దారితప్పిన బస్సు

3 Nov, 2019 05:09 IST|Sakshi

రామలింగం మేష్టారికి తన సొంత పిల్లల్నే అదుపులో పెట్టడం చేతకాదు ఆయన ఖర్మానికి పాతికమంది కోతి మూకని ఎక్స్‌కర్షన్‌ తీసికెళ్ళవలిసిన పని పడింది. ఈ కుర్ర కుంకల్ని హంపీ తీసుకుపోవాలట. అక్కడి శిథిలాలు చూసి, గతించిన విజయనగర సామ్రాజ్యం తాలూకు గొప్పతనం అవగాహన చేసుకుంటారట. చరిత్ర అంతా స్పష్టంగా రాసి ఉంది. చదువుకుని ఏడవకూడదూ? ఏవిటో రకరకాల కొత్త సిద్ధాంతాలొచ్చి పడ్డాయి. ఏమయితేనేం, ఈ అధికమాసపు తద్దినం తనకి తప్పలేదు. ఉదయం ఎనిమిందిటికి బుల్లిపాలెం నించి బయలుదేరవలసిన టూరిస్టు బస్సు స్కూలు దగ్గరకు వచ్చేసరికి పదిన్నరయింది. రామలింగం మేస్టారు సీట్లో వెనక్కి జేర్లబడి కళ్ళు మూశారు. నలభై ఏభై మంది సంతగోల చేస్తున్న క్లాసులోనే గుర్రుపెట్టి నిద్రపోగల యోగసాధన ఆయనకుంది. కిటికీలోంచి చల్లని కొండగాలి వీస్తోంది. మేస్టారు నిద్రపోయారు.

బస్సు ఆగిన కుదుపుకి మేస్టారు ముందుకు పడబోయి మేలుకుని నిలదొక్కుకున్నారు. పిల్లలు బిలబిల గంతులేస్తూ దిగిపోయారు. వంటవాడు జంబుఖానాలు దారి పక్కన పచ్చిక మీద పరిచాడు. రామలింగం మేస్టారికి ఒకటే కంగారు, ఈ కొండదారుల్లో ఎక్కడ ఎవరు తప్పిపోతారో, ఎవరు పారిపోతారోనని, దిగే పిల్లల్ని తిరిగి లెక్క పెట్టారు మేస్టారు. కిష్టప్ప ఒక కొండ కొమ్మ మీదికి ఎక్కుతుంటే, సుబ్బిగాడు, వెంకటం, గౌరి వెంటపడుతున్నారు. మేస్టారు అరిచారు అలాంటి కోతిపనులు చెయ్యొద్దని. ఈ కిష్టప్పగాడు కోతిమూకకి లీడరు కూడా. వాణ్ని ఓ కంట కనిపెట్టి చూడకపోతే, కొంప మునుగుతుంది. మేస్టారు రవంత ఈతిబాధ తీర్చుకోడానికి ఒక బండరాతి పక్కకి వెళ్ళి తిరిగొచ్చేసరికి, కిష్టప్ప మరో నలుగురు గల్లంతు. వెతగ్గా వెతగ్గా, వాళ్లు ఒక కొండవాల్లో ఉన్న చెట్టెక్కి సీతాఫలాలు కోస్తున్నారు. వాళ్ళని నాలుగు తిట్టి బెదిరించి, బస్సులో ఎక్కించేసరికి గంటన్నర పట్టింది.

బస్సు కదిలింది. కిష్టప్ప సందేహాం! సీతాఫలాలు వర్షాకాలంలోనూ, మామిడి కాయలు వేసవిలోనూ ఎందుకు కాస్తాయి, అని. తనకి మాత్రం ఏం తెలుసు? అయినా తెలీదంటే మేస్టారి మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. అందుకని, దేవుడు అలా ఏర్పాటు చేశాడని పోటీలేని సమాధానం చెప్పారు. ఈ కుర్రాళ్ళందరికీ అనుమానాలు అంటువ్యాధిలా పుట్టుకొస్తాయి. వరసగా అడగడం మొదలుపెట్టారు. ఇంత ఎత్తు కొండ మీద నీళ్ళు ఉండవుగదా మొక్క లెలా మొలుస్తున్నాయని ఒకడు. వర్షాలు కురుస్తాయిగా అని మేస్టారి సమాధానం. కురిస్తే అవన్నీ కొండ కిందికి పారి వెళ్ళిపోతాయి గదండి? అని ఇంకొకడి ఎదురుప్రశ్న. కిట్టప్ప కొంటెగా, దేవుడు కింది నించి వాటికి నీళ్ళు ఏర్పాటు చేస్తాడని జవాబు చెప్పాడు. డ్రైవరు రేడియో మోగించాడు. సినిమా పాట లొస్తున్నాయి. వాటి వ్యామోహంలో పడి పిల్లలు ఆయన్ని మరిచిపోయారు.

ఆయన వాళ్ళనీ మరిచిపోయి, హాయిగా గుర్రు నిద్రలో మునిగిపోయాడు. ఆ నిద్రలో ఓ కల. చటుక్కున బస్సు తేనెపట్టులా మారిపోయింది. పిల్లలంతా తేనెటీగలు. అందులో గౌరి రాణి ఈగ. తను మాత్రం చెట్టు మీద నిలబడిపోయాడు. ఇన్ని తేనెటీగల్ని ఎలా పట్టడం? తేనెపట్టు చిటారు కొమ్మన ఉంది. పిల్లలంతా ఇలా అయిపోయారంటే, బుల్లిపాలెం ఊరంతా కలిసి తన్ను కొరత వేస్తారు. తేనెటీగల్ని బతిమాలాడు–తేనెపట్టు కిందికి దింపి దాన్ని మళ్లీ బస్సుగా మార్చేయమని, తమందరు తిరిగి పిల్లలుగా మారిపొమ్మని. పెద్ద తీనెటీగ కిష్టప్పగాడి మొహంతో తన చుట్టూ నవ్వుతూ ఎగిరింది. చెయ్యి విసిరారు, కొట్టబోయారు, పట్టుకోబోయారు. చురుక్కున ఒక పోటు పొడిచి కిష్టప్పగాడు ఎగిరిపోయాడు. కోపం వచ్చింది మేస్టారికి. ధైర్యం చేసి చెట్టెక్కారు చిటారు కొమ్మదాకా. చెయ్యి జాపారు పట్టు అందుకోడానికి. అంతే పిల్లతేనెటీగలన్నీ ఒక్క పెట్టున చేతిచుట్టూ మూగి కుట్టడం మొదలెట్టాయి. ‘అబ్బ’ అనుకుంటూ చెయ్యి వెనక్కి లాక్కున్నారు.

పట్టు తప్పింది. కింద పడిపోతున్నారు, కొన్ని వందల అడుగులు. తేనెటీగలు మాత్రం కుడుతూనే ఉన్నాయి చేతిని. ‘కెవ్వు’మని అరుస్తూ లేచారు రామలింగం మేస్టారు. తను బస్సులోనే ఉన్నాడు. పక్క కిటికీలోంచి సన్నజల్లు చురుకు చురుకుమని చేతి మీద పడుతోంది. మేస్టారు పక్క కిటికీ అద్దం దింపేశాడు. అప్పుడాయనకి అర్థమైంది, చీకటి పడుతోందని, అవతల గాలీ, సన్న జల్లూ ప్రారంభమైందని. రోడ్డు చూస్తే ఆయనకి అనుమానం వచ్చింది, ‘తారురోడ్డులా లేదే’ అన్నారాయన. ‘అడ్డుదారి’ అన్నాడు డ్రైవరు. ‘‘ఎక్కడి కెడుతుందీ అడ్డుదారి?’’ ‘‘మళ్లా ధర్మారం మేన్‌ రోడ్డులో కలుస్తాదంట, 12 మైళ్ళు కలిసొత్తాదంట’’ ఏడు గంటలకి ధర్మారం చేరాల్సింది. టైం చూస్తే పావు తక్కువ ఏడు. రోడ్డు మరింత అధ్వాన్నంగా ఉంది.

కొండదారి..మలుపులు బస్సుదీపాల వెలుగులో అస్తవ్యస్తంగా కనబడుతున్నాయి. బస్సు పరుగెత్తడం లేదు. పాకుతోంది. ఎనిమిదయింది. అప్పటికీ మెయిన్‌రోడ్డు రాలేదు సరిగదా, పల్లె కూడా తగల్లేదు. వాన జోరు హెచ్చింది. ‘‘ఏం దారయ్య ఇది. నీ మొహం అడ్డుదారి’’ అన్నారు మేస్టారు. ‘‘దారి తప్పినట్టున్నామండి. ఆ మడిసి సెప్పిన ఊరేదీ తగల్లేదు’’ అన్నాడు వంటవాడు.  ‘‘బస్సు వెనక్కి తిప్పు. నీ మొహం లాగుంది, నీ అడ్డదార్లూ నువ్వూ’’ ‘‘బస్సు తిరగదండి, ఓ పక్క కొండ, ఓ పక్క ఎయ్యి అడుగుల లోయ’’ అన్నాడు డ్రైవరు. రామలింగం మేస్టారికి ఓ పక్క కోపం, రెండో పక్క భయం. ఇంతమంది పిల్లలతో ఈ బస్సు సురక్షితంగా మనుషులుండే చోటికి చేరితే చాలునని వెయ్యి దేవుళ్లకు మొక్కుకున్నారు. తొమ్మిదింబావు. బస్సు రెండుసార్లు గుంజి ఆగిపోయింది. మేస్టారి పై ప్రాణాలు పైకి పోయాయి. ఇప్పుడేవిటి గతి? డ్రైవర బోనెట్‌ ఎత్తి బాటరీలైట్ల సహాయంతో ఇంజిన్‌ చూస్తున్నాడు. నిద్ర పోతున్న పిల్లలంతా మేలుకున్నారు.

పిల్లల్లో పిరికివాళ్ళు ఏదో పెద్ద ప్రమాదం జరగబోతున్నట్టు వొణికిపోతున్నారు. కిష్టప్ప, సుబ్బు బస్సు దిగారు. వాళ్ళు కొండ మీదికి ఎక్కుతుంటే ఆయన గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ‘‘మేస్టారూ’ అదిగో ఏదో దీపం. పెద్ద ఇల్లులా ఉంది’’ అని అరిచాడు కిష్టప్ప. బిలబిల పిల్లలంతా దిగారు,  ‘‘మేస్టారు! ఈ మలుపు తిరిగితే ఏదో ఇల్లుందండి. దీపం ఉంది లోపల’’ అన్నాడు కిష్టప్ప. ‘‘బస్సు కేమయింది?’’ అని అడిగారు మేస్టారు. ‘‘డెల్కోలోకి నీల్లెల్లిపోయాయ్‌. ఈ వోనలో కదల్దు’’ అన్నాడు డ్రైవర్‌. మేస్టారి అనుమతి కోసం చూడకుండా కిష్టప్ప బాటరీలైట్ల సహాయంతో మిగతా పిల్లలకి దారి చూపిస్తూ నడిచాడు. అదృష్టవశాత్తు వానజోరు కొంత తగ్గింది. విరిగి తప్పుపట్టిపోయిన గేటు తోస్తే కిర్రుమంటూ తెరుచుకుంది. దారంటూ లేదు. పాచి పట్టిన రాతి మెట్లెక్కి తలుపు తట్టాడు. మేస్టారికి ఇంత వాన కురిసినా మెత్తబడని ఎండు పచ్చిక విచిత్రంగా తోచింది. బాటరీ లైటు వేసి చూశారు–రంగు పచ్చగానే ఉంది! తలుపు బాదగా బాదగా తెరుచుకుంది.

వయసు చెప్పడానికి వీల్లేని ఒక వ్యక్తి చేత్తో హరికెన్‌ లాంతరు పట్టుకుని గుమ్మంలో నిలబడ్డాడు. ‘‘మా బస్సు దారి తప్పింది. ఈ పక్క సందులో ఆగిపోయింది. బాగు అయేదాకా మేం ఇక్కడ ఉండొచ్చా?’’ అని అడిగాడు కిష్టప్ప. వ్యక్తి సమాధానం చెప్పలేదు సరిగదా, గుమ్మంలోంచి తప్పుకోలేదు. ‘‘తమరు కాస్త అనుగ్రహించాలి. పిల్లలు, బయట వాన’’ అన్నారు మేస్టారు. అప్పటికీ ఆ వ్యక్తి తప్పుకోలేదు. కిష్టప్ప ధైర్యం చేసి, అతని పక్క నించి లోపలికి జారాడు. ఇంక మర్యాద కాదన్నట్టు ఆ వ్యక్తి పక్కకి నిలబడ్డాడు. పిల్లలంతా ధైర్యం చేసి లోపలికొచ్చారు. ఆ వెనక మేస్టారూ వచ్చారు. ‘‘మూగతనేమో పాపం’’ అన్నాడు కిష్టప్ప. వ్యక్తి అతని వంక చూశాడు. పిల్లలు రవంత బెదిరి కిష్టప్ప వెనక చేరారు. ‘‘ఇదే ఊరు?’’ అని అడిగాడు మేస్టారు. వ్యక్తి కళ్ళప్పగించి అరగంట చూసినట్టు చూశాడు ఆయన వంక. కిష్టప్ప చెప్పినట్టు అతడు నిజంగా మూగవాడేమోనన్న అనుమానం మేస్టారికి ధ్రువపడుతుండగా, అతడు నోరు తెరిచాడు.

‘‘దుగ్గన్న సత్రం’’ అన్నాడా వ్యక్తి. మేస్టారు ఆత్రంగా ఎన్నో ప్రశ్నలడిగారు, ఈ కొండదారి ఎక్కడికి పోతుంది? దగ్గర ఉన్న పట్నం ఏది? ఎంత దూరం? దేనికి ఆ వ్యక్తి సమాధానం చెప్పలేదు. హరికేన్‌ లాంతరు చేతపట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. లాంతరు గుమ్మంలో పెట్టి తన మంచం మీద పడుకున్నాడు. సరే ఈమాత్రమయినా ఆశ్రయం దొరికినందుకు సంతోషించారు మేస్టారూ పిల్లలూ. బుల్లిపాలెంలో తయారుచేసి తీసుకొచ్చిన సాంబరు అన్నం పిన్నలూ పెద్దలూ అందరూ తిన్నారు. నీళ్ళు ఎక్కడున్నాయని కిష్టప్ప వెళ్ళి ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి లేచి వచ్చి లాంతరు తీసుకుని దారి చూపించాడు. అది పెద్దభవంతి. ఎన్నో గదులున్నాయి. అన్నీ బూజు పట్టి దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. ఎంతో దూరం నడిచాక, వెనక పక్క వరండాలోకి వచ్చారు ఆ పిల్లలూ ఆ వ్యక్తీ. అక్కడొక పెద్ద నీళ్ళకుండీ ఉంది. అవి మంచినీళ్లేనని నిర్ధారణ చేసుకుని పిల్లలంతా చేతులు కడుక్కొని నీళ్ళు తాగారు.

వ్యక్తి ఈసారి గదిలోకి పోకుండా గొడవారని ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. ‘‘బాబాయి’’ అన్నాడు కిష్టప్ప. ఆ పిలుపుతో ఆ వ్యక్తి కొంత మెత్తబడ్డాడు. అతని ముభావం సడలింది. కిష్టప్పా మేస్టారూ ఈ ఇంటిని గురించీ దీని ఒంటరితనాన్ని గురించీ ప్రశ్నలు వేశారు. అతను అతి క్లుప్తంగా దీని కథ చెప్పాడు. రెండు వందల ఏభై ఏళ్ళ క్రితం దుగ్గన్న సేనాని బీజాపూర్‌ నవాబు కింద సేనాపతిగా ఉండేవాడు. అతని పెళ్ళాం చాలా అందగత్తె. అతన్ని యుద్ధభూమికి పంపి, అతని భార్యని చెరపట్టాడు. విజయం సాధించి తిరిగివచ్చిన దుగ్గన సేనానికి ఈ సంగతి తెలిసింది. సైన్యంలో అతనికి చాలా పలుకుబడి ఉండేది. కొందరు నమ్మిన అనుచరులతో నవాబు జనానాలో ప్రవేశించి తన భార్యను బలత్కారం చెయ్యబోతున్న నవాబుని నరికేసి, తను రాజయ్యాడు. ఇది అప్పుడు బీజపూరికి రహదారి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ సత్రం కట్టించాడు. దీని వెనక చాలా అందమైన పూలతోట వేయించాడు.

ఆరోజుల్లో ఎంతో కలకల్లాడుతూ ఉండేది ఈ సత్రం. ఇంతలో తెల్లవాళ్ళు ఈ ప్రాంతం క్రమంగా ఆక్రమించడం మొదలు పెట్టారు. దుగ్గన్న సేనాని మాత్రం ఎంతో ధైర్యంతో ప్రతిఘటించాడు. కాని అతని భార్య, బావమరుదులు, ఎలాగా ఓడిపోతామన్న భయంతో తెల్లవాళ్ళతో కుట్ర పన్నారు. అది తెలిసిన దుగ్గన్న భార్యనీ బావమరుదుల్ని చంపేసి, ఈ సత్రంలోకి పారిపోయి వచ్చేశాడు. వెనక తోటలో ఒక చిన్న ఇల్లుంది. ఆ ఇంట్లో దాక్కున్నాడు. ఇక్కడున్న ఆయన నమ్మినబంటు, తెల్లసైన్యాలు సత్రాన్ని చుట్టుముట్టడం చూసి, తోటలో చిన్న ఇంటికి బయట తాళం వేసి, దుగ్గన్న సేనాని అక్కడలేడన్నాడు. తెల్లవాళ్ళు అతన్ని బంధించి పట్టుకుపోయారు. సేనాని ఆ ఇంట్లోంచి బయటపడే దారి లేక, కొన్నిరోజులు ఆకలిదప్పులతో బాధపడి, చచ్చిపోయాడు. ఇప్పుడు దెయ్యమై ఆ తోటలోనూ ఇంట్లోనూ తిరుగుతుంటాడు. దుగ్గన్న దెయ్యం మహా భయంకరమైంది. రకరకాల ఆకారాలు ధరించి, రాత్రిపూట ఆ తోటలో అడుగు పెట్టిన మనుషుల్ని భయపెట్టి చంపుతుంటుంది. ఇరవై ఏళ్ళక్రితం ఒక కలెక్టర్‌గారు ఇలాంటి రాత్రే ఈ సత్రంలో మకాం పెట్టి, ఈ కథంతా విని దెయ్యాలంటే తనకి నమ్మకం లేదని, ఆ తోటలోకి వెళ్ళాడు.

తెల్లారేసరికి ఆయన శవం కింద లోయలో ఉంది. ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి. సగంమంది పైగా పిల్లలకి, మేస్టారికీ భయంతో వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ‘‘ఈ భవనంలోకి కూడా వొస్తుందా ఆ దెయ్యం?’’ అని అడిగారు మేస్టారు. రాదన్నట్టు తల ఊపాడు ఆ వ్యక్తి. ‘‘వెనకాల మంచి పూలతోట ఇంకా ఉందే’’ అని అడిగాడు కిష్టప్ప. ‘‘అది తోట కాదు, రెండు వందల ఏళ్ళనించీ ఆ మొక్కలకీ పూలతీగెలకీ ఎదుగూ బొదుగూ లేదు. ఆ దెయ్యం స్పర్శకి అవన్నీ రాళ్లుగా మారిపోతుంటాయి. రాత్రి గుడ్డి వెలుగులో అవన్నీ పూలమొక్కల్లాగ కనిపిస్తాయి. పగలు చూద్దురుగాని, అన్నీ రాళ్ళు’’ అన్నాడు వ్యక్తి. ‘‘అదంతా కట్టుకథ, ఎవడో మహాశిల్పి ఆ మొక్కలూ లతలూ అతి సున్నితంగా చెక్కి ఉంటాడు’’ అన్నారు రామలింగం మేస్టారు. ‘‘అవి మహాశిల్పాలు కావు, రాళ్ళయి పోయిన పూలమొక్కలు. అవి తాకితే తెలుస్తుంది. చెయ్యి కూడా గడ్డ కట్టుకుపోతుంది’’ అన్నాడు వ్యక్తి. రామలింగం మేస్టారికి ఈ కథలన్నీ నమ్మాలని లేదు.

కాని తను నమ్మడం లేదని ఆ దెయ్యానికి తెలిస్తే, తన మీద విజృంభిస్తుందేమోనని భయం. ఎందుకైనా మంచిదని, సింహద్వారం తెరిచే ఉంచి, పారిపోవడానికి వీలుగా గుమ్మం దగ్గర పక్కపరుచుకున్నారాయన. కుర్రవాళ్ళందరినీ తెల్లవారకుండానే లేవాలని హెచ్చరించి, ఆయన నడుం వాల్చారు. పిల్లలంతా పడుకున్నారు. ఆ వ్యక్తి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు–క్రమంగా అందరికీ నిద్ర పట్టింది. కాని కిష్టప్పకు మాత్రం ఆ కథే బుర్రలో తిరుగుతోంది. ఆ దెయ్యాన్ని చూడాలని గట్టి కోరిక. రవంత భయం కూడా. కాని కుతూహలం. ఆ మొక్కలన్నీ నిజంగా రాళ్ళయిపోయినవేనా? ఇంతలో సన్నగా ఏ పక్క నించో విచిత్రమైన ధ్వని వచ్చింది. చెవులు నిక్కించి విన్నాడు. ఈ లోకంలో విన్నచప్పుడులా లేదు. ఆవు అరుపు సింహం గర్జన కాకుండా రెండూ కలిసినట్లుంది ఆ ధ్వని. మెల్లిగా లేచాడు. అతని వెనక సుబ్బు, వెంకటం, గౌరి కూడా లేచారు. వాళ్ళూ నిద్ర పోలేదు అతనిలాగే–నలుగురూ పిల్లుల్లాగ బాటరీ లైట్ల సహాయంతో వెనక వరండా చేరుకున్నారు. చూశారు.

వందగజాల అవతల మరో ఆవరణ ఉంది. రాళ్ళతో కట్టిన ప్రహరీ ఉంది దానికి. అదే రాతి మొక్కల తోటై ఉంటుంది. నలుగురూ ధైర్యం చేసి ఆ వైపు నడిచారు. గేటు లేదు, కాని ఆ చోట కంప అడ్డంగా ఉంది. అది మెల్లిగా తొలిగించారు. వాళ్ళు ఆ తోటలో అడుగు పెట్టడంతోటే, విచిత్రమైన వెలుగు, వెన్నెలకాని వెన్నెలలాంటిది తోటంతా ఆవరించింది, ఎవరో స్విచ్చి నొక్కినట్టు. ఆ వెలుగులో తోట ఎంతో అందంగా ఉంది. లతల కొసల్లో పువ్వులు ఎవరో శిల్పి తీర్చిదిద్దినట్లున్నాయి. రవంతా గాలి వీస్తున్నా, లతలు మాత్రం ఊగడం లేదు. ఒక చెట్టు మీద పిట్ట కూడా కూచ్చుని ఉంది. కిష్టప్ప దాని మీదికి రాయి విసిరాడు, గురి చూసి. తగిలింది. కాని పిట్ట ఎగిరిపోలేదు. రాయి రాతికి తగిలిన చప్పుడు మాత్రం వినిపించింది. ధైర్యం చేసి కిష్టప్ప ఒక పువ్వు కొయ్యబోయాడు.

గట్టిగా రాయిలా తగిలింది చేతికి! మంచుకున్న తీవ్రమైన చల్లదనం అతని శరీరంలోకి విద్యుత్తులా ప్రవహించింది. చట్టుక్కున చెయ్యి వెనక్కి తీసుకుని రెండో చేత్తో వేడి పుట్టేదాకా రాసుకున్నాడు–మిగతా ముగ్గరూ బిత్తరపోయి చూశారు–ఇంతలో పెద్ద వింత శబ్దం. చటుక్కున అందరూ అటు చూశారు. పెద్ద బస్సు అంత ఆకారం ఏదో తమవంక వస్తోంది. సింహం నోట్లో సగం ఆవు. ఆవు ముందు కాళ్ళు గాలిలో గిలగిల కొట్టుకుంటున్నాయి. పెద్ద గుహలాగుంది ఆవు నోరు. నలుపు ఎరుపు ఆకుపచ్చ రంగులు దాని వంటి మీద మారిపోతున్నాయి. గుహలోంచి వచ్చినట్టు పెద్ద గంభీరమైన గొంతు. ‘‘కుర్రకుంకల్లారా! మా తోటలో అడుగు పెట్టడానికి మీకు ఎన్ని గుండెలున్నాయి’’ అంటూ ఆ ఆకారం వాళ్ళ మీదికి ఉవ్వెత్తున వచ్చిపడింది. నలుగురూ ఒకరికొకరు గట్టిగా పట్టుకు నిలబడ్డారు. పారిపోవడానికి కాళ్ళు రాలేదు వాళ్ళకి. ఆ ఆకారం వాళ్ళని దూసుకుని తుపానుగాలిలా వెళ్ళిపోయింది. కిష్టప్పటికి భయం పోయింది.

దెయ్యమంటే వట్టిగాలి, గాలి తమని ఏంచెయ్యగలదు? భయపెడుతుంది. అంతే. కాని సుబ్బు, వెంకటం, గౌరి తోట అవతలికి పారిపోయారు. కాని కిష్టప్ప రావడం లేదని చూసి ఆగిపోయారు. కిష్టప్ప తోటంతా పరీక్షగా చూడ్డం మొదలు పెట్టాడు. చాలా పెద్ద తోట. ఎన్నో రకాల మొక్కలుండేవి, ఇప్పుడన్నీ రాళ్ళయిపోయాయి. చిన్న ఇల్లు, దాని మీద ఒక పెద్ద నీళ్ళకుండీ, ఆ నీళ్ళ కుండీలోంచి ఇందాకా కురిసిన వాననీళ్ళు ధారగా కిందికి కారుతున్నాయి. ఆ నీళ్ళు చక్కగా రాళ్ళతో కట్టిన బోదుల ద్వారా మొక్కల్లోకి పారుతున్నాయి. అన్ని మొక్కలకీ చుట్టూ పాదులు చేసి ఉన్నాయి. నీళ్ళు ఆ పాదుల్లో నిండి పొర్లి మరో బోదిలో పడుతున్నాయి. ఆ బోది నీళ్ళను మరో మొక్కకి మర్లిస్తోంది. చాలా బాగా కట్టిన బోదులు. ఇంతలో దుగ్గన్న దెయ్యానికి మళ్ళీ కోపం వచ్చింది. ఇంత సాహసించిన కుర్రకుంకని బెదిరించి రాయిగా మార్చెయ్యాలని తీర్మానించుకుంది. కిష్టప్ప తన మీదికి వస్తున్న దెయ్యం వంక చూశాడు.

దెయ్యం ఈసారి పెద్ద రైలు ఇంజను అవతారం దాల్చింది. దానికి ఎర్రటి మంటలు పొగలు కక్కుతున్న నోరుంది. ఆ నోరు తెరుచుకుని ఇంజన్‌ అతని మీదికి వచ్చింది. అతనప్పుడు ఒక బండరాయి మీద ఎక్కి ఉన్నాడు ఇంజను మీదికి వచ్చిపడుతుంటే, అతను వెనక పక్కకి దూకి నేల మీద పడుకున్నాడు. ఇంజను రాయికి తగిలి రెండుగా చీలి, రెండు బండరాళ్లకు ఢీకొని, చప్పగా రంగులు మారుతూ నేలమట్టం అయిపోయింది. కొంతసేపు కదల్లేదు. కిష్టప్ప మళ్ళీ సురక్షితంగా లేవడం చూసి, మిగతా ముగ్గురూ ధైర్యం చేసి లోపలికొచ్చారు. మెల్లగా దెయ్యం పడి పోయిన చోటికి వచ్చారు–దెయ్యం మెల్లగా మనిషి ఆకారం దాలుస్తోంది. బిత్తరపోయి చూశారు నలుగురూ. దెయ్యం మనిషిగా మారింది. అయినా పూర్తిగా కాదు–గాజులాంటి దూదితో చేసినట్టుంది ఆకారం. తలవంచుకుని, రాతికి జేర్లబడి కిందికి చూస్తూ కూచుంది దెయ్యం. ఔనన్నట్టు తల ఊపింది. బాధగా నిట్టూర్చింది. ‘‘ఎందుకండీ ఏదో బాధపడుతున్నట్టున్నారు?’’ అని అడిగాడు కిష్టప్ప.

‘‘నా పరువంత నువ్వు మంట కలిపేశావురా కుర్రకుంకా! రెండువందల ఏళ్ళుగా ఎందరు మహావీరుల్ని హడల గొట్టేశాను! వేలెడు లేవు. నా భయంకరాలకు తట్టుకుని ధైర్యంగా నిలబడ్డావు. ఇంకేముంది? నన్ను చూసి మనిషన్నవాడు ఎందుకు భయపడతాడు? ఇంత గొప్ప దెయ్యమై లాభం ఏముంది?’’ కిష్టప్పకి జాలి వేసింది. ‘‘సార్‌! అసలు మీరు మనుషుల్ని ఎందుకు భయపెట్టాలి?’’ ‘‘మరింక దెయ్యం కావడం ఎందుకు? అయి ప్రయోజనం ఏమిటి? పైగా మనుషులు నన్ను చూసి భయపడి ప్రాణాలు విడుస్తుంటే నాకెంతో సరదాగా తృప్తిగా ఉండేది. అది కూడా లేకపోతే ఇంకా దెయ్యంగా ఎలా బతికేది? నాకింక రాత్రుల్ళు ఎలా గడుస్తాయి?’’ ‘‘మనుషుల్లా మీరు కూడా హాయిగా మెత్తని పరుపు మీద వెచ్చగా పడుకుని నిద్రపోకూడదు?’’ ‘‘నిద్రా? దెయ్యానికా?’’ దెయ్యం బరువుగా నవ్వింది. తరువాత మెల్లగా అంది– ‘‘నాకు వెచ్చని పరుపు ఏదో తెలుసా? ఊరి బయట, ఏటి ఒడ్డున, కట్టెలు పేర్చి నాకు పరుపే ఏర్పాటయి ఉంది.

నేను పడుకున్నాక అది అంటించాలి. ఆ వెచ్చని మంటల దుప్పటి కప్పుకుని నేను శాశ్వతంగా నిద్ర పోవాలి. అంత వరకు నిద్ర లేదు, మెలకువ లేదు. నేను బ్రతికీ లేను, చచ్చీ లేను. చావు బతుకుల మధ్య ఇలా ఊగులాడుతూ శాశ్వతంగాగా ఉండిపోవలసిందే, నాకీ స్థితి నించి విడుదల లేదు?’’ కిష్టప్ప మిత్రులకీ కళ్ల నీళ్ళు తిరిగాయి–గౌరి అంది–‘‘తాతగారూ! మేం కట్టెలు పేర్చి మీకు పరుపు ఏర్పాటు చేస్తామండి’’ దెయ్యం ముఖంలో రవంత ఆశ, వెంటనే నిరాశ, మీవల్ల కాదన్నట్లు తల అడ్డంగా ఆడించాడు, కిష్టప్ప అడిగాడు  ‘‘సార్‌! మీరు బతికున్నప్పుడే చాలామందిని చంపేశారట. మరి పాపం కాదండీ!’’ ‘‘పాపం! మీరు అమాయకులు. పాపం అనే మాటే మీకు తెలుసు. అర్థం తెలియదు. అందుకే నన్ను చూసి మీరు భయపడలేదు. మీ మనసుల్లో పాపం ఉంటే, మీ పెద్దల్లాగే మీరూ నన్ను చూసి హడలి చచ్చిపోయి ఉందురు. రెండువందల ఏళ్ళుగా లోకాన్ని చూస్తున్నాను, అంతకంతకూ పాపం పేరుకుని లోకంలో గడ్డ కట్టుకుపోతోంది. స్వార్థం, దుర్మార్గం, క్రౌర్యం, ఇవే లోకాన్ని నడిపిస్తున్నాయి.

మంచితనాన్ని చంపెయ్యడం మనిషి లక్ష్యం. నేను చాలా ఘోరాలు చేశాను, నా మీదా ఎందరో ఎన్నో ఘోరాలు చేశారు. ఒక మనిషినిహత్య చేస్తే హంతకుడికి ఉరిక్ష వేస్తారు లేదా యావజ్జీవ కారాగారం వేస్తారు. అదయినా ఏ పది పదిహేనేనేళ్లో. ఆ తరువాత హంతకుడు హాయిగా చనిపోతాడు. నేనో, చావూ కాని, బ్రతుకూ కాని, ఈ దెయ్యం రూపంలో రెండు వందల ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్నాను. ఇంకా ఎన్ని వందల ఏళ్ళు నేనిలా గడపాలో. ఈ ఒంటరితం ఎలా భరించేది? అందుకే ఈ తోటని దెయ్యపుతోటగా మార్చేశాను, కసిదొద్దీ. ఈ మొక్కలకు చావూ లేదూ బ్రతుకూ లేదు. ఈ తోటలో ఉన్న పువ్వులకీ పిట్టలకీ కూడా అదే గతి. నేను వాయురూపంలో ఉన్న దెయ్యాన్ని, అవి ఘనరూపంలో దెయ్యాలు. నా తోడు కోసం తాకినదంతా దెయ్యంగా మార్చెయ్యాలని నా కోరిక. వీలయితే ఈ స్వార్థపరుల లోకాన్నంతా దెయ్యపు లోకంగా మార్చెయ్యాలని. ఈ క్షణం వరకూ ఈ లోకంలో మంచితనం, ధైర్యం, అమాయకత్వం ఉన్నాయని నేననుకోలేదు. ఉన్నాయని మీ ద్వారా నా కర్థమయింది...ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా ఈ స్థితి నుంచి బయటపడాలి? ఎలా శాశ్వత నిద్రలో మునిగిపోవాలి? మిమ్మల్ని చూశాక, లోకాన్ని మీ కోసమన్నా మిగల్చాలనిపిస్తోంది.

నేను చచ్చిన దెయ్యాన్ని. మీ లోకంలో బతికున్న దెయ్యాలున్నాయి. పెరిగి పెద్దవాళ్లై మీరూ ఆ దెయ్యాల్లో ఒకరై పోతారని నా భయం. మీ అమాయకత్వం ఇలాగే వర్ధిల్లి లోకాన్ని మీరు మార్చెయ్యాలని మంచితనానికి స్థావరంగా చెయ్యాలనీ నా కోరిక. ఏది నిజమౌతుంతో నాకు తెలియదు. అందుకే నాకేం పాలు పోవడం లేదు. గౌరి కిదంతా అర్థం కాకపోయినా దెయ్యంతాత ఎందుకో చాలా బాధపడుతున్నాడని గ్రహించింది. ‘‘తాతా! నీకు పరుపు మేం ఏర్పాటు చేస్తాం. ఈ తోటని మాత్రం మూములుగా చెయ్యి. వెనకటిలాగా పూలతో పిట్టలతో ఉంటే ఎంతో బాగుంటుంది. రా తాతా! నా చెయ్యి పట్టుకో. ఈ తోటలో కట్టెలు లేవు. అవతల నీకు కట్టెలతో పరుపు వేసి వెచ్చగా అంటిస్తాం. రా తాతా! రా మరి!’’ దెయ్యం కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పసిపాప చెయ్యి పట్టుకుంది. నడవడం మొదలు పెట్టింది. ఈలోగా నిద్రపోతున్న పిల్లలంతా ఒకరొకరే లేచి వచ్చారు. తోట ఆవరణకి అవతల కట్టెలతో చితి పేర్చారు. కిష్టప్ప లాంతరు పట్టుకొచ్చాడు. గౌరి అలిసిపోయిన దెయ్యం తాతని చితి మీద పడుకోబెట్టారు. కిష్టప్ప లాంతరు చిమ్నీ తీసి చితి అంటించాడు. వెచ్చని మంటల్లో సగం మగత నిద్రలోకి పోతున్న దుగ్గన్న సేనాని దెయ్యం అంది– ‘‘నా చేతులతో ఆనాడు వేసిన తోట నేనే దెయ్యపుతోటగా మార్చేశాను. నేనింక విముక్తి పొందుతున్నాను. నాతో పాటు ఈ తోట విముక్తి పొందుతుంది.

నేను శాశ్వత నిద్రలో చావును చేరుకుంటాను. ఈ రాతి మొక్కలు, లతలు, పువ్వులు, పిట్టలు బ్రతుకును చేరుకుంటాయి. కలకల్లాడుతూ వెనకటిలాగ అయిపోతుంది తోట. కానీ...స్వార్థం ఏమాత్రం మమస్సులో ఉన్నవాళ్లకయినా ఇది రాతితోటే. అమాయకులైన పిల్లలకే ఇది సజీవంగా కనిపిస్తుంది. మీలాంటి పిల్లలే...రాతితోటలాంటి లోకానికి తిరిగి ప్రాణం పొయ్యాలి’’ దుగ్గన్న సేనాని దెయ్యం మంటల్లో వెలుగుగా మారిపోయింది. తోటంతా పిట్టలు కిలకిలమంటూ ఎగురుతున్నాయి. పువ్వులు కలకల్లాడుతున్నాయి, అనేక రంగులతో. పిల్లలు ఆనందంగా ఆ తోటమధ్య గంతులేస్తూ తిరుగుతున్నారు. కాని– వాళ్లని వెతకడానికి వచ్చిన రామలింగం మేస్టారికీ, డ్రైవరుకీ, వంటవాడికీ రాతి మొక్కలే, రాతిపువ్వులే, రాతి పిట్టలే కనిపించాయి. విరిగి తప్పుపట్టిపోయిన గేటు తోస్తే కిర్రుమంటూ తెరుచుకుంది. దారంటూ లేదు. పాచి పట్టిన రాతి మెట్లెక్కి తలుపు తట్టాడు. మేస్టారికి ఇంత వాన కురిసినా మెత్తబడని ఎండు పచ్చిక విచిత్రంగా తోచింది. కిష్టప్ప తన మీదికి వస్తున్న దెయ్యం వంక చూశాడు. దెయ్యం ఈసారి పెద్ద రైలు ఇంజను అవతారం దాల్చింది. దానికి ఎర్రటి మంటలు పొగలు కక్కుతున్న నోరుంది. ఆ నోరు తెరుచుకుని ఇంజన్‌ అతని మీదికి వచ్చింది. దెయ్యం కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పసిపాప చెయ్యి పట్టుకుంది. నడవడం మొదలు పెట్టింది. ఈలోగా నిద్రపోతున్న పిల్లలంతా ఒకరొకరే లేచి వచ్చారు.
∙పాలగుమ్మి పద్మరాజు

మరిన్ని వార్తలు