నిప్పు కనిక

18 Jan, 2018 23:32 IST|Sakshi

ఆరో క్లాసులో అగ్నిపరీక్ష ఒకటి కనికను, స్నేహితురాళ్లను, కుటుంబాన్ని మసకబార్చింది. స్కూల్లోని ఒక వేడుకలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది! కానీ కనికను ఆ అగ్నిపరీక్షే కాదు. జీవితంలోని ఏ అగ్నిపరీక్షా ఆపలేకపోయింది. బ్రేవ్‌ గర్ల్‌. 

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 23 నుంచి 26 వరకు జరుగుతున్న ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌’లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఎంపికయ్యారు. ఆ ఇద్దరిలో ఒకరైన కనికా కుమార్‌ (ఇంకొకరు దీపికా ప్రసాద్‌) ముంబైలోని ‘ఇంటెల్‌క్యాప్‌’కి అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశానికి హాజరవుతున్న సందర్భంలో కనిక పరిచయమిది.కనికా కుమార్‌ పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. సెయింట్‌ ఆన్స్‌లో పాఠశాల విద్య, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. కనిక ఆరవ తరగతిలో ఉన్నప్పుడు  స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది.అందులో కనికా గాయపడ్డారు. కోలుకోవడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది. ఆ ప్రభావం ఇప్పటికీ మొహం మీద కనిపిస్తుంటుంది. ‘‘బయటవాళ్లు చాలామంది అడుగుతారు ఏమైంది? అని. చెప్పగానే.. ‘అయ్యో  పెళ్లి ఎలా అవుతుందమ్మా?’ అంటూ జాలిపడ్తారు. ఆ మాటలకు మనసులోనే నవ్వుకుంటా. ఎందుకంటే ఇలాంటివి అధిగమించే స్థయిర్యాన్ని నేను ఏనాడో సాధించాను. చిన్నప్పుడు జరిగిన ఆ ప్రమాదం ఒక రకంగా నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’’ అని చెప్తుంది కనికా. 

లండన్‌ స్కూల్‌  
గ్రాడ్యుయేషన్‌ అయిపోయాక కనికా లండన్‌ వెళ్లారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో డిప్లొమా కోర్స్‌ చేశారు. తిరిగొచ్చాక ముంబైలోని ఒక అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలో కొన్నాళ్లు పనిచేశారు. హైదరాబాద్‌లో ‘బాలకళాకార్‌’ టీమ్‌లో ఆమె ఓ భాగస్వామి. పేదపిల్లల్లో ఉన్న కళలను వెలికితీసి, వాళ్లను ప్రోత్సహిస్తుంటుంది ఈ సంస్థ. ‘‘ఇప్పటి వరకు 3 వేల మంది పిల్లల్లోని క్రియేటివ్‌ స్కిల్స్‌కు ఒక డయాస్‌ కల్పించాం. పెయింటింగ్, డాన్స్, సాంగ్స్‌ వంటి వాటిల్లో వాళ్లను ప్రోత్సహిస్తున్నాం. ఆ పిల్లలు వేసిన పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్‌ కూడా పెట్టాం’ అని చెప్తారు కనిక. 

ఇంటెల్‌క్యాప్‌
యాడ్‌ ఏజెన్సీలో పనిచేశాక ఇంటెల్‌క్యాప్‌లో జాయిన్‌ అయ్యారు కనిక. ప్రస్తుతం అందులోని కార్పొరేట్‌ స్ట్రాటజీ టీమ్‌ను లీడ్‌ చేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో  సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ కోసం కృషిచేస్తున్నారు. బాధ్యతల్లో భాగంగా ఆఫ్రికాలో కొన్నాళ్లున్నారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఇనిషీయేటివ్‌ ప్రోగ్రామ్‌ అయిన ది గ్లోబల్‌ షేపర్స్‌ (ముంబై)లో కూడా ఆమె పాలుపంచుకుంటున్నారు. ప్రయాణాలంటే చాలా ఇష్టపడే కనిక తను చూసిన, పనిచేస్తున్న ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను దగ్గరగా చూశారు. ‘‘వ్యక్తిగతంగా ఇటు ఇంట్లో, అటు బయట నేనెలాంటి వివక్షనూ ఎదుర్కోకపోయినా.. అలాంటి పరిస్థితినైతే చూశాను. నిజానికి మా ఇంట్లో నాకు సంబంధించి.. అంటే చదువు, జాబ్‌ ఎవ్రీథింగ్‌ నా ఇష్టమే. ఆఫీస్‌లో కూడా నేనెలాంటి వివక్షకు లోను కాలేదు. మగవాళ్లకు ఎలాంటి అవకాశాలు వచ్చాయో నాకూ అలాంటి అవకాశాలే వచ్చాయి. వాళ్లు డీల్‌ చేసిన కఠినతరమైన సవాళ్లను నేనూ డీల్‌ చేశాను. పదోన్నతులను కూడా అంతే సమానంగా పొందాను. కాని నేను బాగుండగానే నా చుట్టూ ఉన్న ఆడవాళ్లు బాగున్నట్టు కాదు కదా! వివక్షకు గురి అయిన అమ్మాయిలను చాలామందిని చూశాను. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో వాస్తవాలు ఏంటో నాకు తెలుసు. ఆడవాళ్లను చులకనగా చూస్తారు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలకు లోన్స్‌ కూడా దొరకని స్థితి. ప్రాపర్టీ ఉన్నా ఆమె పేరున ఉండదు. అంతా భర్త అధికారం కిందే, ఆయన అనుమతితోనే సాగాలి. ఈ చాలెంజెస్‌ అన్నిటినీ తట్టుకొని నిలబడ్డ వాళ్లను చూశాను. ఇవన్నీ గ్రహించాకే మహిళల కోసం ఏమన్నా చేయాలి అనిపించింది. అందుకే మా సంస్థలో ‘క్రెడిట్‌ ట్రీ’ ఏర్పాటు చేశాం. ఈ క్రెడిట్‌ ట్రీ కింద ఒంటరి స్త్రీలకు కూడా లోన్స్‌ ఇప్పిస్తాం. వ్యాపార, వాణిజ్య రంగాల్లో వాళ్లూ రాణించడానికి హెల్ప్‌చేస్తున్నాం’ అని వివరించారు కనికా కుమార్‌. 

గర్వంగా ఉంది
ఇంత చిన్న వయసులో మా అమ్మాయి సాధించిన విజయం చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. పని అంటే ప్యాషన్‌ ఆమెకు. చేస్తున్న పనిపట్ల నిజాయితీ, నిబద్ధతతో ఉంటుంది. సహాయం, సేవ ఆమె నైజం. తన పనితో సమాజంలో ఒక ఇంపాక్ట్‌ ఉండాలని తపన పడుతుంది. ఆత్మవిశ్వాసం మెండు. ఇవ్వాళ్టి అమ్మాయిలకు కావల్సింది కూడా అదే. ఫిజికల్‌ బ్యూటీ కాదు ఇన్నర్‌ బ్యూటీ చాలా ఇంపార్టెంట్‌. అదే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తల్లిదండ్రులు కూడా ఆ దిశగానే పిల్లల్లో విశ్వాసం పెంపొందింపచేయాలి. 
– అనిల్‌కుమార్, సీమా కుమార్‌  (కనికా కుమార్‌ తల్లిదండ్రులు) 
– సరస్వతి రమ

మరిన్ని వార్తలు