జీవితం సంతోషాల పూదోట

6 Jan, 2018 00:26 IST|Sakshi

చెట్టు నీడ

లోపాలు, కోపాలు, దిగుళ్లు, చింతలు ఎన్ని ఉన్నప్పటికీ సంతోషం అనేది ఈ జీవితంలో చేయవలసిన ఒక గొప్ప సాహసం అని మరచిపోవద్దు. సంతోషం అంటే మబ్బుల్లేని ఆకాశం కాదు. ప్రమాదాలు లేని రహదారి కాదు. నిస్సత్తువ లేని పని గంటలు కాదు. నిరాశ కలిగించని మానవ సంబంధాలు కాదు. సంతోషంగా ఉండడం అంటే.. క్షమాగుణంలోని శక్తిని కనుక్కోవడం, యుద్ధాలలో ఆశల్ని నిలుపుకోవడం, భయంలో భద్రతను, విడిచివేతలో ప్రేమను వెతుక్కోవడం. సంతోషం అంటే చిరునవ్వును ఆస్వాదించడం మాత్రమే కాదు. విచారానికి అదొక ప్రతిఫలనం కూడా.  సంతోషం అన్నది విధి విలాసం కాదు. కాలంతో పాటు అంతర్యానం చేయగలవారు సాధించే విజయం. సంతోషం అంటే ఎడారులను దాటుకుంటూ నీ లోలోపలి లోతుల్లో ఒయాసిస్సులను అన్వేషించడం. నీ జీవితంలోని మహిమలకు ప్రతి ఉదయం దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవడం.

సంతోషం అంటే ‘కాదు’ అనే మాటను వినగలిగిన ధైర్యాన్ని కలిగి ఉండడం. విమర్శలో నిబ్బరంగా ఉండడం. నీ పిల్లల్ని ముద్దాడడం. తల్లిదండ్రులను లాలించడం. స్నేహితులతో కవితాత్మక క్షణాలను గడపడం... వాళ్లు మనల్ని బాధించినా కూడా!  ‘నేను పొరపాటు చేశాను’ అని ఒప్పుకోవడం పరిణతి. ‘నన్ను క్షమించు’ అని అడగగలగడం ధైర్యం. నీ జీవితం సంతోషానికి అవకాశాల çపూదోట అవ్వాలి. సంతోషాన్ని ప్రేమించే వసంతం కావాలి. శీతాకాలంలో వెచ్చటి విజ్ఞత అవ్వాలి. ఒక తప్పు జరిగిపోతే జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టు. అప్పుడు మాత్రమే జీవితంతో నువ్వు ప్రేమలో ఉండగలవు. సంతోషంగా ఉండడం అంటే జీవితంలో పరిపూర్ణత  ఉండడం మాత్రమే కాదని అప్పుడు నువ్వు గ్రహిస్తావు. అయితే సహనాన్ని నువ్వు కన్నీళ్లతో సాగు చెయ్యాలి. కోల్పోయినవాటితో సహనాన్ని సాధన చెయ్యాలి. నీ పొరపాట్లతో ప్రశాంతత అనే శిల్పాన్ని మలుచుకోవాలి. బాధను ఆహ్లాదమనే పట్టీగా వేసుకోవాలి. అడ్డంకులతో జ్ఞానద్వారాలను తెరవాలి. విడిచిపెట్టకు. నిన్ను ప్రేమించే మనుషులను ఎప్పటికీ విడిచిపెట్టకు. సంతోషాన్ని వదులుకోకు. జీవితమనే అద్భుతమైన ఆట నుంచి తప్పుకోకు. (కొత్త సంవత్సరంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఇచ్చిన ప్రసంగం నుంచి) 

మరిన్ని వార్తలు