నువ్వు నువ్వుగా...

12 Nov, 2017 07:49 IST|Sakshi

ఆ రోజంతా ప్రవల్లికను ఏదో తెలియని బాధ వెంటాడుతోంది. ఎటుచూసినా భర్త మాటలే తగుల్తున్నాయి. తానేం చేసింది? భర్తే సర్వస్వం అనుకొని బతికేయడం తప్పా? ఆమెకు ఎటూ పాలుపోలేదు. విడాకులు ఇచ్చే దాకా వెళ్లిపోయాడా? అసలెందుకంట విడాకులు? చంద్రహాస్‌ మాటలు ఆమె చెవిలో గింగురుమంటున్నాయి.‘‘చూడు ప్రవల్లికా! ఓ ఇద్దరు మనుషులు కలిసి బతకాలంటే వారిద్దరి మధ్యా ప్రేమ మాత్రమే ఉంటే చాలని నమ్మే వ్యక్తివి నువ్వు. నీ ఆలోచనల్లో నేను తప్ప ఇంకేం ఉండదు. భార్యాభర్తల మధ్య ఆకర్షణ జీవితాంతం నిలబడితేనే ఆ ఇద్దరి జీవితం బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు, నన్ను నేను గొప్ప స్థాయిలో నిలబెట్టుకోవడం నాకిష్టం. అదే నా ప్రియారిటీ కూడా. వాటిని అర్థం చేసుకొని, నాకు కావాల్సిన స్పేస్‌ నువ్వివ్వాలన్నది నా కోరిక. కానీ నువ్వు నా గురించే ఆలోచిస్తూ, నేను తప్ప ఇంక వేరే ఏదీ లేనట్లు ప్రవర్తించడం నాకు నచ్చట్లేదు. నువ్వు నన్ను ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు. నాకది తెలుసు. కానీ అలా వ్యక్తిత్వాన్ని, ఉనికిని మరచిపోయి బతికేవారంటే నాకు అసహ్యం. నువ్వు నువ్వుగానే ఉండాలని అనుకున్నా. అదెందుకో సాధ్యపడేలా కనిపించట్లేదు. అందుకే విడిపోదామనే నిర్ణయానికే వచ్చేశా.’’

భర్తే అన్నీ అనుకొని ప్రేమించడం, ఇప్పుడు ఆ భర్తనే తనకు దూరం చేస్తోందా? అన్న ఆలోచనే ప్రవల్లికను మరింత బాధపెట్టింది. బాధలో తనకు గుర్తొచ్చే ఏకైక ఫ్రెండ్‌.. కిరణ్మయి. ఎక్కువ ఆలోచించలేదు. కిరణ్మయికి ఫోన్‌ చేసింది. ప్రవల్లిక రమ్మనడంతోనే కిరణ్మయి అన్ని పనులూ వదిలేసుకొని వచ్చింది. ప్రవల్లిక జరిగిందంతా చెప్పుకొని బాధపడింది. ఓదార్చే ప్రయత్నం చేసింది కిరణ్మయి. ప్రవల్లిక పరిస్థితేంటో ఆమెకే అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. ‘‘ఇదంతా నీకు నువ్వే గీసుకున్న పిచ్చి గీతలు. నీ చుట్టూ నువ్వే కట్టుకున్న గోడలు. నువ్వు మారితే అంతా మారుతుంది’’ అంది కిరణ్మయి.ప్రవల్లిక ఏడుస్తూనే ఉంది. ఏడుపు ఆపి ఏదైనా చెప్పన్నట్టు చూసింది కిరణ్మయి.‘‘నువ్వేం చెప్తావో అర్థం కాదు. ఒకరిని అంతలా ప్రేమించడం కూడా తప్పా?’’ ప్రవల్లిక బాధనంతా కోపంగా మలచి చిన్న స్వరంతో సమాధానం ఇచ్చింది. 

‘‘తప్పని అనను. కానీ విను.. ఒక వ్యక్తి ఈ లోకంలో ఎంత మందితో కలిసి బతకాల్సి ఉంటుందో చూడూ!! పేరెంట్స్, వైఫ్, ఫ్రెండ్స్, సొసైటీ.. ఇది ఎక్కడా ఆగేది కాదు. అదో ప్రవాహం. అందరితో కలిసిపోయినప్పుడే మనకు ఒకరిదగ్గరి నుంచి ఆశించే గుణం తగ్గుతుంది. దాన్ని అలా అర్థం చేసుకొని సాగిపోవడమే జీవితం. మన ప్రేమను అందరితో పంచుకోగలిగినప్పుడే ఎమోషనల్‌ డిపెండెన్సీ అన్నది తగ్గిపోతుంది. నీ విషయంలో జరుగుతున్నది ఏంటో నువ్వే చూడూ.. నీ ప్రేమనంతా ఒక్క వ్యక్తికే పరిమితం చేశావ్‌. ఇప్పుడు అదే వ్యక్తి నాకిది కష్టంగా ఉందంటున్నాడు. అతి అన్నది ఏ బంధాన్నైనా దెబ్బతీస్తుంది. ప్రేమన్నది బ్యాలెన్స్‌డ్‌గా సాగాలి. నీ విషయంలో అది జరగట్లేదు. ‘ప్రపంచంతో నేను’ అన్న ఆలోచన తెచ్చుకో! మార్పు నీ దగ్గరే ఉంది.’’ కిరణ్మయి ఎక్కడా ఆపకుండా తన స్నేహితురాలికి ఎప్పట్నుంచో చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పేసింది. ప్రవల్లిక మౌనంగా ఉండిపోయింది. 

‘‘నువ్వేది చెప్పినా ‘నువ్వే కరెక్ట్‌’ అని చెప్పి ఓదార్చే ఫ్రెండ్‌ని కాదు నేను. నీకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండాలి. పరిస్థితులను నీకు నువ్వు అర్థం చేస్కోవాలి. వాటికి నువ్వు నీలా స్పందించాలి. ఇంతవరకు చెప్పగలను ప్రవల్లికా! ఆ తర్వాత ఇంక నీకే వదిలేస్తున్నా’’ అంటూ ముగించింది కిరణ్మయి.ప్రవల్లికకు ఏదో అర్థమైనట్టనిపించింది. కిరణ్మయిని గట్టిగా హత్తుకొని ‘‘థ్యాంక్స్‌ కిరణ్‌!’’ అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. సమాజానికి, మనిషికి ఎక్కడ లింక్‌ తెగిపోతోందో ప్రవల్లికకు మెల్లిమెల్లిగా తెలుస్తోంది. తన తప్పూ అర్థం కాసాగింది. ‘‘ఆంటీ.. నేను వేసిన ఈ పువ్వుల పెయింటింగ్‌ ఎలా ఉందో చెప్పరా?’’ అంటూ చుట్టుముట్టింది ఓ చిన్నారి.‘‘ఆంటీ.. నేను వేసిన ఈ సీనరీ పెయింటింగ్‌ ఎలా ఉందో చెప్పరూ!?’’ అని గడుసుగా అడిగాడో గడుగ్గాయి.మాట్లాడటానికి వీలులేకుండా ఆ చిన్నారుల ముద్దు ముద్దు మాటలు వారి గడుసు చేష్టలు, పెయింటింగ్‌ నేర్చుకుంటూ, అది తనకు చూపించాలని వారు పడే తపన.. అంతా ప్రవల్లికకు ఓ కొత్త ప్రపంచంలా ఉంది. 

ఈలోపు వెనకనుంచి వచ్చి కళ్లు మూసాడు ఇంకో గడుగ్గాయి. ‘‘ఆంటీ మీకోసం నేనేం తెచ్చానో చెప్పుకోండి చూద్దాం..’’
ఆ చిన్నారుల నవ్వుల్లో ప్రవల్లికకు కాలం కూడా తెలియలేదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో, ప్రపంచంతో కలిసి దాన్ని ప్రేమించడంలో ఉన్న అందమేదో ఆమెకు అర్థమవుతూ వస్తోంది. అన్నీ కొత్తగా కనిపించసాగాయి. జీవితంలో ఎప్పుడూ చూడని కొత్త వెలుగేదో ఆమె చుట్టూ చేరింది. అది ఆమె ముఖంలో నవ్వుగా మెరిసింది. మెల్లిగా ప్రపంచానికి ఎక్స్‌పోజ్‌ అయ్యింది ప్రవల్లిక. ఇప్పుడు ప్రవల్లికకు భర్తతో పాటు ఇంకో ప్రపంచం కూడా ఉంది. తన భర్త కోరుకున్న ఒక స్పేస్‌ ఇవ్వగల ప్రపంచం. నువ్వు నువ్వుగా బతకడం అంటే నీకున్న అభిరుచుల్ని అందంగా మలచుకొంటూ అందరికీ ఉపయోగపడేలా బతకడమే అన్న విషయం ప్రవల్లికకు అర్థమవుతోన్న రోజులవి. ప్రవల్లిక భర్త చంద్రహాస్‌ కూడా ఆమెలో వస్తోన్న మార్పును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఏ కారణంతోనైతే ప్రవల్లికకు దూరం కావాలని చందూ అనుకున్నాడో ఆ కారణానికి ఇప్పుడు అర్థమే లేదు. కాలగమనంలో, ప్రవల్లికలో వచ్చిన మార్పులో ఆ కారణం కొట్టుకుపోయింది. రోజులలా దొర్లిపోయాయి. 

 ‘‘కిరణ్మయీ.. నువ్‌ చేసిన హెల్ప్‌కు ఎలా థ్యాంక్స్‌ చెప్పాలో కూడా తెలీడం లేదు.’’ చందూ చెప్తోన్న మాటలను సంతోషంగా వింటోంది కిరణ్మయి.  ‘‘అవేం మాటలు చందూ.. ప్రవల్లిక నీ భార్యే కాదు.. నా ఫ్రెండ్‌ కూడా! తనలో ఈ మార్పు కోసమే మనం ఇంత చేశాం. ఇప్పుడది కనిపిస్తుందంటే అందరికీ సంతోషమేగా!’’ కిరణ్మయి కూడా తన సంతోషాన్ని పంచుకుంది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది కిరణ్‌. అత్తయ్య వాళ్ల ఆనందానికి కూడా అవధుల్లేవు. ఎప్పుడూ పుట్టింటికి పోవడానికి కూడా ఇష్టపడని తను, ఇప్పుడు వాళ్లతో ఆనందంగా గడపటం.. ఒకప్పటి తన ఇష్టాల్లో ఒకటైన పెయింటింగ్‌ లోకంలో మునిగిపోవడం, ఈ ప్రపంచాన్ని ప్రేమించడాన్ని అలవాటు చేసుకోవడం.. అంతా నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి. ప్రవల్లిక తనలా తాను బతకాలని కోరుకున్నా.

 ఇప్పుడదే నిజం అవుతోంటే ఎందుకో సంతోషాన్ని మాటల్లో చెప్పలేకున్నా. ఇంకా చెప్పాలంటే తనకోసం మేమొక పెయింటింగ్‌ స్కూల్‌ కూడా పెట్టాలనుకుంటున్నాం.’’ చందూ సంతోషాన్ని ఆపుకోలేక మాట్లాడుతూనే వెళుతున్నాడు. ‘‘కూల్ చందూ..’’ ‘‘కానీ ఒక భయం ఉంది కిరణ్‌..’’‘‘దేనికి భయం?’’‘‘మనం ఆడిన విడాకుల నాటకం బయటపెట్టాల్సిన రోజు వచ్చేసింది కదా! ఇదంతా నాటకమని తెలిస్తే తనెలా రియాక్ట్‌ అవుతుందో?’’‘‘అంతా మంచే జరుగుతుంది చందూ..’’చందూ ఫోన్‌ కట్‌ చేసి హాల్లో ఆరోజే గోడకు పెట్టిన ఒక పెద్ద సైజు ప్రవల్లిక ఫోటో చూస్తూ నవ్వాడు. అందులో నవ్వుతూ ఉన్న ప్రవల్లికతో అతడు కొద్దిసేపట్లో మాట్లాడాలి. అసలు విషయం చెప్పాలి. 

మరిన్ని వార్తలు