నిన్ను నువ్వు కనవే తల్లి

29 Sep, 2017 23:56 IST|Sakshi

ఇవాళ దశమి. విజయదశమి.
తొమ్మిది అవతారాలనూ సెలబ్రేట్‌ చేసుకునే రోజు.
మరి.. సంతోషంగా, సంపూర్ణంగా, నిండుగా జీవించడానికి
ఈ ప్రపంచంలో నేటి మహిళ ఏ అవతారం ఎత్తాలి?!
అమ్మవారి తొమ్మిది అవతారాలనూ కలుపుకుని..
మహిళ... ఓ కొత్త శక్తిగా అవతరించాలి.  
తనలోంచి తనే జన్మించాలి! ఎప్పుడూ ఒకర్ని మోయడమేనా?
ఎప్పుడూ ఒకర్ని కనడమేనా? నిన్ను నవ్వు కను తల్లీ.
నీలోంచి నువ్వు అవతరించి అసమానతల్ని సంహరించు.
శక్తి స్వరూపమై ప్రభవించు.

అమ్మవారి తొమ్మిది అవతారాల్లా ఇవి..
ప్రతి స్త్రీకీ అవసరమైన తొమ్మిది హక్కులు.
ఇంట్లో వాటిని సాధించుకుంటే.. ఇలలో తిరుగే ఉండదు.

అడిగే హక్కు
త్రిపుర ఒక్కటే ఇంట్లో ఆడపిల్ల. మిగతా ఇద్దరూ మగపిల్లలు. త్రిపుర అమ్మానాన్న చెప్పినట్లు వింటుంది. చెయ్యొద్దన్నవి చెయ్యకూడదనే అనుకుంటుంది. కానీ ఎంతైనా చిన్నపిల్ల. త్రిపురకు కూడా అన్నయ్యల్లా ఫ్రీ బర్డ్స్‌గా ఉండాలనిపిస్తుంది. అన్నయ్యల్లా ఇప్పుడు తనక్కూడా టూ వీలర్‌ నేర్చుకోవాలనిపిస్తోంది! ‘నీకెందుకమ్మా ఆడపిల్లవు?’ అనేసింది అమ్మ! నాన్నయితే.. ‘ఆడపిల్లలు బయట తిరక్కూడదు’ అని.. పుట్టినప్పట్నుంచీ అంటూనే ఉన్నాడు. త్రిపుర ఆలోచిస్తోంది. ఇంట్లో వాళ్ల ఇష్టం కోసం తన ఇష్టాలను చంపుకుంది. అన్నయ్యలు ఆడుకోడానికి వెళితే, తను వంటింట్లో అమ్మకు హెల్ప్‌ చెయ్యడానికి వెళ్లింది. అన్నయ్యలతో గొడవ పడినప్పుడు.. ‘మగపిల్లల్తో ఏమిటే.. కాస్త అణుకువగా ఉండు’ అనే మాటను కూడా తనే పడింది. అన్నయ్యల స్కూల్‌ బ్యాగును, అన్నయ్యల లంచ్‌ బాక్స్‌నూ తనే సర్దిపెట్టింది. ఇంట్లో తనొక ఆడపిల్లలా లేదు. ఇంకో ‘అమ్మ’లా ఉంది. ఇప్పుడు తను అమ్మాయిలా ఉండే హక్కును కోరుకుంటోంది. ఎలాగైనా నాన్నను ఒప్పించి వచ్చే బర్త్‌డేకి గిఫ్టుగా.. డ్రైవింగ్‌ నేర్చుకోడానికి నాన్న నుంచి లైసెన్స్‌ తెచ్చుకోవాలని నిశ్చయించుకుంది. నాన్న లైసెన్స్‌ ఇస్తే చాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తనకు చిటికెలో పని అని త్రిపురకు తెలుసు.

కదిలే హక్కు
లలితకు పెళ్లయి రెణ్ణెల్లే అయింది. నవదంపతులు నవ్వుతూ తుళ్లుతూ ఉన్నారు. ఊళ్లు, గుళ్లు తిరుగుతున్నారు. పుట్టింటి నుంచి, పుట్టిన ఊరి నుంచి లలిత బయటికి రావడం అదే మొదటిసారి. గడప దాటిన లలితకు ప్రతిదీ కొత్త ప్లేసే. అయినా బెరుకు లేదు. కంగారు లేదు. బిడియం లేదు. పక్కన భర్త ఉంటే చాలు.. అది తన బర్త్‌ ప్లేస్‌ అన్నంత స్వేచ్ఛగా ఉంటోంది లలిత. భర్త వెంట రోడ్డు మీద వెళుతుంటే స్వేచ్ఛ. భర్తతో కలిసి సినిమా చూస్తుంటే స్వేచ్ఛ. భర్త, తను రెస్టారెంట్‌కి ఎదురెదురుగా కూర్చొని భోజనం చేస్తుంటే స్వేచ్ఛ. భర్త స్నేహితులతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతుంటే స్వేచ్ఛ. అన్నీ కొత్త ప్రదేశాలే, అందరూ కొత్త మనుషులే. ప్రతిచోటా కలిసిపోయింది. కానీ ఒకే ఒక కొత్త ప్రదేశంలో లలిత స్వేచ్ఛగా కలవలేకపోతోంది. స్వేచ్ఛగా కదల్లేకపోతోంది. అది.. ఆమె మెట్టినిల్లు! అత్త, మామ, మరిది, ఆడపడుచు.. అంతా అయినవాళ్లే. అయినా ఆమెకు కొత్త పోవడం లేదు. ఇంకా వింతేమిటంటే.. ఆ ఇంట్లో ఉన్నంతసేపూ భర్త కూడా తనకు కొత్త వ్యక్తిలా అనిపిస్తున్నాడు. లలిత ఆలోచించింది. అందరికీ అన్నీ అందించినంత మాత్రాన కొత్త పోదు. మెట్టినింటి అలవాట్లకు తనూ అలవాటు పడడం వల్ల కొత్త పోదు. కొత్త పోవడం అంటే తను తనలా ఉండడం. అందరికీ అన్నీ అందిస్తూనే, తనకూ కొన్ని అందివచ్చేలా చేసుకుంది. మొదట రెస్పెక్ట్‌ అందుకుంది. దాంతో పాటు వచ్చే ఫ్రీడమ్‌నూ అందుకుంది.

ఎంపిక హక్కు
గాయత్రికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ‘చూస్తున్నారు’ కాదు. వస్తున్నాయి. అందమైన పిల్ల. అణుకువ ఎలాగూ ఉంటుంది. మంచి ఉద్యోగం. మంచి కుటుంబం.  మరి రాకుండా ఉంటాయా? ఆ వచ్చేవాళ్లు కూడా తక్కువేం కాదు. ఆస్తులు, అంతస్తులు ఉన్నవాళ్లు, ఎన్నారైలు, ఐఏఎస్‌లు. కట్నం వద్దన్నారు. బంగారం వద్దన్నారు. ఇవన్నీ కాదు. అబ్బాయి అందగాడు. సకల సుగుణాభిరాముడు. ఇంకేం కావాలి? గాయత్రి తల్లిదండ్రులు కూడా ఇంకేం అక్కర్లేదనుకున్నారు. ఆఖరికి తమ కూతురు మనసులో ఏముందో కూడా తెలుసుకోనక్కర్లేదనుకున్నారు. నిజానికి గాయత్రి మనసులో ఎవరూ లేరు. కానీ.. ఎప్పుడు చేసుకోవాలో, ఎలాంటి వారిని చేసుకోవాలో తనకో క్లారిటీ ఉంది. జీవితాంతం తను కలిసి నడవాలనుకుంటోంది తప్ప, ఏడడుగుల కోసం ఎవరినో ఒకర్ని కలుపుకుపోవాలని అనుకోవడం లేదు. ఆ సంగతే అమ్మకు, నాన్నకు చెప్పేసింది.

నడిపే హక్కు
లక్ష్మి ఉద్యోగం చేస్తోంది. నెలంతా కష్టపడుతుంది. నెలయ్యాక ఆ కష్టాన్నంతా భర్త చేతుల్లో పెడుతుంది! అసలు ఆమె పెట్టేలోపు అతడే లాగేసుకుంటాడు. లక్ష్మి పే స్లిప్పు, ఆమె చేతిలోని జీతం రెండూ చెక్‌ చేసుకుంటాడు. రెండు రూపాయలు తేడా వచ్చినా.. ఏం చేశావ్‌ అంటాడు! ఇంటి ఖర్చులకని లక్ష్మి జీతంలోంచే లక్ష్మికి కొంత తీసి ఇస్తాడు. ఇక నెలంతా ఆమె పడాల్సిందే. పాల బిల్లు. నువ్వే ఇవ్వు; పేపర్‌ బిల్లు. నువ్వే ఇవ్వు; వాటర్‌ బిల్లు. నువ్వే ఇవ్వు; పిల్లల ఫీజు. నువ్వే ఇవ్వు; అన్నిటికీ లక్ష్మీనే ఇవ్వాలి. లక్ష్మి భర్తకు ఎంత జీతం వస్తుందో లక్ష్మికి తెలియదు. ఇంటి ఖర్చులకు ఎందుకు డబ్బు ఇవ్వడో తెలీదు. అడగడానికైతే అడుగుతుంది. ‘‘ఉద్యోగం చేస్తున్నానని పొగరా! నీ ఒక్క సంపాదనతోనే ఇల్లు గడుస్తోందా?’’ అని రంకెలేస్తాడు. ఇంటి ఇన్‌స్టాల్‌మెంట్‌లన్నీ లక్ష్మి జీతం నుంచే. బ్యాంకు లోన్‌లన్నీ లక్ష్మి జీతం మీదే. చేతిలో రూపాయి మిగలదు. రవిక ముక్క కొనుక్కోవాలన్నా చెయ్యి చాచాలి. లక్ష్మి ఆలోచనలు చేతిలోంచి జారిపడిన కరెన్సీ కాగితాల్లో ఎగురుతున్నాయి. తను ఉద్యోగం చేస్తోంది. ఎప్పుడూ రూపాయి కోసం దేవులాటే. పక్కింట్లోని శారద ఏ ఉద్యోగమూ చేయడం లేదు. పైగా నెలాఖర్లో తనే వాళ్లకీ వీళ్లకు వందా రెండొందలు చేబదులు ఇస్తుంటుంది. సంపాదించడం ఆర్థిక స్వాతంత్య్రం కాదు. ఖర్చు పెట్టే వీలుండడం ఆర్థిక స్వాతంత్య్రం. తన జీతాన్ని తనే మేనేజ్‌ చెయ్యాలని లక్ష్మి గట్టిగా తీర్మానించుకుంది. భర్త వింటాడా? ఆమేమీ ‘ఇమ్మని’ అడగడం లేదు కదా. ‘ఇవ్వను’ అని మాత్రం చెప్పబోతోంది.

వద్దనే హక్కు
దుర్గకు ఒంట్లో బాగోలేదు. భర్త వచ్చేటప్పటికి నీరసంగా పడుకుని ఉంది. అతడి కోసం డైనింగ్‌ టేబుల్‌ మీద అన్ని సర్ది వచ్చే పడుకుంది. భర్త వచ్చాడు. ఆమె దగ్గరికి రాలేదు. స్నానం చేశాడు. భోజనం చేశాడు. తర్వాతే ఆమె దగ్గరకు వచ్చాడు. మరింత దగ్గరకి వచ్చాడు. ఒంట్లో బాగోలేదని చెప్పింది. టాబ్లెట్‌ వేసుకున్నాననీ చెప్పింది. ‘తగ్గుతుందిలే’ అని తనవైపుకు లాక్కోపోయాడు. ఆమెకు ఒళ్లు  సహకరిస్తే కదా! ‘నా వల్ల కాదు’ అంది. మీద పడబోయాడు. దుర్గ ప్రతిఘటించింది. ఎక్కడి నుంచి వచ్చిందో అంత శక్తి! భర్తను గట్టిగా నెట్టేసింది. ‘‘నువ్వు భార్యవేనా?’’ అన్నాడు ఉక్రోషంగా. కాదు. ‘‘నా ఒంట్లో బాగోలేనప్పడే కాదు, నా మనసు బాగోలేనప్పడు కూడా నేను నీ భార్యను కాదు’’ అంది దుర్గ. ‘‘నువ్వు భర్తవి కావచ్చు. నేను భార్యను కావచ్చు. నా బాడీ అండ్‌ మైండ్‌ నాకు సహకరించకపోతే, నేనూ నీకు సహకరించలేను’’ అని గట్టిగా చెప్పేసింది దుర్గ.

సహోద్యోగ హక్కు
రాజేశ్వరి వర్కింగ్‌ ఉమన్‌. ఆఫీసులో చలాకీగా ఉంటుంది. చక్కగా పనిచేస్తుంది. కొలీగ్స్‌తో కలిసిపోతుంది. ఎవరైనా పర్సనల్‌ ప్రాబ్లం చెబితే వింటుంది. సొల్యూషన్‌ చెబుతుంది. వాళ్ల గురించి వీళ్లకు, వీళ్ల గురించి వాళ్లకూ చెప్పదు. అలాంటి మనిషిపైనా కూడా ఏవో విమర్శలు వచ్చాయి. లొడబుచ్చి అని, ఓవర్‌స్మార్ట్‌ అనీ, బాస్‌ ఈవిడ మాటే వింటాడనీ.. ఏవేవో కామెంట్స్‌. రాజేశ్వరి నొచ్చుకుంది. అలాగని తననేం మార్చుకోలేదు. ఆఫీస్‌లో తన బర్త్‌డేకి చిన్న పార్టీ ఇచ్చింది. అప్పుడే తన మనసులో మాట బయట పెట్టింది. జీతం కన్నా, ప్రమోషన్‌ల కన్నా.. కొలీగ్స్‌ ఒకరికొకరు ఇచ్చుకునే రెస్పెక్ట్‌ విలువైనది అని చెప్పింది. ఎవరి కుటుంబ సభ్యులు వారికి ఉన్నా, ఆఫీసు సభ్యులు కూడా తన అత్మీయ సభ్యులేనని చెప్పింది.  

చెప్పే హక్కు
మహి! పేరుకే మహి. ఏమీ తెలీదు. ఎలా ఉండాలో తెలీదు. ఎలా ఉండకూడదో తెలీదు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు. ఎలా పెంచకూడదో తెలీదు. వట్టి దేభ్యం ముఖం.  తెలివితక్కువ. పల్లెటూరి బైతు. నాజూగ్గా ఉండడం చేతకాదు. వంట చేస్తే రుచీపచీ ఉండదు. ఇంటి పనిలో శుచీ శుభ్రత ఉండదు.. ఇవన్నీ మహి గురించి మనం చెప్పుకుంటున్నవీ కాదు. ఆమె భర్తగారి స్టేట్‌మెంట్స్‌. పిల్లల ముందు, బంధువుల ముందు, స్నేహితుల ముందు, బయట అపరిచితుల ముందు ఆయనగారు మహికి ఇచ్చే సర్టిఫికెట్స్‌. మహికి గానీ, ఇంకో మహిళకు గానీ.. భర్త కంటే ఎక్కువ తెలియకపోయినా, భర్తకు సమానంగానైనా తెలియకపోతుందా. ఆ సంగతి గ్రహించలేని భర్తదా తెలియనితనం? భార్యదా ఆ మంచితనం.

విశ్రాంతి హక్కు
సరస్వతి ఉదయాన్నే లేచింది. ఇల్లూ వాకిలీ ఊడ్చింది. పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపింది. భర్త లేచేలోపు ఆయనకు కావలసినవన్నీ అమర్చింది. పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయాక, భర్త ఆఫీస్‌కి వెళ్లిపోయాక, అత్తమామలకు ఆ పూట సేవల ప్రేమానురాగాలను అందించాక సరస్వతికి కాస్త నడుము వాల్చాలనిపించింది. వాల్చబోతుండగా పిల్లలు వచ్చేశారు. పెద్దవాళ్లూ లేచారు. మళ్లీ తెల్లారినంత పనైంది. మళ్లీ టిఫిన్లు, మళ్లీ అన్నాలు, మళ్లీ పక్క సర్దుళ్లు. మళ్లీ అందరి నిద్రలు. పదకొండయింది. పన్నెండయింది. భర్తగారు ఉదయించారు. లేచి ఆయనకూ వడ్డించింది. చివరికి తను మిగిలింది. తనూ తిందామనుకుంది. ఓపిక లేక వాలిపోయింది. ఏ ఇంట్లో అయినా ఇల్లాలికి తినేందుకు ఇంత ముద్ద ఉంటుంది. కానీ తినే ఓపికే ఉండదు. ఆమెకు విశ్రాంతి అనే ముద్ద కావాలి. అది పెట్టేదెవరు? తీసుకోనిదే.. ఏ ఇల్లయినా ఇల్లాలికి విశ్రాంతిని ఇస్తుందా?!

మాట్లాడే హక్కు
పూర్ణ నోట్లోంచి మాట తొణకదు. నిండు కుండ! కానీ అది కన్నీటి కుండ. చిన్నప్పట్నుంచీ కళ్లలోనే దాచిపెట్టుకున్న నీళ్లు అవి. మాటలొచ్చీ మాట్లాడని అమ్మాయి ఊళ్లో ఎవరూ అంటే పూర్ణ. స్కూల్లో ఎవరూ అంటే పూర్ణ. కాలేజీలో ఎవరూ అంటే పూర్ణ. పెళ్లి చూపుల్లోనూ మాట్లాడలేదు. పెళ్లయ్యాకా మాట్లాడలేదు. ‘మాటలన్నీ మీవే.. మాట వినడమే నేను’ అన్నట్లు ఉండిపోయింది పూర్ణ. కాకి ఒక్కోరాయినీ కుండలో వేస్తే నీళ్లు పైకి వచ్చినట్లుగా.. పూర్ణ ఒక్కో మాటనూ మింగీ మింగీ కళ్లలోకి నీళ్లు తెచ్చేసుకుందా అన్నట్లు ఉంది ఇప్పుడు. ఆ నీళ్లన్నీ పొంగి పొర్లి, మనసు తేలికపడాలంటే పూర్ణ మాట్లాడాలి. పూర్ణ వయసు ఇప్పుడు 50 ఏళ్లు. చాన్స్‌ ఇస్తే ఇప్పుడు తనేం మాట్లాడుతుంది? ఏమైనా మాట్లాడనివ్వండి. కానీ చాన్స్‌ ఒకరు ఇవ్వడం కాదు. పూర్ణే తీసుకోవాలి.

                                                                                                                              (ఫోటోలన్నీ ప్రతీకాత్మక చిత్రాలు)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా