కిచెన్‌తో పొత్తు

7 Jul, 2018 01:34 IST|Sakshi

పొలిటికల్‌ సీన్‌ వేడెక్కింది. ఎవరితో ఎవరికి పొత్తుంటుందన్నదే హాట్‌ డిస్కషన్‌.స్వీట్‌ టాక్‌. మీక్కూడా పొత్తుండాలిగా మరి. ఇదిగోండి కిచెన్‌లోకి మొక్కజొన్న తేండి.దానితో పొత్తు పెట్టుకుంది. చిత్తు చేసే రుచులన్నీ జుర్రుకోండి.

స్పైస్‌డ్‌ సిమ్మర్డ్‌ కార్న్‌ రెసిపీ
కావలసినవి: ఉడికించిన మొక్కజొన్న గింజలు – అర కేజీ; పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొత్తిమీర తరుగు – 4 టేబుల్‌ స్పూన్లు; నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పాలు – 125 మి.లీ.; అల్లం – చిన్న ముక్క; చిలికిన పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర తరుగు – గార్నిషింగ్‌ కోసం

తయారీ: ∙మొక్కజొన్న గింజలను ఉడికించిన నీటిని పక్కన ఉంచాలి ∙మిక్సీలో పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర, ఉడికించిన నీరు వేసి మెత్తగా చేయాలి ∙బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి ∙మెత్తగా చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము మిశ్రమం జత చేసి కలపాలి ∙ఉడికించిన మొక్కజొన్న గింజలు, పాలు, పెరుగు జత చేసి సుమారు 10 నిమిషాలు ఉడికించి వేడివేడిగా అందించాలి.


కార్న్‌ పాయసం
కావలసినవి: నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; జీడిపప్పులు – 10; కిస్‌మిస్‌ – 10; కొబ్బరి తురుము – టేబుల్‌ స్పూను; మొక్కజొన్న గింజలు – ఒక కప్పు; పాలు – అర లీటరు; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బాదంపప్పుల పొడి – టేబుల్‌ స్పూను.

తయారీ ∙అర కప్పు మొక్క జొన్న గింజలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి కరిగాక, జీడిపప్పులు, కిస్‌మిస్, పచ్చికొబ్బరి తురుము, అర కప్పు మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి ∙పాలు, మొక్కజొన్న పేస్ట్‌ జత చేసి మరిగించాలి ∙మిశ్రమం బాగా చిక్కబడుతుండగా పంచదార జత చేసి మరి కొద్ది సేపు మరిగించాలి ∙చివరగా ఏలకుల పొడి వేసి కలిపి దింపేయాలి ∙బాదం పప్పులతో అలంకరించి అందించాలి.

మొక్క జొన్న పులావ్‌
కావలసినవి: బాస్మతి బియ్యం – పావు కేజీ; మొక్కజొన్న గింజలు – ఒకటిన్నర కప్పులు; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు;ఉల్లి తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; ధనియాల పొడి – పావు టీ స్పూను; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – తగినంత.గ్రీన్‌ చట్నీ పేస్ట్‌ కోసం.. . కొత్తిమీర – పావు కప్పు; పుదీనా ఆకులు – ఒక టేబుల్‌ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 4 (సన్నగా తురమాలి);పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూనునీళ్లు – మిశ్రమాన్ని ముద్దలా చేయడానికి తగినంత;మసాలా కోసం...  బిరియానీ ఆకు – 1; ఏలకులు – 2; లవంగాలు – 2; దాల్చిన చెక్క – చిన్న ముక్క; జాపత్రి – కొద్దిగా; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – 4

తయారీ ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో సుమారు అరగంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ∙గ్రీన్‌ చట్నీ కోసం చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి.
పులావ్‌ తయారీ ∙కుకర్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేడయ్యాక, మసాలా దినుసులు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి  మెత్తగా చేసిన మసాలా మిశ్రమం జత చేసి, వేయించాలి ∙మొక్క జొన్న గింజలు జత చేసి వేయించాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి వేసి మరోమారు వేయించాలి ∙బియ్యం జత చేసి బాగా కలియబెట్టాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టి మూత పెట్టి, విజిల్‌ పెట్టాలి ∙మూడు విజిల్స్‌ రాగానే స్టౌ కట్టేసి దింపేయాలి ∙పులావ్‌ను పెద్ద పాత్రలోకి తీసుకుని, కొత్తిమీరతో అలంకరించి, రైతాతో అందించాలి.

హండీ కార్న్‌ సబ్జీ

కావలసినవి :గరం మసాలా కోసం లవంగాలు – 7, మిరియాలు – 8, ఏలకులు – 3, ధనియాలు – ఒక టేబుల్‌ స్పూను, దాల్చిన చెక్క – చిన్న ముక్క, జీలకర్ర – ఒక టేబుల్‌ స్పూనుకూరలుక్యాప్సికమ్‌ – 2కాల్చిన మొక్కజొన్న గింజలు – 2 కప్పులుసబ్జీ కోసంనూనె – 2 టేబుల్‌స్పూన్లు, జీల కర్ర – ఒక టీ స్పూను, మినప్పప్పు – ఒక టీ స్పూను, సెన గ పప్పు – ఒక టీ స్పూను, కరివేపాకు – 5 రెమ్మలు, ఉల్లి తరుగు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 2, అల్లం తురుము – ఒక టీ స్పూను, కొబ్బరి తురుము – అర కప్పు, పసుపు – ఒక టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూను, ధనియాల పొడి – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంతచింతపండు పులుసు – 3 టీ స్పూన్లుబెల్లం తురుము – ఒక టీ స్పూనుకొత్తిమీర – కొద్దిగాగరం మసాలా – ఒక టీ స్పూనునిమ్మరసం – కొద్దిగా గరం మసాలా తయారీ ∙బాణలిలో గరం మసాలా కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.

సబ్జీ తయారీ:∙బాణలిలో నూనె కాగాక జీలకర్ర, మినప్పప్పు, సెనగ పప్పు వేసి వేయించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙ఉలి తరుగు, అల్లం, వెల్లుల్లి జత చేసి వేయించాలి ∙ఉల్లి పాయలు బంగారు రంగులోకి వచ్చాక, కొబ్బరి తురుము వేసి వేయించాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి, అర టీ స్పూను గరం మసాలా, ఉప్పు, కొద్దిగా నీళ్లు జత చేసి కలియబెట్టాలి ∙చింతపండు రసం, బెల్లం తురుము జత చేసి మరోమారు కలిపి, మొక్కజొన్న గింజలు, గ్రిల్‌ చేసి క్యాప్సికమ్‌ తరుగు వేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు జత చేసి, మూత పెట్టి, నీళ్లు ఇగిరిపోయేవరకు ఉడికించాలి ∙ఉడికిన తరవాత దింపి, కొత్తిమీర తరుగుతో అలంకరించి, తయారుచేసి ఉంచుకున్న గరం మసాలా ఒక టీ స్పూను, కొద్దిగా నిమ్మరసం జత చేసి కలిపి అందించాలి.

మొక్క జొన్న సమోసా
కావలసినవి:మొక్క జొన్న గింజలు – అర కప్పుఉల్లికాడల తరుగు – పావు కప్పుఉల్లి తరుగు – అర కప్పుమిరప కారం – అర టీ స్పూనుఉప్పు – తగినంతమైదా పిండి – ముప్పావు కప్పునూనె – ఒక టీ స్పూను + ఒక టీ స్పూను + డీప్‌ ఫ్రైకి సరిపడానీళ్లు – తగినంత

తయారీ ∙బాణలిలో టీ స్పూను నూనె కాగాక, ఉల్లి తరుగు జత చేసి వేయించాలి ∙మొక్క జొన్న గింజలు జత చేసి కొద్దిసేపు వేయించాలి ∙ఉల్లి కాడల తరుగు వేసి బాగా కలిపాక, ఉప్పు, మిరపకారం వేసి కలిపి దింపి చల్లారబెట్టాలి ∙ఒక పాత్రలో మైదాపిండి, టేబుల్‌ స్పూను వేడి నూనె, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి, ఉండలు చేసి చపాతీలా కలపాలి ∙మధ్యకు కట్‌ చేసి ఒక్కో భాగాన్ని సమోసాలాగ చుట్టాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం టీస్పూన మిశ్రమాన్ని సమోసాలు ఉంచి అంచులు తడి చేసి మూసేయాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙బాణలిలో నూనె కాగాక సమోసాలు అందులో వేసి దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో అందించాలి.

గుమ్మడికాయ బెల్లం రోటి పచ్చడి
కావలసినవి:గుమ్మడికాయ – పావు కేజీచింతపండు – నిమ్మకాయంతపసుపు – చిటికెడుబెల్లం – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతపేస్టు కోసంపచ్చి కొబ్బరి తురుము – అర కప్పుపచ్చి మిర్చి – 2పోపు కోసం
నూనె – 1 టీ స్పూనుఆవాలు – అర టీ స్పూనుమెంతులు – పావు టీ స్పూనుఎండు మిర్చి – 1 కరివేపాకు – 4 రెబ్బలు

తయారీ ∙చింతపండు గుజ్జు తీయాలి ∙గుమ్మడికాయను తొక్క తీసి అర అంగుళం ముక్కలుగా తరగాలి ∙అర కప్పు నీటిలో చింతపండు గుజ్జు, గుమ్మడి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి ∙కొబ్బరి తురుము, పచ్చి మిర్చి మెత్తగా నూరి, గుమ్మడి ముక్కల్లో వేయాలి ∙బెల్లం పొడి కలిపి దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి కరివేపాకు వేసి వేయించి, పచ్చడికి జత చేయాలి ∙ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

రోటి పచ్చడి పొటాటో – కార్న్‌ సూప్‌
కావలసినవి :బంగాళ దుంపలు – 6 (తొక్క తీసి ముక్కలు చేయాలి)కొత్తిమీర ఆకులు – ఒక కప్పుఉల్లి తరుగు – పావు కప్పుమొక్క జొన్న గింజలు – రెండు కప్పులుఉల్లి కాడల తరుగు – పావు కప్పుఉప్పు – తగినంత

తయారీ ∙ఒకపెద్ద పాత్రలో బంగాళ దుంప ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు, తగినన్ని నీళ్లు జత చేసి మూత పెట్టి ఉడికించాలి.
∙మొక్కజొన్న గింజలు జత చేసి పదార్థాలన్నీ మెత్తగా అయ్యేవరకు సుమారు పది నిమిషాలు ఉడికించాలి.
∙ఉల్లికాడలు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేసి, వడగట్టి అందించాలి.

మొక్కజొన్న
భారతదేశపు ప్రాచీన ఇతిహాసంలో ప్రస్తావించబడిన ఆహార ధాన్యాలైన వరి, గోధుమ, బార్లీ (యవలు) వంటి వర్ణనలలో ‘మొక్కజొన్న పొత్తు’ ప్రస్తావన కానరాదు. ఇది సుమారు 16, 17వ శతాబ్ద కాలంలో విదేశాల నుంచి వలసవచ్చిన ఆహార ధాన్యం మాత్రమే. దీనినే మెయిజ్‌ () లేదా కార్న్‌ () అని ఆంగ్లంలో అంటారు. ఇటీవల స్వీట్‌ (షుగర్‌) కార్న్‌ కూడా మనకు విరివిగా లభ్యమౌతోంది.  సాధారణ మొక్కజొన్న పొత్తు (కండె) కన్నా ఎక్కువ తీయదనం కల్గి రసప్రధానంగా ఉంటుంది కనుక దీనిని స్వీట్‌కార్న్‌ అంటారు.

పోషక విలువలు: 
ఆధునిక జీవ రసాయన పరిభాషలో చెప్పాలంటే దీనిలో పీచు పదార్థం (ఫైబర్‌) పుష్కలంగా లభిస్తుంది. ఎ, బి, సి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. యాంటి ఆక్సిడెంట్స్‌ కూడా అధికంగా ఉంటాయి. శర్కర, పిండి పదార్థాలు ఎక్కువగా కలిగివుండడం వల్ల మధుమేహ రోగులు వీటిని అధిక ప్రమాణంలో కాకుండా తక్కువగా తినవలసి ఉంటుంది. ఖనిజ లవణాలైన ఫాస్ఫరస్, మేంగనీస్, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్‌ తగురీతిలో లభిస్తాయి. పొటాషియం, కాల్షియం బాగా తక్కువగా ఉంటాయి. స్టార్చ్‌ కూడా అధికంగా ఉంటుంది. నీరు శాతం కూడా అధికమే.

ఆరోగ్య ప్రయోజనాలు: తగు ప్రమాణంలో కొంతకాలం తింటే నీరసం తగ్గి, బరువు పెరుగుతారు. కంటిచూపుకి చాలా ఉపయోగకరం. కడుపులోని వాయువులను తొలగించి సుఖవిరేచనం చేస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది.

ఎలా తినాలి:
పొత్తుని పైరేకలు తొలగించి నిప్పుమీద కాల్చి, కొంచెం చల్లారిన తర్వాత నమిలితింటే ఆరోగ్యానికి చాలా మంచిది.ఎండలో ఎండబెట్టి పొడిబారిన తర్వాత ‘పిండి’గా మలచుకొని రొట్టెలు తయారుచేసుకొని తినే అలవాటు ఉత్తర భారతదేశంలో ఉంది. ఆ పిండిని వంటలలో కూడా వాడుతుంటారు.ఆకర్షణీయమైన ‘పాప్‌కార్న్‌’లోని లోపాలు:వాస్తవానికి వరిధాన్యం నుండి ఒక పద్ధతి ప్రకారం పేలాలను తయారుచేస్తారు. వేడిచేసినప్పుడు ధాన్యం పగిలి, పేలటం ద్వారా వచ్చే పదార్థం కనుక ‘పేలాలు’ అన్నారు. ‘పాప్‌’కి కూడా వికసించి బయటకు వస్తుంది అని అర్థం. ఎక్కువ కేలరీలు గల నూనెలను వాడి ఈ పాప్‌కార్న్‌ తయారుచేస్తారు. ఉప్పు, ఇతర మసాలాలను అధికంగా కలిపి రుచిని పెంచుతారు. ఇక సరే, శీతల పానీయాలను తాగుతూ ఇవి తినడం ఒక రివాజు. ఇవన్నీ శరీరానికి హానికరమని మరిచిపోకూడదు. ఇలా తినడం వల్ల వాటి ప్రయోజనాలకన్నా అనర్థాలే అధికమని గమనించుకోవాలి.నీటి ఆవిరితో ఉడికించి తిన్నా మంచిదే.నానబెట్టడం, మొలకలు తయారుచేయడం, పులియబెట్టడం వంటి ప్రక్రియలను అరుదుగా పాటిస్తారు. వీటివల్ల దీనిలో ఉండే ‘ఫైటేట్సు’ యొక్క దుర్గుణాలు తగ్గిపోతాయి. వీటి నుంచి ఆయిల్స్, సిరప్స్‌ కూడా చేస్తారు. వాటికి దూరంగా ఉంటేనే మేలు.

ఆయుర్వేదం: ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో దీని ప్రస్తావనే లేదు కానీ, ఇటీవల 16, 17 శతాబ్దపు ఆయుర్వేద వైద్యుడైన యోగరత్నాకరుడు దీనిని ‘యుగంధరః’ అని ప్రస్తావించి శరీరానికి చాలా మేలు చేస్తుందని, మంచి పథ్యపు ఆహారంగా పనికొస్తుందని, తీపి కల్గి ధాతు పుష్ఠికరమని, త్రిదోష (వాత, పిత, కఫ)హరని, వక్కాణించాడు.‘‘యుగంధరః త్రిదోషఘ్నః స్వాదుః పథ్యో రసాయనః’’అని యోగరత్నాకర గ్రంథంలో ఉంది.

ఔషధ గుణాలు: దీనిపై గల రేకలలో మీసాల వంటి సన్నని మృదువైన ‘కేసరాలు’ ఉంటాయి. దీని కషాయం తాగితే ‘ప్రొస్టేటు’ గ్రంథి యొక్క వాపు తగ్గుతుందని ఇటీవలికాలంలో చేసిన పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే కిడ్నీలోనూ, గాల్‌ బ్లాడరు (పిత్తాశయం)లోనూ గల రాళ్లు కరిగి బయటకు వచ్చేస్తాయి. దీనిలో ఉంటే క్షారగుణం (ఆల్కలైన్‌ గుణం) ఈవిధంగా ఉపకరిస్తుందని అన్వయించారు.
గుర్తుంచుకోవలసిన సారాంశం:‘బక్కచిక్కినోడ మొక్కజొన్న తినుముధాతు పుష్టి కలిగి తనువు మెరయుపాపుకార్ను మనకు వలదంచు గుర్తించిపొత్తు కాల్చి తినుగ పుష్టి కలుగు’

వంటింటి చిట్కాలు
బియ్యం, తృణధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేకలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి.
పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా మారితే, దాని మీద సబ్బు నీళ్లు పోసి సన్నటి సెగ మీద ఉంచి, చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది.
రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.
పచ్చి బఠాణీలు ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
చపాతీలు ఒత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనె వేసి మడతలుగా చేసి కాల్చి, హాట్‌ ప్యాక్‌లో ఉంచితే ఆరేడు గంటలపాటు మెత్తగా ఉంటాయి.
చపాతీ పిండిలో ఉడికిన బంగాళదుంపను వేసి బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి.
పరగడుపున ఉసిరికాయ, భోజనం చేశాక అరటిపండు, సాయంత్రం వెలగపండు తింటే అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
 పెరుగు పచ్చడి మరింత రుచిగా రావాలంటే, పోపులో టీ స్పూను నెయ్యి కలిపితే సరి.
గులాబ్‌జామ్‌ తయారుచేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పనీర్‌ జత చేస్తే, మృదువుగా రుచిగా ఉంటాయి.
దోసెల పిండి బాగా పులిస్తే, అందులో రెండు టీ స్పూన్ల గోధుమపిండిని కలిపితే రుచిగా వస్తాయి.

మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్‌ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్‌... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్‌. mail: familyvantakalu@gmail.com  లేదా పోస్టు ద్వారా పంపండి. 
మా చిరునామా: సాక్షి వంటలు,  
సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, 
బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  

 

మరిన్ని వార్తలు