ఆడతనం కాదు... అమ్మతనం చూడాలి

5 Jan, 2020 00:22 IST|Sakshi

స్త్రీ వైశిష్ట్యం–22

తండ్రికన్నాకొడుకు శరీరం వేరు, కూతురు శరీరం వేరు. కానీ యదార్థానికి అమ్మకన్నాకూడా బిడ్డ శరీరం వేరు కాదు. నా గోరు తీసి అక్కడ పెట్టాననుకోండి... నానుంచి వేరుచేసినా అది నా గోరే. మనం అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నాం. అమ్మ తిన్న అన్నంలోంచి ఈ సప్త ధాతువులు వచ్చాయి. ప్రసవ వేదనపడి, ఎంత కష్టపడి ఈ శరీరాన్ని కన్నదో.. అమ్మ శరీరం లోని ఒక అంతర్భాగం బయటికొచ్చింది తప్ప... గోరు ఊడివచ్చినా అది నాదే అయినట్లు, అమ్మ శరీరంలో ఒక ముక్క ఈ శరీరం కాబట్టి ఇది ఎప్పటికీ మన అమ్మదే తప్ప మనది మాత్రం కాదు. అందుకే అమ్మ అమ్మే. అబ్దుల్‌ కలాంగారు రాష్ట్రపతి పదవిని చేసి దేశానికి ఖ్యాతి తెచ్చినవాడు. అలాంటి శాస్త్రవేత్త తన స్వీయ రచన ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’కి ఉపోద్ఘాతం రాసుకుంటూ ...‘‘అమ్మా! రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు తినడానికి రొట్టెలు లేని రోజుల్లో నేను వచ్చి రొట్టెలు తింటుంటే... నీవు పెడుతూ పోయావు. రుచిగా ఉన్నాయని నీవు చేసినవన్నీ తినేసాను.

అన్నయ్య వచ్చి – అసలే యుద్ధంతో గోధుమలు దొరకడం లేదు, రుచిగా ఉన్నాయని నువ్వు తినేస్తుంటే అమ్మ తను తినకుండా అన్నీ నీకు పెట్టేసింది. ఈ రాత్రికి అమ్మ పస్తుండాలి. చూస్కోక్కరలేదా...అమ్మా! నీకున్నాయా అని అడగక్కరలేదా’’ అని కోప్పడ్డాడు –అయ్యో, అమ్మా! నువ్వు తినాల్సినవి కూడా నేనే తినేసానా – అని బేలగా నీకేసి చూస్తుంటే... నీవు చటుక్కున వంగి నా రెండు బుగ్గలమీద ముద్దు పెట్టుకుని –నాన్నా! నీ బొజ్జ నిండితే నా బొజ్జ నిండినట్టేరా– అన్నావు. నువ్వు నా కడుపు తడుముతూ పెట్టిన రొట్టెలతో ఏర్పడిన ఈ శరీరం ఈ దేశానికి ఎంత సేవ చేయాలో అంత సేవా చేసిందమ్మా, చేస్తూనే ఉంటుంది. భగవంతుడు అంతిమమైన తీర్పిచ్చే రోజు ఒకటి వస్తుందమ్మా. అప్పుడు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఎక్కడున్నా మొట్టమొదట వచ్చి నీ పాదాల దగ్గర వంగి నమస్కారం చేస్తానమ్మా’’ అని రాసుకున్నారు. అమ్మ అన్నమాటలో అంత త్యాగం ఉంది. లోకంలో ఎవరయినా ఏదయినా పదార్ధాన్ని వండి పెట్టారనుకోండి.

మనం దానిని తినకపోతే..‘‘ఏవండీ మీరు వంకాయ కూర తినరా’’ అని అడుగుతారు. అదే అమ్మయితే అలా అనదు...‘‘ఏం నాన్నా, బాగా వండలేదా... తినలేదే... రెండో సారి కూడా వడ్డించుకోలేదు. బహుశః కాయలు బాగా లేవేమో, కనరొచ్చాయి ఉంటాయి. నేను బాధపడతానని చెప్పడం లేదు కదూ, రేపు జాగ్రత్తగా చూసి వండుతాలే..’’అని తెగ బాధపడిపోతుంది. అమ్మలా సాకగల వ్యక్తి లోకంలో మరొకరు లేరు. ఆ అమ్మతనం ఎక్కడుందీ అంటే అమ్మతనంలోనే ఉంది. లోకంలో ఆడతనాన్ని మాత్రమే చూసినవాడు దుర్మార్గుడు. అమ్మతనాన్ని చూసినవాడు ధన్యజీవి. ఆడతనం చూసిన వాడు పాలగిన్నె కింద మంట పెట్టిన వాడు. వాడి మనసు పొంగుతుంటుంది. అమ్మతనం చూసినవాడు పొంగుతున్న పాలమీద నీళ్ళు చల్లుకున్నవాడు. మనిషికి సంస్కారం వచ్చేది–ఆడతనంలో అమ్మతనం చూడడంలోనే. అమ్మతనం చూడకుండా ఆడతనం చూడడం దౌర్భాగ్యం. ఈ జాతి అమ్మతనాన్ని ప్రబోధం చేసింది తప్ప ఆడతనాన్ని బజారుకెక్కించుకున్న తత్త్వం ఈ దేశానిది కాదు. ‘‘అటువంటి స్థితి ఈ దేశానికి కలుగకుండా రోజులు సంస్కరింపబడుగాక’’ అని పరమేశ్వరుడిని ప్రార్థించడం మినహా చేయగలిగిందేమీ లేదు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు