పగటి విశ్రాంతి

7 May, 2018 01:03 IST|Sakshi

రవీంద్రనాథ్‌ టాగోర్‌ని ‘స్పిరిచువల్‌ హ్యూమనిస్ట్‌’ అంటారు. పెద్ద మాటే! కానీ ఇంకే విధమైన మాటకూ ఈ విశ్వ కవీంద్రుడిని మనకు అర్థం చేయించే శక్తి ఉండదేమో అనిపిస్తుంది. ఆధ్యాత్మికత కన్నా పైస్థితి స్పిరిచువాలిటీ. మనిషి కన్నా పైస్థితి మానవీయత. ఈ రెండు పైస్థితులపైనా ఉంటారేమో టాగోర్‌. ఇలాక్కూడా ఆయన అందకపోతే చిన్న కథనేదైనా వెదుక్కోవాలి మనం. గాంధీజీ ఓసారి రవీంద్రుని ఆశ్రమానికి వెళ్లారు.

ఇద్దరూ మధ్యాహ్న భోజనం ముగించాక గాంధీజీ విశ్రమించారు. కొద్దిసేపటికే ఆశ్రమ సేవకులు వచ్చి, ‘‘మహాత్మా, రవీంద్రునికి చెప్పండి. విశ్రాంతి తీసుకొమ్మని. ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని మాకు ఆందోళనగా ఉంది. మేము చెబితే వినడం లేదు. మీరు చెబితే వింటారని మా ఆశ అన్నారు’. గాంధీజీ రవీంద్రుని గదికి వెళ్లారు. ‘‘అప్పుడే మీ విశ్రాంతి ముగిసిందా!’’ అని గాంధీజీని అడిగారు రవీంద్రుడు. ‘‘లేదు. మిమ్మల్ని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పేందుకు వచ్చాను.

మీ రాత పనులను కొంతసేపు పక్కనపెట్టొచ్చు కదా’’ అన్నారు గాంధీజీ. రవీంద్రుడు నవ్వారు. ‘‘పగటిపూట విశ్రాంతి తీసుకోకూడదని నా పన్నెడవ యేటే తీర్మానించుకున్నాను’’.. అని చెప్పారు. నిజంగానే రవీంద్రనాథ్‌ టాగోర్‌ అరవై తొమ్మిదేళ్ల పాటు పగటిపూట విశ్రాంతీ విరామం తీసుకోనేలేదు! మరి కర్తవ్య నిర్వహణలో క్షణమైనా విశ్రమించని వ్యక్తిని స్పిరిచువల్‌ హ్యూమనిస్ట్‌ అనుకోవచ్చా? ‘కర్తవ్యాన్ని దైవంలా భావించి, నిరంతరాయమైన కర్తవ్య నిర్వహణను అభౌతిక మానవీయ ధర్మంగా భావించిన వ్యక్తి’ అనే అర్థంలోనైతే ఆయన్ని స్పిరిచువల్‌ హ్యూమనిస్ట్‌ అనే అనుకోవాలి. 

మరిన్ని వార్తలు