మౌనం

6 Jan, 2016 22:49 IST|Sakshi
మౌనం

ధ్యానమార్గం

యోగసాధనలో ధ్యానానికి తిరుగులేని ప్రాధాన్యం ఉంది. ధ్యానం అంటే ఒకరకంగా మానసికంగా మౌనావస్థకు చేరుకోవడమే. అంటే, ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగా కూడా మౌనం పాటించనిదే ధ్యానం చేయడం సాధ్యం కాదు. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు. మౌనం పాటించడం వల్లనే వారిని మునులు అంటారు. రోజుల తరబడి మౌనం పాటించడం లౌకిక జీవితం గడిపే సామాన్యులకు సాధ్యం కాదు. వారానికోసారి లేదా పర్వదినాల్లో, ప్రత్యేక సందర్భాల్లో సామాన్యులు కూడా మౌనవ్రతం పాటించడం మంచిదని పెద్దలు చెబుతారు. పెద్దల మాట మేరకు కొందరు లౌకిక జీవితం గడుపుతూనే, అప్పుడప్పుడు మౌనవ్రతం పాటిస్తూ ఉంటారు.

ఇంతకీ మౌనవ్రతం ఎందుకు పాటిస్తారు? మౌనం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అంటారా..? మౌనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చిరాకు, కోపం, వేదన వంటి ప్రతికూల భావోద్వేగాలు క్రమంగా సద్దుమణిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధ్యానానికి అలాంటి ప్రశాంత పరిస్థితే అవసరం. అందుకే, ధ్యాన సాధనకు ఉపక్రమించేవారు తొలుత మౌనాన్ని ఆశ్రయించాలి.

 

మరిన్ని వార్తలు