మాధురితో ఏక్‌.. దో.. తీన్‌

29 Apr, 2020 03:52 IST|Sakshi

మనిషిని కడిగేసే శానిటైజర్‌.. డ్యాన్స్‌. శుభ్రమైపోతాయి బాడీ అండ్‌ మైండ్‌.. డ్యాన్స్‌ చేసినా.. డ్యాన్స్‌ చూసినా! ‘తాం.. దిగిదిగి తాం.. దిగిదిగి.. తాం..’ ఇదొకటే కాదు డ్యాన్స్‌కి తాళం.  మనసు ఉద్వేగాన్ని తెరిచే ప్రతిదీ! ‘సాగర సంగమం’లో ఇన్విటేషన్‌ చూసి కమల్‌హాసన్‌ మనసు నాట్యం చేస్తుంది. నేడూ రేపు మనతో డ్యాన్స్‌ చేయించడానికి అలాంటి ఇన్విటేషన్‌నే ఇస్తున్నారు మాధురీ దీక్షిత్‌.

నిలువనివ్వనిదేదో డ్యాన్స్‌లో ఉంది. రక్తప్రసరణలా నృత్యప్రసరణ! మనిషిని నిటారుగా ఉండనివ్వదు. కొద్దిగా వచ్చినవాళ్లను కూడా క్రీస్తుపూర్వపు నృత్య పండితుడు భరతముని ఆవహించి ఆడించేస్తాడేమో! ‘సాగర సంగమం’లో కమల్‌హాసన్‌కి భరతనాట్యం వచ్చు. కూచిపూడి వచ్చు. కథాకళి వచ్చు. కథక్‌ కూడా కొంచెం వచ్చు. కొంచెంతో తృప్తిపడడు. దాహం. నృత్యదాహం. డబ్బులుండవు. గురువుగారికి సేవచేసి రుణం తీర్చుకుంటానని చెప్పి కథక్‌ క్లాసులకు ఎంట్రీని ఇప్పించుకుంటాడు. ఆ ఆనందంలో డాన్స్‌ చేస్తుంటాడు.
‘‘సరే పదా’’ అంటాడు శరత్‌బాబు వచ్చి.
‘నువ్వు వెళ్లు.. ’ అంటాడు.. చేత్తో ‘వెళ్లు’ అని అభినయిస్తూ. 
‘‘సరే, అట్టాగే మణిపురి, భోజ్‌పురి, ఒడిస్సీ, అస్సాం, గుస్సాం, బుస్సాం.. అవి కూడా నేర్చుకో. దాంతోనే జీవితమంతా సరిపోతుంది. తొందరగా ఇంటికొచ్చి ఏడువ్‌’’ అనేసి తను వెళ్లిపోతాడు శరత్‌బాబు.
డ్యాన్సే జీవితం అనుకున్నప్పుడు జీవితమంతా డాన్స్‌కే సరిపోవడం అంటూ ఏముంటుంది? అయితే కమల్‌ని గానీ, మాధురీ దీక్షిత్‌ని గానీ.. కోర్సు పూర్తయింది కదా.. అని వదిలేసి పోదు డ్యాన్స్‌. ఆడిస్తుంది. ఓ పెద్ద వేదిక మీద గిర్రున తిరిగి అలసి పడిపోయేంత వరకు.

‘‘అవునూ.. ప్రతి సంవత్సరం ఆలిండియా మ్యూజిక్‌ ఫెస్టివల్స్, డాన్స్‌ ఫెస్టివల్‌ జరుగుతాయంటారు.. అంత గొప్పగా ఉంటాయా?’’.. సాగర సంగమంలోనే.. జయప్రద అడుగుతుంది కమల్‌ని. ‘మరీ! చాలా విశేషం కదండీ. ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, దేశదేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కోసారి ప్రైమ్‌ మినిస్టర్‌ కూడానండీ. అంతమంది పెద్దవాళ్ల ఎదుట, తోటి కళాకారుల సమక్షంలో పెర్ఫార్మెన్స్‌ ఇవ్వాలంటే జాతకంలో రాసి పెట్టి ఉండాలండీ’ అంటాడు. కనీసం ఆ ఫెస్టివల్స్‌ని చూసే భాగ్యం కూడా కలిగివుండదు కమల్‌కి తన లైఫ్‌లో. ఓసారెప్పుడో గురువుగారి దగ్గర్నుంచి ఒక్క ఇన్విటేషన్‌ సంపాదిస్తే, సరిగ్గా వెళ్లే టైమ్‌కి డబ్బుల్లేక ఆగిపోతాడు. జయప్రద అడిగితే అదే చెబుతాడు. ‘‘ఈసారి జరిగే డ్యాన్స్‌ ఫెస్టివల్‌కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్‌లు ఉన్నాయి. వెళతారా?’’ అని అడుగుతుంది జయప్రద. అతడా ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే తన హ్యాండ్‌ బ్యాగులోంచి ఒక ఇన్విటేషన్‌ తీసి ఇస్తుంది. డాన్స్‌ చేసినంత పని చేస్తాడు కమల్‌. ఇన్విటేషన్‌ తీసుకుని ఒక్కో పేజీ తిప్పుతుంటాడు. లోపల అంతా ప్రపంచ ప్రసిద్ధ నాట్యకోవిదులు. యామినీ కృష్ణమూర్తి! ‘అమ్మోయ్‌’ అంటాడు.

సోనాల్‌ మాన్‌సింగ్‌! ‘ఓహ్‌’ అంటాడు. జయప్రద కమల్‌ కళ్లలోకే చూస్తూ ఉంటుంది. గీతానాయర్‌! ‘ఆహా’ అంటాడు. గోపి కృష్ణ! ‘ఊప్‌..’ అంటాడు. అని, జయప్రద వైపు చూసి ‘ఈసారి అంతా పెద్దవాళ్లేనండీ’ అంటాడు. ఇంకో పేజీ తిప్పుతాడు. క్లాసికల్‌ డ్యాన్స్‌ రిసైటల్‌ బై.. శ్రీ బాలకృష్ణ అని ఉంటుంది!! ఆ బాలకృష్ణ కమల్‌హాసనే! జయప్రద వైపు చూస్తాడు. అతడి విస్మయాన్ని, అతడి ఉద్వేగాన్ని, కృతజ్ఞతను మోయలేని అతడి హృదయ భారాన్ని వ్యక్తీకరించే పనిని బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా ఇళయరాజాకు అప్పగించారు కె.విశ్వనాథ్‌. ఆ సీన్‌లో కమల్‌లా మనం కూడా గడ్డకట్టుకుని పోతాం. జయప్రద కలవారి అమ్మాయి. ఆమె ప్రయత్నం వల్లనే కమల్‌కి అంతటి అవకాశం వస్తుంది. ముందే చెప్పదు. సర్‌ప్రైజ్‌ చెయ్యాలనుకుంటుంది. ఇన్విటేషన్‌లో డాన్స్‌ చేస్తున్న తన ఫొటో, తన పేరు చూస్తుంటాడు కమల్‌. ‘‘ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే’’ అంటుంది జయప్రద ఇన్విటేషన్‌లో కమల్‌ని చూపిస్తూ. కమల్‌ ఏడ్చేస్తాడు. కమల్‌ కాదు. కమల్‌లోని డాన్సర్‌ ఏడ్చేస్తాడు. ఎంత పెద్ద లైఫ్‌ అచీవ్‌మెంట్‌.. కళాకారుడికి.

మాధురీ దీక్షిత్‌ తొమ్మిదేళ్లకే కథక్‌ డాన్సర్‌. గురుపూర్ణిమ రోజు తొలి డాన్స్‌ ప్రదర్శన ఇచ్చింది. ‘దిస్‌ లిటిల్‌ గర్ల్‌ స్టోల్‌ ద షో’ అని ముంబైలో ఓ పత్రిక రాసింది. ఆ రోజంతా చంద్రమండలం మీదే ఉంది మాధురి. సినిమా స్టార్‌ కాకపోయుంటే ఆమె డ్యాన్సర్‌ గానీ, మైక్రోబయాలజిస్ట్‌ గానీ అయి ఉండేది. సినిమాలొచ్చి క్లాస్‌లోంచి మధ్యలోనే ఆమెను తీసుకెళ్లిపోయాయి. మైక్రోబయాలజిస్ట్‌ అయి ఉంటే మాధురి ఇప్పుడు కరోనా వైరస్‌కు వాక్సిన్‌ కనిపెట్టే టీమ్‌లో ఉండేవారేమో! అప్పుడూ ఆమెను డ్యాన్స్‌ వదలకపోయేది. డ్యాన్స్‌లో ఉన్న గొప్పతనం అది. వదిలిపెట్టదు. ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ డే ఈరోజు. లాక్‌డౌన్‌లో ఉన్నాం కాబట్టి.. ఆన్‌లైన్‌లో డాన్స్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు మాధురీ.. ఈరోజు, రేపు. తన ఫస్ట్‌ లవ్‌ కథక్‌తో పాటు.. ‘ఏక్‌ దో తీన్‌..’ పాటలకూ ఆమె తన వెబ్‌సైట్‌లో లైవ్‌గా డ్యాన్స్‌ చేయబోతున్నారు. ‘డాన్స్‌ విత్‌ మాధురి’ ఆ ఫెస్టివల్‌ పేరు. కొరియోగ్రాఫర్‌లు సరోజ్‌ ఖాన్, ఫరాఖాన్, కథక్‌ నాట్యాచార్యులు పండిట్‌ బిర్జూ మహరాజ్‌ మరికొంతమంది దిగ్గజాలు మాధురితో కలుస్తున్నారు. హిప్‌హాప్‌లు, మసాలా భాంగ్రాలూ ఉంటాయి. డ్యాన్స్‌లో ఏదో ఉంది.. రక్తప్రసరణలా మనిషి లోపల నృత్యప్రసరణ లాంటిది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు