గోధూమ్‌ధామ్

30 Dec, 2015 15:05 IST|Sakshi
గోధూమ్‌ధామ్

గోధుమపిండి...
ఏముందిలే... చపాతీ, పూరీలేగా చేసేది అని చప్పరించేయకండి.
అదే పిండికి కొన్ని ఆధరువులు తగిలిస్తే...
చపాతీ, పూరీలు సైతం చవులూరించే
కొత్త రుచులకు కేంద్రమవుతాయి.
గోధుమపిండితోనే స్వీటు, దోసెల లాంటి వెరైటీలూ ఉన్నాయండోయ్!
అందుకే, గోధుమలతో ధూమ్‌ధామ్... ఈ ఆదివారం మీ ఫ్యామిలీలో...
 

బంగాళదుంప - కొత్తిమీర చపాతీ
 
కావలసినవి: గోధుమ పిండి - 2 కప్పులు; బంగాళదుంపలు - 8; కొత్తిమీర - ఒక కట్ట, పచ్చి మిర్చి - 4; ఇంగువ - చిటికెడు, ఉప్పు, నెయ్యి - తగినంత
తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి.
 బంగాళదుంపలను  ఉడికించి తొక్క తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి  కొత్తిమీర , పచ్చి మిర్చి శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి   ఒక పాత్రలో బంగాళదుంప మిశ్రమం, కొత్తిమీర మిశ్రమం వేసి, ఇంగువ జత చేసి బాగా కలపాలి   చిన్న చిన్న ఉండలుగా చేయాలి ఒక్కో ఉండను గుండ్రంగా ఒత్తి, అందులో బంగాళదుంప మిశ్రమం ఉంచాలి. అంచులు మూసేసి, పిండి కొద్దిగా అద్దుతూ చపాతీలా ఒత్తాలి  స్టౌ మీద పాన్ వేడి చేసి, ఒత్తి ఉంచుకున్న చపాతీని వేసి రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి తీసేయాలి వేడివేడిగా వడ్డించాలి.
 
 గోధుమ హల్వా


కావలసినవి: గోధుమ పిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; మిఠాయి రంగు - చిటికెడు (కొద్దిపాటి నీళ్లలో వేసి కలిపి ఉంచాలి); ఏలకుల పొడి - పావు టీ స్పూను; నెయ్యి - తగినంత
 తయారీ:ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, గోధుమ పిండి వేసి కలపాలి  వేరొక పాత్రలో పావు కప్పు నీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. స్టౌ మీద ఈ పాత్ర ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి నీళ్లలో కలిపి ఉంచుకున్న గోధుమపిండి, మిఠాయి రంగు, ఏలకుల పొడి, నెయ్యి వేసి అడుగంటకుండా కలపాలి  మిశ్రమం బాగా ఉడికిందనిపించాక, స్టౌ కట్టేయాలి పెద్ద పళ్లానికి నెయ్యి రాసి, ఉడికించుకున్న హల్వా పోసి, సమానంగా పరిచి కట్ చేసుకోవాలి.
 
 టొమాటో  చీజ్ పూరీ
 
కావలసినవి గోధుమపిండి - కప్పు మైదా పిండి - కప్పు టొమాటో రసం - కప్పుకారం - టీ స్పూను చీజ్ తురుము - కప్పు ఉప్పు - తగినంత
 నూనె - తగినంత
 
తయారీ ఒక పాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి, చపాతీ పిండిలా కలిపి సుమారు అర గంటసేపు నాననివ్వాలి.బాణలిలో నూనె వేసి కాచాలి.పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తి, నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పేపర్ టవల్ మీదకు తీసుకుని, వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి.
 
కశ్మీరీ చపాతీ
 
కావలసినవి: గోధుమపిండి - కప్పు, సోంపు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను, వాము - పావు టీ స్పూను; మిరియాలు - 10, ఇంగువ - పావు టీ స్పూను; పాలు - తగినన్ని, ఉప్పు - తగినంత; నెయ్యి - కొద్దిగా
 
తయారీ: ముందుగా బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలను నూనె లేకుండా వేయించి, చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి  ఒక పాత్రలో గోధుమపిండి, పొడి చేసి ఉంచుకున్న మసాలా, ఇంగువ, పాలు, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి  స్టౌ మీద పెనం ఉంచి వేడి చేయాలి  పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా ఒత్తి, పెనం మీద వేసి రెండువైపులా నేతితో కాల్చి తీయాలి. వేడివేడిగా ఏదైనా కూరతో అందించాలి.
 
 

మరిన్ని వార్తలు