ఎటువైపైనా ఒక వైపే

13 Feb, 2018 00:23 IST|Sakshi

ఒక యువకుడు గుర్రం మీద బయల్దేరాడు. అతడు కొత్తగా బౌద్ధధర్మాన్ని స్వీకరించాడు. గుర్రం మీద ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఒక చోటికి చేరుకున్నాడు. అక్కడ ఒక చిన్న యేరు అడ్డం వచ్చింది. అది ఉధృతంగా పారుతోంది. గుర్రంతో సహా దిగలేనంత లోతుగా ఉందని వెంటనే అంచనాకు రాగలిగాడు. కానీ ఎలా దాటడం? అవతలి వైపునకు ఎలా చేరడం? ఎంత ఆలోచించినా ఉపాయం తోచలేదు. గుర్రం దిగి చాలాసేపు అలాగే నిరీక్షించాడు. గుర్రం పచ్చిక మేస్తూవుంది. సాయంత్రం కావస్తోంది. యువకుడి సహనం నశిస్తూవుంది. అప్పుడు యేరుకు అటువైపు ఒక గురువు నడుస్తూ కనిపించాడు.

యువకుడు ఉత్సాహంగా లేచి, గొంతెత్తి కేకేశాడు. ‘గురువర్యా, నేను అవతలి వైపు ఎలా రావాలి?’ గురువు ఏమాత్రం తడుముకోకుండా అంతే బిగ్గరగా సమాధానమిచ్చాడు. ‘నాయనా, నువ్వున్నది కూడా అవతలి వైపే’. ఇది హాస్యం కాదు. ఒక అవరోధం రాగానే ప్రయత్నాన్ని విరమించుకొమ్మని చెప్పడం కాదు. అసలు ఏ వైపైనా ఎందుకు దాటాలి? ఏ ప్రపంచం ఇవ్వగలిగే అనుభవం ఆ ప్రపంచానికే ఉండగా మరెక్కడికో చేరాలన్న ఉబలాటం దేనికి? గురువు చెప్పింది అర్థమైన యువకుడు సానుకూలంగా గురువుకు నమస్కరించి, తిరుగు ప్రయాణం కోసం మళ్లీ తన అశ్వం వైపు బయల్దేరాడు.

 ‘గురువర్యా, నేను అవతలి వైపు ఎలా రావాలి?’గురువు ఏమాత్రం తడుముకోకుండా అంతే బిగ్గరగా సమాధానమిచ్చాడు. ‘నాయనా, నువ్వున్నది కూడా అవతలి వైపే’.

మరిన్ని వార్తలు