మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు?

30 Nov, 2015 16:39 IST|Sakshi
మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు?

మృత్యువు అనంతరం ఆత్మ ఏం చేస్తుంది?
మరణించిన ప్రతి జీవీ తప్పనిసరిగా తిరిగి జన్మ ఎత్తుతుందా?
మానవ జన్మకు రాని అంటే పునర్జన్మ లేని ఆత్మలు ఎక్కడ ఉంటాయి? ఎలా ఉంటాయి?
ఇటువంటి సందేహాలు చాలామందిలో మెదళ్లను తొలిచేస్తూనే ఉంటాయి.

 
ఈ సందేహాలు ఇప్పటి తరానివి కావు... కొన్ని వేల ఏళ్ల క్రితమే సత్యకామ జాబాలి అనే బాలకుడికి వచ్చాయట. కాదు కాదు... తెగ పీడించుకు తినడంతో అనుభవంతో, జ్ఞానంతో తలపండిన పెద్దల ముందుంచాడట తన సందేహాలను. అయితే ఎవరి నుంచీ సంతృప్తికరమైన సమాధానం లభించలేదట. దాంతో సత్యకామ జాబాలి ఈ సంగతేదో మృత్యువునే అడిగి తేల్చుకుందామని కఠోర తపస్సు చేసి మృత్యువును ప్రత్యక్షం చేసుకుని ఆత్రంగా అడిగాడట. అయితే మృత్యువు కూడా మౌనమే వహించిందట. అంటే మృత్యువు కూడా తన పరిధి దాటి తెలుసుకోలేదన్నమాట. ఎందుకంటే దానికే జీవం లేదు కాబట్టి, దానిగుండా ప్రయాణించాల్సిన జీవుడే అంటే మానవుడే దానికి సమాధానం తెలిసినవాడు. అయితే పునర్జన్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్మరు కదా మరి! ఇప్పటి రోజులలో అయితే ఈ ప్రశ్న ఎవరినడిగినా ‘‘అదేం ప్రశ్న? మరణించిన తర్వాత ఇక జీవితమేంటి?’’ అంటూ ఆ ప్రశ్న వేసిన వారిని అమాయకులుగా జమకట్టేస్తారు చాలామంది.

స్వర్గనరకాలు
మన సంగతెలా ఉన్నా, మృత్యువు తర్వాత ఆత్మ భౌతికంగా తాను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి స్వర్గం లేదా నరకాన్ని చేరుకుంటుందని ఇంచుమించు అన్ని మతాలూ చెబుతాయి. స్వర్గమనేది మరణం తర్వాత కూడా సుఖాలను అనుభవింపజేసేదని, అందుకే బతికినంతకాలం దానధర్మాలూ, పరోపకారాలూ చేసి, బోలెడంత పుణ్యం మూటక ట్టేసుకుని, ఆనక ఇంచక్కా స్వర్గసుఖాలను అనుభవించండని పెద్దలు చెబుతుంటారు. వాళ్లు చెప్పిన నాలుగు మంచిముక్కలూ చెవినేసుకోకుండా విచ్చలవిడిగా పాపాలు చేసేస్తే, నరకానికి పోతారు. అక్కడ వేడి వేడి నూనెలో వేగుతూ, చీమూ నెత్తురూతో నిండి, కుళ్లుకంపు కొట్టే వైతవరణీనదిలో పడి, ఉక్కిరిబిక్కిరవుతూ, ఇనుపశూలాలతో ఒళ్లంతా చిల్లులు పడేలా పొడిపించుకోవలసిందే... అని ఆస్తికులు చెబుతారు.
      
మరణానంతర జీవితం గురించి తెలుసుకునేముందు అసలు మృత్యువంటే ఏమిటో చూద్దాం... ‘‘మృత్యువంటే జీవితానికి క్రీనీడ... జీవితం బొమ్మయితే మృత్యువు బొరుసు. ఈ జీవితాన్ని అనుక్షణం వెన్నంటి ఉండేది మృత్యువు. ఈ జీవితాన్ని కాపాడుకుంటూ పోయేదీ మృత్యువే. మృత్యువు జీవిత ద్వారబంధం దగ్గర కాపలా లేకపోతే రక్షణ ఎక్కడిది? అందుకే మృత్యువును కాదని జీవితాన్ని ప్రత్యేకంగా చూడలేం’’ అంటారు సికిందరాబాద్ తిరుమలగిరిలోని మాస్టర్ యోగాశ్రమ సంచాలకులు, యోగాపై అనేక గ్రంథాలను రాసిన డాక్టర్ వాసిలి వసంత కుమార్.
 
‘జీవితంలో పోరాడగలవారికే మృత్యుస్పర్శ తెలుస్తుంది. మనల్ని అతలాకుతలం చేసే పరిస్థితుల్లో సైతం మనం జీవితం నుంచి పారిపోకూడదు. పైగా ఎదురొడ్డి నిలవాలి. ఆ నిబ్బరం, ఆ నిలువరింపు ఉంటే మృత్యువు సైతం మనల్ని భయపెట్టలేదు. ఆ మృత్యుదర్శనం సైతం విశ్వరూప సందర్శనంలా మనల్ని అనందపరుస్తుంది’ అని ఆయన తన తాజా పుస్తకం ‘యోగానంద లహరి’లో చెబుతారు.
 
అసలు మృత్యువంటే ఏమిటి?
 ఈ శరీరాన్ని కాదని అంతరాత్మ స్వేచ్ఛను పొందడమే మృత్యువు కదా! అంతరాత్మ స్వేచ్ఛగా ఏం చేస్తుంది? బాధ్యతగా మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే మరో రూపంలోకి పరిణమిస్తుందన్నమాట. మృత్యువు గురించి ఇంకాస్త లోతుగా చెప్పుకోవాలంటే.. మృత్యువు అనేది ఈ శరీరం నుంచి మరో శరీరంలోకి మార్పే. అంటే ఆత్మ అదే. అంతరాత్మ స్పందనలలో మార్పుండదు. అంతెందుకు.. మృత్యువుతో మనం ఈ శరీరాన్ని త్యజిస్తాం కాబట్టి ఆ తర్వాతి జీవితం అంటే పరజన్మ ఎలా ఉంటుందన్న భయం ఉండదు. ఆత్మ- మృత్యువులలో జీవితం బొమ్మ అయితే మృత్యువు బొరుసు. మృత్యువు బొమ్మ అయితే జీవితం బొరుసు. ఈ రెంటిలో ఒకదాని ఉనికి సాధ్యమైనప్పుడు రెండవదాని ఉనికి సాధ్యం కాదు. అంటే రెండవది అగోచరంగా ఉంటుంది.
 
ప్రాణం ఎక్కడి నుండి, ఎలా అందుతుందో తెలుసుకుంటే మృత్యువుపై విజయం సాధించవచ్చని, దానికి ఏమాత్రం భయపడనవసరం లేదని ‘మృత్యువు తర్వాత జీవితం’ ‘యోగానంద లహరి’, ‘యోగసాధన’, ‘భానుమతి’ వంటి పుస్తకాలను రాసిన శ్రీ శార్వరి వంటి సీనియర్ రచయితలు చెబుతారు. మన కంటికి కమ్మిన పొర తొలగిపోతేనే జ్ఞానదృష్టి అలవడుతుందని, అందుకు యోగసాధన అవసరమంటారాయన.
 
ప్రేతాత్మలు... పునర్జన్మలూ...

 కోరికలు తీరిన  ఆత్మ వెంటనే పునర్జన్మ తీసుకుంటుందని, కోరికలు తీరకపోతే ప్రేతాత్మగా మారి, తన కోరికలను తీర్చుకోవడం కోసం ఇతరులను ఆశ్రయించి, వారి ద్వారా తీర్చుకుంటూ ఉంటుందని చాలా కథలలో, సీరియల్స్‌లో చదివే ఉంటాం, సినిమాలలో చూసే ఉంటాం. అప్పుడెప్పుడో అంటే ఏఎన్నారూ, ఎన్టీయారూ, శోభన్‌బాబుల కాలంలో వచ్చిన ‘దేవుడే గెలిచాడు’, ‘శ్రీ రామ రక్ష‘, ‘విశ్వరూపం’, సుమన్, చిరంజీవిల హయాంలోని ‘ఆత్మబంధం’, ‘యముడికి మొగుడు’ ఆ తర్వాతి కాలంలోని ‘ఆ నలుగురు’, రజనీకాంత్ ‘చంద్రముఖి’, దానికి సీక్వెల్‌గా వెంకటేష్‌తో తీసిన ‘నాగవలి’్ల, లారెన్స్ రాఘవేంద్ర తన నటనతో ఒక ఊపు ఊపేసిన ‘కాంచన’, నిన్నమొన్నల్లో వచ్చిన ‘గంగ’, ‘త్రిపుర’ వంటి సినిమాలన్నీ ‘ఆత్మీయై’మెనవే! విఠలాచార్య సినిమాలు, హారర్ చిత్రాలు సరేసరి. శరీరం రోమాంచితమయ్యే అలాంటి సినిమాలు అందులోనూ సెకండ్ షోలు చూసి ఒంటరిగా ఇంటికి రావాలన్నా... వచ్చాక ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా భయంతో వ ణుకు పుట్టి మెడలో ఆంజనేయస్వామి లాకెట్టో, నుదుటిపై సింధూరమో పెట్టుకుంటే కానీ ఉలికిపాటు తగ్గనివారెందరో!
 ఇక ‘కథలు, నవలల సంగతి చెప్పనే అక్కరలేదు (ఆత్మకథలు కాదు సుమీ!) క్రైమ్ స్టోరీల్లోకి కూడా ఆత్మలు చొచ్చుకొచ్చేసి, అద్భుతాలు, అంతకుమించి అరాచకాలెన్నో చేసి చూపిస్తుంటాయి. చదివినంతసేపూ థ్రిల్లింగానే ఉంటాయి కానీ.. ఆ తర్వాతే... వీటికన్నా దయ్యం సినిమాలే కాస్తంత బెటరనిపిస్తుంది!

అసలీ చర్చంతా ఎందుకు, మృత్యువు తర్వాత జీవితం ఉందా లేదా, ఉంటే ఎలాంటి జీవితాన్ననుభవిస్తారనేదే కదా సందేహం..? అది తెలుసుకునేందుకు ఇంకా చా...లా సమయం ఉంది! అనుభవించడానికి బోలెడంత జీవితమూ ఉంది. సఫలం చేసుకోగలిగితే ఇప్పుడే స్వర్గం... లేకపోతే ఇక్కడే నరకం... కాదంటారా?
 - డి.వి.ఆర్.భాస్కర్
 
మనిషికి ప్రధానంగా మూడు శరీరాలుంటాయి. అవి 1. ఆత్మ తత్వం గల స్పిరిచ్యువల్ బాడీ, 2. భావోద్వేగాలకు నెలవైన సూక్ష్మశరీరం, 3. కంటికి కనిపించే స్థూల శరీరం లేదా భౌతిక శరీరం. భూలోకంలోని ప్రతి జీవీ మరణించిన తర్వాత ఏదో ఒక సూక్ష్మలోకం చేరుకుంటుంది. కొద్ది ప్రయత్నం, మరికొద్దిగా సాధనతో ఈ లోకాల్ని దర్శించగలం. అనుభవించగలం. పరలోకాలను సందర్శించడం కోసం మరణించనే అవసరం లేదు. ఆత్మ సంస్కారం గల వ్యక్తి కేవలం సంకల్పమాత్రాన భౌతిక శరీరాన్ని వదలకుండానే సూక్ష్మలోకాల్ని
 అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ శరీరంతో దర్శించి రావచ్చు అంటారు యోగ సాధకులు.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా