మేథకు అందనిది

21 Oct, 2018 00:30 IST|Sakshi

తత్త్వరేఖలు

భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మగా చెప్పబడే అనంతమైన శక్తి నిరాకారమైనది. ఎందుకంటే, పరిమితంగా ఉంటేనే కదా ఆకృతి కనిపించేది. ఎక్కడా అణువంత ఖాళీ లేకుండా విశ్వమంతా నిండి ఉన్న ఆ అనంత శక్తికి పదార్థ లక్షణాలు కానీ, కాంతి, శబ్దం, ఉష్ణం, ఆకర్షణ లాంటి శక్తి రూపాలకుండే లక్షణాలు కానీ ఏవీ లేవు. ఏ పరిమాణాలకూ, కొలతలకూ చిక్కకుండా, నిశ్చలంగా ఉంది. ఆస్టన్రామికల్‌ యూనిట్, కాంతిసంవత్సరాలు, పార్సెక్‌ లు, మెగా పార్సెక్‌ లాంటి ఖగోళదూరాలు కొలిచే ఏ ప్రమాణాలూ ఆ అనంతశక్తిని ఇసుమంత కూడా కొలవలేవంటే అతిశయోక్తికాదు.అంతటి శక్తిలోనుండే ఈ దృశ్యమాన ప్రపంచం పుట్టుతూ, గిట్టుతూ ఉంది. ఒక ప్రాంత జనాభా ఏవిధంగాౖ నయితే స్థిరంగా ఉండదో, అదేవిధంగా ఈ దృశ్యమాన ప్రపంచంలో ఖగోళ పదార్థాల సంఖ్యా స్థిరంగా ఉండదు. ఒక గ్యాలక్సీ పుట్టి, ఎదిగి, మళ్లీ ఆ అనంతశక్తిలో కలిసిపోయే లోపల మరెన్నో గ్యాలక్సీలు ఎక్కడెక్కడో రూపుదిద్దుకుంటూనే ఉంటాయి. ఈ ప్రక్రియ నిరంతర స్రవంతి. తనలో తాను, తనంత తానుగా పరిణామం చెందుతూ స్థిరంగా ఉండటమే వైచిత్రి.

అట్టి ఆత్మను సందర్శించడం ఒక యోగం. యోగం అంటే కలయిక. ఆత్మతో అభేదాన్ని సాధిస్తేనే సందర్శించినట్టు. అణువణువూ నిండి ఉన్న అనంత శక్తిని అనుభవించడం ఒక ఉత్కృష్ట మానసిక స్థితి. భగవద్గీతలో కేవలపదార్థ రూపాన్నే అర్జునుడు దర్శించాడు. అంతకుమించిన జ్ఞానమార్గంలో శోధిస్తేనే మనం భగవంతుని లేదా ఆత్మను లేదా అనంత శక్తిని సందర్శించగలము. ఈ సందర్శన ఇంద్రియాలైన కన్నుల ద్వారానో, చెవుల ద్వారానో, స్పర్శ ద్వారానో, వాసన ద్వారానో, రుచిద్వారానో కాదు. మనసు ద్వారా మాత్రమే సందర్శించడమౌతుంది. వేరే మార్గం లేదు. కేవలం మనసు మాత్రమే సరిపోతుందా అంటే అదీ సరిపోదు. ఆ మనసుకు జ్ఞానసహిత మేథస్సు పునాది అయి ఉండాలి. హేతువు ఆ మేథస్సుకు ఆలంబన కావాలి. బలమైన, స్థిరమైన, విస్తృతమైన మనసును సాధించిన సాధకుడు మాత్రమే ఆత్మ సందర్శనకు అర్హుడు ఔతాడు. ఆ ఆత్మ లేక అనంత శక్తిని దృఢమైన మనసు నిండా నింపుకోవాలి. అంతటి అనంతశక్తిని మనసులో ఎలా కుదించుకోగలమనేది ప్రశ్న.మనసుకు గొప్ప లక్షణాలు ఉన్నాయి. అది ఎక్కడికైనా పోగలదు, ఎంతైనా విస్తరించగలదు, దేన్నైనా సొంతం చేసుకోగలదు. ఈ గొప్ప లక్షణాలతోనే ఆ సర్వాంతర్యామిని సందర్శించాలి. మనసుతోనే తపించాలి. ఆ తపనయే నవవిధ భక్తులలో చివరిది, ఉతృష్టమైన ఆత్మనివేదనం. ఈ ఆత్మ నివేదనం బలమైన మనసులకు మాత్రమే సాధ్యమవుతుంది. 

ఆ స్థితిలో సాధకునికి, అనంత శక్తి భేదం ఉండదు. అట్టి ఆత్మకు, సాధకుని రూపంలో ఉన్న చైతన్య పదార్థానికి అభేదం నెలకొల్పబడుతుంది. అప్పుడే సాధకుని లోపల భగవంతుడు పొసగగలుగుతాడు. ఇక సాధకునికి భగవంతుని వినా అన్యమైనది ఏదీ ఉండదు. ఈ విధంగా అంతటి ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుని, నిలుపుకోవడం ఎంతో కష్టం. సాధకుని మనస్సు ఎంతో దృఢమైనదై, నిశ్చలమైనదై ఉండాలి. ఎందుకంటే, మనసులో ఏకాగ్రత, బలీయమైన తపన లేనప్పుడు ఆ ఆత్మ మనసుకు చిక్కదు. అంతే కాకుండా ఆత్మ స్వరూపాన్ని హృదయాంతరాలలో నింపుకోవడం అత్యంత ఆనందదాయకం. ఆ ఆనందాన్ని భరించాలంటే సాధారణ మనసుకు సాధ్యం కాదు. ఆ ఆనందస్థితి చూసేవారికి విచిత్రం. అనుభవించే వారికి అనుపమాన అనుభూతి.
– గిరిధర్‌ రావుల 

మరిన్ని వార్తలు