బయటికి వచ్చేశారు

21 Sep, 2018 00:09 IST|Sakshi

గృహ నరకం

ఎక్కడ ఇబ్బంది కలిగినా, భయం అనిపించినా, ఇంటికి రాగానే అన్నీ మరచిపోతాం. ఇల్లు ఒక భరోసా, ఇల్లు ఒక నమ్మకం, ఇల్లు ఒక విశ్వాసం. మరి ఆ ఇంట్లోనే నరకం కనిపిస్తే ఏం చేయాలి? వలెరి, రచెల్, నాన్సీ, విక్టోరియా... ఇల్లు చూస్తే భయపడుతున్న అమ్మాయిలు వీరు. ఇంగ్లండ్, వేల్స్‌ ప్రాంతాలలో కనీసం 11 లక్షలమంది మహిళలు నిత్యం గృహ హింసకు గురవుతున్నారని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, సంతానం.. ఎవరో ఒకరి కారణంగా వీరు శారీరకంగా, మానసికంగా ఇంట్లో రక్షణ లేకుండా ఉన్నారని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి. ఈ నలుగురి అనుభవాలను వింటే.. స్త్రీ జీవితం ఎక్కడైనా ఒకేలా ఉందనిపిస్తుంది!

వలెరి 
ఉదయం ఐదు గంటలకే లేచి, ఆయన లేవకముందే పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఆయన కోసం ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం చాలా టైమ్‌ కేటాయిస్తాను. నాకు రెండుసార్లు వివాహం అయ్యింది. రెండు వివాహాలలోను.. నన్ను నియంత్రించడం, నిరంతరం అసభ్యంగా మాట్లాడుతూ హింసించడం అనుభవం అయ్యాయి. నా మొదటి భర్త చొక్కాకి పొరపాటున మరక ఉండిపోయిందని, నా భర్త నాకు వాతలు పెట్టాడు. నా రెండో భర్త ఉద్యోగానికి బయటకు వెళుతూ, నన్ను మెట్ల మీద నుంచి తోసేశాడు, నేను స్పృహ తప్పి పడిపోయాను. ఇటువంటివి ఎన్నని లెక్కించగలను? నా పిల్లలను దృష్టిలో ఉంచుకుని చాలాకాలం అన్నీ అనుభవించాను. చివరికి నేను ఎందుకూ పనికిరాననే భావన నాలో ఏర్పడింది. ప్రపంచం ఎందుకు ఇలా నడుస్తుందో అర్థం కాదు, సాటి మనిషిని హింసించే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు? కాలం ఎంత మారుతున్నా వారి ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. నేనే బయటికి వచ్చేశాను. 

రచేల్‌
నా చుట్టూ ఉన్న సంప్రదాయ యూదు కుటుంబాల వారు.. నా భర్త నన్ను హింసించడం కళ్లారా చూశారు. ఒక్కరూ నా వైపు న్యాయం మాట్లాడలేదు. నా గురించి, నా పిల్లలకు సంబంధించిన కుశలప్రశ్నలు అడగలేదు. ఆయన గదిలోనే కనీసం నేల మీద పడుకోవాలన్నా భయమే. నేను వద్దు అనడానికి వీలు లేదు. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆయన బెడ్‌రూమ్‌లోకి వెళ్లవలసిందే. ఆయన ఎన్ని విధాలుగా హింసించినా, నేను శుభ్రంగా ముఖం కడుక్కుని, శుభ్రంగా రెడీ అయ్యి, ఏమీ జరగనట్టుగా ప్రవర్తించవలసిందే. ఇలాగే రోజులన్నీ గడిచాయి. కబోర్డ్‌లో డబ్బాల మీద లేబుల్స్‌ దగ్గర నుంచి అన్నీ ఆయన చెప్పినట్టుగా ఉండాలి. ఆయన కనుసన్నల్లోనే జరగాలి. పదిహేడు సంవత్సరాల తరువాత నేను ఏం కోల్పోయానో తెలుసుకున్నాను. ఇంతకాలం నా గొంతు నేను నొక్కుకున్నానని అర్థం చేసుకున్నాను. నా మీద నాకే అసహ్యం వేసింది. అప్పుడే నాలో శక్తి బయలుదేరింది. నేను ఇంక బాధితురాలిగా ఉండకూడదని నిశ్చయించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను.    

నాన్సీ
మొదట్లో నేను చాలా సంబరపడ్డాను. అతను ప్రతిరోజు నాకోసమే వస్తున్నాడని, నన్ను కలుస్తున్నాడని నా తరువాతే తనకి అందరూ అని భావించాను. నేను వేరేవారితో ఉంటే, వెంటనే నాకు మెసేజ్‌ పెట్టేవాడు. నా మీద తనకి ప్రేమ చాలా ఎక్కువ అనుకున్నాను. అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినప్పుడు అతనిలో ఎటువంటి భావమూ లేదు. అప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. అంతకుముందు ఎన్నడూ నన్ను ఎవ్వరూ కొట్టలేదు. అంతకుముందు ఎన్నడూ లేనంత భయంకరంగా నన్ను హింసించాడు. గట్టిగా తన్నాడు, చెంప మీద కొట్టాడు, చేతులతో బయటకు తోసేశాడు, తల పగలగొట్టాడు. చివరగా నా గొంతు పట్టుకున్నాడు. నేను భయంతో వీధులలోకి పరుగులు తీసి, పబ్లిక్‌ టాయిలెట్‌లో దాక్కున్నాను. నన్ను వెంటాడుతూ వెనకే వచ్చాడు. ఆ టాయిలెట్‌కి రెండు దారులు ఉన్నాయనే విషయం నాకు తెలియదు. హమ్మయ్య నేను తప్పించుకున్నాను అనుకునేంతలోనే అతడు నా మీదకు రాబోయాడు. ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను పిలిచాను. ఇటువంటి విషయాలను మరచిపోవాలన్నా సాధ్యపడదు. కానీ ఎలా తప్పించుకోవాలో మాత్రం తెలుసుకున్నాను. ఆ తరువాత నేను మగవారితో ఒంటరిగా ఉండటం మానేశాను. అందరూ ఒకేలా ఉండరని తెలిసినా కూడా నాలో ఆ భయం పోలేదు. 

విక్టోరియా
నేను ఇద్దరు మగవారి కారణంగా గృహహింసను అనుభవించాను. నాతో సన్నిహితంగా ఉంటూనే నన్ను హింసించారు వారు. ఆ తరువాత నేను వారి నుంచి దూరంగా వచ్చేశాను. నా మాజీ భర్త మా ఇంటి తలుపులన్నీ మూసేసి, ఆ తరువాత నన్ను, నా కొడుకుని హింసించేవాడు. వాడిని కొట్టకుండా అడ్డుపడేదాన్ని. నా భర్త నా తల మీద సుత్తితో బలంగా కొట్టాడు. 11 సంవత్సరాల నా బిడ్డ నా మాజీ భర్తను ఇంట్లో నుంచి పొమ్మని బయటికి తోసేశాడు. అలా ఆ రోజు నా కొడుకే నన్ను రక్షించాడు. నేను ఆసుపత్రి నుంచి వచ్చాక, నన్ను నేను చంపుకోవాలనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే నా కొడుకు దగ్గర నుంచి నాకు ‘‘అమ్మా! ప్లీజ్, ఇంటికిరా, నాకు నువ్వు కావాలి’’ అని ఒక మెసేజ్‌ వచ్చింది. నా ప్రయత్నం విరమించుకున్నాను. ఈ రోజుకీ  నాకు పీడకలలు వస్తున్నాయి. నిద్రపోతే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భయం నన్ను విడిచిపెట్టట్లేదు. అందుకే కళ్లు మూసుకోలేకపోతున్నాను.
 – రోహిణి

మరిన్ని వార్తలు