అభివృద్ధికి నడక నేర్పించాడు

7 Jul, 2017 23:45 IST|Sakshi
అభివృద్ధికి నడక నేర్పించాడు

చెరగని ముద్ర

(దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, సాక్షి)
ఆయన చూపులు... సుదీర్ఘ పరిచయపు చిరునవ్వును చిందిస్తూ, చూసే ప్రతివారి వైపూ ఆత్మీయంగా ప్రసరిస్తాయి. ఆయన చేతులు... సదా ఏదో ఇవ్వడానికే తామున్నట్టు ఓ ఆత్మీయ స్పర్శో, చల్లని దీవెనో కురిపిస్తుంటాయి. ఆయన పాదాలు... ఆపన్నుల్ని ఆదుకునేందుకు, బడుగుల బతుక్కు కొత్త భరోసా ఇచ్చేందుకు నిరంతరం ముందడుగు వేస్తూ ఉంటాయి.

 

వైఎస్సార్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కొన్ని ఘట్టాలు

తెలుగువారి జీవన గతినే మార్చిన దార్శనికుడిగా సదా స్మరణీయుడు డా.వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి. అయిదారేళ్ల పాలనలోనే, ఓ తరం మరచిపోని మంచిని మిగిల్చిపోయారు. రాజకీయం–పరిపాలన, ఓ ఆదర్శవంతమైన జమిలి నడకకు తానొక బెంచ్‌ మార్క్‌గా నిలిచారు. ఏళ్లతరబడి ఆయన పాలనాకాలాన్నే ఇంకా గుర్తుతెచ్చుకునేలా, ఇకపైనా గుర్తుపెట్టుకునేలా తనదైన ముద్ర జనజీవితంపై వేసి వెళ్లారు. ప్రతి విధానంలో, ప్రతి నిర్ణయంలో... మూడు దశాబ్దాల తన రాజకీయ అనుభవాల్ని రంగరించి జనహృదయాల్లో స్థిరపడి మహానేత అయ్యారు. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో అనేక ఆటుపోట్లను అపారమైన ధైర్య, స్థైర్యాలతో ఎదుర్కొని ముందుకు సాగారు.

ఆర్థికంగా అన్నీ అమరిన నేపథ్యమే అయినా, రాజకీయ వాతావరణం ఆయనకు వడ్డించిన విస్తరి కాదు! ఆయన ప్రస్థానంలో అలుపెరుగని పోరాటముంది. చదవడం వల్ల వచ్చిన జ్ఞానంతో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వం ఆయనది.  ప్రాపంచిక పరిశీలనతో గడించిన అనుభవం, నరనరాన నిబిడీకృతమైన సహృ‘దయ’త... కలగలిసి వై.ఎస్‌ ‘జననేత’ అయ్యారు. కొన్ని సందర్భాలు, మరికొన్ని సన్నివేశాలు, ఇంకొన్ని అభిప్రాయాలు కలబోస్తే ఆయన చిత్రం ఓ పార్శ్వమైనా కళ్లముందు ఆవిష్కృతమౌతుంది. తెలిసినవారు, ఇంకా ఇలాంటివెన్నెన్నో! అనుకుంటారు. ఇక, ఇవి తెలియనివారు ‘ఔరా! ఎంతటి మానవీయతా!’ అని అబ్బురపడతారు. ఆయన తెలుగునాట గుండె గుండె కింద ఆరని తడి. ఏళ్లు గడిచినా మరుపునకు రాని జ్ఞాపకాల జడి!

అలనాటి ఘటనలు
రాగ్యానాయక్‌ మరణించినప్పుడు...
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. భోజనవిరామంలో ఇంటికి వెళ్లిన రాజశేఖరరెడ్డికి ఓ సమాచారం అందింది. గిరిజన ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను నక్సలైట్లు కాల్చి చంపారు. ఆయన ఒక్కసారిగా చలించిపోయారు. వెంటనే ఘటనా స్థలికి వెళతానని పట్టుపట్టారు. అదంత సురక్షితం కాదని, అంతే పట్టుదలగా పోలీసు, ఇంటలిజెన్స్‌ వర్గాలు వాదించి, వారించాయి. వారు గట్టిగా నచ్చజెప్పిన మీదట, తాను ఆగిపోయి... కట్టుదిట్టమైన భద్రత కల్పించి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దోసపాటి గోపాల్‌ను ఘటనాస్థలికి పంపించారు. అసెంబ్లీలో సంతాప తీర్మాన సమయంలో వై.ఎస్‌ కంటతడి పెట్టారు. ఇంతటి అమాయకుల్ని కూడా నిష్కారణంగా చంపితే ఎలా? అని ఆయన రోదించారు.

ఆర్థికంగా భారమవడం వల్ల ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ప్రాణరక్షణకోసం అదనపు భద్రతా ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నారని వెంటనే ఓ నిర్ణయం తీసుకున్నారు. నెలకు 30 వేల రూపాయల చొప్పున వారి ప్రయాణ భత్యం పెంచేశారు. కాంగ్రెస్‌లో అనేక పొరలు, ఆ పైన అధిష్టానం ఉన్నా, రాగ్యానాయక్‌ కుటుంబ వ్యక్తిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా అప్పటికప్పుడు అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తూ, పోటీ లేకుండా ఉప ఎన్నికల్లో  ఏకగ్రీవంగా గెలిపించాలని విపక్షాలకు వినతి చేసి అదీ సాధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని లక్ష్యం చేసుకొని అలిపిరి వద్ద నక్సలైట్లు మందుపాతర పేల్చినపుడు, విపక్షనేతగా దాన్ని నిరసిస్తూ గాంధీ బొమ్మ వద్ద దీక్షకు కూర్చున్న మానవతావాది ఆయన. సమస్య తీవ్రతను తగ్గించే చిత్తశుద్ధితో నక్సలైట్లతో చర్చలు జరపాలని ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి ఇంటా, బయటా ప్రశంసలు లభించాయి.

రాజకీయాలు మరోలా ఉండేవి
తాను అనుకున్నది సాధించే క్రమంలో ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొనగల ఆత్మవిశ్వాసం గల నేత. ప్రతిపక్షనాయకుడిగానే కాదు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక కూడా వై.ఎస్‌. తక్షణమే పరిష్కరించాలని భావించిన వాటిలో నక్సలైట్ల సమస్య ఒకటి. ఫలితం ఏమయిందన్నది పక్కన పెడితే, దాన్ని పరిష్కరించుకోవాలనడంలో ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. చర్చలకు ఆహ్వానించడమే ఒక చరిత్ర. అది అనుకున్న ఫలితాలు సాధించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మరోలా ఉండేవి.
-బొజ్జా తారకం (ప్రముఖ న్యాయవాది)
 

గురుదక్షిణ ఇచ్చారిలా!
ఉత్తరకోస్తా జిల్లాల్లో అప్పుడా నాయకుడు తిరుగులేని నేత! వైఎస్‌ కూడా ఆయన్ని ఆత్మీయంగా ‘గురువుగారూ’ అని సంబోధించేవారు. అత్యధిక సర్క్యులేషన్‌ గల పత్రికలో ఓ సంచలన వార్త వచ్చింది.  వై.ఎస్‌. ప్రభుత్వాన్ని అస్థిరపరచి, కోస్తా ప్రాంతానికే చెందిన ఓ మహిళా మంత్రిని అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రిని చేయించే ఓ కుట్రకు బీజం పడుతోందనేది కథనం. దీనికి కీలకపాత్రధారిగా సదరు ఉత్తరాంధ్ర ముఖ్యనేత ఉన్నారన్నది విశాఖపట్నం నుంచి పుట్టిన ఆ కథలోని  కీలకాంశం! అది చూసి ఆ నేత బిత్తరపోయారు. మధ్యాహ్నానికి సీఎల్పీ కార్యాలయానికి పరుగు పరుగున వచ్చారు. లేనపోనివన్నీ తనకాపాదించి కట్టుకథలల్లారని, తనకే సంబంధమూ లేదని వాపోయారు. అక్కడ్నుంచే సదరు పత్రికాఫీసుకు ఫోన్‌ చేసి తన ఆగ్రహం వెళ్లగక్కారు. రిపోర్టర్‌ను చెడామడా తిట్టారు. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ సహాయకుడితో చనువుగా మాట్లాడుతూ ఓ సహాయం అభ్యర్థించారు.

‘ఏ పదజాలంతో ఖండిస్తే బావుంటుందో నువ్వే రాసి పంపు, ఇదుగో నా లెటర్‌హెడ్స్‌తో ఉన్న ఖాళీ కాగితం’ అంటూ అప్పటికప్పుడు కింద సంతకం చేసి ఇచ్చారు. అపాయింట్‌మెంట్‌ తీసుకొని అదే సాయంత్రం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన సీఎం వై.ఎస్‌.ను కూడా కలిశారు. ‘మిత్రమా! దుర్మార్గంగా రాశారు. నేనెందుకలా చేస్తాను.....’ అంటూ ఏదో చెప్పబోయారు. వై.ఎస్‌ కల్పించుకొని, ‘....అవునా! అలా రాశారా? నే చూడలేదులెండి! గురువుగారూ... పత్రికల్లో అలా రావడం సహజం.  మీరెందుకు కంగారు పడతారు! మీరేంటో నాకు తెలీదా? నిశ్చింతగా ఉండండి.  మీరవన్నీ మరచిపోండి’ అని అనునయించి పంపారు. అక్కడే ఉండి అవన్నీ చూస్తున్న సీఎం సహాయకుడు, ఆయన వెళ్లిన మీదట... పత్రికలో వార్త ఎలా వచ్చిందీ, మధ్యాహ్నం సీఎల్పీలో ఏం జరిగిందీ వివరించారు. తన సంతకంతో ఖాళీ లెటర్‌హెడ్‌గల లేఖ ఆయన ఇచ్చిన విషయాన్నీ చెప్పారు.  వై.ఎస్‌. ఒక చిర్నవ్వు నవ్వి ఆయన్ని సముదాయించి పంపించారు.

అక్కడ్నుంచి వెళ్లిపోయాక ఓ గంటకు సీఎం నుంచి సహాయకుడికి ఫోన్‌ వచ్చింది. ‘చెప్పడం మరిచిపోయా, ఆయన పేరిట పత్రికకు ఖండన అవసరమా? చూడూ... ఒకవేళ పంపినా, లెటర్‌హెడ్‌తో ఖాళీ పత్రం ఇచ్చాడు కదా! అని ఏది పడితే అది రాసి పంపకు. ఈ వ్యవహారంలో మన గౌరవం ఎంత ముఖ్యమో, అంత పెద్దమనిషి ఆయన గౌరవం కాపాడటం కూడా అంతే ముఖ్యం. దానికి వీసమెత్తు భంగం కలుగొద్దు, జాగ్రత్త సుమా!’ అన్నారు. అదీ వైఎస్‌ విలువలతో కూడిన రాజకీయాలకు మచ్చు తునక. సదరు నేత మరణించాక అదే విశాఖపట్నం నుంచి ఆయన కుమారుడ్ని ఎమ్మెల్యేగా గెలిపించి తన గురుదక్షిణ చెల్లించుకున్న మర్యాద వైఎస్‌ ది!

 
నా సోదరుడు రాజశేఖరరెడ్డి
రాజశేఖరరెడ్డి నేడు రాజకీయాల్లో ఉన్న అనేకమంది నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తారు. విలువల్ని, చక్కటి పరిపాలనా జ్ఞానాన్ని, కార్యాచరణ సామర్థ్యాన్ని ఆయన కలిగి ఉన్నారనడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన అమలు చేసిన అనేకానేక పథకాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇవే నాలో ఆయనపై అభిమానాన్ని, గౌరవాన్ని మరింత పెంచుతాయి. విద్యార్థి దశలోనే ప్రజాసేవపై బాగా ఆసక్తి పెంచుకున్న నా సోదరుడు రాజశేఖరరెడ్డి.
-కరుణానిధి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి


పెల్లుబికే మానవత
పోలీసుశాఖలో పౌర సంబంధాల అధికారులు (పీఆర్వోలు)గా ఉన్న వారి ఫైలొకటి రెన్యూవల్‌ కోసం ముఖ్యమంత్రి వై.ఎస్‌ ముందుకొచ్చింది. ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని నేరుగా కలువలేకపోయింది. ఏటా రెన్యూవల్‌ అవసరమయ్యే తాత్కాలిక నియామకాలయినందున ప్రతిసారీ తమకు నిరీక్షణ తప్పటం లేదని, రెన్యూవల్‌ జరుగకపోతే తాము వీధిన పడతామనీ వారు ఆందోళన చెందుతున్నారని ఎవరో చెబితే విన్నట్టు ముఖ్యమంత్రికి లీలగా గుర్తుంది. అలాంటివి ఆయన మెదడులో స్థిరంగా నాటుకుపోతాయి. పలు విషయాలు గుర్తు చేస్తూ సదా అప్రమత్తంగా ఉంచే ఉన్నతస్థాయి అధికారులిచ్చే సూచనలు, సలహాల కన్నా ఇటువంటి మానవీయ కోణమే ఆయన నిర్ణయాల్ని బాగా ప్రభావితం చేస్తుందనడానికి ఇక్కడి పరిణామమొక మచ్చు తునక! సదరు ఫైలు ముఖ్యమంత్రి ముందుంచిన ప్రిన్సిపాల్‌ సెక్రటరీ స్థాయి అధికారి ఓ మాట చెప్పారు.

‘సర్, వీరంతా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియామకం అయిన వాళ్లు, రెన్యువల్‌ చేయాలనుకుంటేనే చేయొచ్చు, లేదంటే... అంటూ నర్మగర్భంగా ఆగిపోయారు. అప్పుడు లిప్తపాటు ఆలోచించిన ముఖ్యమంత్రి, ‘చూడండి సెక్రటరీ గారు... వారిది పోలీసుశాఖలో పీఆర్వో ఉద్యోగం. వారికి తాము చేసే పని ముఖ్యం. అంతేగానీ నియామకం జరిగింది తెలుగుదేశం కాలంలోనా, కాంగ్రెస్‌ హయాంలోనా అని ఏముంటుంది? వారి ఉద్యోగాలు వార్ని చేసుకోనీయండి’ అని మాట్లాడుతూనే సంతకం చేసేశారు. ఇలా ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, శ్రమజీవులు... ఎందరెందరి జీవితాల్లోనో వెలుగులు నింపిన ధన్యజీవి ఆయన.

 
ఎవరైనా ప్రశంసించక తప్పదు
మొక్కవోని దైర్యం, అచంచలమైన మానసిక స్థైర్యం, చెరగని చిరునవ్వుతో వ్యక్తిగత ఆకర్షణ గల అరుదైన నేత రాజశేఖరరెడ్డి. ఆయనతో ఎవరైనా ఏకీభవించవచ్చు, లేదా విభేదించవచ్చు. కానీ, ఆయన ఉక్కు సంకల్పాన్ని, పేదల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఆయన ఆర్తిని, శక్తివంతమైన ఆయన నాయకత్వ పటిమను మాత్రం ఎవరైనా ప్రశంసించక తప్పదు.                              
 - డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా