ఊరు మెచ్చిన కోడలు

3 Apr, 2018 00:00 IST|Sakshi
విమలా కాదమ్‌

‘‘ఏమిటీ? దాన్ని ఇంట్లోనా?’’ ముఖం చిట్లించిందొకామె. ‘‘దేవుడి గది, వంటగదితోపాటు అది కూడా ఇంట్లోనేనా,భగవంతుడా!’’ మరొకామె. ‘‘ఇల్లు దాటి పదడుగులు వేస్తే పొలాలే.కావల్సినంత ఖాళీ ఉంది. చెట్ల మరుగుఉంది.  మా ఊరికి దాంతో పనిలేదు’’ఇంకొకామె. ‘‘చెరువు గట్టున చేయాల్సినపని ఇంట్లోనా, ఛీఛీ’’ మరో పెద్దాయన.‘దేవుడా, వీళ్లకు ఎలా చెప్పాలి?!  తామెలాంటి స్థితిలో జీవిస్తున్నదీ   వీళ్లకు తెలియడం లేదసలు’.. ఇంటికి వచ్చి తల పట్టుకుని కూర్చుంది విమలా కాదమ్‌. 

మరుసటి రోజు ఎప్పటిలాగానే కాలేజ్‌కి వెళ్లింది విమల. తన ఫ్రెండ్స్‌ పాతికమందికి ఈ సంగతి చెప్పింది. అంతా అంగీకరించారు. ఇంటికి వచ్చి మూడు ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి తయారు చేసింది. ఆ ప్రశ్నలివి..
‘గడచిన ఐదేళ్లుగా గ్రామంలో పాముకాటు మరణాలెన్ని? అవి ఎప్పుడు జరిగాయి?’‘ఆడవాళ్ల మీద అఘాయిత్యాలెన్ని? ఎప్పుడు?’‘నీటి కాలుష్యం కారణంగా వానలు కురిసినప్పుడు రోగాల పాలయిన వాళ్లెందరు?’ఆ తర్వాత విమలా కాదమ్‌ తన ఫ్రెండ్స్‌ బృందాన్ని ఊళ్లో దించింది. స్టూడెంట్స్‌ గుంపులు గుంపులుగా ఇళ్ల మీద వాలిపోయారు. ఇంట్లో వాళ్ల మీద ఈ మూడు ప్రశ్నలతో దాడి చేశారు.

చెరువు గట్టునే చేటు!
బలాత్కారాలు, పాము కాట్లన్నీ బహిర్భూమి కోసం పొలాల్లోకి, చెట్ల మరుగుకు వెళ్లినప్పుడే జరిగాయని బదులిచ్చారు గ్రామస్థులు. ఇక నీటి కాలుష్యం వల్ల వచ్చిన అనారోగ్యాలకైతే లెక్కే లేదు. వానాకాలంలో అతిసార వంటి రోగాల రూపంలో ప్రాణాలు తీస్తున్నది చెరువు గట్టు ‘వాడకమే’నని వారికి తెలియజెప్పారు స్టూడెంట్స్‌. గ్రామస్థులను చైతన్యవంతం చేయడానికి జరిగిన ఈ దాడిలాంటి ప్రయత్నం మంచి ఫలితాలనిచ్చే సూచనలు కనిపించాయి. వేడెక్కిన ఇనుము చల్లబడక ముందే దానిని మలుచుకోవాలి. ఇక అందరికీ నచ్చ చెప్పే పని మొదలైంది. దేవుడి పూజ గది ఉన్నంత మాత్రాన ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి ఉండకూడదనే అపోహను మొత్తానికి వారు తుడిచేయగలిగారు.

‘దీపం’ ఉండగానే ఆలోచన 
విద్యార్థులను చూసి గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు. ‘‘స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ఇంటింటికీ మరుగుదొడ్డి కట్టించాలని ప్రభుత్వ ఆదేశం. నిధులు కూడా దండిగా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమానికంటే ముందే ఎవరికివారే మరుగుదొడ్డి కట్టించుకున్న ఇరవై శాతం మంది మినహా స్వచ్ఛభారత్‌ ప్రయత్నంలో ఒక్క దొడ్డిని కూడా కట్టించలేకపోయాం. ఈ చైతన్యోద్యమంలో మేమూ నడుస్తాం’ అని ఆ పెద్దలు చొరవ చూపారు. తమ వంతుగా ఇంటికి పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయల డబ్బు ఇచ్చారు. స్కీమ్‌ ఉండగానే కట్టించుకోవడం మేలని గ్రామస్థులు కూడా మరుగుదొడ్ల నిర్మాణానికి సిద్ధం అయ్యారు.

మరో ఆరు మిగిలే ఉన్నాయి
నాలుగు వేల ఐదొందల జనాభా ఉన్న ఆ గ్రామంలో ఇప్పుడు 800 మరుగుదొడ్లు ఉన్నాయి. మరో వంద మంది కూడా నిర్మాణం పనులు మొదలుపెట్టారు. ఆ గ్రామం పేరు ఉమ్రాని. కర్ణాటక రాష్ట్రం, చిక్కోడి తాలూకాలో ఉంది. విమల కాదమ్‌ చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో అక్కడి అధికారులకు ఆమె ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తోందిప్పుడు. ‘‘మరో ఆరు గ్రామాలు ఇలాగే కొరకరాని కొయ్యలుగా మిగిలి ఉన్నాయి, ఆ గ్రామాలకు వెళ్లి వాళ్లకూ చెప్పండి ప్లీజ్‌’ అని రిక్వెస్ట్‌ చేశారు తాలూకా ఆఫీసర్‌. పరీక్షలై పోయిన తర్వాత తన ‘చైతన్య యాత్ర’ ప్రారంభించబోతోంది విమలా కాదమ్‌.

►అధికారులు చెయ్యలేని పనిని  కళాశాల విద్యార్థిని విమలా కాదమ్‌ చేయగలిగింది! మరుగుదొడ్డ  నిర్మాణానికి మొరాయించిన  గ్రామస్థుల మనసును ఆమె మార్చగలిగింది.

►కర్ణాటక, హుబ్లీలో ఇటీవల జరిగిన యువ సదస్సులో విమలా కాదమ్‌ ‘బెస్ట్‌ లీడర్‌ 2018’ అవార్డు అందుకున్నారు. అయితే ఆమె తనను గోప్యంగా ఉంచుకోడానికే ఇష్టపడడంతో సదస్సు నిర్వాహకులు మీడియాను ఫొటోలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 

►మరుగుదొడ్ల నిర్మాణం కోసం విమలా కాదమ్‌ నేతృత్వంలో గ్రామస్థులలో చైతన్యం తెచ్చేందుకు బయల్దేరిన సహ విద్యార్థులు.

►అక్షయ్‌కుమార్‌ నటించిన ‘టాయిలెట్‌’  సినిమాలోని ఒక సన్నివేశం: ఈ చిత్రంలో  చూసిన దృశ్యాలు అత్తగారి ఊరిలో విమలా కాదమ్‌కు నిత్యమూ కనిపించేవట.


‘ఇదా! నా మెట్టినూరు!!’ 
విమలా కాదమ్‌ 2016లో పెళ్లి కారణంగా చదువును మధ్యలో ఆపేసింది. పెళ్లి తర్వాత మళ్లీ చదువుకోవడానికి అత్తగారింటికి దగ్గరలో చిక్కోడి తాలూకాలో ఉన్న ఎ.ఎ.పాటిల్‌ ఉమెన్స్‌ కాలేజ్‌లో చేరింది. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘టాయిలెట్‌’ సినిమాలో ఆమె చూసిన దృశ్యాలు అత్తగారి ఊరిలో నిత్యమూ కనిపించేవి. ఓసారైతే వయసు మళ్లిన మహిళలు ముధోల్‌– నిప్పని స్టేట్‌ హైవే దగ్గర బారుగా నిలబడి ఉన్నారు. రోడ్డు దాటితే అంతా ఖాళీ పొలాలే. వాళ్లు వెళ్తున్నది టాయిలెట్‌ అవసరం తీర్చుకోవడానికి అని తెలిసి నివ్వెరపోయింది విమల. తాను కోడలిగా వచ్చింది ఇలాంటి ఊరికా అనిపించింది ఆమెకు. ఏదో ఒకటి చేసి తీరాలనుకుంది. అనుకున్న పని చేసి చూపించింది. దాంతో ఊరు స్వచ్ఛ గ్రామంగా మారింది. విమల ఊరు మెచ్చిన కోడలు అయింది. ఇటీవలే ఆమె హుబ్లీలో జరిగిన 8వ ‘యువ సదస్సు’లో ‘బెస్ట్‌ లీడర్‌ (ఇన్‌ కమ్యూనిటీ ఇంపాక్ట్‌) 2018’ అవార్డు అందుకుంది. 
– మంజీర

మరిన్ని వార్తలు