరన కటకం వరకు రుద్రదేవుడి రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయని చెప్పారు. రుద్రేశ్వర, కేశవ, సూర్యనారాయణమూర్తుల నిత్యకైంకర్యానికి మద్దిచెరువుల గ్రామాన్ని రుద్రేశ్వరుడు దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది.

అలసకన్య... ఆలాపన
శ్రీరుద్రేశ్వరాలయం నైరుతిభాగంలో అలసకన్య శిల్పం ఉంది. ప్రతి  పౌర్ణమిరోజున దేవాలయం వెన్నెల వెలుగులో రాత్రి నడిజామున అలసకన్య దేవాలయ ప్రాంగణంలో విహరిస్తుందని నమ్మకం ఉండేదట. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్‌ ఆలాపన అనే నవల రాసారు. ముష్కరుల దాడిలో ఆమె అందమైన ముఖం  ధ్వంసమైపోయింది.

నిత్య పూజలు..
ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీరుద్రేశ్వరస్వామివారిని దర్శించుకోవచ్చు. శివ ప్రీతికరమైన సోమవారాలలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అనుమతిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామివారికి నిర్వహించే మహాహారతి కార్యక్రమం శివ సాన్నిధ్యంలో ఉన్నామా అనిపించే విధంగా మహాద్భుతంగా జరుగుతుంది. దేవాలయంలో ప్రతి హిందూ పర్వదినాన్ని ఘనంగా జరుపుతారు.  తొలిఏకాదశి, శ్రావణమాసోత్సవాలు, శ్రీమహాగణపతినవరాత్రులు, శ్రీదేవీనవరాత్రులు, కార్తీక మాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, ఉగాది మహోత్సవం, శ్రీరామనవమి వేడుకలు, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.

కళ్యాణమండపం..
త్రికూటాలయానికి దక్షిణం వైపున కళ్యాణమండపం ఉంది. ఇక్కడ ఉత్సవాల సమయంలో కళ్యాణోత్సవాలు, వీరుల నృత్యాలు, రాజసందర్శన సమయంలో సభలు జరిగేవి. అయితే, కళ్యాణమండపం శిథిలం కావడంతో ప్రస్తుతం జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. పనులలో సిమెంట్‌ వాడకుండా సాంప్రదాయ పద్ధతులలో ఇసుక, సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమాలతో తయారు చేసిన పదార్థాన్ని ఉపయోగిస్తూ, అలనాటి సంస్కృతికి అద్దం పడుతున్నారు.

రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
చారిత్రాత్మక శ్రీ రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహా శివరాత్రిమహోత్సవాలు ఫిబ్రవరి 23 నుండి 27వ తేదీ వరకు జరగనున్నాయి.
23వతేదీ: 23వ తేదీ మాఘ బహుళ ద్వాదశి గురువారం ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత పూజ, గణపతి పూజ, శ్రీరుద్రేశ్వరశివలింగానికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పుణ్యాహవచనం, అంకురారోపణ, అగ్నిప్రతిష్టాపన, నవగ్రహమంటపారాధన, ఉత్సవవిగ్రహాలపూజ, కలశస్థాపన సాయంత్రం ప్రదోషకాల పూజ పంచమహాహారతి నిర్వహిస్తారు. రాత్రి
సాంస్కృతిక కార్యక్రమాలు.
24వతేదీ: 24 వతేదీ శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి సామూహిక రుద్రాభిషేకాలు, నిత్యవిధిహవనం, సాయంత్రం 6.40 గంటలకు శ్రవణానక్షత్రయుక్త గోధూళిలగ్నసుముహూర్తమున శ్రీరుద్రేశ్వరస్వామి వారి కళ్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి  నడిజాము 12గంటలకు లింగోద్భవసమయంలో జరిపే  మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం జరుగుతుంది.
25 వతేదీ:  25వతేదీ శనివారం ఉదయం 5గంటలకు సుప్రభాతం గణపతిపూజ, స్వామివారికి రుద్రాభిషేకములు, మహాపూజ, నాగవల్లి కార్యక్రమం జరుగుతుంది.
26 వతేదీ:  26వతేదీ ఆదివారం మహాన్నపూజ, అన్నప్రసాదాల వితరణ.
27 వతేదీ: 27వతేదీ  ఉత్సవ ముగింపులో భాగంగా శ్రీఅంజనేయస్వామికి చందనోత్సవం, ఆకుపూజ, శ్రీరుద్రేశ్వరస్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, మహాబిల్వార్చన, చండీహోమం.

కళ్యాణమండపాన్ని వెంటనే పూర్తిచేయాలి..
నిర్లక్ష్యానికి గురైన రుద్రేశ్వరుని ఆలయంలో క్రీ.శ.1959 నుంచి∙పూజలు ప్రారంభమయ్యాయి.  2005 అక్టోబర్‌ 16న జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఏడున్నర కోట్ల రూపాయలతో పనులు జరుగుతు న్నప్పటికీ 10 సంవత్సరాల తరువాత కూడా కళ్యాణమండపం పూర్తి కాలేదు. కళ్యాణమండపం పూర్తయితే చూడాలని తపించిన ఎందరో ప్రస్తుతం లేరు. బడ్జెట్‌ లేదని శిల్పులు పని ఆపివేసి తమిళ నాడు వెళ్లిపోయారు. ప్రభుత్వాలు శ్రద్ధ చూపిస్తేనే ఇలాంటి పనులు పూర్తవుతాయి. కళ్యాణమండపం పూర్తయితేనే దేవాలయానికి పూర్వపు శోభ వస్తుంది. వాస్తుదోషం కూడా తొలగిపోతుంది. – గంగు ఉపేంద్రశర్మ , వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకులు
– అడ్లూరి శివప్రసాద్‌ సాక్షి హన్మకొండ ప్రతినిధి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు