ఎండ తత్వం ఎర్రగా...

24 Apr, 2018 00:26 IST|Sakshi

సీజన్‌ సూత్రాస్‌ 

‘కుడి ఎడమైతే పొరబాటులేదోయ్‌...’ అన్నాను.‘తప్పు. కుడి కుడే... ఎడమ ఎడమే’ అన్నాడు రాంబాబు.‘ఆరు నూరైనా... నూరు ఆరైనా... అని సామెత’ అన్నాను.‘కుదర్దు. ఆరు ఆరే. నూరు నూరే. ఎన్నటికీ సమానం కావు’ చెప్పాడు రాంబాబు.నేను ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాను.రాంబాబు ఖండిస్తున్నాడు. అలా వాడు ఒక పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు.  ‘‘ఏదైనా సరే ఎర్రగానే అవుతుంది కదా అని తమలపాకును చేతులకు పూసుకుంటామా? గోరింటాకును నోట్లో పెట్టి నములుతామా? సూక్తులూ సూచనలూ బోలెడన్ని ఉంటాయి. ఏది ఎక్కడ ఎలా వాడాలో తెలియడమే విజ్ఞత, విచక్షణ’’ అన్నాడు. ‘‘స్పీచులో ఈ సీజన్‌నాటి ఎర్రటి ఎండలా మండుతున్నావ్‌రా నువ్వూ’’ అన్నాను. మళ్లీ ఫ్లో మొదలైంది. ‘‘ఎండ మంచిదే...! కాదని ఎవరన్నారు. మొక్క మీద పడి ఆకును పచ్చగా చేసి... దాన్ని మనకే ఆహారంగా పెడుతుంది. ఒంటి మీద పడి... ‘విటమిన్‌–డి’ని తయారు చేసి ఎముకలనూ ఆరోగ్యాన్నీ భర్తీ చేస్తుంది. అలాగని... కుడి ఎడమల్లో ఎలాంటి పొరబాటు లేదనే సూక్తిని ఎండకు ఆపాదించి... ‘విటమిన్‌–డి’ మనక్కావాలంటూ ఈ సీజన్‌లో చొక్కా అలా విప్పేసి ఒంటిని ఆరుబయట అదేపనిగా ఎక్స్‌పోజ్‌ చేయవచ్చా? తప్పు కదా...!’’ అన్నాడు వాడు. 

‘‘తప్పేనంటావా?’’ అన్నాను. ఇంకా రెచ్చిపోయాడు. ‘‘చెబుతా విను. ఎండ ఎప్పుడూ ఎర్రగా, వేడిగానే ఉంటుంది. మంచు ఎప్పుడూ తెల్లగా, చల్లగానే ఉంటుంది. భౌతికశాస్త్ర సూత్రాలేవీ మారవు. భూమ్మీదైనా... మార్స్‌ మీదైనా... మరో గెలాక్సీలోని ఇంకో గ్రహం మీదైనా... మరెక్కడైనా ఒక్కటే. కానీ... ఆలోచనా, ఒక విషయాన్ని చూడాల్సిన దృక్పథం సీజన్‌ను బట్టి మారాలి. అదే... వివేకం, విచక్షణ, వివేచన. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం కుదరదు. మంత్రం మార్చాలి’’  ... మ«ధ్యాహ్నం ఎండలాంటి తీక్షణతతో ఇలా ఎడతెరిపి లేకుండా అనంతంగా ఒక తత్వవేత్తలా మాట్లాడుతూనే ఉన్నాడు మా రాంబాబు గాడు. ‘‘ఇంతకీ చివరగా ఏమంటావురా నువ్వూ?’’ అడిగాన్నేను. దీనికి జవాబుగా వాడన్న మాటా... వాడి అభిప్రాయం తెలిసి అవాక్కయ్యాను నేను. దాంతో నాకు ఒక తత్వం బాగా బోధపడింది. అదేమిటంటే... తమలపాకూ గోరింటాకులు బాగా పండాకా... ఎండలు విపరీతంగా మండాకా... ఎర్రగా ఎలా ఉంటాయో... మా రాంబాబు గాడి వాదనలూ అచ్చం అలాగే ఉంటాయి.   ఇంతకీ చివరగా వాడన్న ఉపదేశం లాంటి ఆ మాట ఏమిటంటే...‘‘వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది... ఎర్రటి ఎండల్లో పడి అలా ఆరుబయట తిరగకు’’ 
– యాసీన్‌

మరిన్ని వార్తలు