చిరస్మరణీయులు

18 Aug, 2019 08:54 IST|Sakshi

పూర్వం ఇరాక్‌ దేశంలో నమ్రూద్‌ అనే చక్రవర్తి ఉండేవాడు. పరమ దుర్మార్గుడు. తనది సూర్యచంద్రాదుల వంశమని, తాను దైవాంశ సంభూతుడినని ప్రకటించుకొని నిరంకుశంగా పరిపాలన చేస్తుండేవాడు. రాజు మాట వేదవాక్కుగా పరిగణించబడేది. ప్రజలంతా బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదుగదా, కనీసం అలా ఊహించడానికే ప్రజలు గడగడలాడేవారు.

అలాంటి పరిస్థితుల్లో రాజ దర్బారులో పూజారిగా పని చేస్తున్న‘అజర్‌’ ఇంట ఓ బాబు జన్మించాడు. అతని పేరే ఇబ్రాహీం. ఆయన్ని దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నమ్రూద్‌ దైవత్వానికి, రాచరికపు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న వివిధ రకాల దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా  పోరాటం ప్రారంభించారు. విగ్రహారాధనను ఖండించారు. తనయుని వైఖరి తండ్రికి నచ్చలేదు.మందలించాడు. చంపేస్తానని బెదిరించాడు. అయినా ఇబ్రాహీం అలైహిస్సలాం తన వైఖరి మానుకోలేదు. విషయం  తెలుసుకున్న నమ్రూద్‌ ఇబ్రాహీం గారిని తన దర్బారుకు పిలిపించాడు. ‘నా దైవత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావట. ఎవరో కనబడని దేవుణ్ణి గురించి చెబుతున్నావట. ఎవరా దేవుడు చెప్పు?’అని గర్జించాడు.

ప్రశాంతచిత్తంతో మౌనంగా నిలబడి ఉన్న ఇబ్రాహీం ఏమీ మాట్లాడలేదు.
దీంతో.. ‘మాట్లాడవేం.. నీ దేవుడెవరో చెప్పు?’ అంటూ మళ్ళీ గాండ్రించాడు.
అప్పుడు ఇబ్రాహీంగారు, ‘మహారాజా..! ఎవరి ఆధీనంలో జీవన్మరణాలున్నాయో ఆయనే నా ప్రభువు, ఆయనే మనందరి దేవుడు.’ అన్నారు.
‘..అలాగా..! అయితే చూడు..’ అంటూ ఒక ఉరిశిక్ష పడిన ఖైదీని, నిరపరాధి అయిన మరొక అమాయకుడిని పిలిపించాడు. మరణ శిక్ష విధించబోయేౖ ఖెదీని విడుదల చేస్తూ, అమాయక యువకుణ్ణి చంపేశాడు.’ తరువాత..,
‘ఇప్పుడు చెప్పు. చావబోయేవాడికి జీవితం ప్రసాదించాను, బతకవలసిన వాణ్ణి చంపేశాను. అంటే జీవన్మరణాలు నా చేతిలో ఉన్నాయి.. మరి నేను దేవుణ్ణికానా..?’ అంటూ చూశాడు గర్వంగా..

ఓహో.. జీవన్మరణాల అర్ధాన్ని ఈవిధంగా అన్వయించుకున్నావా..? అని మనసులో అనుకున్న ఇబ్రాహీం, ‘సరే అయితే, దేవుడు సూర్యుణ్ణి తూర్పున ఉదయింపజేసి, పశ్చిమాన అస్తమింప జేస్తాడు. మరి నువ్వు, పశ్చిమాన ఉదయింపజేసి, తూర్పున అస్తమించేలా చేయి.’ అని సవాలు విసిరారు. దీంతో దైవద్రోహి అయిన నమ్రూద్‌ కు నోట మాట రాలేదు. గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

‘ఇతణ్ణి తీసుకెళ్ళి భగభగ మండే అగ్నిగుండంలో వేసి కాల్చిచంపండి.’ అని ఆదేశించాడు.
రాజాజ్ఞ క్షణాల్లో కార్యరూపం దాల్చింది. పెద్ద అగ్నిగుండం రాజేసి, కణకణ మండుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్ని కీలల్లో ఆయన్ని విసిరేశారు. కాని దేవుని ఆజ్ఞతో అగ్ని తన కాల్చే గుణాన్ని కోల్పోయింది. ఇబ్రాహీం పాలిట పూల పానుపుగా మారిపోయింది. ఆయన సురక్షితంగా బయట పడ్డారు.

తరువాత ఇబ్రాహీం ప్రవక్త స్వదేశాన్ని విడిచి పెట్టి ఇతరప్రాంతాలకు వెళ్ళిపోయారు. సత్యధర్మాన్ని, దేవుని ఏకత్వాన్ని బోధిస్తూ, మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వివిధ ప్రాంతాలు పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అనేక కష్టనష్టాలు, పరీక్షలు ఎదుర్కొన్నారు. దైవాజ్ఞ మేరకు భార్యాబిడ్డల్ని నిర్జన ఎడారి ప్రాంతంలో వదిలేయడం, కన్నకొడుకును దైవమార్గంలో త్యాగం చేయడం మానవ జాతి చరిత్రలో చిరస్మరణీయ పరిణామాలు. దైవాదేశ పాలనలో తన సమస్తాన్నీ సమర్పించిన త్యాగధనుడు కనుకనే ఐదువేల సంవత్సరాలు గడిచినా చరిత్ర ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ‘ఈదుల్‌ అజ్‌ హా’ పర్వదినం ఆ మహనీయుని త్యాగస్మరణే.

ఆయన నిలిచిన ప్రదేశం, నిర్మించిన కాబాలయం, జమ్‌ జమ్‌ జలం, సఫా, మర్వాల సయీ, ఆయన, ఆయన కుటుంబం నడయాడిన నేల, వారి ఒక్కోఆచరణ ప్రళయకాలం వరకూ, సందర్శనీయ, స్మరణీయ ఆచరణలుగా దేవుడు నిర్ధారించాడు. ఈ అన్నిటికీ అసలు ప్రేరణ అల్లాహ్‌ సంతోషం, శాశ్వత సాఫల్యం. ఎవరికైనా అంతకన్నా కావలసింది ఇంకేముంటుంది? సత్యం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించిన ఆ మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం కావాలి.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు