పిందె విందు

21 Mar, 2020 04:57 IST|Sakshi

వేసవికాలం వస్తోందంటే ఎండలు మండుతుంటాయి... ఒక పక్క నుంచి వడగాడ్పులు ... మరో పక్కనుంచి మామిడి గాలులు వీస్తాయి కాయలు పెద్దవయ్యే వరకు ఊరుకోగలమా... చెట్టు కింద రాలిన పిందెలను ఏరి ఏదో ఒకటి చేసేయొద్దు... పిందే కదా అని ఏరి పారేయద్దు... అందులోనూ రుచి ఉంది... తిని చూడండి... మీకు నచ్చి తీరుతుంది... కావాలంటే ఈ పిందె మీద ఒట్టు... పిందె విందు చేసుకు తిందాం...

వడు మాంగా
కావలసినవి: మామిడి పిందెలు – రెండు కప్పులు; (మామిడి పిందెలు గుండ్రంగా ఉండాలి); ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్‌ స్పూన్లు. పొడి కోసం: ఎండు మిర్చి – 20; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ∙ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కాసేపు నీడలో ఆరబెట్టాలి ∙ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి (అలా చేయడం వల్ల నూనె అన్ని మామిడి పిందెలకు పడుతుంది) ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి చల్లారాక, ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙పావు కప్పు నీళ్లను మరిగించి చల్లార్చాక, పొడికి జత చేసి మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి ∙రోజుకి మూడు నాలుగుసార్ల చొప్పున అలా సుమారు మూడు రోజులు కలపాలి ∙మామిడిపిందెలు మెత్తగా అయ్యి తినడానికి అనువుగా తయారవుతుంది.

మామిడి ఔషధం
వేసవి వస్తోందనే సమాచారాన్ని మామిడి కాయలు మోసుకొస్తాయి. ఆ సమాచారంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లు, మినరల్స్‌నూ తీసుకొస్తాయి. మండు వేసవి రాక ముందే అందరినీ నోరూరించే మామిడి కాయల వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది ∙మామిడిలో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది ∙క్యాన్సర్‌ ప్రమాదాన్ని నివారిస్తుంది ∙కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గిస్తుంది ∙మామిడిలో అధిక మొత్తంలో ఉండే పెక్టిన్, పీచు పదార్థం రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది. పెక్టిన్‌.. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా ఉంచుతుంది ∙బరువు పెరగడానికి సహాయపడుతుంది ∙రక్త హీనతను తగ్గిస్తుంది ∙మామిడిలో ఐరన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల, గర్భధారణ సమయంలో గర్భిణీలకు అవసరమైన ఇనుము వీటి ద్వారా పుష్కలంగా లభిస్తుంది ∙మొటిమల నివారణకు మామడి చక్కని ఔషధం. చర్మానికి అడ్డు పడే రంధ్రాలు తెరుచుకోవటం వల్ల మొటిమలు ఏర్పడటాన్ని నివారిస్తుంది ∙వృద్ధాప్యాన్ని నివారిస్తుంది

∙మామిడికాయలో ఉండే ఏ, సి విటమిన్లు శరీరంలో అధికమొత్తం కొల్లాజెన్‌ ప్రోటీన్‌ ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తాయి ∙మామిడికాయలో  అధికంగా ఉండే విటమిన్‌ బి 6 మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తుంది ∙రోగనిరోధక శక్తి పెంచుతుంది ∙మామిడిలో అధిక పరిమాణంలో ఉండే బీటా కెరొటిన్‌ అనే కెరొటినాయిడ్‌ వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ∙కంటి ఆరోగ్యానికి మామిడి చక్కని ఔషధం. మామిడికాయ ముక్కలు ప్రతిరోజూ తీసుకుంటే విటమిన్‌ ఏ లభిస్తుంది. తద్వారా రేచీకటి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు దూరమై, కంటి చూపు మెరుగుపడుతుంది ∙పచ్చి మామిడికాయ రసంలో నీళ్లు, కొంచెం పంచదార కలిపి తాగితే శరీరం చల్లగా మారి, వేసవిలో వడదెబ్బ ప్రమాదాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది ∙సూర్యుని వేడి వల్ల మన శరీర వేడి తగ్గక పోతే, మూత్రవిసర్జన ఆగి, మూత్రపిండాలు విషపదార్థాలతో నిండే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి మామిడికాయ ఎంతో ఉపయోగపడుతుంది.

కన్ని మాంగా అచార్‌
కావలసినవి: మామిడి పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ – టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి). 
తయారీ: ∙ముందుగా మామిడిపిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి పోయేవరకు ఆరబెట్టి, ముచికలు కట్‌ చేయాలి ∙తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి మరిగించి చల్లార్చాలి ∙ఒక పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి మీద నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి ∙నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి ∙ఈ నీటికి కారం, ఇంగువ, ఆవ పొడి జత చేసి బాగా కలపాలి ∙ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి.

కడు మాంగా అచార్‌
కావలసినవి: మామిడి పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చిమిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్‌స్పూన్లు.
తయారీ: ∙మామిడిపిందెలను శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ∙పసుపు, కారం కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ∙చివరగా మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ∙మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక, గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ∙(ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం తురుమును ఎండబెట్టి కలుపుకోవచ్చు)

మరిన్ని వార్తలు